1. గణతంత్ర భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయ శ్రీమతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు ఐక్య గణతంత్ర టాంజానియా దేశాధ్యక్షురాలు మాననీయ సమియా సులుహు హసన్ 2023 అక్టోబరు 8-10 తేదీల మధ్య భారతదేశంలో అధికారికంగా పర్యటించారు. టాంజానియా విదేశాంగ-తూర్పు ఆఫ్రికా సహకార శాఖల మంత్రి గౌరవనీయ జనవరి మకాంబసహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు, ఆ దేశ వాణిజ్య సమాజ ప్రతినిధి బృందం కూడా ఆమెతోపాటు ఈ పర్యటనకు వచ్చారు.

2. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధ్యక్షురాలు గౌరవనీయ సమియా సులుహు హసన్‌కు 2023 అక్టోబర్ 9న అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. అనంతరం ఆమె రాజఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆమె గౌరవార్థం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. అటుపైన వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

3. అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సౌహార్ద స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాల సంబంధిత ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికేగల సన్నిహిత, సహృదయ, సహకారాత్మక సంబంధాలపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. భారత- టాంజానియాల మధ్య ఉమ్మడి విలువలు, ఆదర్శాలతో కూడిన సుదీర్ఘ చరిత్రగల భాగస్వామ్యం కాలపరీక్షకు తట్టుకుని ఏళ్ల తరబడి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. టాంజానియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016 జూలైనాటి పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. అలాగే రెండు దేశాల మధ్య అభివృద్ధి సహకారానికి గణనీయ ప్రోత్సాహాన్నిచ్చాయని వారిద్దరూ వ్యాఖ్యానించారు.

4. ఆర్థిక, సాంకేతిక, శాస్త్రీయ రంగాల్లో సహకారంపై సంయుక్త కమిషన్‌ 10వ సమావేశానికి సహాధ్యక్ష హోదాలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నాయకత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఇటీవల టాంజానియా సందర్శించగా, ఈ ఏడాది పలువురు టాంజానియా మంత్రులు కూడా భారత్‌లో పర్యటించారని వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఇటువంటి ఉన్నత స్థాయి పర్యటనలు టాంజానియా-భారత్‌ల బలమైన స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేశాయని ఇద్దరు నాయకులూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.

5. గౌరవనీయ అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ 2023 అక్టోబరు 10న భారత-టాంజానియా వాణిజ్య-పెట్టుబడుల వేదిక సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు దేశాల వాణిజ్య సమాజాల ప్రతినిధులను ఉద్దేశించి కీలకోపన్యాసం చేస్తారు. అలాగే ఆమె భారతీయ వ్యాపార ప్రముఖులతో ముఖాముఖి సమావేశాల్లోనూ (బి2బి) పాల్గొంటారు.

6. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంసహా వివిధ రంగాల్లో సహకార  విస్తరణ దిశగా భారత-టాంజానియా సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా  స్థాయి పెంచుతున్నట్లు నాయకులిద్దరూ ప్రకటించారు. సముద్ర భద్రత, రక్షణ సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, వాణిజ్యం-పెట్టుబడులు వంటి ఇతరత్రా అంశాలపైనా సంయుక్త కృషిలో వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలకూ తోడ్పడుతుందని ఉభయపక్షాలు పేర్కొన్నాయి.

టాంజానియా అధ్యక్షురాలి పర్యటనలో భాగంగా పలు రంగాల సంబంధిత విస్తృత శ్రేణి అవగాహన ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి. వీటి జాబితా ఈ ప్రకటనకు ‘అనుబంధం-ఎ’గా జతచేయబడింది.

రాజకీయ సంబంధాలు

7. లలఇండో-పసిఫిక్‌పై దూరదృష్టి, ఈ ప్రాంతంపై హిందూ మహాసముద్ర వలయ దేశాల కూటమి దృక్పథం అమలుసహా ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలలో ద్వైపాక్షిక రాజకీయ చర్చలు, వ్యూహాత్మక సంభాషణల స్థాయి ఇనుమడించడంపై ఉభయ పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భారత-టాంజానియా సుదీర్ఘ వాణిజ్య చరిత్రగల సముద్ర పొరుగు దేశాలు కావడంతోపాటు ప్రజల మధ్య సంబంధాలున్న దృష్ట్యా భారత్‌ చేపట్టిన ‘సాగర్’ (ప్రాంతీయ దేశాలన్నిటికీ భద్రత-వృద్ధి) వ్యూహంలో టాంజానియాకు కీలక స్థానం ఉందని అంగీకరించాయి. ఇండో-పసిఫిక్‌ విషయంలో సహకారాన్ని ఉభయ పక్షాలూ ఆమోదించాయి. సత్వర ఆర్థిక వృద్ధి కోసం నీలి/సముద్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఆఫ్రికాలో శాంతిభద్రతలపై ఆఫ్రికా సమాఖ్య (ఎయు) నిర్దేశించుకన్న వ్యూహానికి, భారత్‌ ప్రతిపాదిత ‘సాగర్‌’కు మధ్య సాపేక్షతను ఉభయపక్షాలూ గుర్తించాయి. ప్రకృతి వైపరీత్యాలు భారీస్థాయిలో విరుచుకుపడినప్పుడు రక్షణ-సహాయ కార్యకలాపాలు చేపట్టేందుకు అనుభవాల ఆదానప్రదానం కోసం భారత్‌లో నిర్వహించే వార్షిక మానవతావాద విపత్తు సహాయ కసరత్తు (హెచ్‌ఎడిఆర్‌)లో టాంజానియా భాగం కావడంపైనా వారు హర్షం వ్యక్తం చేశారు.

8. విదేశాంగ మంత్రుల స్థాయిలో సంయుక్త కమిషన్ యంత్రాంగం, నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశాల ద్వారా ఉన్నతస్థాయి రాజకీయ చర్చల కొనసాగింపునకు ఇరుపక్షాలూ అంగీకరించాయి. అలాగే తమతమ విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య విధాన ప్రణాళిక రూపకల్పన చర్చకు శ్రీకారం చుట్టడంపైనా అంగీకారానికి వచ్చాయి.

రక్షణ సహకారం

9. టాంజానియాలోని అరుషాలో 2023 జూన్ 28-29నాటి 2వ సంయుక్త రక్షణ సహకార కమిటీ సమావేశంలో రెండు దేశాల మధ్య రక్షణ సహకారంపై ఐదేళ్ల మార్గ ప్రణాళిక రూపకల్పనకు మార్గం సుగమం కావడంపై నాయకులిద్దరూ హర్షం ప్రకటించారు.

10. టాంజానియా రక్షణ మంత్రులు 2022 ఆగస్టు, 2023 ఫిబ్రవరిలో భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని ఇరుపక్షాలు గుర్తుచేసుకున్నాయి. ఈ పర్యటన సందర్భంగా రక్షణ సహకార పరిధి విస్తరణకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో తమ దేశంలోని డులూటిలోగల ‘కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ’లో భారత సైనిక శిక్షణ బృందం (ఐఎంటిటి)ని ఏర్పాటు చేయడాన్ని టాంజానియా పక్షం ప్రశంసించింది.

11. టాంజానియాలోని దార్-ఎస్-సలామ్‌లో 2022 మే 31సహా 2023 అక్టోబరు 2న రెండుసార్లు రక్షణ రంగ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అనేక భారతీయ రక్షణ సంస్థలు ఇందులో పాలుపంచుకున్నాయి; ఈ సందర్భంగా రక్షణ రంగ పరిశ్రమలలో సహకార విస్తరణకు ఉభయ పక్షాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. టాంజానియా బలగాలతోపాటు పరిశ్రమల సామర్థ్యం పెంపుతో రెండు పక్షాల మధ్య సహకారం పురోగమించడంపై నాయకులిద్దరూ సంతోషం ప్రకటించారు.

సముద్ర భద్రత

12. భారత-టాంజానియా రెండు దేశాలూ సాధారణ సముద్ర భద్రత సవాళ్లను ఎదుర్కొనే సముద్ర పొరుగు దేశాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్ర ప్రాంత సముద్ర భద్రతలో సహకార విస్తరణకు ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. జాంజిబార్, దార్-ఎస్-సలామ్‌లను భారత నావికాదళ నౌక త్రిశూల్ సందర్శించిన సందర్భంగా 20263 జూలైలో నిర్వహించిన తొలి భారత-టాంజానియా సంయుక్త ప్రత్యేక ఆర్థిక మండలి (ఇఇజడ్‌) నిఘా కసరత్తుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత నావికాదళ నౌక తార్కాష్ 2022 అక్టోబరు నాటి సందర్శన సందర్భంగా భారత్‌-టాంజానియా ద్వైపాక్షిక సముద్ర కసరత్తు కూడా నిర్వహించడాన్ని వారు గుర్తుచేసుకున్నారు.

13. ఇటీవలి సంవత్సరాల్లో తమ ప్రధాన ఓడరేవుల హైడ్రోగ్రాఫిక్ సర్వేల నిర్వహణలో భారత్‌ చొరవను  టాంజానియా పక్షం ప్రశంసించింది. తదనుగుణంగా ఈ ప్రాంతంలో సహకారం కొనసాగింపునకు ఉభయ పక్షాలు అంగీకరించాయి.

14. రెండు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర కార్యాచరణాత్మకతను పెంచాలని ఉభయ పక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా భారతీయ నౌకలు తరచూ టాంజానియా ఓడరేవులకు ప్రయాణించడాన్ని వారు హర్షించారు. అలాగే 2022 అక్టోబరులో భారత నావికాదళ నౌక తార్కాష్ సందర్శన సందర్భంగా మొజాంబిక్ కాలువలో భారత-టాంజానియా, మొజాంబిక్‌ సహిత తొలి త్రైపాక్షిక సముద్ర కసరత్తు నిర్వహించడాన్ని వారు ప్రశంసించారు.

15. భారత-టాంజానియాల మధ్య వాణిజ్య, సైనికేతర నౌకల రాకపోకలపై ముందస్తు సమాచార మార్పిడి (వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్‌) సంబంధిత సాంకేతిక ఒప్పందంపై సంతకాలు పూర్తికావడాన్ని నాయకులిద్దరూ అభినందించారు.

నీలి ఆర్థిక వ్యవస్థ

16. పర్యాటకం, సముద్ర వాణిజ్యం, సేవలు, మౌలిక సదుపాయాలు, సముద్ర శాస్త్ర పరిశోధన, సముద్రగర్భంలో మైనింగ్ సామర్థ్యం, సముద్ర పరిరక్షణ, సముద్ర భద్రత-రక్షణసహా నీలి ఆర్థిక వ్యవస్థ రంగంలో భారత ప్రభుత్వంతో సహకారానికి టాంజానియా పక్షం ఆసక్తి వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని శాంతియుత, సుసంపన్న, సుస్థిర ప్రాంతంగా తీర్చిదిద్దడానికి, హిందూ మహాసముద్ర వలయ దేశాల కూటమి (ఐఒఆర్‌ఎ) చట్రం కింద సహకరించుకోవడానికి భారత-టాంజానియాలు అంగీకరించాయి.

వాణిజ్యం - పెట్టుబడులు

17. ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం పెంపుపై ఉభయ పక్షాలు తమ కట్టుబాటును ప్రకటించాయి. ఈ దిశగా కొత్త వాణిజ్య రంగాలను అన్వేషించాలని సంబంధిత అధికారులను నాయకులిద్దరూ ఆదేశించారు. ఇందులో భాగంగా వ్యాపార ప్రతినిధుల సందర్శనలు, వ్యాపార ప్రదర్శనలు, వ్యాపార సంఘాలతో పరస్పర చర్యల నిర్వహణ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం మెరుగు సంబంధిత సమాచార ఆదానప్రదాన సమన్వయం చేసుకోవాలని, చొరవ తీసుకోవాలని కూడా అంగీకరించారు.

18.  టాంజానియా సంబంధిత తొలి ఐదు పెట్టుబడి వనరులలో భారత్‌ ఒకటని టాంజానియా పక్షం అంగీకరించింది. తద్వారా 3.74 బిలియన్‌ డాలర్ల విలువైన 630 పెట్టుబడి ప్రాజెక్టులు నమోదు కాగా, వీటిద్వారా 60,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. టాంజానియాలో పెట్టుబడులపై భారత వ్యాపారవేత్తల్లో ఆసక్తిని పెంచుతున్న ఇటీవలి ధోరణులను ఉభయ పక్షాలు స్వాగతించాయి. టాంజానియాలో ఇన్వెస్ట్‌మెంట్ పార్క్ ఏర్పాటు అవకాశాల అన్వేషణకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. దీనికి సంబంధించి తమనుంచి పూర్తి మద్దతు ఉంటుందని టాంజానియా పక్షం హామీ ఇచ్చింది.

19.  ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణలో రెండు దేశాల్లోనూ స్థానిక కరెన్సీ వినియోగాన్ని నాయకులిద్దరూ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా టాంజానియా అనుబంధ బ్యాంకులు భారత్‌లోని అధీకృత బ్యాంకులను ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలు (ఎస్‌ఆర్‌విఎ) తెరవడానికి, భారత రూపాయి-టాంజానియా షిల్లింగ్‌ల వినియోగానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (భారత కేంద్ర బ్యాంక్) అనుతించింది. ఇది వాణిజ్య విస్తరణకు మార్గం సుగమం చేసిందని వారు హర్షం ప్రకటించారు. మరోవైపు సంబంధిత యంత్రాంగం ఏర్పాటై లావాదేవీలు కూడా ఇప్పటికే కార్యరూపం దాల్చాయి. కాగా, ఈ ఏర్పాటు స్థిరత్వానికి భరోసా ఇవ్వడంపై తలెత్తే సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు కొనసాగించాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

20. రెండు దేశాల మధ్య సంబంధాల్లో వ్యవసాయ రంగ సహకారం కీలక స్తంభమని ఉభయ పక్షాలూ అంగీకరించాయి. తద్వారా భారత సుంకం రహిత ప్రాధాన్యం (డిఎఫ్‌టిపి) పథకం కింద టాంజానియా నుంచి 98 శాతం ఉత్పత్తుల శ్రేణిని సుంకం లేకుండా భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. టాంజానియా జీడిపప్పు, పచ్చి బఠానీలు, సుగంధ ద్రవ్యాలు, అవకాడో తదితర వ్యవసాయ ఉత్పత్తులకు భారత ప్రధాన గమ్యంగా ఉంది. అందుకే ఈ రంగంలో సహకారాన్ని మరింత పునరుజ్జీవింప చేయాలని రెండు పక్షాలూ అంగీకారానికి వచ్చాయి.

అభివృద్ధి భాగస్వామ్యం

22. నీరు, ఆరోగ్యం, విద్య, సామర్థ్య వికాసం, ఉపకార వేతనానలు, సమాచార-కమ్యూనికేషన్‌ సాంకేతికత (ఐసిటి) తదితర రంగాల్లో భారత అభివృద్ధి భాగస్వామ్య సహాయం అందించడాన్ని టాంజానియా ప్రశంసించింది.

23. టాంజానియాలో తాగునీటి మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, రక్షణ సంబంధిత ప్రాజెక్టుల కోసం 1.1 బిలియన్ డాలర్లకుపైగా దశలవారీ రుణసాయాన్ని (ఎల్‌ఒసి) భారత్‌ అందించడంపైనా ఉభయ పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సాయంలో భాగంగా ఆ దేశంలోని 24 పట్టణాల్లో 500 మిలియన్ల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం పురోగతిలో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాంతాల్లో నివసించే దాదాపు 60 లక్షల మంది ప్రజలకు సురక్షిత నీటిసరఫరా సౌలభ్యం కలుగుతుంది.

24. భారతీయ స్కాలర్‌షిప్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ తమ మానవ వనరుల అభివృద్ధికి ఎంతో దోహదపడిందని టాంజానియా ప్రశంసించింది. భారతదేశం 2023-24లో సామర్థ్య నిర్మాణానికి 450 ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసి) స్కాలర్‌షిప్‌లు, దీర్ఘకాలిక కార్యక్రమాల కోసం 70 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. 2023-24 సంవత్సరానికి దీర్ఘ కాల స్కాలర్‌షిప్‌ల (ఐసీసీఆర్) సంఖ్యను 70 నుండి 85కి పెంచే నిర్ణయాన్ని భారతదేశం ప్రకటించింది. గ్లోబల్ సౌత్‌కు నిబద్ధతలో భాగంగా, స్మార్ట్ పోర్ట్‌లు, స్పేస్, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ మొదలైన కొత్త, ఉద్భవిస్తున్న రంగాలలో 5 సంవత్సరాల వ్యవధిలో ఉపయోగించడానికి టాంజానియా కోసం 1000 అదనపు ఐటీఈసి స్లాట్‌లను భారతదేశం ప్రకటించింది.

విద్యనైపుణ్యాభివృద్ధి మరియు ఐసిటి అభివృద్ధి

25. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), డిజిటల్ యూనిక్ ఐడెంటిటీ (ఆధార్)తో సహా ఇండియా స్టాక్ కింద స్పేస్ టెక్నాలజీస్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో భారతదేశం సహకారాన్ని అందిస్తుంది.

26. టాంజానియా పక్షం పెంబా, జాంజిబార్‌లో వృత్తి శిక్షణా కేంద్రం (విటిసి) స్థాపనకు, స్థానిక మార్కెట్ డిమాండ్‌ల ఆధారంగా కోర్సుల రూపకల్పనకు భారతదేశ మద్దతును స్వాగతించింది. టాంజానియా యువతకు శిక్షణ, నైపుణ్యాన్ని పెంపొందించడానికి భారతదేశంలోని వృత్తి నైపుణ్య కేంద్రాల తరహాలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడానికి భారతదేశం ముందుకొచ్చింది.

27. దార్ ఎస్ సలామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, అరుషాలోని నెల్సన్ మండేలా ఆఫ్రికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ (ఎన్ఎంఏఐఎస్టి)లో రెండు ఐసీటీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని టాంజానియా ప్రశంసించింది. ఎన్ఎంఏఐఎస్టిలో ఐసీటీ కేంద్రాన్ని అప్‌గ్రేడ్ చేసినందుకు టాంజానియా పక్షం కూడా భారతదేశానికి తన కృతజ్ఞతలు తెలియజేసింది.

జాంజిబార్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ క్యాంపస్

28. జాంజిబార్‌లో మద్రాస్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మొదటి విదేశీ క్యాంపస్‌ను స్థాపించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నాయకులు ధృవీకరించారు. జాంజిబార్‌లోని ఐఐటీ ఆఫ్రికా ఖండంలో సాంకేతిక విద్యకు ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని కూడా వారు అంగీకరించారు. మొదటి బ్యాచ్‌కు సంబంధించిన తరగతులు ఈ నెలలో ప్రారంభం కానున్నాయని వారు పేర్కొన్నారు. టాంజానియా ఈ విషయంలో భారతదేశం నిబద్ధతను మెచ్చుకుంది, జాంజిబార్‌లో ఐఐటీ వృద్ధి, స్థిరత్వానికి పూర్తి మద్దతునిస్తుందని హామీ ఇచ్చింది.

అంతరిక్ష సహకారం

29. 2023 ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు టాంజానియా బృందం భారతదేశాన్ని అభినందించింది.

30. టాంజానియాకు అంతరిక్ష సాంకేతికత రంగంలో భారతదేశం సహకారం అందించింది, దీనిని టాంజానియా స్వాగతించింది.


 

ఆరోగ్యం

31. ఆరోగ్య రంగంలో అద్భుతమైన సహకారాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి, జులై 2023లో టాంజానియా ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మీ మ్వాలిము (ఎంపి) పర్యటనను గుర్తు చేసుకున్నారు. అవకాశాలను శోధించడానికి ఆగస్ట్ 2022లో భారతదేశం, యూఏఈ సంయుక్త ప్రతినిధి బృందం టాంజానియా సందర్శించాయి. ఆరోగ్య రంగంలో మరింత సహకారం కోసం కృషి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

32. టాంజానియా బృందం రోగులకు సత్వర వైద్య సంరక్షణను అందించడంలో, ఆసుపత్రి మౌలిక సదుపాయాలకు మద్దతునిచ్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించడాన్ని ప్రశంసించింది.

33. రేడియేషన్ థెరపీ మెషిన్, "భాభాట్రాన్ II", అవసరమైన మందులు, 2019లో నిర్వహించిన కృత్రిమ అవయవాల ఫిట్‌మెంట్ క్యాంప్‌తో సహా గ్రాంట్ ప్రాజెక్టుల అమలులో ద్వైపాక్షిక సహకారం అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను ఇరుపక్షాలు ప్రముఖంగా చర్చించాయి.

ప్రజలకు-ప్రజలకు మధ్య సంబంధాలుసాంస్కృతిక మార్పిడి:

34. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి, విద్యాపరమైన సంబంధాలు, పర్యాటకం ప్రాముఖ్యతను ఇరువురు నేతలు నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య వారధిగా పనిచేసి టాంజానియా ఆర్థిక వ్యవస్థకు సమాజానికి గణనీయమైన సహకారం అందించిన టాంజానియాలోని పెద్ద స్థాయిలో ఉన్న భారతీయ ప్రవాసుల సహకారాన్ని వారు ప్రశంసించారు.

35. సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. 2023-27 కాలానికి సంబంధించి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై సంతకం చేయడాన్ని అభినందించారు. ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతమైన ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో ఫిబ్రవరి 2024లో జరగబోయే సూరజ్‌కుండ్ మేళాలో భాగస్వామి దేశంగా ఉండాల్సిందిగా టాంజానియాకు భారతదేశం ఆహ్వానం పంపింది.

36. ఇరు పక్షాల సాంస్కృతిక బృందాల పరస్పర మార్పిడిని ఇరు పక్షాలు గుర్తించాయి. రెండు దేశాల మధ్య మరింత సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించాయి.


37. టాంజానియాలో క్రీడలకు పెరుగుతున్న ప్రజాదరణను పరిగణనలోకి తీసుకుని భారతదేశం నుండి ఇద్దరు కబడ్డీ కోచ్‌లను నియమించినందుకు టాంజానియా జట్టు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

38. రెండు దేశాలకు చెందిన యూనివర్సిటీలు, ఆలోచనా పరుల మధ్య సన్నిహిత సహకారానికి నేతలు అంగీకరించారు.

ప్రాంతీయ సమస్యలు
39. ఆఫ్రికన్ హ్యూమన్ క్యాపిటల్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమ్మిట్, ఆఫ్రికా ఫుడ్ సిస్టమ్స్ సమ్మిట్ వరుసగా జూలై, సెప్టెంబర్ 2023లో రెండు ప్రధాన శిఖరాగ్ర సమావేశాలను విజయవంతంగా నిర్వహించినందుకు టాంజానియాను భారతదేశం అభినందించింది.

అంతర్జాతీయ సమస్యలు
40. తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ (ఈఏసీ)తో పరస్పర సంబంధాలను పెంచడంలో టాంజానియా మద్దతు ఇచ్చినందుకు భారత్ ధన్యవాదాలు తెలిపింది.

41. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల మధ్య సఖ్యత ఉందని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఇరు పక్షాలు చురుకుగా పాల్గొంటున్నాయని మరియు ప్రాంతీయ భద్రతా కార్యక్రమాలకు సహకరించాయని గుర్తించబడింది. సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ (ఎస్ఏడిసి) ఆధ్వర్యంలో మోహరించిన శాంతి పరిరక్షక కార్యకలాపాలలో టాంజానియా చేసిన సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి.

42. సభ్యత్వం రెండు వర్గాలలో విస్తరణ ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల అవసరాన్ని భారతదేశం, టాంజానియా అంగీకరించాయి. 2021-22 కాలానికి యూఎన్ఎస్ లో శాశ్వత సభ్యుడిగా భారతదేశం పదవీకాలంలో మద్దతు ఇచ్చినందుకు, 2028-29లో యూఎన్ఎస్ శాశ్వత సభ్యత్వం కోసం భారతీయ అభ్యర్థిత్వానికి టాంజానియా మద్దతు ఇచ్చినందుకు భారతదేశం టాంజానియాకు ప్రశంసలు తెలియజేసింది.

43. సెప్టెంబరు 2023లో జరిగిన జి20 లీడర్స్ సమ్మిట్‌లో ఆమోదించిన జి20 ప్రెసిడెన్సీ, జి20 న్యూఢిల్లీ నాయకుల ప్రకటనపై టాంజానియా భారతదేశాన్ని అభినందించింది, దీనిలో జి20 నాయకులు ఆఫ్రికన్ యూనియన్ (ఏయు)ని జి20 శాశ్వత సభ్యునిగా స్వాగతించారు. భారతదేశం జి20 ప్రెసిడెన్సీకి టాంజానియా మద్దతు, జనవరి 2023లో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో పాల్గొనడాన్ని భారతదేశం ప్రశంసించింది. జి20లో ఏయు ప్రవేశం బహుళపక్ష ప్రపంచ ఫోరమ్‌లో ఆఫ్రికా స్వరాన్ని విస్తరించడంలో ప్రధాన దశను అందించిందని టాంజానియా పేర్కొంది. ఆఫ్రికా ఈ చేరిక సరైన రీతిలో లబ్ది పొందుతుంది.

44. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ), గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ (జిబిఎ)లో చేరాలనే టాంజానియా నిర్ణయాన్ని భారత దేశం స్వాగతించింది. విపత్తు రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్‌ఐ)లో టాంజానియా సభ్యత్వం కోసం ఎదురుచూస్తోంది.

45. ఇరువురు నాయకులు తీవ్రవాదాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా-ఎప్పటికైనా దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో తీవ్రంగా ఖండించారు. ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వానికి తీవ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని, దీనిని తీవ్రంగా పరిగణించాలని వారు అంగీకరించారు.

46. అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ తమకు ఇచ్చిన ఆతిధ్యానికి, సాదర స్వాగతానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారతదేశాన్ని సందర్శించినందుకు ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్ స్నేహపూర్వక ప్రజలకు ఆమె మంచి ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi