‘భారతదేశానికే తొలి ప్రాధాన్యం’ అనే సూత్రం.. ప్రధాన మంత్రి దృఢంగా దృష్టి సారించిన నేపథ్యంలో.. అది ప్రపంచం అంతటా ప్రతిధ్వనించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) వ్యాపార సౌలభ్య ఒప్పందం (టిఎఫ్ఎ)పై చర్చిస్తున్న సమయంలో దానిపై తన అభ్యంతరాలను భారతదేశం సుస్పష్టంగా వినిపించింది. ఆహార భద్రత కల్పనకు నిబద్ధత విషయంలో రాజీ పడేది లేదని భారతదేశం స్పష్టం చేసింది. పేదలకు ఆహార భద్రత తమకు ఒక విశ్వాసపూర్వక నిర్దేశమని, దీనికి ప్రధాన మంత్రి వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారంటూ కుండ బద్దలు కొట్టింది.
ఆహార ధాన్యాలను నిల్వ చేయడంపై శాశ్వత పరిష్కారం అన్వేషించాలని డిమాండ్ చేసింది. ప్రపంచ రంగస్థలంపై భారతదేశపు గళానికి వివిధ దేశాల మద్దతు లభించడంతో, ఆ వైఖరికి బలం చేకూరింది. అంతిమంగా ఆహార భద్రతపై రాజీకి తావే లేదన్న భారతదేశం వాదన నెగ్గింది. అదే సమయంలో అంతర్జాతీయ సమాజంతో దశలవారీ చర్చలకు ద్వారాలు తెరిచి ఉంచింది.