దార్శనికుడైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శనంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆలిండియా కోటా పథకంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సులలో ( ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డిప్లొమా/బిడిఎస్/ఎండిఎస్) ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసిలు) 27%, ఆర్థికంగా బలహీనవర్గాల (ఇ డబ్ల్యు ఎస్) వారికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం, అంటే 2021-22 నుంచే అమలు లోకి వస్తుంది.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాల్సిందిగా ప్రధాని ఈ నెల 26న జరిగిన ఒక సమావేశంలో సంబంధిత కేంద్ర మంత్రులను ఆదేశించారు. ఈ నిర్ణయం వలన ఏటా ఎంబీబీఎస్ లో1500 మంది ఒబిసి విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 2500 మంది ఒబిసి విద్యార్థులు లబ్ధిపొందుతారు. అదే విధంగా 550 మంది ఆర్థికంగా వెనుకబడిన ఎంబీబీఎస్ విద్యార్థులు, 1000 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
స్థానికతతో నిమిత్తం లేకుండా మెరిట్ ప్రాతిపదికన చదువుకోవాలని ఆశించే ఏ రాష్ట విద్యార్థి అయినా మరో రాష్ట్రంలో ఉన్న ఒక మంచి వైద్య కళాశాలలో చదువుకునే అవకాశం ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆలిండియా కోటా పథకాన్ని 1986లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటా కింద మొత్తం సీట్లలో 15% గ్రాడ్యుయేషన్ సీట్లు, అందుబాటులో ఉన్న పిజి సీట్లలో 50% ఉంటాయి. అయితే, మొదట్లో 2007 వరకు ఆలిండియా కోటాలో ఎలాంటి రిజర్వేషన్లూ లేవు. 2007 లో సుప్రీంకోర్టు 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు ప్రవేశపెట్టింది. 2007 లో కేంద్ర విద్యా సంస్థల చట్టం ( ప్రవేశాలలో రిజర్వేషన్) అమలులోకి వచ్చినప్పుడు సమానంగా ఒబిసి లకు 27% ఇవ్వటం మొదలైంది. దీన్ని అన్ని కేంద్ర విద్యా సంస్థలలోనూ అమలు చేశారు. అందులో సఫ్దర్ జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి. అయితే, రాష్టాల వైద్య కళాసాలలకు, దంత వైద్య కళాశాలలకు ఈ ఆలిండియా కోటా సీట్లకు వర్తింపజేయలేదు.
ప్రస్తుత ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించటానికి కట్టుబడి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆలిండియా కోటా సీట్లలో ఒబిసిలకు 27% రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఒబిసి విద్యార్థులు ఏ రాష్టంలోనైనా ఆలిండియా కోటా సీట్లకోసం పోటీ పడే వెసులుబాటు కలుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి ఈ రిజర్వేషన్ కోసం ఒబిసి ల కేంద్ర జాబితాను అనుసరిస్తారు. దాదాపు 1500 మంది ఒబిసి విద్యార్థులు ఎంబీబీఎస్ లోను. 2500 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లొను ఈ రిజర్వేషన్ ద్వారా సీట్లు పొందగలుగుతారు.
ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాలలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి లబ్ధి చేకూర్చే దిశలో 2019లో రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. దీనివలన ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటా లభించింది. మ్దుకు అనుగుణంగానే 2019-20, 2020-21 సంవత్సరాలలో ఈ 10% మంది విద్యార్థులను చేర్చుకోవటానికి వీలుగా వైద్య/దంతవైద్య కళాశాలల్లో సీట్లు పెంచారు. ఆ విధంగా అన్ రిజర్వ్ డ్ కేటగిరీ విద్యార్థులు సీట్లు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ సౌకర్యాన్ని ఇప్పటిదాకా ఆలిండియా కోటా సీట్లకు వర్తింపజేయలేదు.
అందువలన ఇప్పుడు 27% ఒబిసి రిజర్వేషన్లతోబాటు 10% ఆర్థికంగా వెనుకబడినవారి రిజర్వేషన్ కూడా ఆలిండియా కోటా అండర్ గ్రాడ్యుయేట్.పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ సీట్లకు విస్తరించారు. ఇది 2021-22 విద్యాసంవత్సరం నుంచే అమలు జరిగేలా ఆదేశాలిచ్చారు. దీనివలన 550 మందికి పైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్ లోనూ, 1000 మంది పిజి మెడికల్ కోర్సులలోనూ ప్రయోజనం పొందగలుగుతారు.
వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం అద్దం పడుతోంది.
2014 నుంచి వైద్య విద్యలో చేపడుతున్న అనేక కీలకమైన సంస్కరణలకు కూడా ఈ నిర్ణయం ఒక నిదర్శనం. గడిచిన ఆరేళ్ళ కాలంలో దేసవ్యాప్తంగా ఎంబీబీస్ సీట్లు 56% పెరిగాయి. 2014 లో 54,348 సీట్లుండగా 2020 నాటికి అవి 84,649 అయ్యాయి. అదే విధంగా పిజి సీట్లు 80% పెరిగాయి. 2014 లో 30,191 ఉండగా అవి 2020 నాటికి 54,275 అయ్యాయి. అదే కాలంలో 179 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు దేశంలో 558 వైద్య కళాశాలలుండగా అందులో 289 ప్రభుత్వ ఆధ్వర్యంలోను, 269 ప్రైవేట్ ఆధ్వర్యంలోను నడుస్తున్నాయి.