1. భారతదేశ ప్రధాన మంత్రి మాననీయ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని 2018 డిసెంబర్ 16- 18 తేదీ ల మధ్య భారతదేశం లో ఆధికారిక పర్యటన కు మాల్దీవ్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇబ్రాహిమ్ మొహమ్మద్ సోలిహ్విచ్చేశారు.
2. 2018 నవంబర్ 17వ తేదీ న రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ అధ్యక్షుని గా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ప్రెసిడెంట్ శ్రీ సోలిహ్ తొలి విదేశీ పర్యటన ఇదే. ప్రథమ పౌరురాలు, ఆయన సతీమణి శ్రీమతి ఫజ్నా అహ్మద్ తో పాటు అత్యున్నత అధికార స్థాయి ప్రతినిధుల బృందం తో సహా ఆయన ఈ ఆధికారిక పర్యటన కు వచ్చారు. ఈ పర్యటన లో ఆయన వెంట మాల్దీవ్స్ విదేశ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా షాహిద్, ఆర్థిక మంత్రి ఇబ్రహీం అమీర్, జాతీయ ప్రణాళిక మరియు మౌలిక వసతుల శాఖ మంత్రి శ్రీ మొహమ్మద్ అస్లమ్, రవాణా మరియు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ ఐషత్ నహులా, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఉజ్ ఫయ్యాజ్ ఇస్మాయిల్ లతో పాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు, వ్యాపార వేత్తలు ఉన్నారు.
3. అత్యంత ప్రధానమైన సంకేతం గా ప్రెసిడెంట్ శ్రీ సోలిహ్ రాష్ట్రపతి ప్రత్యేక అతిథి గా రాష్ట్రపతి భవన్ లో బస చేశారు. భారతదేశం, మాల్దీవ్స్ మధ్య ఉన్న సన్నిహిత బంధానికి, రెండు ప్రభుత్వాలకు గల పరస్పర గౌరవానికి ఇది దర్పణం.
4. భారతదేశ రాష్ట్రపతి 2018 డిసెంబర్ 17వ తేదీ న మాల్దీవ్స్ అధ్యక్షుడి తో భేటీ అయ్యారు. అదే రోజు న సాయంత్రం పూట ఆయన గౌరవార్ధం విందు ను ఇచ్చారు. మాల్దీవ్స్ అధ్యక్షుడిని కలుసుకొన్న వారి లో ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు.
5. భారతదేశ ప్రధానమంత్రి, మాల్దీవ్స్ అధ్యక్షుడు 2018 డిసెంబర్ 17వ తేదీ న అత్యంత సుహృద్భావ వాతావరణం లో ఆధికారిక చర్చలలో పాల్గొనడం ఉభయ దేశాల మధ్య గల ప్రత్యేక బాంధవ్యానికి ప్రతీక. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా మాల్దీవ్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇబ్రాహిం మొహమ్మద్ సోలిహ్, ఆయన వెంట ఉన్న ప్రతినిధివర్గానికి విందు ను ఇచ్చారు.
6. మాల్దీవ్స్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం గా ఈ దిగువ పొందుపరచిన ఒప్పందాలు/ఎంఒయు లు/ఉమ్మడి ప్రకటన లపై ఉభయ పక్షాలు
సంతకాలు చేశాయి.
• వీసా సదుపాయాన్ని కల్పించే అంగీకారం
• సాంస్కృతిక సహకారానికి సంబంధించిన ఎంఒయు
• వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు పరస్పరం సహకారం అందించుకునే అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)
• సమాచారం, సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ రంగాలలో సహకారానికి ఉమ్మడి ప్రకటన
ఈ దిగువ విభాగాలలో సహకారం విస్తృతి కి సహాయపడే ఒక యంత్రాంగం ఏర్పాటు కు, సంస్థాగత అనుసంధానాని కి ఉభయులు అంగీకరించారు.
• ఆరోగ్య రంగం లో, ప్రత్యేకించి కేన్సర్ చికిత్స ల విభాగం లో సహకారం
• నేరపూరితమైన అంశాలపై పరస్పర న్యాయ సహాయం
• పెట్టుబడులకు ప్రోత్సాహం
• మానవ వనరుల అభివృద్ధి
• పర్యటన రంగం
7. అధ్యక్షుడు మాన్య శ్రీ సోలిహ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథి గా తాను ఇటీవల మాల్దీవ్స్ లో పర్యటించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుర్తు చేశారు. మాల్దీవ్స్ తో బంధానికి భారతదేశం ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యాన్ని ఆయన ఈ సందర్భం గా పునరుద్ఘాటించారు.
8. ఉభయ దేశాల ప్రజల మధ్య ఉన్న భౌగోళిక, ప్రాంతీయ, చారిత్రక, సామాజిక- ఆర్థిక, సాంస్కృతిక సాన్నిహిత్యం పునాది గా నిర్మాణం అయిన సాంప్రదాయకం గా శక్తివంతమైన, స్నేహపూర్వకమైన బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలన్న ఆకాంక్షను ఉభయులు పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధి, శాంతియుత సహజీవనం సిద్ధాంతాల కు కట్టుబాటు ను, గట్టి నమ్మకాన్ని కూడా వారు నొక్కి పలికారు.
9. ప్రజాస్వామ్యం లోకి శాంతియుతం గాను, విజయవంతం గాను అడుగు పెట్టినందుకు మాల్దీవ్స్ ప్రజలకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రధానం గా సమ్మిళిత, వికేంద్రీకృత, సుస్థిర పరిపాలన నిర్వహించాలన్న ప్రెసిడెంట్ విజన్ ను ఆయన కొనియాడారు. “పొరుగు వారి కే ప్రాధాన్యం” ఇవ్వాలన్న తమ ప్రభుత్వ విధానాన్ని గౌరవ ప్రధాన మంత్రి మరోసారి గుర్తుకు తెస్తూ సామాజిక- ఆర్థిక అభివృద్ధి, ప్రజాస్వామిక, స్వతంత్ర సంస్థ ల పరిరక్షణ ప్రయత్నాలలో మాల్దీవ్స్ కు అన్ని రకాలుగాను సహాయాన్ని అందించగలమని ప్రధాన మంత్రి శ్రీ మోదీ గట్టి గా వక్కాణించారు.
10. మాల్దీవ్స్ ప్రభుత్వం చేపట్టే సామాజిక- ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు వీలుగా 1.4 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం బడ్జెటరీ మద్దతు, కరెన్సీ మార్పిడి, రాయితీ రుణకల్పన తో కలిపి అందించగలమని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ప్రకటించారు.
11. తమ ప్రభుత్వం అనుసరించే “ఇండియా ఫస్ట్ పాలిసి”ని ప్రెసిడెంట్ శ్రీ సోలిహ్ పునరుద్ఘాటించారు. భారతదేశం తో కలిసికట్టు గా, సన్నిహితం గా పని చేయడానికి కట్టుబాటు ను ప్రకటించారు. మాల్దీవ్స్ కు ఆర్థిక సహాయం అందించేందుకు భారతదేశం ఎంతో ఉదారంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. అభివృద్ధి పథం లో ప్రయాణించే సమయం లో సహకారాన్ని అందుకొనేందుకు కొన్ని రంగాల ను ఎంపిక చేసినట్టు తెలిపారు. మాల్దీవ్స్ కు వెలుపల ఉన్న దీవులలో గృహనిర్మాణం, మౌలిక వసతులు, నీరు, నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యాటక రంగాలలో సహకారానికి గల అవకాశాలను వివరించారు.
12. వస్తువులు, సేవలు, సమాచారం, ఆలోచనలు, సంస్కృతి, ప్రజల సత్వర రవాణా కు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా ఉభయ దేశాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచవలసిన అవసరాన్ని ఉభయ దేశాల నాయకులు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
13. తమ ప్రభుత్వం న్యాయం, పోలీసు, చట్టాల అమలు, ఆడిట్, ఆర్థిక నిర్వహణ, స్థానిక పాలన, సామాజికాభివృద్ధి, ఐటి, ఇ- గవర్నెన్స్, క్రీడలు, ప్రసార మాధ్యమాలు, యువజన, మహిళా అభివృద్ధి, నాయకత్వం, నవ్యత, నవ పారిశ్రామికులకు అండదండలు వంటి విభాగాలలో సామర్థ్యాల విస్తరణ కోసం శిక్షణ కు రానున్న 5 సంవత్సరాల కాలంలో 1,000 అదనపు స్లాట్ ల కేటాయింపు కు నిర్ణయించిందన్న విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ
మాల్దీవ్స్ ప్రతినిధివర్గానికి తెలిపారు.
14. ప్రజల మధ్య సహజసిద్ధమైన అభిప్రాయ మార్పిడి కి గల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ అందుకు అనుగుణం గా వీసాల జారీ కి సంబంధించిన కొత్త ఒప్పందం పై సంతకాలు చేశారు. ఉభయులకు గల ఉమ్మడి ఆందోళన ను ఈ కొత్త అంగీకారం తీర్చగలదని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొంటూ, దీని వల్ల ప్రజల మధ్య పరస్పర అనుబంధం మరింత గా పెరుగుతుందన్నారు. భారతదేశం వీజా ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని దేశాల్లో మాల్దీవ్స్ ఒకటి.
15. ఒప్పందంపై సంతకాలు జరగడం పట్ల ప్రెసిడెంట్ శ్రీ సోలిహ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దీని వల్ల మాల్దీవ్స్ ప్రజలు వారి పిల్లలను విద్యాభ్యాసం కోసం భారతదేశం లోని పాఠశాల లకు పంపించి వారికి సంరక్షకులు గా కూడా వచ్చే అవకాశం కలుగుతుందని అన్నారు. మాల్దీవ్స్ పౌరులు, వారి కుటుంబాల సభ్యులు వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చేందుకు తేలికగా వీజా లభ్యం అయ్యేందుకు కూడా ఈ ఒప్పందం దోహదకారి అవుతుందన్నారు. ఉభయ దేశాల మధ్య ప్రజలు నిరంతరాయంగా రాకపోకలు సాగించాలన్న ఆకాంక్ష ను ఇరువురు నేత లు ప్రకటించారు.
16. హిందూ మహాసముద్ర ప్రాంతం లో శాంతి ని, సుస్థిరత్వాన్ని నెలకొల్పాల్సిన ప్రాధాన్యాన్ని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఉభయ దేశాలు ప్రాంతీయంగా ఒకదానితో మరొకటి అనుసంధానాన్ని కలిగివున్న కారణం గా ఉమ్మడి భద్రత ప్రయోజనాలను మరింతగా విస్తరించుకునేందుకు వారు అంగీకరించారు. ప్రాంతీయ సుస్థిరత్వం పట్ల ఉభయుల ఆందోళనలు, ఆకాంక్షలు గుర్తుంచుకుంటూ తమ ప్రాదేశిక ప్రాంతాలలో రెండో దేశం పై శత్రుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించరాదని నిర్ణయించారు. హిందూ మహాసముద్ర ప్రాంతం లో సమన్వయపూర్వక గస్తీ, గగనతల గూఢచర్యం, సమాచార మార్పిడి, సామర్థ్యాల విస్తరణ వంటి కార్యకలాపాల ద్వారా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉభయులు అంగీకరించారు.
17. ప్రాంతీయం గా లేదా ప్రపంచం లో ఎక్కడైనా, ఏ రీతి లో అయినా సాగే ఉగ్రవాదం పై పోరాటం లో పరస్పరం సహకరించుకోవాలని ఇద్దరు నాయకులు వచనబద్ధత ను పునరుద్ఘాటించారు. పైరసీ, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా ల వంటి ఉభయులకు ఉమ్మడి ఆందోళన గల వివిధ అంశాలపైన ద్వైపాక్షిక సహకారాన్నిపెంచుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్, మాల్దీవ్స్ నేశనల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది శిక్షణ, సామర్థ్యాల విస్తరణ కు సహాయాన్ని అందించేందుకు కూడా అంగీకారం కుదిరింది.
18. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విభాగాలలో జరుగుతున్న కృషి ని సమీక్షించాలని ఉభయ దేశాల నాయకులు అంగీకారానికి వచ్చారు. పరస్పర ప్రయోజనం గల భిన్న రంగాలలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలు మాల్దీవ్స్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం విస్తరించేందుకు అంగీకరించడం పట్ల ప్రధాన మంత్రి హర్షం ప్రకటించారు. పారదర్శకత్వం, బాధ్యత, నిబంధనల కట్టుబాటు తో కూడిన మాల్దీవ్స్ ప్రభుత్వం దార్శనికత వల్ల భారతీయ వ్యాపారవేత్త లలో విశ్వాసం నెలకొంటుందని ప్రధాన మంత్రి అన్నారు. మత్స్య సంపద అభివృద్ధి, పర్యాటకం, రవాణా, అనుసంధానం, ఆరోగ్యం, విద్య, ఐటి, సరికొత్త- నవీకరణ యోగ్య శక్తి వనరులు, కమ్యూనికేశన్ రంగాలలో సన్నిహిత సహకారాన్ని విస్తరించుకునేందుకు రెండు దేశాల నాయకులు అంగీకరించారు.
19. అంతర్జాతీయ సవాళ్ల ను దీటుగా ఎదుర్కొనాలంటే ప్రపంచం లోని బహుముఖీన వ్యవస్థ సమర్థవంతం గా పని చేయవలసివుందని ఇరువురు నాయకులు పునరుద్ఘాటిస్తూ ఐక్య రాజ్య సమితి సంస్థలలో సంస్కరణలను చేపట్టాలని, ఐక్య రాజ్య సమితి సర్వప్రతినిధి సభ ను పునరుత్తేజింపచేయడం తో పాటు భద్రత మండలి ని విస్తరించాలని సూచించారు.
20. విస్తరించిన, సంస్కరించిన భద్రత మండలి లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వ కల్పన కోసం మాల్దీవ్స్ మద్దతును అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. 2020-21 సంవత్సరాల కాలానికి భారత్ నాన్ పర్మనెంట్ సభ్యత్వానికి కూడా మాల్దీవ్స్ మద్దతు నుప్రకటించింది.
21. కామన్ వెల్త్ లో తిరిగి సభ్యత్వాన్ని పొందాలన్న మాల్దీవ్స్ నిర్ణయాన్ని భారతదేశ ప్రధాన మంత్రి స్వాగతించారు. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేశన్ లో సరికొత్త సభ్యదేశం గా మాల్దీవ్స్ చేరడాన్ని కూడా ఆయన స్వాగతించారు.
22. వాతావరణ మార్పులు, ప్రత్యేకించి వర్థమాన దేశాలు, చిన్న దీవుల ప్రయోజనాల కు విరుద్ధమైన చర్య లకు వ్యతిరేకంగా పోరాటం ప్రాధాన్యాన్ని ఉభయ దేశాల నాయకులు గుర్తించారు. యుఎన్ఎఎఫ్ సిసి, ప్యారిస్ ఒప్పందం పరిధి లో వాతావరణ మార్పు లకు అంతర్జాతీయ స్పందన వ్యవస్థ ను మరింత పటిష్ఠం చేయడం కోసం కలసి పని చేయాలని నిర్ణయించారు.
23. బహుముఖీన ఆర్థిక సంస్థ లను కూడా సంస్కరించి పటిష్ఠం చేయవలసిన అవసరం ఉందని ఉభయ దేశాల నాయకులు నొక్కి పలికారు. అంతర్జాతీయ స్థాయి లో ఆర్థిక నిర్ణయాలలో వర్ధమాన దేశాల వాక్కు, భాగస్వామ్యం పెరగాలని వారు అన్నారు.
24. తనకు, తన ప్రతినిధివర్గానికి సుహృద్భావపూర్వకమైన, అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించినందుకు భారతదేశ ప్రధాన మంత్రి కి మాల్దీవ్స్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.
25. మాల్దీవ్స్ లో ఆధికారిక పర్యటన కు తరలి రావలసిందంటూ భారతదేశ రాష్ట్రపతి ని మాల్దీవుల అధ్యక్షుడు ఆహ్వానించారు. అలాగే మాల్దీవ్స్ లో ఆధికారిక పర్యటన కు రావాలంటూ ప్రధాన మంత్రి ని కూడా ఆహ్వానించగా అందుకు ప్రధాన మంత్రి సమ్మతి ని తెలిపారు.