అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.
భారత్ , అమెరికాలు మున్నెన్నడూ లేనంతటి స్థాయిలో పరస్పర సహకారం, విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్లిన చారిత్రక కాలానికి ఇరువురు నాయకులు నిదర్శనంగా నిలిచారు.
ఉభయదేశాలూ మరింత సమర్ధదేశాలుగా ఎదుగుతూ, ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నందున, అమెరికా– ఇండియా భాగస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, స్వేచ్ఛ, చట్టబద్ద పాలన, మానవహక్కులు, బహుళత్వం, అందరికీ సమాన అవకాశాలతో తప్పనిసరిగా అనుసంధానం కావాలని ఇరువురు నాయకులూ పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు మూలస్తంభమైన అమెరికా– ఇండియాల కీలక రక్షణ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నాయకులు ప్రశంసించారు. రక్షణ పారిశ్రామిక ఆవిష్కరణలు, పెరిగిన నిర్వహణా పరమైన సమన్వయం, సమాచార మార్పిడి వల్ల కలిగిన ప్రయోజనాలను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.
ఉభయదేశాల ప్రజలు, పౌర, ప్రైవేటు రంగాలు, ఇరుదేశాల ప్రభుత్వాలు, మరింత లోతైన బంధాన్ని కలిగిఉండేందుకు సాగిస్తున్న అవిశ్రాంత కృషి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరుగులేని ఆశాభావాన్ని, సమున్నత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కృషి రానున్న దశాబ్దాలలో అమెరికా – ఇండియా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చనున్నదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ వేదికపై భారత నాయకత్వం పోషిస్తున్న పాత్ర పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రత్యేకించి జి–20 కూటమి, దక్షిణార్ధ గోళంలోని వర్ధమాన దేశాల విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, స్వేచ్ఛాయుత, బహిరంగ, సుసంపన్న ఇండో –పసిఫిక్ సాధనకు వీలు కల్పించడం, క్వాడ్ కూటమిని బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి కృషిని ఆయన అభినందించారు.
ప్రపంచవ్యాప్తంగా గల ఘర్షణ పూరిత పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో, కోవిడ్ 19 మహమ్మారి విషయంలో అంతర్జాతీయ పిలుపునకు మద్దతు నివ్వడంలో పెను సవాళ్లకు పరిష్కారాల సాధన కృషిలో ఇండియా ముందువరుసలో ఉందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోలెండ్, ఉక్రెయిన్ల చారిత్రక పర్యటనలను అధ్యక్షుడు బైడెన్ అభినందించారు. దశాబ్దాల చరిత్రలో భారత ప్రధానమంత్రి ఈ దేశాలను సందర్శించడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన శాంతి సందేశాన్ని, ఉక్రెయిన్ కు కొనసాగిస్తున్న మానవతా సహాయాన్ని, ఇంధన రంగానికి మద్దతు, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ పై ప్రధానమంత్రి సందేశాన్ని ఆయన ప్రశంసించారు.
నౌకా రవాణా మార్గ స్వేచ్ఛ, వాణిజ్య రక్షణ, మధ్యప్రాచ్యంలో కీలక నౌకామార్గాల రక్షణ అంశాలలో తమ మద్దతును ఉభయ నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 2025లో ఇండియా ఉమ్మడి టాస్క్ ఫోర్స్ 150 కి సహ నాయకత్వం వహించనుంది. ఇది అరేబియా సముద్రంలో ఉమ్మడి నౌకాయాన బలగాలతో కలిసి పనిచేయనుంది.
సంస్కరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం సహా, ఇండియా కీలక గొంతు ప్రతిధ్వనించేలా అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలకు వీలుకల్పించే చర్యలకు అమెరికా మద్దతునిస్తుందని అధ్యక్షుడు బైడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. పరిశుభ్రమైన, సమ్మిళిత, మరింత భద్రత, సుసంపన్నతతో కూడిన భవిష్యత్ భూగోళానికి అమెరికా – ఇండియా సన్నిహిత భాగస్వామ్యం కీలకమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. వినూత్న , కీలక సాంకేతికతలకు (ఐసీఈటీ) సంబంధించి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, అధునాతన టెలికమ్యూనికేషన్ రంగాల వంటి ముఖ్యమైన సాంకేతిక రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, దానిని విస్తృతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను అధ్యక్షుడు బైడెన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కృత్రిమ మేథ, క్వాంటం బయోటెక్నాలజీ, పరిశుభ్ర ఇంధనంవంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు వీలుగా సంప్రదింపులను మరింత పెంచేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇరువురు నాయకులు ప్రకటించారు. కీలక పరిశ్రమలకు భద్రమైన, సమర్ధ సరఫరా వ్యవస్థను నిర్మించేందుకు, ఆవిష్కరణల విషయంలో సమష్టిగా ముందు వరుసలో ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. ఈ ఏడాది మొదట్లో ప్రారంభించిన అమెరికా– ఇండియా –ఆర్.ఒ.కె త్రైపాక్షిక టెక్నాలజీ కార్యక్రమం, క్వాడ్ కూటమి, భావసారూప్యతగల ఇతర భాగస్వాములతో కలసి పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జరుగుతున్న కృషిని కూడా వారు ప్రముఖంగా వివరించారు. ఎగుమతుల నియంత్రణ సమస్యను అధిగమించేందుకు కృషిని రెట్టింపు చేయాల్సిందిగా ఇరువురు నాయకులు తమ ప్రభుత్వాలను ఆదేశించారు. అలాగే సాంకేతిక భద్రత అంశంపై దృష్టిపెట్టడంతోపాటు, ఇరుదేశాల మధ్య సాంకేతికత బదిలీ విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను తగ్గించాలని, ఇండియా– అమెరికా వ్యూహాత్మక వాణిజ్య చర్యలద్వారా వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. ద్వైపాక్షిక సైబర్ భద్రత చర్యల ద్వారా సైబర్ స్పేస్ రంగంలో మరింత లోతైన సహకారానికి కొత్త విధానాలను వారు సమర్ధించారు.పరిశుభ్రమైన ఇంధన వినియోగం, తయారీ ని విస్తృతపరచడం, సౌర, పవన, అణు ఇంధన రంగంలో అమెరికా .. ఇండియా సహకారాన్ని మరింత పెంచేందుకు గల అవకాశాలను అన్వేషించడంతోపాటు, చిన్న మాడ్యులార్ రియాక్టర్ టెక్నాలజీల అభివృద్దికి కట్టుబడిఉన్నట్టు ఉభయ నాయకులు ప్రకటించారు.
భవిష్యత్ సాంకేతిక భాగస్వామ్య వ్యూహం:
కొత్త సెమీ కండక్టర్ ఫాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటు కీలకమైనదని అధ్యక్షుడు బైడన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది జాతీయ భద్రత, తదుపరి తరం టెలికమ్యూనికేషన్లు, హరిత ఇంధన అప్లికేషన్లకు, అధునాతన సెన్సింగ్, కమ్యూనికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ పై దృష్టి పెడుతుందన్నారు. ఇన్ఫ్రారెడ్, గెలీలియం నైట్రైడ్, సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్లర్ల తయారీ లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఇండియా సెమీకండక్టర్ మిషన్, భారత్ ‘సెమి’, ‘థర్డ్ ఐ టెక్’, అమెరికా‘ స్పేస్ ఫోర్స్’ ల మద్దతుతో చేపడతారు.
భారతదేశంలోని కోల్ కతా లో గల, జిఎఫ్ కోల్కతా పవర్ సెంటర్ ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫౌండ్రీస్ (జిఎఫ్) వంటి వాటితో సహా భద్రమైన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సెమికండక్టర్ సుస్థిర సరఫరా చెయిన్ ను ఏర్పాటు చేసుందుకు జరుగుతున్న సమష్టి కృషిని ఇరువురు నాయకులూ ప్రశంసించారు. ఇది చిప్ తయారీ, పరిశోధన, అభివృద్ధిలో పరస్పర ప్రయోజనకరమైన అనుసంధానతను పెంచడానికి ఉపకరిస్తుంది. తక్కువ స్థాయి ఉద్గారాలు లేదా ఉద్గారాలు లేని స్థితి దిశగా ముందుకు సాగడానికి, అనుబంధ వాహనాలు, ఇంటర్నెట్ ద్వారా ఇతర పరికరాలతో అనుసంధానమయ్యే ఉపకరణాలు, కృత్రిమ మేథ, డాటా సెంటర్ల రంగంలో గొప్ప మార్పునకు ఇది దోహదపడనుంది.
జిఎఫ్ సంస్థ దీర్ఘకాలిక భాగస్వామ్యం, వివిధ దేశాలలో తయారీ ,ఇండియాతో సాంకేతిక భాగస్వామ్యాలకు గల అవకాశాలను అన్వేషిస్తున్నది. ఇది ఉభయదేశాలలో అత్యంత నాణ్యతగల ఉద్యోగాలను కల్పించనుంది.
ఇంటర్నేషనల్ టెక్నాలజీ , సెక్యూరిటీ ఇన్నొవేషన్ ఫండ్ కు సంబంధించి,
అమెరికా విదేశాంగ శాఖ, ఇండియా సెమికండక్టర్ మిషన్ కు మధ్య కుదిరిన నూతన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉభయ నాయకులూ స్వాగతించారు.
అమెరికా. ఇండియా, ఇతర అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్లకు భద్రమైన , సురక్షితమైన నిరంతరాయ సరఫరా చెయిన్లను ఏర్పాటు చేసేందుకు మన పరిశ్రమ వర్గాలు చేపడుతున్న చర్యలను ఉభయ నాయకులు స్వాగతించారు.అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు చేయడానికి తమ చెన్నై ప్లాంటును ఉపయోగించుకోవలసిందిగా ఆసక్తి వ్యక్తీకరణ లేఖను ఫోర్టు మోటార్ సంస్థ అందజేయడాన్ని వారు స్వాగతించారు.
2025లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శాస్త్ర పరిశోధనలను నిర్వహించడానికి నాసా, ఇస్రో చేపట్టిన తొలి సంయుక్త కృషిని, ఆదిశగా సాగిన పురోగతిని ఉభయ నాయకులు స్వాగతించారు. పౌర అంతరిక్ష సంయుక్త కార్యాచరణ బృందం కింద, ఆలోచనలను పంచుకోవడం, ఈ దిశగా చేపట్టిన చర్యలను వారు ప్రశంసించారు. 2025 తొలినాళ్లలో జరిగే ఈ సంయుక్త కార్యాచరణ బృందం తదుపరి సమావేశం పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలను కల్పించగలదన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.
. సంయుక్త ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు గల అవకాశాలు పరిశీలించేందుకు, పౌర , అంతరిక్ష వాణిజ్య రంగంలో కొత్త వేదికల అన్వేషణకు వారు ప్రతిజ్ఞ చేశారు. ఉభయదేశాల పరిశోధన అభివృద్ధి రంగాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించే కృషిని వారు స్వాగతించారు. అమెరికా– భారత విశ్వవిద్యాలయాలు, పరిశోధన శాలలమధ్య అత్యంత ప్రభావశీల పరిశోధన , అభివృద్ధి భాగస్వామ్యానికి ఉభయదేశాలు మద్దతు నివ్వనున్నాయి. రాగల 5 సంవత్సరాలలో అమెరికా–ఇండియా గ్లోబల్ చాలెంజెస్ ఇన్స్టిట్యూట్కు అమెరికా, భారత ప్రభుత్వ నిధుల సమీకరణ కింద 90 మిలియన్ డాలర్లకు పైగా సమకూర్చాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2024 జూన్ లో జరిగిన ఐసిఇటి సమావేశంలో సంతకాలు జరిగిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని అమలు చేసేందుకు గల ప్రత్యామ్నాయాలను గుర్తించేందుకు కూడా వారు నిర్ణయించారు. అమెరికా , భారత విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధన శాలలు, ప్రైవేటు రంగ పరిశోధకుల మధ్య సహకారాన్ని విస్తరించేందుకు కొత్తగా, అమెరికా – ఇండియా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆర్ అండ్ డి ఫోరంను ప్రారంభించడాన్ని ఇరువురు నాయకులూ స్వాగతించారు.
నేషనల్ సైన్స్ ఫౌండేషన్,భారతదేశ శాస్త్ర సాంకేతిక విభాగాలకు సంబంధించి 11 ఫండింగ్ అవార్డుల ఎంపికను వారు ప్రకటించారు. తదుపరి తరం టెలికమ్యూనికేషన్లు, అనుసంధానిత వాహనాలు, మెషిన్ లెర్నింగ్ రంగాలలో అమెరికా– ఇండియా పరిశోధన ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉమ్మడిగా 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంటును సమకూర్చనున్నారు. సెమికండక్టర్లు, తదుపరి తరం కమ్యూనికేషన్ వ్యవస్థలు, సుస్థిరత, హరిత సాంకేతికత, ఇంటెలిజెంట్ రవాణా వ్యవస్థలలో అమెరికా– ఇండియాలు మౌలిక, అనువర్తిత పరిశోధనలు కొనసాగించేందుకు సుమారు 10 మిలియన్ డాలర్లను సమకూర్చనున్నారు. ఇందుకు సంబంధించి పరిశోధన , సహకారానికి నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద నిధులు సమకూర్చే 12 అవార్డులను వారు ప్రకటించారు. దీనికితోడు, ఎన్.ఎస్.ఎఫ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్,సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఇరువైపులా మౌలిక, అనువర్తిత పరిశోధన రంగంలో సహకారానికి గల కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. భారత డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్లు 2024 ఫిబ్రవరిలో పరస్పర సహకారంతో కూడిన పరిశోధన ప్రాజెక్టులకు ఉమ్మడి పిలుపు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇది సంక్లిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించేందుకు, వినూత్న పరిష్కారాల అన్వేషణకు సింథటిక్,ఇంజనీరింగ్ బయాలజీ, సిస్టమ్స్, కంప్యుటేషనల్ బయాలజీ తదితర అనుబంధ రంగాలలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడుతుంది. ఇది అధునాతన జీవ ఆర్ధిక వ్యవస్థ, భవిష్యత్ జీవ తయారీ రంగ పరిష్కారాల అభివృద్ధికి కీలకమైనది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తొలి పిలుపునకు, సంయుక్త పరిశోధక బృందాలు ఉత్సాహంగా స్పందించాయి. వీటి ఫలితాలను 2024 చివరలో ప్రకటించనున్నారు.
కృత్రిమ మేథ,క్వాంటమ్, ఇతర కీలక సాంకేతిక రంగాలలో ఉభయదేశాలూ పరస్పర సహకారానికి అదనంగా తీసుకుంటున్న చర్యలను ఇరు నాయకులూ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆగస్టులో వాషింగ్టన్లో ఇండియా – అమెరికా క్వాంటమ్ సమన్వయ యంత్రాంగం రెండో సమావేశం నిర్వహించిన విషయాన్నివారు ప్రస్తావించారు. అమెరికా – ఇండియా సైన్స్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్ ద్వారా కృత్రిమ మేథ,క్వాంటం రంగాలలో ఉభయ దేశాలలో పరిశోధన అభివృద్ధి సహకారానికి సంబంధించి 17 కొత్త అవార్డులు ప్రకటించడాన్ని వారు స్వాగతించారు.
వినూత్న సాంకేతికతలో ప్రైవేటు రంగ సహకారాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్బంగా భారత ప్రభుత్వంతో ఇటీవల ఐబిఎం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని వారు ప్రస్తావించారు. ఇది ఇండియాకు చెందిన ఐరావత్ సూపర్ కంప్యూటర్ పై ఐబిఎం వారి వాట్సోక్స్ ప్లాట్ఫారంకు, నూతన కృత్రిమ మేధ అవకాశాల కల్పనకు, అధునాతన సెమీ కండక్టర్ల ప్రాసెసర్లలో పరిశోధన , అభివృద్ధి సహకారానికి, భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్ కు మరింత మద్దతు నివ్వనుంది. 5జి వినియోగం, తదుపరి తరం టెలికమ్యూనికేషన్లలో విస్తృత సహకారానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇరువురు నాయకులూ ప్రశంసించారు. అంతర్జాతీయ అభివృద్ధి ప్రణాళికల అమెరికా సంస్థ, ఏసియా ఓపెన్ ఆర్.ఎ.ఎన్ అకాడమీని విస్తరించేందుకు చర్యలు చేపట్టంది. దీనిని 7 మిలియన్డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో విస్తరిస్తున్నారు.భారతీయ సంస్థలు, దక్షిణాసియాలోని సంస్థలు, ప్రపంచ వ్యాప్త సంస్థలలోని ఉద్యోగులకు శిక్షణనిచ్చే కార్యక్రమాలను విస్తృత పరచడం ఇందులో ఉంది.
‘‘ఇన్నొవేషన్ హ్యాండ్ షేక్’’ అజెండా కింద,ఉభయదేశాలూ వినూత్న ఆవిష్కరణల వాతావారణాన్ని పెంచేందుకు అమెరికా వాణిజ్య విభాగం, భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మధ్య 2023 నవంబర్లో కుదిరిన అవగాహనా ఒప్పందం విషయంలో పురోగతిని ఇరువురు నాయకులూ స్వాగతించారు. అమెరికా, ఇండియాలలో పరిశ్రమలవారితో రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అంకుర పరిశ్రమలు,ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ కాపిటల్ సంస్థలు, కార్పొరేట్ పెట్టుబడి విభాగాలు , ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచి ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు ఈ సమావేశాలను చేపట్టారు.
తదుపరితరం రక్షణ రంగ భాగస్వామ్యానికి మరింత శక్తి:
ఇండియా 31 మానవ రహిత జనరల్ ఆటోమిక్స్ ఎం.క్యు –9బి ఎయిర్క్రాఫ్ట్ లను (16 గగనతల రక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు, 15 సముద్ర రక్షక ఎయిర్ క్రాఫ్ట్లు), వాటికి అనుబంధంగా పరికరాలను సమీకరించే ప్రక్రియను పూర్తిచేయడంలో పురోగతిని అధ్యక్షుడు బైడన్ స్వాగతించారు. ఇది భారతదేశ సాయుధ బలగాలు అన్ని విభాగాలలో ఇంటెలిజెన్స్, నిఘా, పరిశీలన సామర్ధ్యాలను మరింత పెంచేందుకు ఉపకరిస్తుంది.
అమెరికా ఇండియా రక్షణ పారిశ్రామిక సహకార మార్గసూచి కింద సాధించిన అద్భుత పురోగతిని ఇరువురు నాయకులూ గుర్తించారు. జెట్ ఇంజిన్లు, ఆయుధాలు, క్షేత్ర స్థాయి కదలికలకు సంబంధించిన వ్యవస్థల ప్రాధాన్యత సహ ఉత్పత్తి ఏర్పాట్లను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కొనసాగుతున్న సహకారాన్ని వారు ప్రస్తావించారు.
రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను మరింత విస్తృతం చేసే చర్యలను వారు స్వాగతించారు. మానవ రహిత భూతల వాహనాల సహ ఉత్పత్తి, సహ అభివృద్ధికి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, లిక్విడ్ రోబోటిక్స్ తో కలిసి పనిచేయడానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది సముద్ర గర్భ, సముద్రయాన రంగంలో అవగాహనకు ఉపకరిస్తుంది.
రక్షణ సరఫరా ఏర్పాట్ల భద్రత,రక్షణ ఉత్పత్తులు, సేవల పరస్పర సరఫరా పెంపు విషయంలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలను వారు అభినందించారు. రక్షణ ఉత్పత్తులు, సేవలు మరింతగా పరస్పరం సరఫరా చేసుకునేందుకు వీలుగా ఆయా దేశాల రక్షణ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థలకు అనుగుణంగా ప్రస్తుతం కొనసాగుతున్న చ ర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్టు వారు ప్రకటించారు.
.అన్ని ఎయిర్ క్రాఫ్ట్లు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ విడిభాగాలతోపాటు మెయింటినెన్స్, రిపేరు, ఓవర్హాల్ రంగానికి సంబంధించి ఏకరీతిన 5 శాతం వస్తు సేవల పన్నును విధించేందుకు ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు బైడెన్ స్వాగతించారు. ఇది పన్ను వ్యవస్థను సులభతరం చేస్తుందని, ఇది ఇండియాలో మెయింటినెన్స్, రిపేర్, ఓవర్హాల్ సేవలకు గట్టి అనుకూల పరిస్థితులను కల్పిస్తుందని అన్నారు.
ఇండియా కీలక విమానయాన కేంద్రంగా ఎదిగేందుకు చేస్తున్న కృషికి సహకారాన్ని విస్తృతపరిచేందుకు, వినూత్న ఆవిష్కరణలకు ఉభయ నాయకులూ పరిశ్రమలను కొనియాడారు. మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ లు , వైమానిక వాహనాల రిపేరు తో పాటు, ఇండియా ఎం.ఆర్.ఒ సామర్ధ్యాలను మరింత పెంపొందించుకునేందుకు , అమెరికా పరిశ్రమ వర్గాలు కట్టుబడి ఉండడాన్ని వారు స్వాగతించారు.లాక్హీడ్ మార్టిన్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య ఇటీవల కుదిరిన సి–130జె సూపర్ హెర్కులెస్ ఎయిర్ క్రాఫ్ట్ టీమింగ్ ఒప్పందాన్ని ఇరువురు నాయకులూ అభినందించారు. ఈ రెండు కంపెనీలు అమెరికా –ఇండియా సిఇఒ ఫోరంలో సహ అధ్యక్షత వహిస్తున్నాయి.ఈ ఒప్పందం దీర్ఘకాలిక పరిశ్రమ సహకారానికి దోహదపడుతుంది. ఈ ఒప్పందం ద్వారా ఇండియాలో కొత్త మెయింటినెన్స్, రిపేర్, ఒవర్హాల్ (ఎం.ఆర్.ఒ) సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి సి–130 సూపర్ హెర్కులస్ ఎయిర్ క్రాఫ్ట్ను నడిపే అంతర్జాతీయ భాగస్వాములకు, భారత వైమానిక దళ సన్నద్ధతకు మద్దతునిస్తాయి. అమెరికా –ఇండియా రక్షణ, వైమానిక సహకారంలో ఇది ఒక గొప్ప ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఇది ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, సాంకేతిక భాగస్వామ్య బంధం మరింత బలోపేతం కావడాన్ని ప్రతిబింబిస్తోంది.
2023 లో ప్రారంబించిన ఇండియా– అమెరికా డిఫెన్స్ యాక్సిలరేషన్ ఇకో సిస్టమ్ (ఇండస్ –ఎక్స్) ప్రొత్సాహంతో, రక్షణ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి ప్రభుత్వాలు, వ్యాపార, విద్యా సంస్థల మధ్య నానాటికీ పెరుగుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులూ ప్రశంసించారు. ఈ నెల మొదట్లో సిలికాన్ వ్యాలీలో జరిగిన మూడవ ఇండస్–ఎక్స్ సమ్మేళనం సాధించిన పురోగతిని వారు ప్రస్తావించారు. భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇన్నొవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్)కు, అమెరికా రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ ఇన్నొవేషన్ యూనిట్(డిఐయు)కు మధ్య పెరిగిన సహకారాన్ని వారు స్వాగతించారు. ఇందుకు సంబంధించి సిలికాన్ వ్యాలీ సమ్మేళనంలో ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇరుదేశాలలోని ప్రముఖ టెస్టింగ్ రేంజ్లను ఇండస్–ఎక్స్ నెట్వర్క్లోని రక్షణ, ఉభయ వినియోగ కంపెనీలకు అందుబాటులో ఉండేట్టు ఇండస్ వెర్ ఎక్స్ కన్సార్టియం ద్వారా జరుగుతున్న కృషిని వారు కొనియాడారు.
అమెరికాకు చెందిన రక్షణ శాఖ డి.ఐ.యు, భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రక్షణ ఆవిష్కరణల సంస్థ (డి ఐ ఒ) లు సంయుక్తంగా రూపొందించిన, ’’ ఉమ్మడి సవాళ్ల’’ వేదికను ఇండస్ ఎక్స్ కింద ప్రారంభించడం ద్వారా, రక్షణ ఆవిష్కరణల అనుసంధానతను నిర్మించే ఉమ్మడి లక్ష్యం నెరవేరడాన్ని ఇరువురు నాయకులు గుర్తించారు. సముద్రగర్భ కమ్యూనికేషన్లు, సముద్ర మార్గ సమాచారం, నిఘా, అన్వేషణలపై సాంకేతికతలను అభివృద్ధి చేసే అమెరికా , భారతీయ కంపెనీలకు రెండు ప్రభుత్వాలు వేరువేరుగా 2024లో 1 మిలియన్ కు పైగా డాలర్ల మొత్తాన్ని అందజేశాయి. ఈ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలి ఇండస్ –ఎక్స్ సమ్మేళనంలో కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. తక్కువ భూ కక్ష్యలో అంతరిక్ష పరిస్థితుల అవగాహన పై ఇది దృష్టి పెడుతుంది.
ఉభయ దేశాల సైనిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, స్వేచ్ఛాయత, బహిరంగ భారత- పసిఫిక్ సాధనకు పరస్పర ఆధారితంగా ఉండేందుకు చేపడుతున్న చర్యలను ఇరుదేశాల నాయకులు స్వాగతించారు. ఇండియా 2024 మార్చిలో అత్యంత క్లిష్టమైన అతి పెద్ద ద్వైపాక్షిక త్రివిధ దళాల విన్యాసాల నిర్వహణ కార్యక్రమం టైగర్ ట్రంప్ కు ఆతిథ్యం ఇవ్వడాన్ని కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నూతన సాంకేతికతలు, సామర్ధ్యాలను అందిపుచ్చుకోవడాన్ని వారు స్వాగతించారు. జావెలిన్, స్ట్రయికర్ సిస్టమ్ లను ఇండియాలో తొలిసారిగా ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు యుధ్ అభ్యాస్ లో ప్రదర్శించడాన్ని వారు ప్రస్తావించారు.
లయజాన్ అధికారుల నియామకం, ఇండియా నుంచి ఫస్ట్ లయజాన్ అధికారిని అమెరికాలోని ప్రత్యేక ఆపరేషన్స్ కమాండ్ లో నియమించే ప్రక్రియపై ఒప్పందం కుదరడాన్ని వారు స్వాగతించారు. అధునాతన రంగాలలో సహకారం పెంపునకు జరుగుతున్న కృషిని ఇరువురు నాయకులూ ప్రసంసించారు. అంతరిక్షం, సైబర్ రంగాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. 2024 నవంబర్లో జరగనున్న ద్వైపాక్షిక సైబర్ చర్చల పట్ల వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అమెరికా- ఇండియా సైబర్ సహకార ఫ్రేమ్ వర్క్ ను మరింత విస్తృతపరచనుంది.
సైబర్ ముప్పునకు సంబంధించిన సమాచారాన్నిపరస్పరం అందిపుచ్చుకోవడం, సైబర్ భద్రత,శిక్షణ,ఇంధన, టెలికమ్యూనికేషన్ నెట్ వర్కు ల్లో రిస్క్ తగ్గింపు చర్యల వంటి వాటిలో ఉభయ దేశాల మధ్య నూతన సహకారానికి వీలు కల్పిస్తారు. 2024 మే నెలలో అమెరికా – ఇండియా అధునాతన డొమైన్ల రక్షణ చర్చల గురించి ఉభయ నాయకులు ప్రస్తావించారు. మే 2024 లో జరిగిన, అమెరికా –ఇండియా అధునాతన రెండో డొమైన్స్ డిఫెన్స్ డైలాగ్ గురించి కూడా ఇరువురు నాయకులు ప్రస్తావించారు. ఇందులో ద్వైపాక్షిక డిఫెన్స్ స్పేస్ సమావేశం గురించి కూడా వారు పేర్కొన్నారు.
పరిశుభ్ర ఇంధన పరివర్తన వేగవంతానికి చర్యలు:
భద్రమైన,సురక్షితమైన అంతర్జాతీయ పరిశుభ్ర ఇంధన సరఫరా చెయిన్లను ఏర్పాటు చేసేందుకు, అమెరికా–ఇండియా మార్గసూచీని అధ్యక్షుడు బైడన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇందుకు సంబంధించి సురక్షితమైన,భద్రమైన పరిశుభ్ర ఇంధన సరఫరాచెయిన్లను అమెరికా,ఇండియా పరిశుభ్ర ఇంధన సాంకేతికతలు,ఉపకరణాల తయారీదారుల ద్వారా వేగవంతం చేయడానికి ఈ మార్గ సూచీ ద్వారా వినూత్న చర్యలు చేపట్టారు.
పునరుత్పాదక ఇంధనం,ఇంధననిల్వ, పవర్ గ్రిడ్, విద్యుత్ సరఫరా సాంకేతికతలు,ఉన్నత స్థాయి సామర్ధ్యంగల శీతలీకరణ వ్యవస్థలు, కర్బన ఉద్గారాలు లేని వాహనాలు, నూతన పరిశుభ్ర ఇంధన సాంకేతికతలకు సంబంధించిన ప్రాజెక్టులకు అమెరికా ,ఇండియాలు తొలిదశలో 1బిలియన్ డాలర్ల బహుళ పక్ష ఆర్ధిక మద్దతును ఇవ్వనున్నాయి.
పరిశుభ్ర ఇంధన తయారీ విస్తరణ, సరఫరా చెయిన్ల వైవిద్యత సాధించడానికి, భారతదేశ ప్రైవేటు రంగంతో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామ్యం కావడాన్ని ఇరువురు నాయకులూ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పటివరకూ డిఎఫ్సి టాటా పవర సోలార్ సంస్థకు 250 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. దీనిని సోలార్ సెల్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి వినియోగిస్తారు. అలాగే ఫస్ట్ సోలార్ సంస్థకు ఇండియాలో సౌర మాడ్యూల్ తయారీ కర్మాగారం నిర్మించి, దానిని నిర్వహించడానికి 500 మిలియన్ డాలర్ల రుణాన్ని డిఎఫ్ సి మంజూరు చేసింది.
వ్యూహాత్మక పరిశుభ్ర ఇంధన భాగస్వామ్యం కింద,ఇరుదేశాలమధ్య బలమైన సహకారాన్ని ఇరువురు నాయకులూ ప్రశంసించారు. తాజాగా, 2024 సెప్టెంబర్ 16న వాషింగ్టన్ డిసి లో సహకార సమావేశం జరిగింది. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పరిశుభ్ర ఇంధన ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించడం, వాతావరణ మార్పులవల్ల ఎదురయ్యే సమస్యలను చర్చించడం, సామర్ధ్యాలనిర్మాణం, పరిశోధన, అభివృద్ధికి– పరిశ్రమకు మధ్య సహకారం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించే అంశాలను చర్చించడం ఈ సమావేశం లక్ష్యం.
ఇండియాలో హైడ్రోజన్ భద్రత నూతన జాతీయ కేంద్రం ఏర్పాటులోసహకారాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు.పరిశుభ్ర ఇంధన తయారీ, అంతర్జాతీయ సరఫరా చెయిన్ల విషయంలో సహకారాన్ని మరింతముందుకు తీసుకువెళ్లేందుకు నూతన పునరుత్పాదక ఇంధన సాంకేతికత కార్యాచరణ వేదికను ఉపయోగించుకోనున్నట్టు వారు స్పష్టం చేశారు. ఇంధన నిల్వ, పబ్లిక్–ప్రైవేట్ టాస్క్ ఫోర్స్ వంటి వాటి ద్వారా సహకారం కూడా ఇందులో ఇమిడి ఉంది.
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ, అంతర్జాతీయ సౌర కూటమిల మధ్య నూతన సహకార విధివిధానాలను ఉభయ నాయకులు ప్రకటించారు.ఇది బాధ్యతాయుతమైన ,సుస్థిర విద్యుత్ వ్యవస్థకు వీలు కల్పిస్తుంది. ఇది వైవిధ్యతతో కూడిన పునరుత్పాదక ఇంధన వనరుల వాడకానికి దోహదపడుతుంది.
కీలక ఖనిజాల విషయయంలో, ఖనిజ భద్రత భాగస్వామ్యం కింద ,వైవిధ్యతతో కూడిన, సుస్థిర సరఫరా చెయిన్ ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు.ఇందులో వ్యూహాత్మక ప్రాజెక్టులు, వాల్యూ చెయిన్పై ప్రముఖంగా దృష్టిపెడతారు. త్వరలో జరగనున్న అమెరికా – ఇండియా వాణిజ్య చర్చలలో కీలక ఖనిజాలకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కీలక ఖనిజ సరఫరా చెయిన్లను బలోపేతం చేసేలా ద్వైపాక్షిక సహకారాన్ని కుదుర్చుకునేందుకు వారు ప్రతినబూనారు. విస్తృత వాణిజ్య సహకారం, ఉన్నతస్థాయి సాంకేతిక సహాయం ద్వారా దీనిని సాధించనున్నారు.
అంతర్జాతీయ ఇంధన కార్యక్రమ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా , ఐఇఎ సభ్యత్వం కోసం ఇండియా చేస్తున్న ప్రయత్నాల విషయంలో 2023 నుంచి జరిగిన సంయుక్త కృషి పురోగతిని ఇరువురు నాయకులూ స్వాగతించారు
పునరుత్పాదక ఇంధనం తయారీ, వినియోగం, బ్యాటరీ నిల్వ, అధునాతన పరిశుభ్ర సాంకేతికతలను ఇండియాలో వేగవంతం చేసేందుకు ఉభయ నాయకులూ తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు.
భారత జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధి, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్లు ఒక్కొక్కటి 500మిలియన్ డాలర్లను హరిత పరివర్తన నిధిలో పెట్టే అంశం విషయంలో పురోగతిని ఉభయ నాయకులు స్వాగతించారు.ఈ చర్యలకు తోడు ప్రైవేటు రంగం పెట్టుబడులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. హరిత పరివర్తన నిధి వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చడానికి ఎదురు చూస్తున్నట్టు ఉభయపక్షాలు ప్రకటించాయి.
భవిష్యత్ తరాలకు సాధికారత, ప్రపంచ ఆరోగ్యం, అభివృద్ధికి ప్రోత్సాహం:
సుసంపన్నత కోసం ఇండో–పసిఫిక్ ఆర్ధిక విధివిధానాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడం, పిల్లర్ 3, పిల్లర్ 4 కింద ఒప్పందాలపై ఇండియా సంతకంచేయడం, వాటి ఆమోదానికి చర్యలుతీసుకొవడాన్ని ఉభయ నాయకులు స్వాగతించారు.
ఐపిఇఎప్ ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలు, ఆర్థిక వృద్ధి, సమ్మిళితత్వం, సుస్థిరత, అత్యంత సమర్థత, నిష్పాక్షికత, ఆర్ధిక వ్యవస్థల మధ్య పోటీతత్వాన్ని కోరుకుంటున్నాయని, ఉభయ నాయకులు గుర్తుచేశారు. 14 ఐపిఇఎఫ్ భాగస్వామ్య దేశాల ఆర్ధిక వైవిధ్యతను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ జిడిపి లో ఈ దేశాలు 40 శాతం వాటా , ప్రపంచ వస్తు సేవల వాణిజ్యంలో 28 శాతం వాటా కలిగి ఉన్నాయని వారు తెలిపారు.
21 వ శతాబ్దానికి సంబంధించి అమెరికా – ఇండియా నూతన ఔషధ విధాన ఫ్రేమ్ వర్క్ను అధ్యక్షుడు బైడెన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వాగతించారు. దీనితోపాటు గల అవగాహనా పత్రం ఉభయదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది అక్రమ సింథటిక్ ఔషధాలు, రసాయనాల అంతర్జాతీయ రవాణాను, అక్రమ తయారీని అరిక్టడంలో మరింత సహకారానికి దోహదపడుతుంది. సమగ్ర ప్రజారోగ్య భాగస్వామ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
సింథటిక్ డ్రగ్స్ ముప్పును ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ కూటమి లక్ష్యాలకు అనుగుణంగా తమ చిత్తశుద్ధిని ఇరువురు నాయకులూ ప్రకటించారు. పరస్పరం అంగీకరించిన, సమన్వయంతో కూడిన చర్యలు,సహకారం ద్వారా సింథటిక్ డ్రగ్స్ముప్పును ఎదుర్కొనేందుకు తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించేందుకు కలసి పనిచేయాలని వీరు నిర్ణయించారు.
2024 ఆగస్టులో తొలిసారిగా జరిగిన అమెరికా– ఇండియా కాన్సర్ చర్చలను ఉభయ నాయకులు ప్రశంసించారు. కాన్సర్ కేసులు పెరుగుతున్న రేటుకు అనుగుణంగా పరిశోధన , అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకు , ఇది ఇరుదేశాలకు చెందిన నిపుణులను ఒక చోటికి చేర్చిందని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా, ఇండియా,ఆర్.ఒ.కె, జపాన్, యూరోపియన్ యూనియన్ల మధ్య బయో 5 భాగస్వామ్యం ఆవిష్కృతం కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఫార్మాసూటికల్ సరఫరా చెయిన్ విషయంలో సన్నిహిత సహకారానికి వీలు కల్పిస్తుంది. చిన్నారులకోసం హెక్సావాలెంట్ (ఒకేదానిలో ఆరు) వాక్సిన్ తయారు చేసే భారతీయ కంపెనీ , పనాసియా బయోటెక్ కు డవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్,50 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరుచేయడాన్ని ఉభయ నాయకులు అభినందించారు. ఉమ్మడి అంతర్జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతలను ముందుకు తీసుకుపోవడంతోపాటు,ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపట్ల తమకుగల చిత్తశుద్ధికి నిదర్శనంగా వారు దీనిని పేర్కొన్నారు.
సూక్ష్మ,చిన్న , మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖకు, అమెరికాకు చెందిన చిన్న వ్యాపారాల పాలనాయంత్రాంగానికి మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని ఇరువురు నాయకులూ స్వాగతించారు. ఇది అమెరికా,ఇండియాలలోని చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా సామర్ధ్యాల నిర్మాణం, వాణిజ్యం, ఎగుమతులకు నిధులు, సాంకేతికత, డిజిటల్ వాణిజ్యం,హరిత ఆర్థికం,వాణిజ్య సదుపాయాల విషయంలో కార్యశాలలు నిర్వహిస్తారు. ఈ అవగాహనా ఒప్పందం కింద, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా వీరిని మహిళలే యజమానులుగాగల రెండు దేశాలలోని వ్యాపారాలలో భాగస్వాములు కావడానికి వీలు కలుగుతుంది.. 2023 జూన్లో ప్రధానమంత్రి అమెరికాలో అధికారిక పర్యటన అనంతరం, డవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్,ఇండియాలోని చిన్న వ్యాపారాలకు సంబంధించిన 8 ప్రాజెక్టులపై 177 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఇది ఆర్థిక పురోగతికి దోహదపడిందని ఉభయ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
అమెరికా వ్యవసాయ విభాగం, భారత వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని ఇరువురు నాయకులూ స్వాగతించారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయం, వ్యవసాయ ఉత్పాదకత వృద్ధి, వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, పంట ముప్పునుంచి రక్షణకు సంబంధించి ఉత్తమ విధానాలను పరస్పరం తెలియజేసుకోవడం, వ్యవసాయ రుణం వంటి విషయాలలో మరింత సహకారానికి కృషి జరుగుతోంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్నిపెంపొందించేందుకు, వినూత్న ఆలోచనలు చేయనున్నారు. రెగ్యులేటరీ అంశాలపై ప్రైవేటు రంగంతో చర్చల ద్వారా ఉభయ పక్షాలవైపు సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు.
అమెరికా– ఇండియా అంతర్జాతీయ కొత్త డిజిటల్ అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఆవిష్కరించడాన్ని ఇరువురు నాయకులూ స్వాగతించారు. ఇది అమెరికా, ఇండియాలకు చెందిన ప్రైవేటు రంగ కంపెనీలను, సాంకేతికతను, వనరులను ఒకచోటికి చేర్చడానికి వీలు కల్పించింది. ఆసియా, ఆఫ్రికాలలో వినూత్న డిజిటల్సాంకేతికతలు వినియోగించడానికి ఇది ఉపకరిస్తుంది..
త్రిముఖ అభివృద్ధి భాగస్వామ్యం ద్వారా టాంజానియాతో త్రైపాక్షిక సహకారాన్ని బలొపేతం చేసుకోవడాన్ని ఉభయ నాయకులూ స్వాగతించారు. అమెరికా నాయకత్వంలోని ఇంటర్నేషనల్ డవలప్మెంట్ సంస్థ, భారతదేశ అభివృద్ధి భాగస్వామ్య యంత్రాంగం,అంతర్జాతీయ అభివృద్ధి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడంతోపాటు ఇండో పసిఫిక్ ప్రాంత సుసంపన్నతకు దోహదపడనున్నాయి. ఈ భాగస్వామ్యం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిపెడుతుంది. ఇంధన మౌలిక సదుపాయాల పెంపు, టాంజానియాలో వాటిని అందుబాటులోకి తేవడం ద్వారా ఇండో –పసిఫిక్ ప్రాంతంలో ఇంధన సహకారాన్నిఇది పరుగులు పెట్టించనుంది. ఆరోగ్య సహకారంలో త్రిముఖ అభివృద్ధి భాగస్వామ్య విస్తరణ అవకాశాలను అన్వేషించాలని ఉభయ నాయకులు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి పరస్పరం ఆసక్తిగల కీలక సాంకేతిక అంశాలు, డిజిటల్ ఆరోగ్యం,నర్సులు ఇతర క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల సామర్ధ్యాలపెంపుపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు.
2024 జూలైలో సంతకాలు జరిగిన ద్వైపాక్షిక సాంస్కృతిక ఆస్తుల ఒప్పందాన్ని ఉభయ నాయకులు స్వాగతించారు. సాంస్కృతిక ఆస్తుల యాజమాన్యాన్ని అక్రమంగా బదలాయించడాన్ని , అక్రమ ఎగుమతులు,దిగుమతులను 1970 నాటి అంతర్జాతీయ ఒప్పందం నిషేధిస్తున్నది. ఉభయదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక సాంస్కృతిక ఆస్తుల ఒప్పందం నిపుణులు ఎంతో జాగ్రత్తగా రూపొందించినది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో అధ్యక్షుడు బైడెన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం . సాంస్కృతిక వారసత్వం విషయంలో సంయుక్త సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయే అంశం, 2023 జూన్లో ఉభయ నాయకులు కలిసినపుడు చర్చకు వచ్చింది. ఈ సందర్భంఆ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 297 భారతీయ కళాఖండాలను 2024లో అమెరికానుంచి ఇండియాకు తిరిగి పంపడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు.
ఇండియా అధ్యక్షతన, జి 20 దేశాల నాయకుల ఉమ్మడి ప్రాధాన్యతలకు అనుగుణంగా , .రియో డి జనీరియోలో జరిగిన జి 20 అధినేతల శిఖరాగ్ర సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఉభయ నాయకులు పేర్కొన్నారు. మరింత పెద్ద, మెరుగైన, సమర్ధమైన బహుళ పక్ష అభివృద్ధి బ్యాంకులను తీర్చిదిద్దడం, వర్ధమానదేశాలు అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడంలో సహాయపడడం, ప్రపంచబ్యాంకు సామర్ధ్యాన్ని పెంచేలా కృషిచేయడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం తప్పనిసరి అని గుర్తిస్తూ, మరింత స్పష్టంగా, క్రమపద్ధతిలో, సకాలంలో, సమన్వయంతో ఆయా దేశాల రుణ పునర్వ్యవస్థీకరణకు వీలుకల్పించాలని,ఇది, గొప్పసంకల్పంతో ముందుకు వెళ్లే వర్దమాన దేశాలకు ప్రగతి పథం కావాలని వారు ఆకాంక్షించారు. ఒకవైపు పెరుగుతున్న రుణభారం, మరోవైపు ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొనే దేశాలకు ఆర్ధికవనరుల అందుబాటు పెరగాలని,ఆయా దేశాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు అందే వెసులుబాటు ఉండాలని వారు ఆకాంక్షించారు.