ఈ రోజు స్టాక్ హోమ్ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్ ప్రధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్రధాని శ్రీ ఎర్‌నా సోల్‌బర్గ్, స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ లు ఒక శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖర సమ్మేళనానికి స్వీడిష్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాన మంత్రి ఆతిథేయి లుగా వ్యవహరించారు.
శిఖర సమ్మేళనం సందర్భంగా నార్డిక్ దేశాలకు మరియు భారతదేశానికి మధ్య సహకారాన్ని గాఢతరం చేసుకోవాలనే ప్రతిజ్ఞ ను ప్రధాన మంత్రులు స్వీకరించారు. అంతే కాకుండా వారు వారి యొక్క చర్చలలో ప్రపంచ భద్రత, ఆర్థిక వృద్ధి, నూతన ఆవిష్కరణలు మరియు జల, వాయు పరివర్తన లకు సంబంధించిన కీలక అంశాలపై శ్రద్ధ వహించారు. సమ్మిళిత వృద్ధి ని సాధించడం లోను మరియు సస్‌టేనబుల్ డివెలప్‌మెంట్ గోల్స్ ను సాకారం చేసుకోవడం లోను, స్వేచ్ఛా వాణిజ్యం యొక్క ప్రాధాన్యం ఒక ఉత్ప్రేరకంగా పని చేయగలుగుతుందంటూ ప్రధానులు పునరుద్ఘాటించారు.
పరస్పరం అనుసంధానమైనటువంటి ప్రపంచంలో వృద్ధికి చోదక శక్తులుగా నిలిచేవి డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేశన్ మరియు నూతన ఆవిష్కరణలే అని ప్రధాన మంత్రులు ఒప్పుకొన్నారు. నార్డిక్ దేశాలకు మరియు భారతదేశానికి మధ్య సంబంధాలు వర్ధిల్లడం ముఖ్యమని వారు అన్నారు. ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు నాయకత్వ స్థానం వహించడంలో నార్డిక్ దేశాల పాత్ర ప్రాముఖ్యాన్ని వారు నొక్కి పలికారు. నూతన ఆవిష్కరాల వ్యవస్థల పట్ల నార్డిక్ దేశాలు అనుసరిస్తున్న విధానం ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం మరియు విద్యారంగం.. వీటి మధ్య ఒక బలమైన సమన్వయానికి ప్రాధాన్యాన్ని ఇస్తుండడం చర్చకు వచ్చింది. భారతదేశం లో ప్రతిభావంతులైన వారితో సమన్వయం నెలకొల్పుకోగల రంగాలను గుర్తించడమైంది.
మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా మరియు క్లీన్ ఇండియా ల వంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం సమృద్ధికి మరియు కొనసాగగలిగే అభివృద్ధికి కీలకమైనవి డిజిటల్ కార్యక్రమాలు, ఇంకా నూతన ఆవిష్కరణలే అని పరిగణిస్తోందని శిఖర సమ్మేళనం నొక్కి పలికింది. స్వచ్ఛమైన సాంకేతికతలు, సముద్ర సంబంధ సేవలు, నౌకాశ్రయాల ఆధునికీకరణ, ఫూడ్ ప్రాసెసింగ్, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంకా లైఫ్ సైన్సెస్ వంటి రంగాలలో నార్డిక్ దేశాల పాత్ర కూడా ప్రస్తావనకు వచ్చింది. భారత ప్రభుత్వం యొక్క స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ కు మద్దతును అందించే ధ్యేయంతో నార్డిక్ సస్‌టేనబుల్ సిటీస్ ప్రాజెక్టు రూపు దిద్దుకోవడాన్ని శిఖర సమ్మేళనం స్వాగతించింది.
భారతదేశానికి మరియు నార్డిక్ దేశాలకు ఉన్నటువంటి విశిష్టమైన బలాలు పరస్పర ప్రయోజనకరమైన సమన్వయంతో పాటు, వ్యాపారానికి మరియు పెట్టుబడుల వివిధీకరణకు అపారమైన అవకాశాలను అందిస్తున్న సంగతిని ప్రధాన మంత్రులు పరిగణన లోకి తీసుకున్నారు. చర్చల క్రమంలో నియమాల ప్రాతిపదికన బహు పార్శ్విక వ్యాపార వ్యవస్థ యొక్క ప్రాముఖ్యాన్ని, బహిరంగమైనటువంటి మరియు సమ్మిళతమైనటువంటి అంతర్జాతీయ వ్యాపారం అనేవి వృద్ధికి మరియు సమృద్ధికి ముఖ్యమని తీర్మానించారు. వ్యాపారాన్ని సులభంగా నిర్వహించే పద్ధతులకు ఇటు నార్డిక్ దేశాలు, అటు భారతదేశం పెద్ద పీట వేయాలని ఉద్ఘాటించారు.
అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదం పెను సవాళ్ళు అని ప్రధాన మంత్రులు ఒప్పుకొన్నారు. ప్రపంచ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఉమ్మడి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, న్యాయ పాలన, నియమాలపై ఆధారపడిన అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించడం కోసం కట్టుబడాలని వారు తీర్మానించారు. ఎగుమతుల నియంత్రణను గురించి, అణ్వాయుధ వ్యాప్తి నిరోధాన్ని గురించి కూడా వారు చర్చించారు. పరమాణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్ జి)లో సభ్యత్వం కోసం భారతదేశం దరఖాస్తు చేసుకోవడాన్ని నార్డిక్ దేశాలు స్వాగతించాయి. ఈ బృందంలో సభ్యత్వం కలిగివుంటూ వీలైనంత త్వరగా ఒక సకారాత్మక ఫలితాన్ని సాధించే ధ్యేయంతో నిర్మాణాత్మకంగా కృషి చేయాలన్నదే తమ నిబద్ధత అని వారు పునరుద్ఘాటించారు.
ఐక్య రాజ్య సమితి ని మరియు అజెండా 2030 ని సాకారం చేసేందుకు సభ్యత్వ దేశాలకు తోడ్పాటును అందించే ఒక దీటైన ఐక్య రాజ్య సమితి ని మలచడం కోసం ఐరాస సెక్రటరీ- జనరల్ చేస్తున్నటువంటి సంస్కరణ యత్నాలను బలపరుస్తున్నట్లు ప్రధాన మంత్రులు పునరుద్ఘాటించారు. ఐరాస ను బలపరచడం, అభివృద్ధి, శాంతి కార్యకలాపాలు, శాంతిసాధన, ఘర్షణ ల నిరోధం వంటి రంగాలలో ఐరాస కు వెన్నుదన్నుగా నిలవాలని సెక్రటరీ జనరల్ చేస్తున్న ప్రతిపాదనలను వారు పరిగణన లోకి తీసుకొన్నారు. ఐరాస భద్రత మండలి యొక్క సంస్కరణ లను ఆ మండలి లోని శాశ్వత స్థానాలను మరియు శాశ్వతేతర స్థానాలను విస్తరించి దానికి మరింత ప్రాతినిధ్యం లభించేటట్లుగాను, అది మరింత జవాబుదారుతనాన్ని సంతరించుకొనేటట్లుగాను 21వ శతాబ్దం తాలూకు వాస్తవాలకు తగ్గట్టు ప్రతిస్పందించే విధంగాను మారాల్సిన అవసరం ఉందని నార్డిక్ దేశాలు మరియు భారతదేశం పునరుద్ఘాటించాయి.
సంస్కరణకు లోనైన భద్రత మండలి లో ఒక శాశ్వత స్థానం కోసం భారతదేశం గట్టి అభ్యర్థిగా ఉందంటూ నార్డిక్ దేశాలు వాటి అంగీకారాన్ని వ్యక్తం చేశాయి. సస్‌టేనబుల్ డివెలప్‌మెంట్ కోసం మరియు ప్యారిస్ ఒప్పందం అమలు కోసం 2030 అజెండా ను అమలుపరచాలని ప్రధాన మంత్రులు వారి యొక్క పూర్తి నిబద్ధతను మరో మారు వ్యక్తం చేశారు. వారు శుద్ధమైన శక్తి వ్యవస్థను, నవీకరణ యోగ్య శక్తి మరియు ఇంధనాలు, స్వచ్ఛమైన శక్తి ఉత్పాదన కోసం ఉద్దేశించిన ఇంధన సామర్ధ్యం, ఇంకా సాంకేతికతలను పెంచే దిశగా ప్రయత్నాలను కొనసాగించాలని ఒక అంగీకారానికి వచ్చారు. రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక జీవనంలో మహిళల పూర్తి స్థాయి, అర్ధవంతమైనటువంటి ప్రాతినిధ్యం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని ప్రధాన మంత్రులు భావించారు. వారు మహిళల సశక్తీకరణను ప్రోత్సహించాలని అంగీకరించారు.
ఒక బలమైన భాగస్వామ్యమనేది నూతన ఆవిష్కరణలను, ఆర్థిక వృద్ధిని మరియు పరస్పరం ప్రయోజనకరమైన వ్యాపారాన్ని, ఇంకా పెట్టుబడులను పెంచడంలో తోడ్పడగలుగుతుందని ప్రధాన మంత్రులు అంగీకారానికి వచ్చారు. విద్య, సంస్కృతి, కార్మికుల రాకపోకలు మరియు పర్యటన.. ఈ రంగాలన్నింటి ద్వారా ప్రజలకు, ప్రజలకు మధ్య బలమైన సంబంధాలు ఏర్పడటానికి ప్రాముఖ్యం ఇవ్వాలని, ఈ రంగాలలో ప్రయోజనాలు, లబ్ధిదారులు పెచ్చుపెరిగేందుకు ఆస్కారం ఉందని నార్దిక్ దేశాలు మరియు భారతదేశం యొక్క శిఖర సమ్మేళనం స్పష్టం చేసింది.