న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) 2023 సెప్టెంబరు 9న ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్, యుఎఇ దేశాల అధినేతలతో సంయుక్తంగా దీనికి శ్రీకారం చుట్టారు.
జి-20 కూటమికి అధ్యక్ష హోదాలో భారతదేశం ‘జిబిఎ’ ఏర్పాటుకు చొరవ చూపింది. ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధనాల వినియోగాన్ని విస్తృతం చేయడం ఈ సంకీర్ణం ఏర్పాటు లక్ష్యం. ఇందుకోసం సాంకేతిక ప్రగతి సౌలభ్యం, సుస్థిర జీవ ఇంధన వాడకం పెంపు, విస్తృత భాగస్వామ్యంతో బలమైన ప్రామాణిక-ధ్రువీకరణ వ్యవస్థ రూపొందించబడుతుంది. జీవ ఇంధన సంబంధిత విజ్ఞాన భాండాగారంగా, నిపుణల కూడలిగా ఈ సంకీర్ణం బాధ్యత నిర్వర్తిస్తుంది. అలాగే జీవ ఇంధనాల అభివృద్ధి, విస్తృత వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రపంచ సహకారానికి ఒక ఉత్ప్రేరక వ్యవస్థగా వ్యవహరించాలని ‘జిబిఎ’ లక్ష్య నిర్దేశం చేసుకుంది.