ప్రియమైన నా దేశ వాసులారా నమస్కారం! ఈ సంవత్సరానికి ఇది ఆఖరి మనసులో మాట. ఇవాళ ఈ 2017 సంవత్సరానికి ఆఖరి రోజు అవడం అనుకోకుండా కలిసివచ్చింది. ఈ ఏడాది అంతా కూడా మీరూ, నేను ఎన్నో విషయాలను పంచుకున్నాం. మన్ కీ బాత్ (‘మనసులో మాట’) కోసం మీ అందరి అనేకమైన ఉత్తరాలు, అభిప్రాయాలు, మనం పంచుకున్న ఆలోచనలు నాకు ఎప్పుడూ కొత్త శక్తిని ఇస్తూ ఉంటాయి. మరికొన్ని గంటలలో సంవత్సరం మారిపోతుంది కానీ, మన మాటల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. రాబోయే సంవత్సరంలో మనం మరిన్ని కొత్త విషయాలను చెప్పుకుందాం, కొత్త అనుభవాలను పంచుకుందాం. మీ అందరికీ 2018 సంవత్సరానికి గానూ అనేకానేక శుభాకాంక్షలు. కొద్ది రోజుల క్రితమే డిసెంబరు 25 నాడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను వైభవంగా జరుపుకున్నారు. భారతదేశంలో కూడా ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా మనమంతా ఏసు క్రీస్తు చేసిన గొప్ప బోధనలను గుర్తుచేసుకుందాము. ఏసు క్రీస్తు అన్నింటి కన్నా ఎక్కువగా సేవాభావాన్ని గురించి చెప్పే వారు. సేవాభావం సారాన్ని మనం బైబిల్ లో కూడా చూస్తాము.
“The Son of Man has come, not to be served,
But to serve,
And to give his life, as blessing
To all humankind.”
అంటే- ‘‘దేవుని కుమారుడు సేవింపబడటానికి రాలేదు. సేవ చేయటానికి జన్మించాడు. తన జీవితాన్ని మానవజాతికి ఒక వరంలా అందివ్వడానికి వచ్చాడు’’ అని దీని భావం.
సేవా మహత్మ్యాన్ని ఈ వాక్యాలు తెలియజేస్తాయి. ప్రపంచంలో ఏ జాతి అయినా, ఏ ధర్మం అయినా, ఏ సంప్రదాయం అయినా, వివిధ వర్ణాల వారు అయినా.. అందరికీ మానవత విలువలను తెలిపే ఒక అపురూపమైన గుర్తింపుగా సేవాభావం ఉంది. మన దేశంలో నిష్కామ కర్మను గురించి చెప్తారు. నిష్కామ కర్మ అంటే ఏమీ ఆశించకుండా సేవ చెయ్యడం. సేవా పరమో ధర్మ: అని మన పెద్దలు అన్నారు. మానవ సేవే మాధవ సేవ. శివ భావంతో మానవ సేవ చెయ్యాలి. అంటే ప్రపంచం అంతటా ఇవే మానవతా విలువలు అని రామకృష్ణ పరమహంస గారు అనే వారు. రండి, ఆ మహా పురుషులను స్మరించుకుంటూ, పవిత్రమైన తిథులను తలుచుకుంటూ, మన ఈ గొప్ప విలువల పరంపరకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని అందిద్దాం. స్వయంగా కూడా ఆ విలువల ప్రకారం జీవించడానికి ప్రయత్నిద్దాం.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ సంవత్సరంలో పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ గారి 350వ జయంతి వార్షికోత్సవం జరిగింది. త్యాగం మరియు సాహసాలతో నిండిన గురు గోవింద్ సింగ్ గారి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిని ఇచ్చే చక్కని ఉదాహరణ. గురు గోవింద్ సింగ్ గారు గొప్ప జీవిత విలువలను ఉపదేశించారు. వాటిని పాటిస్తూనే ఆయన తన జీవితాన్ని గడిపారు. ఒక గురువు, దార్శనికుడు, మహా యోధుడు అయిన గురు గోవింద్ సింగ్ గారు ఈ పాత్రలన్నింటిలో జీవిస్తూ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వేధింపులకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. కులం, ధర్మాల బంధనాలను తెంచుకొనే మార్గాన్ని ఆయన బోధించారు. ఈ ప్రయత్నాలలో ఆయన వ్యక్తిగతంగా ఎంతో పొగొట్టుకోవలసి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడూ ద్వేష భావాన్ని దరి చేరనివ్వలేదు. జీవితంలో ప్రతి క్షణంలో ప్రేమ, త్యాగం, శాంతి సందేశాలను నింపే ఎన్నో గొప్ప ప్రత్యేకతలతో నిండిన వ్యక్తిత్వం ఆయనది. ఈ సంవత్సరం జనవరిలో, పట్నా సాహిబ్ లో గురు గోవింద్ గారి 350వ జన్మదిన వార్షికోత్సవ ఉత్సవాలలో పాలుపంచుకొనే అవకాశం నాకు లభించడం నా అదృష్టం . రండి, మనమంతా గురు గోవింద్ సింగ్ గారి స్ఫూర్తిదాయకమైన జీవితం నుండి, వారి గొప్ప బోధనల ప్రకారం మన జీవితాలను మలచుకుందాం.
2018 జనవరి ఒకటో తేదీ, అంటే.. రేపటి రోజు నా దృష్టిలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి ఏడూ కొత్త సంవత్సరం వస్తుంది. జనవరి ఒకటో తేదీ వస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏముందీ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ జనవరి ఒకటో తేదీ నిజంగానే ప్రత్యేకమైనటువంటిది. ఎవరైతే 2000 సంవత్సరం లేదా తరువాత పుట్టారో, అంటే 21వ శతాబ్దంలో జన్మించిన వారందరికీ 2018, జనవరి నుండీ వోటు వేసే అర్హత వస్తుంది. భారత రాజ్యాంగం 21వ శతాబ్దపు వోటరులకు, ‘‘న్యూ ఇండియా వోటర్లకు’’ స్వాగతం పలుకుతోంది. నేను మన యువతకు అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు వోటర్లు గా నమోదు చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. యావత్ భారత దేశం మీ అందరికీ 21వ శతాబ్దపు వోటర్లుగా స్వాగతం చెప్పడానికి ఉవ్విళ్ళూరుతోంది. మీరంతా కూడా 21వ శతాబ్దపు వోటర్లుగా గౌరవ భావాన్ని అనుభూతి చెందుతూ ఉండి ఉండవచ్చు. మీ అందరి వోట్లూ ’న్యూ ఇండియా’ కు ఆధారం. ప్రజాస్వామ్యంలో వోటు శక్తి ఎంతో శక్తివంతమైనటువంటిది. లక్షల మంది జీవితాలలో అనుకూలమైన మార్పులను తేవడానికి ‘‘వోటు’’ అనేది ఎంతో ప్రభావశీల సాధనం. వోటు వేయడం ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసేవారు మాత్రమే కాదు, 21వ శతాబ్దపు భారతదేశం ఎలా ఉంటుంది?, 21వ శతాబ్దపు భారతదేశం మీ కలల్లో ఎలా ఉందో తెలియజేస్తుంది. మీరు కూడా 21వ శతాబ్దపు భారతదేశ నిర్మాతలు కావచ్చు. దీనంతటికీ ఈ జనవరి ఒకటో తేదీ నాంది కాబోతోంది. ఇవాళ ఈ ‘మనసులో మాట’లో నేను 18 ఏళ్ల నుండీ 25 ఏళ్ళ లోపూ శక్తి, సంకల్పాలతో నిండిన మన ప్రముఖులైన యువతతో మాట్లాడాలనుకొంటున్నాను.
నేను వీరందరినీ ‘‘న్యూ ఇండియా యువత’’ గా భావిస్తున్నాను. ‘‘న్యూ ఇండియా యువత’’ అంటే ఆశ, ఉత్సాహం, శక్తి. మన ఈ శక్తివంతమైన యువత నైపుణ్యంతో, బలంతో మన ‘న్యూ ఇండియా’ కల నెరవేరుతుందని నా నమ్మకం.
‘న్యూ ఇండియా’ జాత్యహంకారం, సాంఘిక దురభిమానం, తీవ్రవాదం, అవినీతి మొదలైన విషాల నుండి విముక్త నవ భారతం, మురికి, పేదరిక రహితమైన నవ భారతం అవ్వాలి. నవ భారతం లో అందరికీ సమానమైన అవకాశాలు లభించి అందరి ఆశలు, ఆకాంక్షలు తీరాలి. శాంతి, ఏకత్వం, సద్భావనలు మనకు మార్గదర్శకాలు కావాలి. నా ఈ నవ భారత యువతరం ముందుకు వచ్చి నవ భారతాన్ని ఎలా నిర్మించాలో మేథోమధనం చెయ్యాలనేది నా కోరిక. వారు వారి కోసం మార్గాన్ని నిర్ణయించుకుంటూ, తమ మార్గంతో ముడిపడి ఉన్న వారందరినీ తమ లక్ష్యంతో కలుపుకుంటూ ముందుకు సాగాలి. మీరు నడుస్తూ, దేశాన్ని కూడా ముందుకు నడిపించండి. మీతో మాట్లాడుతూంటే నాకు ఆలోచన వచ్చింది. మనం భారతదేశం లోని ప్రతి జిల్లాలో ఒక mock parliament ను ప్రారంభిద్దామా ? అందులో 18 ఏళ్ల నుండీ 25 ఏళ్ళ లోపూ యువత కలిసి నవ భారతాన్ని గురించి మేథోమధనం చేస్తూ, మార్గాలు అన్వేషిస్తూ, ప్రణాళికలు తయారు చేసి, మన సంకల్పాలను 2022 కన్నా ముందే ఎలా పూర్తి చెయ్యాలో ఆలోచించి, మన స్వాతంత్ర్య సమర యోధులు కలలు కన్న భారతదేశ నిర్మాణాన్ని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తే బావుంటుంది కదా. స్వాతంత్ర పోరాటాన్ని మహాత్మా గాంధీ ప్రజా ఉద్యమంగా మార్చేసారు. నా యువ మిత్రులారా, 21వ శతాబ్దంలో భవ్యమైన,దివ్యమైన భారతదేశం కోసం మనందరమూ కూడా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం వచ్చింది. అభివృధ్ధి కోసం ప్రజా ఉద్యమం. ప్రగతి కోసం ప్రజా ఉద్యమం. సమర్థవంతమైన, శక్తివంతమైన భారతదేశం కోసం ప్రజా ఉద్యమం! ఆగష్టు పదిహేనుకి దగ్గర దగ్గర ఢిల్లీ లో ఒక mock parliament ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. అందులో ప్రతీ జిలా నుండీ ఎన్నుకోబడిన యువత పాల్గొని, రాబోయే ఐదు సంవత్సరాలలో నవ భారత నిర్మాణం ఎలా చేయాలి, సంకల్పాలను సాకారం చేసుకోవడానికి ఏమేమి చెయ్యాలి అన్న అంశాలపై చర్చించాలని నా కోరిక. ఈనాటి యువతీయువకుల ఎదుట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నైపుణ్యాన్ని అభివృధ్ధి చేసుకోవడం నుండీ సృజనాత్మకత, పారిశ్రామికీకరణ లో మన యువత ముందుండి, విజయవంతమౌతోంది. ఈ అవకాశాల ప్రణాళికల గురించిన సమాచారం మన నవ భారత యువతకు ఒకే చోటులో లభ్యమయ్యేలా చేయాలి. పద్దెనిమిదేళ్ళు వస్తూనే యువతకు ప్రపంచం గురించీ, ఈ విషయాలన్నింటి గురించీ స్వాభావికంగా తెలియచేసి, వారు దానిని అవసరమైన విధంగా ఉపయోగించుకొనే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బావుంటుంది.
ప్రియమైన నా దేశ వాసులారా, గత ‘మనసులో మాట’ లో నేను మీతో సకారాత్మక ఆలోచనల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడాను. ఈ సందర్భంలో ఒక సంస్కృత శ్లోకం నాకు గుర్తుకువస్తోంది –
ఉత్సాహో బలవానార్య, నాస్త్యుత్సాహాత్పరమ్ బలమ్
సోత్సాహాస్య చ లోకేశు, న కించిదపి దుర్లభమ్
దీనికి.. ఉత్సాహంతో నిండిన ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడు. ఎందుకంటే ఉత్సాహాన్ని మించింది ఏదీ లేదు. సానుకూలత, ఉత్సాహాలతో నిండిన వ్యక్తికి ఏదీ అసంభవం కాదు.. అని భావం. ఆంగ్లం లో ఒక సామెత ఉంది – ‘‘ pessimism leads to weakness, optimism to power ’’ అని. గత ‘మనసులో మాట’ లో నేను దేశ ప్రజలను 2017లో వారి వారి యొక్క మంచి అనుభవాలను పంచుకోవలసిలందని, ఆ సద్భావనలు నిండిన వాతావరణంలో 2018 ని స్వాగతించవలసిందని కోరాను.
సామాజిక మాధ్యమాల ద్వారా, MyGov మరియు the Narendra Modi App ల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు వారి సానుకూల స్పందనను అందించి, వారి వారి అనుభవాలను పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. Positive India hashtag (#) తో వచ్చిన లక్షల ట్వీట్లు దాదాపు 150 కోట్ల కన్నా ఎక్కువ మందికి చేరాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ అనుకూల ప్రచారం భారతదేశం నుండి మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. వచ్చిన ట్వీట్లు, స్పందనలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అది చాలా ఆనందకరమైన విషయం. కొందరు దేశ ప్రజలు ఈ సంవత్సరంలో తమ మనసులపై ప్రత్యేకమైన , అనుకూల ప్రభావాన్నీ చూపిన కొన్ని వరుస సంఘటనలను పంచుకున్నారు. కొందరు తమ వ్యక్తిగత విజయాలను కూడా పంచుకున్నారు.
(ఒకటో ఫోన్ కాల్)
‘‘నా పేరు మీనూ భాటియా. నేను మయూర్ విహార్, పాకెట్- 1, ఫేజ్-1, ఢిల్లీ లో నివసిస్తున్నాను. నా కుమార్తె ఎం.బి.ఎ. చేయాలనుకుంటే, దాని కోసం బ్యాంక్ నుండి లోన్ కావలసి వచ్చింది. అది చాలా సులువుగా లభించింది కూడా. నా కుమార్తె చదువు ముందుకు సాగింది.’’
(రెండో ఫోన్ కాల్)
‘‘నా పేరు జ్యోతి రాజేంద్ర వాడే. నేను బోడల్ నుండి మాట్లాడుతున్నాను. నెలకు ఒక్క రూపాయి బీమా పథకంలో నా భర్త చేరారు. ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ సమయంలో మా పరిస్థితి మాకు మాత్రమే తెలుసు. ప్రభుత్వం ద్వారా మాకు ఎంతో సహాయం లభించింది. దాని వల్ల నేను కాస్త తట్టుకోగలిగాను.’’
(మూడో ఫోన్ కాల్)
‘‘నా పేరు సంతోష్ జాదవ్. మా భిన్నర్ గ్రామం గుండా 2017 లో జాతీయ రహదారిని వేశారు. దాని వల్ల మా రోడ్లు చాలా మెరుగై, మా వ్యాపారం కూడా పెరగనుంది.’’
(నాలుగో ఫోన్ కాల్)
‘‘నా పేరు దీపాన్శు అహూజా. ఉత్తర్ ప్రదేశ్ లోని సాదత్ గంజ్ తాలూకా, సహారన్ పుర్ జిల్లా మాది. భారతీయ సైనికుల ద్వారా జరిగిన రెండు సంఘటనలను గురించి చెప్పాలి. మొదటిది పాకిస్తాన్ లో వారు జరిపిన సర్జికల్ స్ట్రైక్. దాని వల్ల తీవ్రవాదుల స్థావరాలను నాశనం చేశారు. రెండోది డోక్ లామ్ లో మనం చూసిన భారతీయ సైనికుల పరాక్రమం సాటిలేనిది.’’
(అయిదో ఫోన్ కాల్)
‘‘నా పేరు సతీశ్ బేవానీ. మా ప్రాంతంలో నీటి సమస్య ఉండేది. గత నలభై ఏళ్ళుగా మేము భారత సైన్యాల పైప్ లైన్ పైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మాకు విడిగా గొట్టపుమార్గం ఏర్పాటైంది. 2017లో మాకు జరిగిన గొప్ప సదుపాయం ఇది.’’
ఇలా ఎందరో వ్యక్తులు వారి వారి స్థాయిల నుండి చేస్తున్న పనులు ఎన్నో జీవితాలలో సానుకూల మార్పులను తెస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే, మనందరం కలిసి నిర్మిస్తున్న నవ భారతం ఇదే. రండి, ఇటువంటి చిన్న చిన్న ఆనందాలతో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. అనుకూల భారతదేశం నుండి పురోగమిస్తున్న భారతదేశం దిశగా బలమైన అడుగులు వేద్దాం. సానుకూల దృక్పథం గురించి చెప్పుకుంటూ ఉంటే నాకు కూడా ఒక విషయాన్ని పంచుకోవాలని ఉంది. ఈమధ్య నాకు కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో అగ్రగామిగా నిలచిన శ్రీ అంజుమ్ బశీర్ ఖాన్ ఖట్టక్ తాలూకూ ప్రేరణాత్మక గాథ తెలిసింది. ఆయన తీవ్రవాదం, ద్వేషం సంకెళ్ల నుండి బయటపడి, కశ్మీర్ ఎడ్మినిస్ట్రేటివ్ సెర్విస్ పరీక్ష లో టాపర్ గా నిలిచాడు. 1990లో తీవ్రవాదులు వారి పూర్వీకుల ఇంటిని కాల్చివేశారు.
అక్కడ తీవ్రవాదం, హింస ఎంత ఎక్కువగా ఉందంటే వారి కుటుంబానికి తమ పూర్వీకుల భూమిని వదలిపెట్టవలసి వచ్చింది. నలువైపులా ఇంతటి హింసాత్మక వాతావరణం చాలు ఒక చిన్న పిల్లాడి మనస్సులో అంధకారమైన, క్రూరమైన ఆలోచనలను నింపడానికి. కానీ అంజుమ్ అలా జరగనివ్వలేదు. అతను ఆశను ఎప్పుడూ వీడలేదు. తన కోసం అతడు ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకున్నాడు. ప్రజలకు సేవ చేసే మార్గం. వ్యతిరేక వాతావరణం నుండి అతడు బయట పడి తన విజయ గాథను తానే రాసుకున్నాడు. ఇవాళ అతడు కేవలం జమ్ము & కశ్మీర్ ప్రాంతంలోనే కాక యావత్ దేశంలోని యువతకూ ప్రేరణాత్మక ఉదాహరణగా నిలచాడు. పరిస్థితులు ఎంత బాగాలేకపోయినా కూడా అనుకూలమైన పనుల ద్వారా నిరాశా మేఘాలను ఛేదించవచ్చు అని అంజుమ్ నిరూపించాడు.
గత వారమే జమ్ము & కశ్మీర్ లోని కొందరు ఆడ బిడ్డలను కలిసే అవకాశం నాకు దక్కింది. వారి పట్టుదలను, ఉత్సాహాన్ని, కలలను గురించి నేను వింటున్నప్పుడు, వారు జీవితంలో ఏ యే రంగాలలో ప్రగతిని సాధించాలనుకుంటున్నారో విన్నప్పుడు వారు ఎంతటి ఆశావాదులో తెలిసింది. వారితో నేను మాట్లాడినప్పుడూ వారిలో ఎక్కడా నిరాశ అనేదే కనిపించలేదు. వారిలో ఉత్సాహం ఉంది, శక్తి ఉంది, కలలు ఉన్నాయి, సంకల్పం ఉంది. వారితో గడిపిన సమయంలో నాకు కూడా ప్రేరణ లభించింది. ఇదే దేశానికి శక్తి. ఇదే నా యువత. ఇదే నా దేశ భవిష్యత్తు.
ప్రియమైన నా దేశ వాసులారా, మన దేశంలోనే కాక ప్రపంచంలోని ప్రసిద్ధ ధార్మిక క్షేత్రాలను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కేరళలోని శబరిమల లోని గుడి గురించి ప్రస్తావన సహజమే. విశ్వ ప్రసిధ్ధమైన ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం ఎందరో భక్తులు- కోట్ల సంఖ్యలో- ఇక్కడకు వస్తారు. ఎంతో మహాత్మ్యం ఉన్న ఇంతటి భక్త సందోహం వచ్చే చోటు, పరిశుభ్రతను పాటించడమనేది ఎంతో సవాలుతో కూడకున్న సంగతి. ప్రత్యేకంగా అది కొండ ప్రాంతం, అడవుల మధ్య ఉన్న ప్రాంతం కూడా కావడంతో పరిశుభ్రత పాటించడం ఇంకా కష్టం. కానీ ఈ సమస్య ను పరిష్కరించడానికీ, సమస్యను సంస్కారంగా మార్చడానికీ, సమస్య నుండి బయట పడే మార్గాన్ని ఎలా వెతకాలో తెలిపేందుకు, ఇందుకు ప్రజల సహకారం ఎంత ఉందో తెలపడానికి శబరిమల ఆలయం ఎంతో గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీ పి.విజయన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ పుణ్యం పూంగవనమ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఒక స్వయం ప్రచారాన్ని మొదలుపెట్టాడు. అక్కడికి వచ్చే యాత్రికులు పరిశుభ్రత కోసం ఎదో ఒక శారీరిక శ్రమ చస్తే గానీ వారి యాత్ర పూర్తవ్వని విధంగా ఒక సాంప్రదాయాన్ని అతను ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో చిన్న, పెద్ద అంటూ తేడా లేదు. ప్రతి యాత్రికుడు భగవంతుడి పూజలో భాగంగానే ఎంతో కొంత సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయిస్తారు. చెత్తను శుభ్రపరచటానికి పనిచేస్తారు. ప్రతి ఉదయం ఇక్కడ యాత్రికులంతా పరిసరాలను శుభ్రపరచే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతటి ప్రముఖులైనా, ఎంత పెద్ద అధికారి అయినా, ఎంతటి ధనికుడైనా, ప్రతి ఒక్కరూ ఒక సామాన్య యాత్రికుడిలా ఈ పుణ్యం పూంగవనమ్ అనే కార్యక్రమంలో భాగమై పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న తరువాతే ముందుకు వెళ్తారు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మన దేశ ప్రజల కోసం ఉన్నాయి.
శబరిమల లో ఇంత అభివృధ్ధి చెందిన ఈ పరిశుభ్రత ఉద్యమం, అందులోనూ పుణ్యం పూంగవనమ్ కార్యక్రమం ప్రతి యాత్రికుడి యాత్రలో భాగమైపోతుంది. అక్కడ కఠోరమైన నియమాలతో పాటూ, పరిశుభ్రత అనే కఠోర సంకల్పం కూడా వారితో నడుస్తుంది.
ప్రియమైన నా దేశ వాసులారా, 2014 అక్టోబర్ 2వ తేదీ నాటి పూజ్య బాపూజీ జయంతి నాడు, పూజ్య బాపూజీ అసంపూర్ణ కల అయిన ‘స్వచ్ఛ భారతదేశం’ మరియు ‘మురికి కి తావు ఉండని భారతదేశం’ గా మన దేశాన్ని మారుస్తామని మనమంతా సంకల్పం చెప్పుకొన్నాం. పూజ్య బాపూజీ ఇదే పని కోసం జీవితమంతా పాటుపడ్డారు. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బాపూ జీ 150వ జయంతి నాటికి మనం ఆయన కలా అయిన స్వచ్ఛ భారతదేశాన్ని ఆయనకు అందించే ప్రయత్నంలో ఏదో ఒకటి చేద్దాం. పారిశుధ్యాన్ని పాటించడానికి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో విస్తృతమైన ప్రజా భాగస్వామ్యంతో జరుగుతున్న మార్పులు కనబడుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత స్థాయిని సాధించిన స్థాయిని అంచనా వేయడానికి, ప్రపంచం లోని అతి పెద్ద సర్వేక్షణను జనవరి 4 నుండి మార్చి 10, 2018 వరకు ‘క్లీన్ సర్వే 2018’ నిర్వహిస్తుంది. ఈ సర్వేక్షణలు సుమారు 40 కోట్ల జనాభాలో నాలుగు వేలకు పైగా నగరాలలో జరుగుతాయి.
నగరాలను బహిరంగ మల మూత్రాదుల విసర్జన రహితంగా చెయ్యడానికి, వ్యర్థాలను సేకరించడానికి, చెత్తను సేకరించి తీసుకువెళ్ళడానికి జరిగే రవాణా ఏర్పాట్లు, శాస్త్రీయంగా చెత్తను శుద్ధి చేయడం, అలవాట్లలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, సామర్థ్య నిర్మాణానికి మరియు పరిశుభ్రత కోసం జరుగుతున్న నూతన ప్రయత్నాలూ, ఈ పని కోసం ప్రజల భాగస్వామ్యం మొదలైనవన్నీ కూడా ఈ సర్వేక్షణలో అంచనా వేయవలసిన సంగతులు. ఈ సర్వే సందర్భంగా, వివిధ జట్లు వెళ్లి నగరాలను తనిఖీ చేస్తాయి. పౌరులతో మాట్లాడి మరియు వారి అభిప్రాయాన్ని తీసుకుంటాయి. the Cleanliness App ఉపయోగం, ఇంకా విభిన్న రకాల సేవా స్థలాలలో మార్పును అంచనా వేస్తారు. ఈ సర్వేక్షణ ద్వారా నగరాలలో ఏర్పాటైన శుభ్రత వ్యవస్థ నగర పరిశుభ్రతలో భాగమైందా లేక ప్రజల జీవన విధానంలో భాగమైందా అన్నది అంచనా వేస్తారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వమే చెయ్యాలని లేదు. ఇది ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజా సంఘానికి కూడా పెద్ద బాధ్యత. రాబోయే రోజుల్లో జరగబోయే ఈ సర్వేక్షణలో ప్రతి పౌరుడు ఉత్సాహంతో పాల్గొనాలన్నది ప్రతి పౌరుడికీ నా విన్నపం. ఈ సర్వేక్షణ లో మీ నగరం, మీ ప్రాంతం, మీ వీధులు వెనుకబడకుండా మీరు గట్టి ప్రయత్నం చెయ్యాలి. మీ ఇంట్లోని తడి చెత్తని , పొడి చెత్తని వేరు చేసి పారవేయడానికి నీలం రంగు, ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలను ఉపయోగించడం మీకందరికీ ఇప్పటికే బాగా అలవాటు అయి ఉంటుందని నా నమ్మకం.
చెత్తను తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, పునరుపయోగించడం అనే సిద్ధాంతాలు చాలా ప్రయోజనకరమైనవి. ఈ సర్వేక్షణ ఆధారంగా నగరాలకు శ్రేణీకరణ (రేంకింగ్) ఇచ్చేటప్పుడు – మీ పట్టణంలో ఒక లక్ష కన్నా తక్కువ జనాభా గనుక ఉంటే ప్రాంతీయ శ్రేణీకరణ లో అత్యధిక స్థానాన్ని సంపాదించవచ్చు. అలా జారగాలనేది మీ కల కావాలి. మీ ప్రయత్నం ఆ దిశగా సాగాలి. జనవరి 4 నుండీ మార్చి 10, 2018 మధ్య జరిగే పరిశుభ్రతా సర్వేలో, స్వచ్ఛత కు సంబంధించిన ఈ ఆరోగ్యకరమైన పోటీలో మీరు వెనుకబడకుండా ప్రతి నగరంలోనూ కూడా ఇది ఒక ప్రజా చర్చా విషయం కావాలి. మా నగరం – మా ప్రయత్నం, మా అభివృధ్ధి – దేశానికి ప్రగతి అనే నినాదాలు మీ అందరి కలా కావాలి. రండి, ఇదే సంకల్పంతో మనందరమూ మరోసారి పూజ్య బాపూజీ ని స్మరించుకుంటూ స్వచ్ఛ భారతదేశం అనే సంకల్పాన్ని సంపూర్ణం చెయ్యడానికి ప్రయత్నాలు చేద్దాం.
ప్రియమైన నా దేశ వాసులారా, కొన్ని విషయాలు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ సమాజపరంగా మన గుర్తింపు పై చాలావరకూ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటువంటి ఒక విషయాన్ని ఇవాళ ‘మనసులో మాట’ ద్వారా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా ఒక ముస్లిమ్ మహిళ హజ్ యాత్రను చెయ్యాలనుకుంటే, ఆమె ఒక ‘మెహ్ రమ్’ లేదా ఒక సంరక్షకుడు లేకుండా ఆమె ఆ యాత్రను చెయ్యడానికి వీలు లేదు.
మొదటి సారి ఈ సంగతి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అలా కూడా ఉంటుందా ? ఇటువంటి నియమాన్ని ఎవరు రూపొందించారు ? ఎందుకీ వివక్ష ? అని నేను ఈ విషయం లోతుల్లోకి వెళ్ళినప్పుడు- స్వాతంత్రం వచ్చి డెభ్భై ఏళ్ళు అవుతున్నా ఇటువంటి నిషేధాన్ని విధించింది మనమే అని తెలిసి ఆందోళన పడ్డాను. దశాబ్దాలుగా ముస్లిమ్ మహిళలకు అన్యాయం జరిగుతోంది కానీ ఏ చర్చలూ జరగట్లేదు. ఎన్నో మహమ్మదీయ దేశాలలో ఈ నియమం లేదు కూడా. కానీ భారతదేశం లోని ముస్లిమ్ మహిళలకు ఈ అధికారం లేదు. మన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిని పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
మన అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను తీసుకుంది. డెభ్భై ఏళ్ల నుండీ వస్తున్న సాంప్రదాయాన్ని మారుస్తూ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఇవాళ ముస్లిమ్ మహిళలు ఏ సంరక్షకుడి తోడూ లేకుండా హజ్ యాత్ర చేయవచ్చు. ఒంటరిగా హజ్ యాత్ర చేయాలనుకుని ధరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ ప్రయాణించడానికి అనుమతిని ఇవ్వవలసిందిగా అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు నేను సూచించాను. సాధారణంగా హజ్ యాత్రికులకు లాటరీ పద్ధతి ద్వారా అనుమతిని ఇస్తారు. కానీ ఒంటరి మహిళలను ఈ లాటరీ పద్ధతి నుండి దూరంగా ఉంచాలన్నది నా అభిప్రాయం. ఒక ప్రత్యేక పర్గంగా వారికి అవకాశాన్ని ఇవ్వాలి. భారతదేశ అభివృద్ధి ప్రయాణం మన నారీ శక్తి ద్వారా, వారి ప్రతిభ కారణంగా ముందుకు నడిచిందని, వారి ప్రతిభపై ఆధారపడి ఇంకా ముందుకు నడుస్తుందని నా ధృఢ విశ్వాసం, నా నమ్మకం. మన మహిళలకూ కూడా పురుషులతో సమానంగా అధికారం లభించాలి. ప్రగతి పథంలో వారు కూడా పురుషులతో సమానంగా నడిచేందుకు వారికి సమానావకాశాలు కల్పించాలనేది మన నిరంతర ప్రయత్నం కావాలి.
ప్రియమైన నా దేశ వాసులారా, జనవరి 26 వ తేదీ మనకు ఒక చరిత్రాత్మకమైన పండుగ. కానీ ఈసారి 2018లో జనవరి 26 వ తేదీ విశేషంగా గుర్తుండిపోతుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి మొత్తం పది ఆసియాన్ (ASEAN) సభ్యత్వ దేశాల నేతలూ ముఖ్య అతిథులుగా భారతదేశం వస్తున్నారు.
ఈసారి గణతంత్ర దినోత్సవానికి ఒక్కరు కాదు పది మంది ముఖ్య అతిథులు ఉంటారు. ఇలా భారతదేశ చరిత్రలో మునుపు ఎన్నడు జరగలేదు. భారతదేశానికి, ఆసియాన్ దేశాలకు 2017 చాలా ముఖ్యమైందిగా నిలిచింది. ఆసియాన్ దేశాలు 2017 లో తమ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, 2017 లో ఆసియాన్ దేశాలతో భారతదేశం తమ పాతికేళ్ల భాగస్వామ్యాన్ని పూర్తిచేసుకొంది. జనవరి 26 కి ఈ పది ఆసియాన్ దేశాల మహా నేతలు ఒక చోటులో మన దేశంలో ఏకమవడం మన భారతీయులందరికీ గర్వించదగిన విషయం.
ప్రియమైన నా దేశ వాసులారా, ఇది పండుగల కాలం. ఒక రకంగా మనది పండుగల దేశం. ఏదో ఒక పండుగా లేకుండా ఉండే రోజులు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడే మనందరమూ క్రిస్మస్ జరుపుకొన్నాం. కొత్త సంవత్సరం రాబోతోంది. రాబోయే కొత్త సంవత్సరం మీ అందరికీ బోలెడు సుఖసంతోషాలను, ఆనందాన్ని, సమృద్ధిని తేవాలని కోరుకొంటున్నాను. మనందరం కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో ముందుకు సాగుదాం. జనవరి లో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఇదే నెలలో మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఇది ప్రకృతితో ముడిపడిన పండుగ. మన ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడిందే కానీ విభిన్నమైన మన సంస్కృతిలో ప్రకృతి తాలూకూ ఈ అద్భుత ఘటనను రకరకాలుగా విడివిడిగా జరుపుకునే ఆచారం ఉంది. పంజాబ్ లేదా ఉత్తర భారత దేశంలో ఈ పండుగను లోహ్ డీ రూపంలో ఆనందిస్తే, యు.పి., బిహార్ లో ఖిచ్డీ లేదా తిల్ సంక్రాంతి గా స్వాగతిస్తారు. రాజస్థాన్ లో సంక్రాంత్ అంటారు, అసమ్ లో మాఘ బిహు అంటే, తమిళ నాడు లో పొంగల్ అంటారు. ఈ పండుగలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. దేని ప్రాముఖ్యం దానికే ఉంది. ఈ పండుగలన్నీ 13వ తేదీ నుండి 17వ తేదీల మధ్య జరుపుకొంటాం. ఈ పండుగల పేర్లన్నీ వేరు వేరు కానీ వీటి మూల తత్త్వం ఒకటే. ప్రకృతి, వ్యవసాయాల తో ముడిపడి ఉన్నాయి.
దేశ ప్రజలందరికీ ఈ పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. మరో సారి మీ అందరికీ 2018 నూతన సంవత్సరానికి ఎన్నో శుభాకాంక్షలు.
ప్రియమైన దేశ వాసులారా, మీకు అనేకానేక ధన్యవాదాలు. 2018 లో మరోసారి మాట్లాడుకుందాం.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
PM @narendramodi conveys Christmas greetings, talks about the commitment of Lord Christ to service. #MannKiBaat pic.twitter.com/lo4HRy5QEx
— PMO India (@PMOIndia) December 31, 2017
Service is a part of India's culture. #MannKiBaat pic.twitter.com/FiIO8goQr5
— PMO India (@PMOIndia) December 31, 2017
PM @narendramodi pays tributes to Guru Gobind Singh Ji. #MannKiBaat https://t.co/Y1Thhl6aLy pic.twitter.com/psqV1w1KIh
— PMO India (@PMOIndia) December 31, 2017
Tomorrow, 1st January is special. We welcome those born in the 21st century to the democratic system as they will become eligible voters. #MannKiBaat pic.twitter.com/zNGozfpaTT
— PMO India (@PMOIndia) December 31, 2017
A vote is the biggest power in a democracy. It can transform our nation. #MannKiBaat pic.twitter.com/EF6xuo1gAG
— PMO India (@PMOIndia) December 31, 2017
PM @narendramodi addresses the 'New India Youth' during today's #MannKiBaat pic.twitter.com/lbUtT6c6d8
— PMO India (@PMOIndia) December 31, 2017
The New India Youth will transform our nation. #MannKiBaat pic.twitter.com/KScr1V5dRL
— PMO India (@PMOIndia) December 31, 2017
We can have mock Parliaments in our districts, where we discuss how to make development a mass movement and transform India. The New India Youth must take a lead in this. #MannKiBaat pic.twitter.com/b7ysbh4XYT
— PMO India (@PMOIndia) December 31, 2017
There are several opportunities for our youth today. #MannKiBaat pic.twitter.com/9XAiCXKqzm
— PMO India (@PMOIndia) December 31, 2017
During #MannKiBaat last month, I had spoken about #PositiveIndia. I am happy that so many people shared their Positive India moments through social media: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 31, 2017
Let us enter 2018 with a spirit of positivity. #MannKiBaat pic.twitter.com/2LYZs4k8Yt
— PMO India (@PMOIndia) December 31, 2017
While talking about positivity, I want to talk about Anjum Bashir Khan Khattak, who excelled in the KAS exam. He overcame adversities and distinguished himself: PM @narendramodi during #MannKiBaat
— PMO India (@PMOIndia) December 31, 2017
PM @narendramodi appreciates the Punyam Poonkavanam initiative at the Sabarimala Temple in Kerala. #MannKiBaat
— PMO India (@PMOIndia) December 31, 2017
Towards a Swachh Bharat. #MannKiBaat pic.twitter.com/rYGmIwxjyX
— PMO India (@PMOIndia) December 31, 2017
Swachh Survekshan begins in January. We will once again have a look at the strides we are making in cleanliness and areas in which we can improve: PM @narendramodi #MannKiBaat
— PMO India (@PMOIndia) December 31, 2017
A step that will benefit Muslim women. #MannKiBaat pic.twitter.com/tkjfILvB7o
— PMO India (@PMOIndia) December 31, 2017
India looks forward to welcoming ASEAN leaders for Republic Day 2018 celebrations. This is the first time so many leaders will grace the celebrations as the Chief Guests. #MannKiBaat pic.twitter.com/EF91d1oGMl
— PMO India (@PMOIndia) December 31, 2017