ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని యు.ఎస్. జాతీయ భద్రత సలహాదారు లెఫ్టెనంట్ జనరల్ హెచ్. ఆర్. మెక్ మాస్టర్ ఈ రోజు కలుసుకున్నారు.
ప్రెసిడెంట్ శ్రీ డోనాల్డ్ ట్రంప్ తరఫున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి లెఫ్టెనంట్ జనరల్ హెచ్. ఆర్. మెక్ మాస్టర్ అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ తో తాను టెలిఫోన్ లో సకారాత్మకమైనటువంటి సంభాషణ జరిపినట్లు, పలు అంశాలలో భారతదేశం-యు.ఎస్. సంబంధాలను మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు పక్షాలు జతచేసిన ప్రాముఖ్యాన్ని ఈ సంభాషణ పునరుద్ఘాటించినట్లు ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
లెఫ్టెనంట్ జనరల్ హెచ్.ఆర్. మెక్ మాస్టర్ అఫ్గానిస్తాన్, పశ్చిమ ఆసియా మరియు డిపిఆర్ కె లు విస్తరించిన ప్రాంతంలోని భద్రతా పరిస్థితులపై తన దృష్టికోణాన్ని ప్రధాన మంత్రికి వివరించారు. తీవ్రవాద సవాలును సమర్థవంతంగా పరిష్కరించేందుకు రెండు దేశాలూ ఏ విధంగా కలిసి పని చేయగలవో అన్న అంశంతో పాటు ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వాలను ఎలా ముందుకు తీసుకుపోగలవో అన్న అంశంపై ఇరువురూ తమ అభిప్రాయాలను ఒకరితో మరొకరు పంచుకున్నారు.