ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తుల కాలుష్య నిర్మూలన దిశగా ఫ్రాన్స్-భారత్ కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈ మేరకు స్వల్ప ప్రయోజనం, అధిక చెత్తకు దారితీసే ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తులపై రెండు దేశాల్లోనూ నిషేధం విధించబడింది. ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగుపడటంతోపాటు వాటి అపసవ్య నిర్వహణ ప్రపంచ పర్యావరణానికి ముప్పుగా మారింది. అందువల్ల ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సి ఉంది. ఇది సాధారణంగా పర్యావరణ వ్యవస్థలపైనా, ప్రత్యేకించి సముద్ర పర్యావరణ వ్యవస్థల మీద విపరీత ప్రతికూల ప్రభావం చూపుతుంది. (80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలకు భూమే మూలం… ఎలాగంటే- 1950 నుంచి 9.2 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి కాగా, ఇందులో 7 బిలియన్ టన్నుల వ్యర్థాలు ఏర్పడ్డాయి. ఏటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. దీనిలో మూడింట ఒక వంతు ఒకసారి వాడకం కోసమే కాగా, దాదాపు 10 మిలియన్ టన్నుల మేర సముద్రంలో వేయబడుతోంది).
ఒకసారి వాడకపు ఉత్పత్తులను “ఒక్కసారి వాడి పారేసే లేదా పునరుత్పత్తి చేయబడే వివిధ రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను వివరించే ‘సామూహిక పదబంధం’గా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) నిర్వచించింది. వీటిలో ఆహార ప్యాకింగ్, సీసాలు, స్ట్రాలు, కంటైనర్లు, కప్పులు, వంటింటి సామగ్రి షాపింగ్ సంచులు భాగంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనకు అంతర్జాతీయంగా ముందంజ పడింది. ఈ దిశగా నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలపై స్టాక్‌హోమ్ సదస్సు తీర్మానం, సరిహద్దుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు సమస్య పరిష్కారంపై బాసెల్ సదస్సు తీర్మానంతోపాటు వాటి అనుబంధ సవరణలు, ప్రాంతీయ సముద్ర సదస్సు కింద ఓడల నుంచి సముద్రంలో పోగయ్యే చెత్త నిర్మూలనపై అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంఒ) కార్యాచరణ ప్రణాళికలు వంటి చర్యలు చేపట్టబడ్డాయి. మరోవైపు 2014 నుంచి ‘యుఎన్‌ఇఎ’ వరుస తీర్మానాలు కూడా ఈ సవాలు పరిష్కారంలో తోడ్పడ్డాయి. దీంతోపాటు ఇంకా చేపట్టదగిన పరిష్కార చర్యలపై ప్రతిపాదనల కోసం ‘యుఎన్‌ఇఎ3’ ద్వారా 2017లో సముద్రపు చెత్త నిర్మూలనపై తాత్కాలిక సార్వత్రిక నిపుణుల బృందం (ఎహెచ్‌ఇజి) ఏర్పాటు చేయబడింది. కాగా, ఇది 2020 నవంబరు 13తో తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించింది. ఈ మేరకు సమర్పించిన నివేదికలో “ఒకసారి వాడకపు ప్లాస్టిక్ సహా అనవసర-నివారించదగిన ప్లాస్టిక్ వాడకంపై నిర్వచనాలు”సహా అనేక ప్రతిస్పందన మార్గాలను వివరించింది.
ఈ నేపథ్యంలో మనం ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నిర్దిష్టంగా తగ్గించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఆ మేరకు దానికి తగిన ప్రత్యామ్నాయ మార్గాన్వేషణ కూడా చేయాల్సి ఉంది. కాగా, 2019 మార్చి ఐక్యరాజ్య సమితి 4వ పర్యావరణ సభ (యుఎన్‌ఇఎ-4) “ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తుల కాలుష్య నిర్మూలన”పై తీర్మానం (యుఎన్‌ఇపి/ఇఎ-4/ఆర్-9) ఆమోదించింది, “ఐరాస సభ్య దేశాలు సముచిత చర్యలు చేపట్టడాన్ని ఈ తీర్మానం ప్రోత్సహిస్తుంది. అందుకు తగినట్లుగా ఆ ఉత్పత్తులకు బదులు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల గుర్తింపు, తయారీతోపాటు వాటి పూర్తి జీవిత చక్రపు సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.” ఇక ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తుల సమస్య పరిష్కారం కోసం ‘ఐయుసిఎన్’ మూడు తీర్మానాలను (డబ్ల్యూసీసీ 2020 19, 69, 77) ఆమోదించింది. వీటిలో 69వ తీర్మానం- “రక్షిత ప్రాంతాల్లో ఒకసారి వాడకపు ప్లాస్టిక్ కాలుష్య సంపూర్ణ నిర్మూలన అంతిమ లక్ష్యంగా ఆయా ప్రాంతాల్లో కాలుష్య నిరోధానికి ప్రాధాన్యంతో సముచిత చర్యలు తీసుకోవాలి” అని సూచిస్తోంది.
ఈ మేరకు స్వల్ప ప్రయోజనం, అధిక చెత్తకు దారితీసే ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తులను దశలవారీగా తొలగిస్తూ వృత్తాకార ఆర్థిక విధానం ప్రాతిపదికగా పునర్వినియోగ ఉత్పత్తులతో వాటిని భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణమైన తక్షణ పరిష్కారాలు స్పష్టంగా గుర్తించబడ్డాయి. అలాగే ఈ సమస్యకు పరిష్కారాన్వేషణ క్రమంలో ఆవిష్కరణ, పోటీతత్వం, ఉద్యోగ సృష్టికి కొత్త అవకాశాలు అందివస్తాయి అటువంటి పరిష్కారాల్లో కొన్నిటిని దిగువన చూడవచ్చు:
- ప్రత్యామ్నాయాల తక్షణ లభ్యత, అందుబాటు ధర ప్రాతిపదికగా గుర్తించబడిన ఒకసారి వాడకపు ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం;
- తయారీదారు బాధ్యతల విస్తృతి (ఇపిఆర్) ద్వారా పర్యావరణపరంగా వ్యర్థాల సముచిత నిర్వహణకు వారు బాధ్యత వహించేలా చర్యలు;
- పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాల కనీస స్థాయి రీసైక్లింగ్‌పై సూచనలు, రీసైకిల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం;
- తయారీదారులకు నిర్దేశించిన ‘ఇపిఆర్’ నియమాల అనుసరణపై తనిఖీ/పర్యవేక్షణ;
- ఒకసారి వాడకపు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల రూపకల్పన దిశగా తయారీదారులకు తోడ్పడే ప్రోత్సాహకాలు;
- వ్యర్థాలను ఎలా నిర్మూలించాలో సూచించే లేబులింగ్ నిబంధనల విధింపు;
- అవగాహన పెంచే చర్యలు చేపట్టడం;
ఈ నేపథ్యంలో ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం-ఉత్పత్తిని క్రమంగా తగ్గించడంతోపాటు సంపూర్ణ నిర్మూలనపై తమ కృత నిశ్చయాన్ని పునరుద్ఘాటిస్తూ ఫ్రాన్స్-భారత్ దిగువన పేర్కొన్న చర్యలు చేపట్టాయి:
ఇందులో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన 2020 ఫిబ్రవరి 10నాటి వ్యర్థాల నిర్మూలన చట్టం ప్రకారం 2021 జనవరి నుంచి వంటింటి సామగ్రి, ప్లేట్లు, స్ట్రాలు, స్టిరర్లు, పానీయాల కోసం వాడే కప్పులు, ఆహార కంటైనర్లు, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ పుల్లతో కూడిన బడ్స్ వంటి ఉత్పత్తుల శ్రేణిని నిషేధించింది. ఈ చట్టంతోపాటు ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య ఆదేశాలను కూడా ఫ్రాన్స్ అనుసరించింది. ఇటువంటి చర్యల ద్వారా 2040 నాటికి ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తులకు స్వస్తి పలకాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది;
అదేవిధంగా భారత్ కూడా తక్కువ బరువుండే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ పుల్లతో కూడిన బడ్స్, ప్లాస్టిక్ స్టిక్‌ల తొలగింపు ద్వారా స్వల్ప ప్రయోజనం, అధికత చెత్తకు దారితీసే ఒకసారి వాడకపు ప్లాస్టిక్ వస్తువుల దశలవారీ తొలగింపు దిశగా 2021 ఆగస్టు 12న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, మిఠాయి పుల్లలు, ఐస్‌క్రీం/పాలీస్టైరిన్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, వంటింటి సామగ్రి, (ప్లాస్టిక్ ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, ట్రేలు, స్టిరర్లు) వగైరాలను నిషేధించింది.
ఫ్రాన్స్ 1993 నుంచే గృహ ప్యాకేజింగ్‌కు సంబంధించి ‘ఇపిఆర్’ పథకాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2023 నుంచి కేటరింగ్ ప్యాకేజింగ్‌పైనా, 2024 నుంచి చూయింగ్ గమ్‌లమీద, 2025 నుంచి పారిశ్రామిక-వాణిజ్య ప్యాకేజింగ్-ఫిషింగ్ రంగంలోనూ నిషేధం కోసం ‘ఇపిఆర్’ను రూపొందిస్తోంది. కాగా, భారత్ 2016లో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలకు సంబంధించి ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ల యజమానులపై ‘ఇపిఆర్’ అనుసరణను తప్పనిసరి చేసింది.
భారత్ 2022 ఫిబ్రవరిలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ‘ఇపిఆర్’ సంబంధిత మార్గదర్శకాలను ప్రకటించింది. తదనుగుణంగా ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ల యజమానులు (i) వివిధ వర్గాల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాల రీసైక్లింగ్, (ii) గుర్తించబడిన దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాల పునర్వినియోగం దిశగా అమలు చేయదగిన లక్ష్యాల నిర్దేశం iii) ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పదార్థాల వాడకం చేపట్టడాన్ని తప్పనిసరి చేసింది.
మొత్తంమీద చారిత్రక ‘యుఎన్‌ఇఎ’ 5.2 తీర్మానానికి అనుగుణంగా ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనకు అంతర్జాతీయ చట్టబద్ధ ఒప్పందం దిశగా సారూప్య దృక్పథంగల దేశాలతో నిర్మాణాత్మక చర్చల బలోపేతానికి భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా కృషి చేయనున్నాయి.