కువైత్ లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ విద్యార్థి చిరంజీవి రిద్ధిరాజ్ కుమార్ 18,000 రూపాయల విలువైన ఒక చెక్కును సైన్య సంక్షేమ నిధికి గాను విరాళంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేశారు. రిద్ధిరాజ్ కుమార్ మొత్తం 80 కువైత్ దినార్ లను ఎసిఇఆర్ నుండి బహుమతి సొమ్ముగా గెలుచుకున్నాడు. ఈ మొత్తం అతడు ఇచ్చిన విరాళానికి సమానంగా ఉంది. చిరంజీవి రిద్ధిరాజ్ కుమార్ తన తల్లితో పాటు ఈ రోజు శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యాడు.
చిరంజీవి రిద్ధిరాజ్ కువైత్ లో ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రిసర్చ్ (ఎసిఇఆర్) నిర్వహించిన ఇంటర్నేషన్ బెంచ్ మార్క్ టెస్ట్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవార్డును చిరంజీవి రిద్ధిరాజ్ గెలుచుకున్నాడు. మధ్య ప్రాచ్య ప్రాంతంలో గణిత శాస్త్రం, శాస్త్ర విజ్ఞానం.. ఈ రెండు అంశాలలోను రిద్ధిరాజ్ శేష్ఠతను కనబరిచి మొత్తం 80 కువైత్ దినార్ లను గెలుచుకున్నాడు.
చిరంజీవి రిద్ధిరాజ్ విద్యా సంబంధమైన శ్రేష్ఠతను, ఉదారత్వాన్ని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఆ అబ్బాయి అనేక నూతన ఆవిష్కరణలను కూడా సాధించిన విషయం ప్రధాన మంత్రి దృష్టి వచ్చింది.
ఆ విద్యార్థి మాతృమూర్తి శ్రీమతి కృపా భట్ ప్రధాన మంత్రితో మాట్లాడుతూ, తాను 'ఎవ్రీ చైల్డ్ ఈజ్ జీనియస్ ప్రాజెక్ట్' అంశంపై పని చేస్తున్నట్లు, అంతేకాకుండా ప్రతిభావంతులైన బాలలను గుర్తించడానికి భారతదేశంలో ఉపాధ్యాయులకు ఉచితంగా చర్చా సభలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినూత్న జ్ఞానవర్ధక పథకాలను వ్యాప్తిలోకి తీసుకురావాలన్న నిబద్ధతను చాటుతున్నందుకు గాను ఆమెను ప్రధాన మంత్రి అభినందించారు.