75వ స్వాతంత్ర్య సంవత్సరాన సర్వీసులో ప్రవేశించడం మీ అదృష్టం.. రానున్న 25 ఏళ్లు మీతోపాటు భారతదేశానికి ఎంతో కీలకం: ప్రధానమంత్రి;
‘‘వారు స్వరాజ్యం కోసం పోరాడారు... మీరు ‘సు-రాజ్యం’ కోసం ముందడుగు వేయాలి’’: ప్రధానమంత్రి;
నేటి సాంకేతిక విప్లవ యుగంలో పోలీసుల సర్వ సన్నద్ధతే తక్షణావసరం: ప్రధానమంత్రి;
‘ఐక్యభారతం-శ్రేష్ట భారతం’ పతాకధారులు మీరే; ‘దేశమే ప్రథమం..సదా ప్రథమం.. అత్యంత ప్రథమం’.. ఇదే మీ తారకమంత్రం: ప్రధానమంత్రి;
స్నేహంతో మెలగుతూ మీ యూనిఫాం ఔన్నత్యాన్ని నిలబెట్టండి: ప్రధానమంత్రి; నేనిప్పుడు ఉత్తేజితులైన కొత్త తరం మహిళా అధికారులను చూస్తున్నాను.. పోలీసు బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచడానికి మేమెంతో కృషిచేశాం: ప్రధానమంత్రి;
మహమ్మారితో పోరులో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి;
పొరుగు దేశాల శిక్షణార్థి అధికారులు మన దేశాల మధ్యగల
లోతైన, సన్నిహిత సంబంధాలను ప్రస్ఫుటం చేస్తున్నారు: ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.

శిక్షణార్థి అధికారులతో ప్రధాని మాటామంతీ

   ప్రధానమంత్రి నేడు ఇండియన్ పోలీసు సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్లతో ఎంతో ఉల్లాసంగా మాటామంతీ నిర్వహించారు. శిక్షణార్థి అధికారులతో ఆయన సంభాషణ అత్యంత సహజ రీతిలో సాగగా, ‘ఐపీఎస్’కు సంబంధించిన అధికారిక అంశాలను దాటి కొత్త తరం అధికారుల ఆశలు, ఆకాంక్షలను కూడా ప్రధానమంత్రి చర్చనీయాంశం చేశారు. ఇందులో భాగంగా కేరళ కేడరుకు ఎంపికైన ‘ఐఐటీ’ (రూర్కీ) పట్టభద్రుడు, హర్యానా వాస్తవ్యుడైన అనూజ్ పలీవాల్‌తో మాట్లాడుతూ- ప‌ర‌స్ప‌ర విరుద్ధ అంశాల‌ను ప్ర‌స్తావించిన‌ట్లు క‌నిపిస్తూనే స‌ద‌రు అధికారికిగ‌ల అనుకూలాంశాల గురించి ప్ర‌ధాని పూర్తిస్థాయిలో ఆరాతీశారు. దీనిపై ఆ అధికారి స్పందిస్తూ- తన విద్యానేపథ్యం బయోటెక్నాలజీకి సంబంధించినదని, ఇది నేర పరిశోధనలో ఎంతగానో దోహదపడగలదని చెప్పారు. అలాగే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తానెంచుకున్న సామాజిక శాస్త్రం కూడా తన వృత్తి జీవితంలోని అంశాలతో వ్యవహరించడంలో ఉపయోగపడగలదని తెలిపారు. సంగీతంపై అభిరుచిగల పలీవాల్‌కు కఠిన నిబద్ధతతో కూడిన పోలీసు విధుల్లో అందుకు తగిన సమయం లభించకపోవచ్చునని ప్రధానమంత్రి అన్నారు. అయితే, వ్యక్తిగత సేవా పరాణయతను ఇనుమడింపజేసి, ఆయన మరింత మెరుగైన అధికారిగా రూపొందడంలో ఈ అభిరుచి సహాయపడగలదని అభిప్రాయపడ్డారు.

   అనంతరం ఈతపై అభిరుచిగల న్యాయశాస్త్ర పట్టభద్రుడు, సివిల్ సర్వీసెస్ కోసం రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు ప్రధాన పాఠ్యాంశాలుగా ఎంచుకున్న రోహన్ జ‌గ‌దీష్‌తో ప్రధానమంత్రి సంభాషించారు. పోలీసు శాఖలో శరీర దారుఢ్యానికిగల ప్రాధానం గురించి ఈ సందర్భంగా ముచ్చటించడంతోపాటు పోలీసు శిక్షణలో వచ్చిన మార్పుల గురించి శ్రీ జ‌గ‌దీష్‌తో చర్చించారు. కాగా, తన తండ్రి రాష్ట్ర పోలీసు సర్వీసు అధికారిగా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్ర కేడరుకు జగదీష్ ఎంపికయ్యారు.

   అలాగే ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర కేడ‌రుకు ఎంపికై మహారాష్ట్ర వాస్తవ్యుడు, సివిల్ ఇంజినీర్ గౌరవ్ రామ్‌ప్ర‌వేశ్ రాయ్‌తో ప్రధానమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా చదరంగంపై ఆయనకుగల క్రీడాభిరుచి వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతంలో పోలీసు విధుల్లో వ్యూహాలకు ఏ మేరకు తోడ్పడగలదని ఆరాతీశారు. అక్కడ ప్రత్యేక సవాళ్లున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ- శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిసహా సామాజిక సంబంధాలకు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. యువత హింసా మార్గం పట్టకుండా చూడటంలో రాయ్‌వంటి యువ అధికారులు విశేష కృషి చేయాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే మావోయిస్టు హింసను నియంత్రించడమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో సరికొత్త విశ్వాస-ప్రగతి వారధులు నిర్మిస్తున్నామని ప్రధాని వివరించారు.

   అటుపైన రాజస్థాన్ రాష్ట్ర కేడరుకు ఎంపికైన హర్యానా వాస్తవ్యురాలు రంజీతా శర్మతో ప్రధానమంత్రి ముచ్చటించారు. అత్యుత్తమ శిక్షణార్థి అధికారిణిగా పురస్కారం అందుకున్న ఆమె శిక్షణలో సాధించిన విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంబంధాలు ప్రధాన పాఠ్యాంశంగా పట్టభద్రురాలైన ఆమె సదరు అంశాన్ని తన విధుల్లో ఎలా వాడుకుంటారో వాకబు చేశారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బాలికల జీవన పరిస్థితుల మెరుగుకు ఇప్పటిదాకా చేసిన కృషి గురించి శ్రీ మోదీ వివరించారు. తాను విధులు నిర్వర్తించబోయే ప్రాంతంలో వారానికి ఒక గంట సమయాన్ని బాలికల కోసం కేటాయించాలని ఆయన సూచించారు.  తద్వారా వారిలో ఉత్తేజం నింపుతూ సంపూర్ణ సామర్థ్యం సంతరించుకునేలా చూడాలని ఆకాంక్షించారు.

   ఆ తర్వాత సొంత రాష్ట్ర కేడరుకు ఎంపికైన కేరళ వాస్తవ్యుడు పి.నితిన్ రాజ్‌తో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రజలతో మమేమకం కావడంలో చక్కని మాధ్యమాలైన బోధన, ఫొటోగ్రఫీలపై  ఆయనకుగల ఆసక్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు.

   అనంతరం బీహార్ రాష్ట్ర కేడరుకు ఎంపికైన పంజాబ్‌ వాస్తవ్యురాలు, పంటి డాక్ట‌ర్‌ న‌వ్‌జోత్ సిమితో ప్రధానమంత్రి మాట్లాడుతూ- మహిళా అధికారుల ప్రాతినిధ్యంతో పోలీసు శాఖ విధుల్లో సానుకూల మార్పులు సాధ్యం కాగలవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎలాంటి భయానికి తావులేకుండా కరుణతో, అవగాహనతో తన విధులు నిర్వర్తించేలా గురువుల ప్రబోధాలు ముందుకు నడపాలని ఆకాంక్షించారు. పోలీసు బలగంలో మరింతమంది మహిళల చేరిక ద్వారా ఐపీఎస్ ఇంకా బలోపేతం కాగలదని ఆయన అన్నారు.

   ఇక ఐఐటీ-ఖ‌డ‌గ్‌పూర్ నుంచి ఎం.టెక్ పట్టభద్రుడు, సొంత రాష్ట్ర కేడరుకే ఎంపికైన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌తో ప్రధానమంత్రి ముచ్చటించారు. సాంకేతిక శాస్త్ర పట్టభద్రుడు కావడంతో ఆర్థిక నేరాల పరిశోధనపై ఆలోచనల గురించి ప్రధాని ఆయనతో  చర్చించారు. ఇందులో భాగంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానానికిగల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సైబర్ నేరాల్లో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు నిశితంగా దృష్టి సారించాలని ప్రొబేషనర్లందరికీ ఆయన సూచించారు. డిజిటల్ పరిజ్ఞానంపై ప్రజల్లో అవగాహన పెంపు నిమిత్తం సలహాలు, సూచనలు పంపాలని యువ అధికారులను కోరారు.

    ఆ తర్వాత మాల్దీవ్స్ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందిన మొహమ్మద్ న‌జీమ్‌తో ప్రధానమంత్రి సంభాషించారు. మాల్దీవ్స్ ప్రజల అనురాగపూరిత  స్వభావాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మాల్దీవ్స్ పొరుగుదేశం మాత్రమేగాక, ఒక మంచి స్నేహితుడన్నారు. ఆ దేశంలో పోలీసు అకాడమీ ఏర్పాటుకు భారత్ సహాయం చేస్తున్నదని గుర్తుచేశారు. అదే సమయంలో రెండు దేశాల మధ్యగల సామాజిక, వాణిజ్య సంబంధాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

ప్రధానమంత్రి ప్రసంగం

   ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- రాబోయే ఆగస్టు 15న దేశం 75వ స్వాతంత్ర్య  వార్షికోత్సవాన్ని నిర్వహించుకోనున్నదని గుర్తుచేశారు. గడచిన 75 ఏళ్లలో పోలీస్ సర్వీసును మెరుగుపరచేందుకు అనేకవిధాల కృషి సాగిందని ఆయన పేర్కొన్నారు. పోలీసు శిక్షణకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఇటీవలి సంవత్సరాల్లో గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. శిక్షణార్థి అధికారులంతా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించడం కోసం 1930 నుంచి 1947 మధ్య కాలంలో యువతరం ఒక్కతాటిపైకి వచ్చి పిడికిలి బిగించి ముందుకురికిందని ఆయన చెప్పారు. నేటి యువతరం నుంచి కూడా అదే భావన ఉత్తుంగ తరంగంలా ఎగసిపడాలని ఆకాంక్షిస్తూ- ‘‘ఆనాడు వారు ‘స్వరాజ్యం’ కోసం పోరాడారు... నేడు మీరంతా ‘సురాజ్యం’ కోసం ముందడుగు వేయండి’’ అని పిలుపునిచ్చారు.

   భారతదేశం ప్రతి స్థాయిలోనూ పరివర్తన చెందుతున్న ప్రాముఖ్యంగల ప్రస్తుత తరుణంలో వృత్తి జీవితంలోకి ప్రవేశిస్తున్నామని శిక్షణార్థి అధికారులంతా గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. భారత గణతంత్రం 75 ఏళ్ల స్వాతంత్ర్యం నుంచి శతాబ్ది వేడుకల దిశగా పయనించనున్న నేపథ్యంలో వారి తొలి పాతికేళ్ల కర్తవ్య నిర్వహణ కాలం దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నేటి సాంకేతిక విప్లవ యుగంలో పోలీసుల సర్వ సన్నద్ధతే తక్షణావసరమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సరికొత్త ఆవిష్కరణాత్మక పద్ధతులతో కొత్తరకం నేరాలను నిరోధించడం వారి ముందున్న పెనుసవాలని పేర్కొన్నారు. సైబర్ భద్రత దిశగా వినూత్న పరిశోధనలు, ప్రయోగాలు, పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

   ప్రొబేషనరీ అధికారుల నుంచి ప్రజలు నిర్దిష్ట ప్రవర్తన శైలిని ఆశిస్తారని శ్రీ మోదీ చెప్పారు. విధి నిర్వహణలో భాగంగా ఆఫీసు గదిలో లేదా ప్రధాన కార్యాయంలో మాత్రమేగాక ఎల్లవేళలా అదే హుందాతనం పాటించాలన్న వాస్తవాన్ని ఎన్నడూ విస్మరించరాదని సూచించారు. ‘‘సమాజాంలో మీరు పోషించాల్సిన అన్ని పాత్రలపైనా చైతన్యంతో మెలగాలి. స్నేహపూర్వకంగా ఉంటూ మీ యూనిఫాం ఔన్నత్యాన్ని సదా కొనసాగించాలి’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ‘ఐక్యభారతం-శ్రేష్ట భారతం’ పతాకధారులు వారేనని, అందువల్ల ‘దేశమే ప్రథమం.. సదా ప్రథమం.. అత్యంత ప్రథమం’.. అనే తారకమంత్రాన్ని నిరంతరం మదిలో ఉంచుకోవాలని సూచించారు. ఆ మేరకు వారి కార్యకలాపాలన్నిటిలోనూ ఇది ప్రతిబింబించాలని ప్రధానమంత్రి ఉద్బోధించారు. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునే సమయంలో జాతీయ ప్రయోజనాలను, జాతీయ దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు.

   ఉత్తేజితులైన కొత్త తరం మహిళా అధికారులను చూస్తున్నానని, పోలీసు బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచడానికి తామెంతో కృషి చేశామని ప్రధానమంత్రి చెప్పారు. ఈ భారత పుత్రికలు పోలీసు శాఖ సామర్థ్యంలో అత్యున్నత ప్రమాణాలను, జవాబుదారీతనాన్ని ప్రోది చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో పోలీసు విధుల్లో మర్యాద, మన్నన, సౌలభ్యాలకు తావు కల్పించగలరని పేర్కొన్నారు. పది లక్షలకుపైగా జనాభాగల నగరాల్లో కమిషనరేట్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు యోచిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే 16 రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయని తెలిపారు. పోలీసు విధులను మరింత సమర్థం, భవిష్యత్తు అవసరాల తగినట్లుగా రూపొందించేందుకు సమష్టిగా, అవగాహనతో కృషి చేయడం ముఖ్యమని ఆయన చెప్పారు. మహమ్మారితో పోరులో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ప్రధానమంత్రి ఈ సందర్భంగా నివాళి అర్పించారు. మహమ్మారిపై యుద్ధంలో వారు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

   అకాడమీలో శిక్షణ పొందుతున్న పొరుగు దేశాల పోలీసు అధికారులు రెండు దేశాల మధ్యగల లోతైన, సన్నిహిత సంబంధాలను ప్రస్ఫుటం చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు భూటాన్, నేపాల్, మాల్దీవ్స్ వంటి దేశమేదైనా మనం కేవలం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, మన ఆలోచనల్లోనూ, సామాజిక అల్లికలోనూ అనేక సారూప్యాలు ఉన్నాయన్నారు. మనం అవసరమైన సమయాల్లో ఆదుకునే స్నేహితులమని, విపత్తులతోపాటు కష్టాలు ఎదురయ్యే వేళల్లో పరస్పర ప్రతిస్పందనలో మనమే ముందుంటామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఈ వాస్తవం ప్రస్ఫుటమైందని ప్రధాని గుర్తుచేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage