భార‌త‌-ఐరోపా స‌మాఖ్య (ఇయు) వాణిజ్య‌-సాంకేతిక మండ‌లి (టిటిసి) రెండో స‌మావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. భారత్ త‌ర‌ఫున విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్; వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ దీనికి సహాధ్యక్షత వహించారు. అలాగే ‘ఇయు’ వైపునుంచి ‘సాంకేతికత సర్వాధిపత్యం-ప్రజాస్వామ్యం-భద్’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి హెన్నా విర్కునెన్‌; ‘వాణిజ్యం-ఆర్థిక భద్రత-అంతర సంస్థాగత సంబంధాలు-పారదర్శకత’ కమిషనర్ శ్రీ మారోస్ సెఫ్కోవిచ్; అంకుర సంస్థలు-పరిశోధన-ఆవిష్కరణ’ కమిషనర్‌ ఎకటెరినా జహరీవా సహాధ్యక్షులుగా వ్యవహరించారు.

   ‘వాణిజ్యం-విశ్వసనీయ సాంకేతికతలు-భద్రత’ త్రయంతో ముడిపడిన సవాళ్ల పరిష్కారానికి ప్రధాన ద్వైపాక్షిక వేదికగా ‘భారత్‌-ఇయు టిటిసి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 2022 ఏప్రిల్‌లో ప్రారంభించారు. కాగా- స్వేచ్ఛా విపణి ఆర్థిక వ్యవస్థలు, ఉమ్మడి విలువలు, భిన్నత్వంలో ఏకత్వం చాటే సమాజాలుగల రెండు అతిపెద్ద, శక్తియుత ప్రజాస్వామ్య దేశాలుగా నేటి బహుళ ధ్రువ ప్రపంచంలో భారత్‌-‘ఇయు’ సహజ భాగస్వాములుగా మారాయి.

   ఉభయ పక్షాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తృతితోపాటు వ్యూహాత్మక సమన్వయం కూడా ఇనుమడిస్తోంది. అందుకే, నిరంతర మారే అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నడుమ ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక భద్రత, సుస్థిర-సమగ్ర వృద్ధిని ప్రోత్సహించడంలో ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా అవి ప్రతిస్పందిస్తాయి. ఆ మేరకు నియమాధారిత అంతర్జాతీయ వ్యవస్థ ప్రాధాన్యంతోపాటు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, పారదర్శకత, వివాదాలకు  శాంతియుత పరిష్కార సంబంధిత సూత్రావళిని పూర్తిస్థాయిలో గౌరవించాల్సిన ఆవశ్యకతను రెండు పక్షాలు పునరుద్ఘాటించాయి. భారత్‌-‘ఇయు’లలో వాణిజ్య-సాంకేతికత రంగాల నడుమ కీలక సంబంధాల విస్తృతిపై ఉభయపక్షాలకుగల ఏకాభిప్రాయాన్ని ‘టిటిసి’ ప్రతిబింబిస్తుంది. భాగస్వాములుగా రెండు ఆర్థిక వ్యవస్థల వృద్ధికి ఈ రంగాల్లో పరస్పర సహకారానికిగల సామర్థ్యాన్ని, భద్రత సవాళ్లపై సంయుక్త కృషి అవసరాన్ని కూడా ‘టిటిసి’ చాటుతుంది. మరోవైపు పునరుత్థాన శక్తి పెంపు, అనుసంధాన బలోపేతం, పర్యావరణ హిత-కాలుష్య రహిత (గ్రీన్‌ అండ్‌ క్లీన్‌) సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన తదితరాలను ముందుకు నడిపించడంలో తమ భాగస్వామ్యానికిగల సామర్థ్యాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి.

   భారత్‌-ఇయు టిటిసి’ తొలి సమావేశాన్ని 2023 మే 16న బ్రస్సెల్స్‌ నగరంలో నిర్వహించగా, ఈ వ్యవస్థ ముందంజ వేసేందుకు ‘టిటిసి’ మంత్రుల స్థాయి సమావేశం రాజకీయ మార్గనిర్దేశం చేసింది. అటుపైన ‘టిటిసి’లో అంతర్భాగమైన 3 కార్యాచరణ బృందాలు సాధించిన ప్రగతిని వాస్తవిక సాదృశ (వర్చువల్‌) మాధ్యమం ద్వారా 2023 నవంబర్‌ 24న నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు.

కార్యాచరణ బృందం 1: వ్యూహాత్మక సాంకేతికతలు-డిజిటల్‌ పరిపాలన-డిజిటల్‌ సంధానం

   ఉమ్మడి విలువలకు అనుగుణంగా ఈ బృందం ద్వారా డిజిటల్ సహకార విస్తృతి ఆవశ్యకతను భారత్‌-ఇయు పునరుద్ఘాటించాయి. మానవాళి కేంద్రక డిజిటల్ రూపాంతరీకరణ సహా కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, 6జి తదితర అత్యాధునిక-విశ్వసనీయ డిజిటల్ సాంకేతికతల ఆవిష్కరణను వేగిరపరచే దిశగా తమ సామర్థ్యాల సద్వినియోగంపై ఉభయ పక్షాలూ నిబద్ధత ప్రకటించాయి. తద్వారా ఉభయ ఆర్థిక వ్యవస్థలకు, సమాజాలకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా ఆర్థిక భద్రత, పోటీతత్వం మరింత పెంపులో భాగంగా సంయుక్త పరిశోధన-ఆవిష్కరణల బలోపేతానికి భారత్‌-ఇయు అంగీకారం ప్రకటించాయి. సైబర్-సురక్షిత డిజిటల్ ఆవరణంలో ప్రపంచ అనుసంధానాన్ని ప్రోత్సహించడంపైనా నిబద్ధత తెలిపాయి.

   సార్వత్రిక, సార్వజనీన డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలు, సమాజాల వృద్ధిలో ప్రభుత్వ డిజిటల్‌ మౌలిక సదుపాయాల (డిపిఐ) ప్రాధాన్యాన్ని రెండు పక్షాలు గుర్తించాయి. తదనుగుణంగా మానవ హక్కులకు గౌరవం, వ్యక్తిగత సమాచార-గోప్యతల పరిరక్షణ, మేధా సంపత్తి హక్కులకు రక్షణకు సంబంధించిన ‘డిపిఐ’ల పరస్పర నిర్వహణ దిశగా సహకారానికి అంగీకరించాయి. తృతీయపక్ష దేశాల్లో ‘డిపిఐ’ ఉపకరణాలకు సంయుక్త ప్రోత్సాహంతోపాటు సరిహద్దు డిజిటల్ లావాదేవీల మెరుగుదల, పరస్పర ఆర్థిక వృద్ధికి తోడ్పడే దిశగా ఇ-సంతకాల పరస్పర గుర్తింపు అవసరాన్ని స్పష్టం చేశాయి.

   సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థల పునరుత్థాన శక్తిని మరింత పెంచడంతోపాటు సహకారానికి ప్రోత్సాహంపై ఉభయ పక్షాలు నిబద్ధత ప్రకటించాయి. ఇందులో భాగంగా చిప్ డిజైన్, వైవిధ్య ఏకీకరణ, సుస్థిర సెమీకండక్టర్ సాంకేతికతలు, ప్రాసెస్ డిజైన్ కిట్ (పిడికె) కోసం అత్యాధునిక ప్రక్రియల రూపకల్పనకు సాంకేతికత ఆవిష్కరణ వంటి రంగాల్లో సంయుక్త పరిశోధన-ఆవిష్కరణలు చేపట్టేందుకు అంగీకరించాయి. సుస్థిర, సురక్షిత, వైవిధ్యభరిత సెమీకండక్టర్ ఉత్పాదన సామర్థ్యాల రూపకల్పన ద్వారా సాంకేతిక సామర్థ్యాల  మెరుగుకు, సరఫరా వ్యవస్థల పునరుత్థాన శక్తి పెంచడానికి సెమీకండక్టర్ వ్యవస్థల బలోపేతాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాయి. అంతేగాక విద్యార్థులు, యువ నిపుణుల నడుమ ప్రతిభాపాటవాల ఆదానప్రదాన సౌలభ్యంతోపాటు సెమీకండక్టర్ నైపుణ్యాల పెంపు దిశగా ప్రత్యేక కార్యక్రమ రూపకల్పనకు హామీ ఇచ్చాయి.

   సురక్షిత, నిరపాయ, విశ్వసనీయ, మానవాళి కేంద్రక సుస్థిర-బాధ్యతాయుత కృత్రిమ మేధ (ఎఐ) సహా అంతర్జాతీయ స్థాయిలో ఈ దృక్పథాన్ని ప్రోత్సహించడంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ రంగంలో నిరంతర ప్రభావశీల సహకారం లక్ష్యంగా ఐరోపా, భారత ‘ఎఐ’ కార్యాలయాల మధ్య సహకార విస్తృతికి అంగీకరించాయి. ఈ మేరకు ఆవిష్కరణావరణ వ్యవస్థకు తోడ్పాటు సహా విశ్వసనీయ ‘ఎఐ’ రూపకల్పన కోసం ఉమ్మడి సార్వత్రిక పరిశోధనాంశాలపై సమాచార ఆదానప్రదానాలను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. భారీ భాషా నమూనాలపై సహకారం మెరుగుదల, నైతిక-బాధ్యతాయుత ‘ఎఐ’ సంబంధిత ఉపకరణాలు, చట్రాల రూపకల్పన వంటి ఉమ్మడి ప్రాజెక్టులు సహా మానవాళి అభివృద్ధి, విశ్వజన శ్రేయస్సు కోసం ‘ఎఐ’ సామర్థ్య వినియోగానికి అంగీకరించాయి. ప్రకృతి విపత్తులు, వాతావరణ, బయోఇన్ఫర్మాటిక్స్‌ రంగాల్లో హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్ అనువర్తనాలపై పరిశోధన-ఆవిష్కరణల సహకారం కింద సాధించిన ప్రగతి ఆధారంగా ఈ కృషి కొనసాగుతుంది.

   భారత ‘6జి అలయన్స్’-ఇయు ‘6జి స్మార్ట్ నెట్‌వర్క్స్‌ అండ్‌ సర్వీసెస్‌ పరిశ్రమల సమాఖ్య’   అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంపై రెండు పక్షాలూ హర్షం వ్యక్తం చేశాయి. పరిశోధన-ఆవిష్కరణ ప్రాథమ్యాల సమన్వయంతోపాటు సురక్షిత-విశ్వసనీయ టెలికమ్యూనికేషన్లు, పునరుత్థాన శక్తిగల సరఫరా వ్యవస్థల సృష్టికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. అలాగే అంతర్జాతీయంగా పరస్పర నిర్వహణ ప్రమాణాలను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టితో ఐటీ, టెలికాం రంగాలలో ప్రామాణీకరణపై సహకార విస్తృతికి నిర్ణయించాయి.

  అంతేగాక డిజిటల్ నైపుణ్య అంతరం తగ్గింపు, ధ్రువీకరణలపై పరస్పర గుర్తింపు, వృత్తి నిపుణుల చట్టబద్ధ రాకపోకలకు ప్రోత్సాహం, ప్రతిభాపాటవాల ఆదానప్రదానం తదితరాలపై మార్గాన్వేషణకు అంగీకరించాయి.

   ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2024 సెప్టెంబరులో ఏకాభిప్రాయంతో ఆమోదించిన  అంతర్జాతీయ డిజిటల్ ఒప్పందం (జిడిసి) అమలుకు సహకారంపై రెండు పక్షాలు అంగీకారం తెలిపాయి. ఈ రంగంలో భారత్‌-ఇయు ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఈ ఒప్పందం కీలక ఉపకరణం కానుంది. దీంతోపాటు రాబోయే ‘ప్రపంచ సమాచార సొసైటీ+20’ శిఖరాగ్ర సదస్సు వేదికగా ‘ఇంటర్నెట్ గవర్నెన్స్’లో బహుళ-భాగస్వామ్య విధానానికి ప్రపంచ దేశాల మద్దతు కొనసాగింపు, విస్తృతికి హామీ పొందాలని ఉభయ పక్షాలు నిర్ణయించాయి.

కార్యాచరణ బృందం 2: కాలుష్య రహిత-పర్యావరణ హిత (క్లీన్‌ అండ్‌ గ్రీన్‌) సాంకేతికతలు

   భారత్‌ 2070 నాటికి, ఐరోపా సమాఖ్య 2050 నాటికి నికరశూన్య ఉద్గార స్థాయిని సాధించాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాయి. ఈ దిశగా కాలుష్య రహిత-పర్యావరణ హిత (క్లీన్‌ అండ్‌ గ్రీన్‌) సాంకేతికతలపై కార్యాచరణ బృందం-2కు నిర్దేశించిన ప్రాథమ్య కార్యక్రమాల ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలూ గుర్తుచేసుకున్నాయి. ఈ లక్ష్యాల సాధనకు సరికొత్త కాలుష్య రహిత సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రమాణాల రూపకల్పన కోసం గణనీయ పెట్టుబడులు అవసరం. ఇక పరిశోధన-ఆవిష్కరణ (ఆర్‌ అండ్‌ ఐ)లకు ప్రాధాన్యంతో భారత్‌-ఇయు మధ్య సాంకేతిక సహకారం, ఉత్తమ విధానాల ఆదానప్రదానం ఇనుమడిస్తాయి. దీనికి సమాంతరంగా మార్కెట్ వినియోగార్థం సాంకేతిక ఆవిష్కరణలకు మద్దతివ్వాల్సి ఉంటుంది. తద్వారా భారత, ఇయు సంస్థలకు సంబంధిత విపణుల సౌలభ్యం మెరుగుపడటమేగాక వినూత్న సాంకేతికతల విస్తృత స్వీకరణకు వీలు కలుగుతుంది. అలాగే రెండు పక్షాల ఇంక్యుబేటర్లు, చిన్న-మధ్యతరహా సంస్థలు (ఎస్‌ఎంఇ)లు, అంకుర సంస్థల నడుమ సహకారానికి బాటలు పడతాయి. దీనివల్ల  ఆయా సాంకేతిక పరిజ్ఞానాల్లో మానవ వనరుల శక్తిసామర్థ్యాలను పెంపొందించే అవకాశం లభిస్తుంది.

   దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) బ్యాటరీల రీసైక్లింగ్‌, సముద్రపు ప్లాస్టిక్‌ చెత్త పునరుపయోగం, వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి వంటి అంశాలపై విశిష్ట సమన్వయ కృషిలో భాగంగా సంయుక్త పరిశోధన-సహకారానికి ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఇందుకు అవసరమైన సుమారు 60 మిలియన్‌ యూరోల మేర బడ్జెట్‌లో ‘హొరైజన్‌ యూరప్ ప్రోగ్రామ్’ ద్వారా ‘ఇయు’ నిధులిస్తుండగా, భారత్‌ తన వాటా నిధులను జోడిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల పునరుపయోగానికి సంబంధించి వివిధ రకాల సరళ/చౌక/సౌలభ్య రీసైక్లింగ్‌ ప్రక్రియల ద్వారా వాటి వర్తుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. సముద్రపు ప్లాస్టిక్‌ చెత్త విషయంలో జలపరమైన చెత్త గుర్తింపు, అంచనా, విశ్లేషణ సహా సముద్రావరణంపై సంచిత కాలుష్య దుష్ప్రభావం తగ్గించే పరిజ్ఞానాల రూపకల్పనపై ప్రధానంగా దృష్టి పెడతారు. అలాగే జీవసంబంధ వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి దిశగా అధిక సామర్థ్యంగల పరిజ్ఞానాల ఆవిష్కరణపై దృష్టి సారిస్తారు.

   నిర్దేశిత రంగాల్లో సహకారానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రాతిపదికగా నిపుణుల మధ్య గణనీయ ఆదానప్రదానాల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు గుర్తుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహన పరస్పర నిర్వహణ, ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ (ఇఎంసి)పై 2024 జనవరిలో ఇటలీలోని ఇస్ప్రాలోగల సంయుక్త పరిశోధన కేంద్రం (జెఆర్‌సి) ఇ-మొబిలిటీ ప్రయోగశాలలో నిర్వహించిన శిక్షణ-పరస్పర అభ్యసన కార్యక్రమంలో భారత నిపుణులు పాలుసంచుకున్నారు. మరోవైపు భారత్‌ పరంగా పుణె నగరంలోని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ)లోనూ, ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ (ప్రామాణీకరణ-పరీక్ష) సాంకేతికతలపై సంయుక్త మిశ్రమ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. చార్జింగ్‌ మౌలిక సదుపాయాల ప్రామాణీకరణ ప్రక్రియలపై భారత్‌-ఇయు మధ్య  ద్వైపాక్షిక చర్చలు, పరిశ్రమల మధ్య సంబంధాల విస్తృతికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. అలాగే ‘ఈవీ’ బ్యాటరీల రీసైక్లింగ్ సాంకేతికతలో ఆదానప్రదాన అవకాశాల అన్వేషణ, మద్దతు-నిర్వహణ లక్ష్యంగా భారత-ఇయు అంకుర సంస్థల మధ్య భాగస్వామ్యాల ఖరారుకు ఉభయ పక్షాలు ఇప్పటికే ఓ కార్యక్రమం నిర్వహించాయి. అంతేగాక సముద్రపు ప్లాస్టిక్ చెత్త  సంబంధిత అంచనా-పర్యవేక్షణ ఉపకరణాలపైనా నిపుణులు సంయుక్తంగా చర్చించారు. చివరగా- సముద్రపు చెత్త కాలుష్య సమస్య సమర్థ పరిష్కారానికి భాగస్వామ్య సంస్థల సంయుక్త కృషితో ఆచరణాత్మక మార్గాల అన్వేషణ కోసం భారత్‌-ఇయు సహకార విస్తృతి లక్ష్యంగా “ఐడియాథాన్” నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

   ఎలక్ట్రిక్‌ రవాణా రంగంలో చార్జింగ్‌ మౌలిక సదుపాయాల ప్రామాణికత ఏకీకరణపై సహకారం అన్వేషణకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. సహకారాత్మక, ప్రామాణికతా పూర్వ పరిశోధన సహా ఏకీకృత పరిష్కారాలు, విజ్ఞాన ఆదానప్రదానం కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే మునుపటి సంయుక్త పరిశోధన ప్రాజెక్టుల ఫలితాలకు అనుగుణంగా హైడ్రోజన్ సంబంధిత భద్రత ప్రమాణాలు, ప్రామాణీకరణ విజ్ఞానం, వ్యర్థజల శుద్ధి సాంకేతికతల విపణి వినియోగంలో సహకారం పెంచుకునే మార్గాన్వేషణకూ నిర్ణయించాయి.

కార్యాచరణ బృందం 3: వాణిజ్యం-పెట్టుబడులు-పునరుత్థా

   భారత్‌-ఇయు మధ్య సన్నిహిత ఆర్థిక భాగస్వామం లక్ష్యంగా ‘వాణిజ్యం-పెట్టుబడులు-పునరుత్పైఈ కార్యాచరణ బృందం పరిధిలో నిర్మాణాత్మక చర్చల ఆవశ్యకతను రెండు పక్షాలూ గుర్తించాయి. భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో సవాళ్లు  నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా సంపద సృష్టి, ఉమ్మడి సౌభాగ్యం కోసం సంయుక్త కృషికి నిబద్ధత ప్రకటించాయి. తదనుగుణంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ), పెట్టుబడి రక్షణ ఒప్పందం (ఐపిఎ), భౌగోళిక సూచీల ఒప్పందంపై వేర్వేరు మార్గాల్లో సాగుతున్న చర్చలకు ఒక రూపం రావడంలో ఈ కార్యాచరణ బృందం తనవంతు తోడ్పాటునిస్తుంది.

   పారదర్శకత, అంచనా సామర్థ్యం, వైవిధ్యీకరణ, భద్రత, స్థిరత్వాలకు ప్రాధాన్యంతో పునరుత్థాన శక్తిగల, భవిష్యత్‌ సంసిద్ధ విలువ వ్యవస్థల పురోగమనంపై రెండు పక్షాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. మరోవైపు వ్యవసాయ-ఆహార, ఔషధ ముడిపదార్థాల (ఎపిఐ), కాలుష్య రహిత సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేగాక అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగల విలువ వ్యవస్థలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మూడు రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలకు అంగీకారం తెలిపాయి.

   వ్యవసాయ రంగంలో ఆహార భద్రతపై సంభావ్య ప్రణాళిక రూపకల్పన కోసం సహకారానికి భారత్‌-ఇయు సంసిద్ధత తెలిపాయి. అలాగే జి-20 చట్రం ప్రోత్సహిస్తున్న మేరకు వాతావరణ మార్పు పునరుత్థాన పద్ధతులు, పంటల వైవిధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదల సంబంధిత ఉమ్మడి పరిశోధన-ఆవిష్కరణలలో సంయుక్త కృషిపై హర్షం వ్యక్తం చేశాయి. సరఫరా వ్యవస్థలలో దుర్బలత్వం గుర్తింపు, సుస్థిర తయారీకి ప్రోత్సాహం, అంతరాయాల నివారణ కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఔషధ ముడిపదార్థాల రంగంలో పారదర్శకత, భద్రత పెంపుపై లక్ష్యనిర్దేశం చేసుకున్నాయి. సౌర-తీరప్రాంత పవన విద్యుదుత్పాదన, కాలుష్య రహిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం సరఫరా వ్యవస్థ బలోపేతం దిశగా పర్యావరణ హిత సాంకేతిక సహకార కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించాయి. ఇందుకోసం రంగాల వారీగా సామర్థ్యాలతోపాటు పెట్టుబడి ప్రోత్సాహకాలు, పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణ ప్రాథమ్యాలపై సమాచార మార్పిడికి నిశ్చయించాయి. అంతేకాకుండా దుర్బలత్వ అంచనా ప్రక్రియలు, వాణిజ్య అవరోధాల తగ్గింపు విధానాలపై చర్చలు,  సరఫరా వ్యవస్థల మధ్య సమన్వయ అవకాశాల అన్వేషణ చేపట్టేందుకు అంగీకరించాయి.

   ఈ మేరకు ఆయా రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం, క్రమబద్ధ చర్చలు, పరిశోధనలలో సహకారం, వ్యాపారాల మధ్య ఒప్పందాలతో నష్టాల తగ్గింపు, సరఫరా వ్యవస్థల పునరుత్థానం, సుస్థిర ఆర్థిక వృద్ధికి భరోసా తదితరాల దిశగానూ భారత్‌-ఇయు కృషి చేస్తున్నాయి.

   ‘టిటిసి’ చట్రం పరిధిలో సహకారం ద్వారా సంబంధిత ప్రాధాన్య మార్కెట్ సౌలభ్య సమస్యల పరిష్కారంపై రెండు పక్షాలు సంతృప్తి ప్రకటించాయి. ఈ మేరకు అనేక మూలికా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆమోదంపై భారత్‌ చొరవను ‘ఇయు’ పక్షం కొనియాడింది. అలాగే అనేక భారత ఆక్వాకల్చర్ సంస్థలకు గుర్తింపు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు సమాన ప్రాతిపదికపై ‘ఇయు’ చర్యలను భారత్‌ పక్షం ప్రశంసించింది. మరోవైపు ‘టిటిసి’ సమీక్ష యంత్రాంగం కింద ఈ అంశాలపై కృషి కొనసాగింపుతోపాటు పరస్పరం గుర్తించిన ఇతర సమస్యల పరిష్కారంపై తమ హామీలను నెరవేర్చేందుకు అంగీకరించాయి.

   ఆర్థిక భద్రత పెంపులో కీలకమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా వీటి వడపోతలో ఉత్తమ విధానాల ఆదానప్రదానం అవసరాన్ని రెండు పక్షాలు గుర్తించాయి.

   సవాళ్లతో కూడిన ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నడుమ బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను కీలకాంశంగా పరిగణిస్తూ దానిపై తమ నిబద్ధతను భారత్‌-ఇయు ప్రస్ఫుటంగా చాటాయి. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)లో సంస్కరణల ద్వారా సభ్యదేశాల ప్రయోజనాలతో ముడిపడిన సమస్యలకు సార్థక, సమర్థ పరిష్కారాన్వేషణ అవసరాన్ని గుర్తించాయి. దీంతోపాటు క్రియాశీల వివాద పరిష్కార వ్యవస్థ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- ‘డబ్ల్యుటిఒ’ నిర్దిష్ట చర్యలు చేపట్టేలా తోడ్పడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా 14వ మంత్రుల స్థాయి సదస్సు (ఎంసి14) సహా అన్నివేదికలపైనా సంభాషణలు, చర్చల విస్తృతికి అంగీకరించాయి.

   ఉభయ పక్షాలు అనేక ద్వైపాక్షిక వేదికల ద్వారా వాణిజ్యం, కర్బన ఉద్గారాల నిరోధంపై... ప్రత్యేకించి ‘ఇయు సరిహద్దు కర్బన సర్దుబాటు నిబంధన’ (సిబిఎఎం) అమలు గురించి విస్తృతంగా చర్చించడంతోపాటు భాగస్వామ్య సంస్థలతో సంయుక్తంగానూ అందులో పాలుపంచుకున్నాయి. ‘సిబిఎఎం’ అమలుతో తలెత్తే సవాళ్లపై... ముఖ్యంగా చిన్న-మధ్య తరహా పరిశ్రమల సమస్యల మీద ఉభయ పక్షాలు చర్చించి, వాటి పరిష్కారం దిశగా కృషిని కొనసాగించేందుకు అంగీకరించాయి.

   ‘టిటిసి’ యంత్రాంగం కింద చర్చల విస్తరణ, పరిధి పెంచడానికి రెండు పక్షాల సహాధ్యక్ష బృందాలు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి. విజయవంతమైన ఈ రెండో సమావేశం నిర్దేశిత లక్ష్యాల సాధనలో సంయుక్త కృషిపై దృఢ నిశ్చయం ప్రకటిస్తూ- మరో ఏడాదిలోగా 3వ సమావేశం నిర్వహణకు అంగీకరించాయి.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Men’s Regu team on winning India’s first Gold at Sepak Takraw World Cup 2025
March 26, 2025

The Prime Minister Shri Narendra Modi today extended heartfelt congratulations to the Indian Sepak Takraw contingent for their phenomenal performance at the Sepak Takraw World Cup 2025. He also lauded the team for bringing home India’s first gold.

In a post on X, he said:

“Congratulations to our contingent for displaying phenomenal sporting excellence at the Sepak Takraw World Cup 2025! The contingent brings home 7 medals. The Men’s Regu team created history by bringing home India's first Gold.

This spectacular performance indicates a promising future for India in the global Sepak Takraw arena.”