The country was saddened by the insult to the Tricolour on the 26th of January in Delhi: PM Modi
India is undertaking the world’s biggest Covid Vaccine Programme: PM Modi
India has vaccinated over 30 lakh Corona Warriors: PM Modi
Made in India vaccine is, of course, a symbol of India’s self-reliance: PM Modi
India 75: I appeal to all countrymen, especially the young friends, to write about freedom fighters, incidents associated with freedom, says PM Modi
The best thing that I like in #MannKiBaat is that I get to learn and read a lot. In a way, indirectly, I get an opportunity to connect with you all: PM
Today, in India, many efforts are being made for road safety at the individual and collective level along with the Government: PM

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. 'మన్ కీ బాత్' ద్వారా మీతో సంభాషిస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యునిగా నేను మీ మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది. మన చిన్న చిన్న విషయాలు ఏవైనా అంశాలను నేర్పిస్తే.., జీవితంలోని వివిధ అనుభవాలు మొత్తం జీవితాన్ని గడపడానికి ప్రేరణగా మారితే..  – అదే 'మన్ కి బాత్'. ఈ రోజు 2021 జనవరిలో చివరి రోజు. కొద్ది రోజుల క్రితమే  2021 ప్రారంభమైందని మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారా? జనవరి నెల మొత్తం గడిచిపోయిందని అనిపించదు – దీన్నే కాల గమనం అంటారు. కొన్ని రోజుల కిందటే మనం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నామనిపిస్తోంది. మనం లోహ్రీని జరుపుకున్నాం.. మకర సంక్రాంతి జరుపుకున్నాం. పొంగల్, బిహు జరుపుకున్నాం.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు జరుపుకున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజును 'పరాక్రామ్ దివస్' గా జరుపుకున్నాం. జనవరి 26 నాడు 'రిపబ్లిక్ డే' సందర్భంగా  అద్భుతమైన కవాతును కూడా చూశాం.  పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించిన తరువాత బడ్జెట్ సమావేశాలు  కూడా ప్రారంభమయ్యాయి. వీటన్నిటి మధ్య మరో పని కూడా జరిగింది. మనమందరం చాలా ఎదురుచూసిన ఆ కార్యక్రమం పద్మ అవార్డుల ప్రకటన. అసాధారణమైన కృషి చేస్తున్న వారిని – వారి విజయాలు, వారి సేవకు గుర్తింపుగా దేశం సత్కరించింది. ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో అద్భుతమైన కృషి  చేసినవారు, వారి కృషితో ప్రజల జీవితాలను మార్చినవారు అవార్డు పొందిన వారిలో ఉన్నారు.  వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అట్టడుగు స్థాయిలో పనిచేస్తూ గుర్తింపు పొందని  నిజ జీవిత హీరోలకు పద్మ అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని కొన్నేళ్ల క్రితం దేశం ప్రారంభించింది. అదే సంప్రదాయం  ఈసారి కూడా కొనసాగింది.       ఈ వ్యక్తుల గురించి, వారి సేవల గురించి తెలుసుకోవాలని మీ అందరిని నేను కోరుతున్నాను. వారి గురించి మీ కుటుంబంలో చర్చ జరపాలి. దీని నుండి ప్రతి ఒక్కరూ ఎంత ప్రేరణ పొందుతారో చూడండి.

ఈ నెల క్రికెట్ పిచ్ నుండి కూడా చాలా మంచి వార్తలను అందుకున్నాం. మన క్రికెట్ జట్టు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొని, తర్వాత అద్భుతంగా ఆడి  ఆస్ట్రేలియాలో సిరీస్‌ను గెలుచుకుంది. మన క్రీడాకారుల కష్టపడే స్వభావం,  టీం వర్క్ ప్రేరణ ఇస్తుంది. వీటన్నింటి మధ్య ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసిన దేశం చాలా విచారంగా ఉంది. మనం భవిష్యత్తును కొత్త ఆశతో, కొత్తదనంతో నింపాలి. మనం గత సంవత్సరం అసాధారణమైన సంయమనాన్ని, ధైర్యాన్ని చూపించాం. ఈ సంవత్సరం కూడా మనం కష్టపడి పనిచేయాలి. మన సంకల్పాన్ని నిరూపించుకోవాలి. మన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ సంవత్సరం ప్రారంభంతో కరోనాపై మన పోరాటం కూడా దాదాపు ఒక సంవత్సరం పూర్తయింది. కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం ఒక ఉదాహరణగా మారినవిధంగానే ఇప్పుడు మన టీకా కార్యక్రమం కూడా ప్రపంచంలో ఒక ఉదాహరణగా మారుతోంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంతకన్నా గర్వం ఏముంటుంది? అతిపెద్ద వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంతో మన పౌరులకు టీకాలు వేస్తున్నాం. కేవలం 15 రోజుల్లో భారతదేశం 30 లక్షలకు పైగా ఉన్న మన కరోనా యోధులకు టీకాలు వేసింది. ఈ కార్యక్రమానికి అమెరికా వంటి ధనిక దేశానికి 18 రోజులు, బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది.

మిత్రులారా!  'మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్' నేడు కేవలం భారతదేశ  స్వావలంబనకు మాత్రమే కాకుండా దేశ ఆత్మగౌరవానికి కూడా  ప్రతీక. 'మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్' మనస్సులో కొత్త ఆత్మ విశ్వాసాన్ని కల్పించిందని నమో యాప్‌లో ఉత్తరప్రదేశ్ నుండి సోదరుడు హిమాన్షు యాదవ్ రాశారు. తన విదేశీ స్నేహితులు చాలా మంది తనకు సందేశాల మీద సందేశాలు పంపుతూ భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని మదురై నుండి కీర్తి గారు రాశారు.  కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం ప్రపంచానికి సహాయం చేసిన విధానం వల్ల భారతదేశం పట్ల వారికి ఉన్న గౌరవం వారి మనస్సుల్లో మరింతగా పెరిగిందని కీర్తి గారి స్నేహితులు ఆమెకు రాశారు. కీర్తి గారూ.. దేశం పొందిన ఈ గౌరవాన్ని వింటూ 'మన్ కి బాత్' శ్రోతలు కూడా గర్వపడుతున్నారు. ఈ మధ్య  నేను వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల నుండి కూడా ఇలాంటి సందేశాలను పొందుతున్నాను. ట్వీట్ చేయడం ద్వారా బ్రెజిల్ అధ్యక్షుడు భారతదేశానికి ఎలా కృతజ్ఞతలు చెప్పారో, ప్రతి భారతీయుడికి ఇది ఎంత గర్వం కలిగించే విషయమో మీరు కూడా చూసి ఉంటారు. వేలాది కిలోమీటర్ల దూరంలో-  ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో, మూల మూలల్లో నివసిస్తున్నవారికి రామాయణం పై ఉన్న లోతైన అవగాహన వారి మనస్సులపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తోంది. ఇది మన సంస్కృతి  ప్రత్యేకత.

మిత్రులారా! ఈ టీకా కార్యక్రమంలో మీరు ఇంకొక విషయం గమనించి ఉంటారు. భారతదేశానికి మందులు, వ్యాక్సిన్ల విషయంలో ఎంతో సామర్థ్యం ఉంది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అందుకే సంక్షోభ సమయాల్లో భారతదేశం ప్రపంచానికి సేవ చేయగలిగింది.  ఇదే ఆలోచన భారత స్వావలంబన ప్రచారంలో కూడా ఉంది. భారతదేశం సమర్థత పెరుగుతున్న కొద్దీ మానవాళికి ఎక్కువ సేవ లభిస్తుంది. దాని ద్వారా ప్రపంచానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

నా ప్రియమైన దేశవాసులారా! ప్రతిసారీ మీ నుండి ఉత్తరాలు వచ్చినప్పుడు; నమో యాప్, మైగవ్‌లోని మీ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి ఒక సందేశం నా దృష్టిని ఆకర్షించింది. – ఇది సోదరి ప్రియాంక పాండే గారి సందేశం. హిందీ సాహిత్య విద్యార్థి అయిన 23 ఏళ్ల ప్రియాంక బీహార్‌లోని సీవాన్ లో నివసిస్తున్నారు. దేశంలోని 15 దేశీయ పర్యాటక గమ్యస్థానాలను సందర్శించాలన్న నా సూచనతో తాను చాలా ప్రేరణ పొందినట్టు  ఆమె నమో యాప్ లో రాశారు. ఆ ప్రేరణతో జనవరి 1న ఆమె చాలా ప్రత్యేకమైన ప్రదేశానికి బయలుదేరినట్టు తెలిపారు. ఆ స్థలం ఆమె ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరంలోని దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్  పూర్వికుల నివాసం. తన దేశనికి చెందిన  గొప్ప వ్యక్తిత్వాలను తెలుసుకోవటానికి ఇది తన మొదటి అడుగు అని ప్రియాంక గారు ఒక చక్కటి విషయం రాశారు. ప్రియాంక గారికి అక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన పుస్తకాలు లభించాయి.  అనేక చారిత్రక ఛాయాచిత్రాలను పొందారు. ప్రియాంక గారూ.. మీ ఈ అనుభవం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది.

మిత్రులారా!  ఈ ఏడాది నుండి భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ‘అమృత్ మహోత్సవ్’ గా ప్రారంభించబోతోంది. మన స్వాతంత్ర్య వీరులతో సంబంధాలున్న స్థానిక ప్రదేశాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. వారి కృషి కారణంగానే మనకు స్వేచ్ఛ లభించింది.

మిత్రులారా!  మనం స్వాతంత్ర్య ఉద్యమం గురించి, బీహార్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నమో యాప్‌లోనే చేసిన మరో వ్యాఖ్యను కూడా చర్చించాలనుకుంటున్నాను. ముంగేర్‌కు చెందిన జైరామ్ విప్లవ్ గారు తారాపూర్ అమరవీరుల దినోత్సవం గురించి నాకు రాశారు. దేశభక్తుల బృందానికి చెందిన అనేక మంది వీర నవ యువకులను 1932 ఫిబ్రవరి 15 వ తేదీన బ్రిటిష్ వారు దారుణంగా హత్య చేశారు. వారి ఏకైక నేరం ఏమిటంటే వారు 'వందే మాతరం', 'భారత్ మా కి జై' అంటూ నినాదాలు చేయడమే. నేను ఆ అమరవీరులకు నమస్కరిస్తున్నాను. వారి ధైర్యానికి నివాళి అర్పిస్తున్నాను. నేను జైరామ్ విప్లవ్ గారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు పెద్దగా చర్చ జరగని ఒక సంఘటనను ఆయన దేశం దృష్టికి తీసుకువచ్చారు.

నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశంలోని ప్రతి భాగంలో-  ప్రతి నగరంలో, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో స్వాతంత్య్ర సంగ్రామం పూర్తి శక్తితో జరిగింది.  దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీర కుమారులు భారతదేశంలోని ప్రతి మూలలో జన్మించారు. మన కోసం వారు చేసిన పోరాటాలు, వారికి సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తపర్చుకోవడం చాలా ముఖ్యం.  వారి గురించి రాయడం ద్వారా, మనం మన భవిష్యత్ తరాల కోసం వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచగలం.  దేశ స్వాతంత్య్ర సమరయోధుల గురించి, స్వాతంత్ర్యానికి సంబంధించిన సంఘటనల గురించి రాయాలని నేను దేశవాసులకు- ముఖ్యంగా నా యువ సహచరులకు పిలుపునిస్తున్నాను. మీ ప్రాంతంలో స్వాతంత్య్ర సంగ్రామ యుగం నాటి  వీరోచిత గాథల గురించి పుస్తకాలు రాయండి. ఇప్పుడు-  భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న సందర్భంలో మీ రచన ఆ స్వాతంత్ర్య  వీరులకు గొప్ప నివాళి అవుతుంది. యువ రచయితల కోసం ఇండియా సెవెన్టీ ఫైవ్ ద్వారా ఒక కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇది అన్ని రాష్ట్రాలు, భాషల యువ రచయితలను ప్రోత్సహిస్తుంది. భారతీయ వారసత్వం, సంస్కృతిపై లోతైన అధ్యయనం చేసి,  ఇటువంటి విషయాలను రాసే రచయితలు దేశంలో పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంటారు.  అటువంటి ప్రతిభకు మనం పూర్తిగా సహాయం చేయాలి. ఇది భవిష్యత్ దిశను నిర్ణయించే ఆలోచన ఉన్న నాయకుల విభాగాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగం కావాలని, సాహిత్య నైపుణ్యాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని నా యువ స్నేహితులను ఆహ్వానిస్తున్నాను. దీనికి సంబంధించిన సమాచారాన్ని విద్యా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

నా ప్రియమైన దేశవాసులారా!  మన్ కీ బాత్‌లో శ్రోతలు ఇష్టపడేది మీకు బాగా తెలుసు. 'మన్ కీ బాత్'లో నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఇందులో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి చాలా విషయాలు లభిస్తాయి. ఒక విధంగా- పరోక్షంగా మీ అందరితో అనుసంధానమయ్యే అవకాశం లభిస్తుంది.   కొందరి ప్రయత్నాలు, కొందరి అభిరుచులు, దేశానికి ఏదో చేయాలని కొందరిలో ఉన్న తపన – ఇవన్నీ నాకు చాలా స్ఫూర్తినిస్తాయి.  నన్ను శక్తితో నింపుతాయి.

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని స్థానిక కూరగాయల మార్కెట్ తన బాధ్యతలను నెరవేర్చే విధానాన్ని చదవడం కూడా నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. కూరగాయల మార్కెట్లలో చాలా కారణాల వల్ల చాలా కూరగాయలు చెడిపోతాయని మనం అందరం చూశాం. ఈ కుళ్లిపోయిన కూరగాయలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయి. వీటి ద్వారా అపరిశుభ్రత కూడా వ్యాపిస్తుంది.  కాని బోయిన్ పల్లి  కూరగాయల మార్కెట్ ఇలా రోజువారీ కూరగాయలను విసిరివేయకూడదని నిర్ణయించుకుంది. కూరగాయల మార్కెట్‌తో సంబంధం ఉన్న ప్రజలు వీటితో విద్యుత్తును సృష్టించాలని నిర్ణయించుకున్నారు. వ్యర్థ కూరగాయల నుండి విద్యుత్తును తయారు చేయడం గురించి మీరు ఎప్పుడైనా విని ఉంటారు.    ఇది నవ కల్పన శక్తి. గతంలో బోయినపల్లి మార్కెట్లో ఉన్న వ్యర్థాల నుండి  నేడు సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుండి బంగారం తయారుచేసే దిశగా  ప్రయాణం. అక్కడ ప్రతి రోజు 10 టన్నుల వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి.  ఎఏ వ్యర్థాలను ఒక ప్లాంట్ లో సేకరిస్తారు. ప్లాంట్ లోపల ఈ వ్యర్థాల నుండి ప్రతిరోజూ 500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.  సుమారు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ కాంతే కూరగాయల మార్కెట్‌కిఊ వెలుగు ఇస్తుంది. అక్కడ ఉత్పత్తి అయిన జీవ ఇంధనం నుండి ఆ మార్కెట్లోని క్యాంటీన్‌లో ఆహారాన్ని తయారు చేస్తారు. ఇది అద్భుతమైన ప్రయత్నం కదూ !

హర్యానాలో పంచకుల ప్రాంతంలోని బడౌత్  గ్రామ పంచాయతీ కూడా ఇదే విధమైన ఘనతను చూపించింది. ఈ పంచాయతీ ప్రాంతంలో నీటి పారుదల సమస్య ఉంది. ఈ మురికి నీరు వ్యాప్తి చెందుతూ, వ్యాధులకు కారణమవుతోంది. అయితే ఈ నీటి వ్యర్థాల నుండి కూడా సంపదను సృష్టించాలని బడౌత్ ప్రజలు నిర్ణయించుకున్నారు. గ్రామ పంచాయతీ మొత్తం గ్రామం నుండి వస్తున్న మురికి నీటిని ఒకే చోట ఫిల్టర్ చేయడం ప్రారంభించింది.  ఈ ఫిల్టర్ చేసిన నీటిని ఇప్పుడు గ్రామ రైతులు తమ పొలాలలో నీటిపారుదల కొరకు వినియోగిస్తున్నారు. ఆ విధంగా కాలుష్యం, మలినాలు, వ్యాధులను వదిలించుకోవడంతో పాటు తమ  పొలాలకు కూడా నీరందించగలిగారు.

మిత్రులారా! పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా ఆదాయ మార్గం ఎలా కల్పించుకోవచ్చనేదానికి ఉదాహరణ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కూడా కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ పర్వత ప్రాంతంలో 'మోన్ శుగు' అనే కాగితం శతాబ్దాలుగా తయారవుతోంది.  ఈ కాగితాలు శుగు శెంగ్ అనే స్థానిక మొక్క  బెరడు నుండి తయారవుతాయి.  అందువల్ల ఈ కాగితాన్ని తయారు చేయడానికి చెట్లను నరికివేయవలసిన అవసరం లేదు. దీన్ని తయారు చేయడానికి ఏ రసాయనాన్నీ ఉపయోగించరు.  అంటే ఈ కాగితం పర్యావరణానికి , ఆరోగ్యానికి కూడా సురక్షితం. ఈ కాగితాన్ని  గతంలో  ఎగుమతి కూడా చేసేవారు. కానీ, ఆధునిక సాంకేతికత వల్ల పెద్ద మొత్తంలో కాగితాలను ఉత్పత్తి చేయడం ప్రారంభమయ్యాక  ఈ స్థానిక కాగితాల ఉత్పత్తి మూసివేత అంచుకు చేరుకుంది. ఇప్పుడు స్థానిక సామాజిక కార్యకర్త గొంబు దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.  ఇది ఆదివాసి  సోదర సోదరీమణులకు కూడా ఉపాధి కల్పిస్తోంది.

నేను కేరళ నుండి మరొక వార్తను చూశాను. ఇది మన బాధ్యతలను మనం  గ్రహించేలా చేస్తుంది. కేరళలోని కొట్టాయంలో దివ్యాంగ వృద్ధుడు ఉన్నారు. ఆయన  ఎన్.ఎస్.రాజప్పన్ గారు. పక్షవాతం కారణంగా రాజప్పన్ గారు  నడవలేకపోతున్నారు.  కానీ ఇది పరిశుభ్రత పట్ల ఆయనకున్న అంకితభావాన్ని తగ్గించలేదు. ఆయన గత కొన్నేళ్లుగా పడవలో వెంబనాడ్ సరస్సు వద్దకు వెళ్లి సరస్సులో విసిరిన ప్లాస్టిక్ బాటిళ్లను బయటకు తెస్తారు. ఆలోచించండి..  రాజప్పన్ గారి ఆలోచన ఎంత ఉన్నతమైంది! మనం కూడా రాజప్పన్ గారి  నుండి ప్రేరణ పొంది, వీలైన చోట పరిశుభ్రతకు దోహదపడాలి.  

నా ప్రియమైన దేశవాసులారా!  మీరు కొన్ని రోజుల క్రితం తప్పక చూసి ఉంటారు. భారతదేశం నుండి నలుగురు భారతీయ మహిళా పైలట్లు శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరుకు నాన్ స్టాప్ ఫ్లైట్ ను తీసుకువచ్చారు. పదివేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తరువాత ఈ విమానం రెండు వందల ఇరవై ఐదు మందికి పైగా ప్రయాణికులను భారతదేశానికి తీసుకువచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు కొత్త చరిత్రను సృష్టించిన విషయాన్ని ఈసారి జనవరి 26 న జరిగిన కవాతులో మీరు గమనించి ఉంటారు.

ఏ రంగంలో అయినా దేశ మహిళల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూనే ఉంది.  కానీ దేశంలోని గ్రామాల్లో ఇలాంటి మార్పుల గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కాబట్టి, నాకు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నుండి వచ్చిన ఒక వార్తను  'మన్ కీ బాత్' లో ప్రస్తావించాలని భావించాను. ఈ వార్త చాలా ప్రేరణ ఇస్తుంది. . జబల్‌పూర్‌లోని చిచ్‌గావ్‌లో కొందరు ఆదివాసీ మహిళలు రోజూ బియ్యం మిల్లులో పనిచేసేవారు. కరోనా మహమ్మారి ప్రపంచంలో చాలా మందిని ప్రభావితం చేసినట్లే ఈ మహిళలపై కూడా ప్రభావం చూపించింది. ఆ రైస్ మిల్లులో పని ఆగిపోయింది. సహజంగానే ఇది ఆర్థిక సమస్యలను కలిగించడం ప్రారంభించింది. కానీ వారు నిరాశపడలేదు.  తామందరం కలిసి తమ సొంత రైస్ మిల్లును ప్రారంభించాలని వారు నిర్ణయించుకున్నారు. వారు పనిచేసిన మిల్లువారు తమ యంత్రాన్ని కూడా అమ్మాలనుకున్నారు. వీరిలో మీనా రాహండాలే గారు మహిళలందరినీ అనుసంధానించి, 'స్వయం సహాయక బృందాన్ని' ఏర్పాటు చేశారు. అందరూ తాము ఆదా చేసిన మూలధనం నుండి డబ్బును సేకరించారు. కొంత డబ్బు తక్కువైతే 'ఆజీవికా మిషన్' కింద బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు.  ఇప్పుడు చూడండి…. ఈ గిరిజన సోదరీమణులు ఒకప్పుడు తాము పనిచేసిన బియ్యం మిల్లునే కొన్నారు. ఈ రోజు వారు తమ సొంత రైస్ మిల్లు నడుపుతున్నారు.  కొద్ది కాలంలోనే ఈ మిల్లు దాదాపు మూడు లక్షల రూపాయల లాభాలను ఆర్జించింది. ఈ లాభంతో మీనా గారు, ఆమె సహచరులు మొదట బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి, తరువాత తమ వ్యాపారాన్ని విస్తరించడానికి సన్నద్ధమవుతున్నారు. కరోనా సృష్టించిన పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని ప్రతి మూలమూలనా ఇలాంటి అద్భుతమైన పనులు జరిగాయి.

నా ప్రియమైన దేశవాసులారా!  నేను మీతో బుందేల్ ఖండ్ గురించి మాట్లాడితే మీ మనసులో గుర్తొచ్చే విషయాలు ఏమిటి? చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాంతాన్ని ఝాన్సీ కి చెందిన రాణి లక్ష్మీబాయితో అనుసంధానిస్తారు. అదే సమయంలో, కొంతమంది సుందరమైన, ప్రశాంతమైన 'ఓర్చా' గురించి ఆలోచిస్తారు. కొంతమంది ఈ ప్రాంతంలోని విపరీతమైన వేడిని కూడా గుర్తు తెచ్చుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఇక్కడ భిన్నమైన ప్రదర్శన జరుగుతోంది. చాలా ప్రోత్సాహకరంగా ఉండే దీని గురించి మనం తెలుసుకోవాలి. కొద్దిరోజుల కిందట ఝాన్సీలో ఒక నెల రోజులపాటు జరిగే 'స్ట్రాబెర్రీ ఫెస్టివల్' ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపోతుండవచ్చు.  బుందేల్‌ఖండ్ లో స్ట్రాబెర్రీ ఏంటా అని! కానీ, ఇది నిజం. ఇప్పుడు బుందేల్‌ఖండ్‌లో స్ట్రాబెర్రీ సాగు పై ఆసక్తి పెరుగుతోంది.  ఇందులో ఝాన్సీ కి చెందిన గుర్లీన్ చావ్లా గారు అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. న్యాయ శాస్త్ర విద్యార్థిని అయిన  గుర్లీన్ గారు తన ఇంట్లో, తరువాత తన పొలంలో విజయవంతంగా స్ట్రాబెర్రీని సాగు  చేశారు. ఝాన్సీ లో కూడా ఇది జరగవచ్చని ఆమె నిరూపించారు. ఝాన్సీలో జరుగుతున్న 'స్ట్రాబెర్రీ ఫెస్టివల్' స్టే ఎట్ హోమ్ భావనను నొక్కి చెబుతుంది. ఈ పండుగ ద్వారా రైతులను, యువతను స్ట్రాబెర్రీని  వారి ఇంటి వెనుక ఖాళీ స్థలంలో లేదా టెర్రస్ మీద  తోటలను పెంచమని ప్రోత్సహిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పర్వతాలలో పెరుగుతుందన్న గుర్తింపు వచ్చిన  స్ట్రాబెర్రీ  ఇప్పుడు కచ్  ఇసుక భూమిలో కూడా పండుతోంది. దీనిద్వారా రైతుల ఆదాయం పెరుగుతోంది.

మిత్రులారా! స్ట్రాబెర్రీ ఫెస్టివల్ వంటి ప్రయోగాలు నవ కల్పనను ప్రదర్శించడమే కాకుండా మన దేశంలోని వ్యవసాయ రంగం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అవలంబిస్తుందో చూపిస్తాయి.

మిత్రులారా! వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు అనేక చర్యలు కూడా తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రయత్నాలు మరింత కొనసాగుతాయి.

నా ప్రియమైన దేశవాసులారా! నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చూశాను. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ ప్రాంతంలో ఉన్న  'నయా పింగ్లా' గ్రామానికి చెందిన చిత్రకారుడు సర్ముద్దీన్ వీడియో అది. రామాయణంపై తన పెయింటింగ్ రెండు లక్షల రూపాయలకు అమ్ముడైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆయన గ్రామస్తులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ వీడియో చూసిన తరువాత దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఏర్పడింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన చాలా మంచి ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. ఈ విషయం ఖచ్చితంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పర్యాటక మంత్రిత్వ శాఖ  ప్రాంతీయ కార్యాలయం ఈ నెల ప్రారంభంలో బెంగాల్ లోని గ్రామాల్లో 'ఇన్ క్రెడిబుల్ ఇండియా వీకెండ్ గేట్ వే' ను ప్రారంభించింది. ఇందులో పశ్చిమ మిడ్నాపూర్, బాంకురా, బీర్ భూం, పురులియా, తూర్పు బర్ధమాన్ ప్రాంతాల నుండి హస్తకళా కారులు సందర్శకుల కోసం హస్తకళ కార్య శాల నిర్వహించారు. 'ఇన్ క్రెడిబుల్ ఇండియా వీకెండ్ గేట్ వే' కార్యక్రమాల సమయంలో హస్తకళ ఉత్పత్తుల అమ్మకాలు హస్తకళాకారులకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని నాకు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు మన కళలకు  కొత్త మార్గాల్లో ప్రాచుర్యం పొందుతున్నారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన భాగ్యశ్రీ సాహు గారిని చూడండి. ఆమె ఇంజనీరింగ్ విద్యార్థి అయినప్పటికీ, గత కొన్ని నెలలుగా ఆమె చిత్రకళను నేర్చుకోవడం ప్రారంభించింది. అందులో నైపుణ్యం పొందారు.  కానీ ఆమె ఎక్కడ పెయింట్ చేశారో  మీకు తెలుసా? ఆమె  సాఫ్ట్ స్టోన్స్ పై పెయింట్ చేశారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు భాగ్యశ్రీ గారికి ఈ సాఫ్ట్ స్టోన్స్ దొరికాయి. వాటిని సేకరించి శుభ్రం చేశారు. తరువాత ఆమె ఈ రాళ్లపై  పట్టచిత్ర శైలిలో ప్రతిరోజూ రెండు గంటలు చిత్రించారు. ఆమె ఈ రాళ్లపై చిత్రించి తన స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. లాక్డౌన్ సమయంలో ఆమె సీసాలపై కూడా పెయింటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు ఆమె ఈ కళపై వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సుభాష్ చంద్ర బోసు  జన్మదినం సందర్భంగా భాగ్యశ్రీ రాతిపై ఆయనను చిత్రించి, ఆయనకు ప్రత్యేక నివాళి అర్పించారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. చిత్రాలు, రంగుల ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, చేయవచ్చు. జార్ఖండ్‌లోని దుమ్కాలో చేసిన ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించి నాకు చెప్పారు. అక్కడ మాధ్యమిక పాఠశాల ప్రిన్సిపాల్ పిల్లలకు నేర్పడానికి గ్రామంలోని గోడలను ఇంగ్లీషు, హిందీ అక్షరాలతో చిత్రించారు.  అలాగే అందులో వేర్వేరు చిత్రాలను కూడా రూపొందించారు.  తద్వారా గ్రామంలోని పిల్లలకు అభ్యసనంలో సహకారం లభిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలలో నిమగ్నమైన వారందరినీ అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!  భారతదేశం నుండి వేల కిలోమీటర్ల దూరంలో అనేక మహాసముద్రాలు, ద్వీపాలు దాటిన తర్వాత  చిలీ అనే ఒక దేశం ఉంది. భారతదేశం నుండి చిలీ చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ భారతీయ సంస్కృతిలోని పరిమళం చాలా కాలం క్రితమే అక్కడికి వ్యాపించింది. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే యోగా అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. చిలీ రాజధాని శాంటియాగోలో 30 కి పైగా యోగా పాఠశాలలు ఉన్నాయి. చిలీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. యోగా దినోత్సవం సందర్భంగా హౌస్ ఆఫ్ డిప్యూటీస్ లో పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుందని నాకు తెలిసింది.  ఈ కరోనా సమయంలో రోగనిరోధక శక్తికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో యోగా బలాన్ని వారు చవిచూస్తున్నారు. ఇప్పుడు వారు గతంలో కంటే యోగాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. చిలీ దేశంలోని పార్లమెంటు  ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అక్కడ నవంబర్ 4 ను జాతీయ యోగా దినంగా ప్రకటించారు. నవంబర్ 4 కు ఏ ప్రాముఖ్యత ఉందని మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు. ఆ దేశంలోని తొలి యోగా సంస్థ ను 1962 నవంబర్ 4వ తేదీన రాఫెల్ ఎస్ట్రాడా స్థాపించారు. ఆ తేదీని  జాతీయ యోగా దినంగా ప్రకటించడం ద్వారా ఎస్ట్రాడా గారికి కూడా నివాళి అర్పించారు. ఇది చిలీ పార్లమెంట్ ఇచ్చిన ప్రత్యేక గౌరవం. ఇది ప్రతి భారతీయుడు గర్వించే విషయం.  చిలీ పార్లమెంటుకు సంబంధించిన మరో విషయం మీకు ఆసక్తి కలిగిస్తుంది. చిలీ సెనేట్ ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటెరాస్. ఆయన పేరును విశ్వ కవి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణతో పెట్టారు.

నా ప్రియమైన దేశవాసులారా! మహారాష్ట్ర లోని జాల్నాకు చెందిన  డాక్టర్ స్వప్నిల్ మంత్రి, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ప్రహ్లాద్ రాజగోపాలన్ 'మన్ కీ బాత్'లో రహదారి భద్రతపై కూడా మాట్లాడాలని మైగవ్‌ ద్వారా కోరారు.  జనవరి 18వ  తేదీ నుండి ఫిబ్రవరి 17  వ తేదీ వరకు మన దేశం రహదారి భద్రతా మాసోత్సవాన్ని జరుపుకుంటుంది. రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా  ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత, సమష్టి స్థాయిలో రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాణాలను కాపాడటానికి జరిగే ఈ ప్రయత్నాలలో మనమందరం చురుకుగా పాల్గొనాలి.

మిత్రులారా!  బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వేసిన రహదారుల గుండా వెళుతూ మీరు గమనించి ఉండాలి. ఆ రహదారులపై మీరు చాలా వినూత్న నినాదాలను చూడవచ్చు. ‘ఇది హైవే- రన్‌వే కాదు’ లేదా ‘లేట్ మిస్టర్ కావడం కంటే మిస్టర్ లేట్ గా ఉండడం ఉత్తమం’ మొదలైనవి. ఈ నినాదాలు రహదారి జాగ్రత్తల గురించి తెలుసుకోవడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలాంటి వినూత్న నినాదాలను లేదా పదబంధాలను మైగవ్‌కు పంపవచ్చు. మీరు పంపే ఉత్తమ నినాదాలను కూడా ఈ ప్రచారంలో ఉపయోగిస్తారు.

మిత్రులారా! రోడ్డు భద్రత గురించి మాట్లాడుతుంటే కోల్‌కతాకు చెందిన అపర్ణ దాస్ గారు నమో యాప్‌లో రాసిన పోస్ట్ గురించి చర్చించాలనుకుంటున్నాను. 'ఫాస్టాగ్' కార్యక్రమం గురించి మాట్లాడమని అపర్ణ గారు నాకు సలహా ఇచ్చారు. 'ఫాస్ట్ ట్యాగ్'తో ప్రయాణ అనుభవం మారిందని ఆమె అంటున్నారు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. టోల్ ప్లాజా దగ్గర ఆపడం, నగదు చెల్లింపు గురించి ఆలోచించడం వంటి సమస్యలు కూడా ముగిశాయి. అపర్ణ గారి మాట కూడా సరైందే. ఇంతకుముందు టోల్ ప్లాజా దగ్గర ఒక్కో వాహనానికి సగటున 7 నుండి 8 నిమిషాలు పట్టేది. కానీ 'ఫాస్ట్ ట్యాగ్' వచ్చిన తరువాత  సగటున కేవలం ఒకటిన్నర- రెండు నిమిషాలు పడుతోంది. టోల్ ప్లాజా వద్ద వేచి ఉండే సమయం తగ్గడం వల్ల వాహనంలో ఇంధనం ఆదా కూడా పెరుగుతోంది. దీనివల్ల దేశ ప్రజలు సుమారు 21 వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తారని అంచనా. అంటే సమయం ఆదా తో పాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ మీ గురించి మీరు జాగ్రత్త పడడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని నేను మీ అందరిని కోరుతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!  "జలబిందు నిపాతేన క్రమశః  పూర్యతే ఘటః" అని ఆర్యోక్తి. అంటే బిందువు, బిందువు కలిసి కుండను నింపుతాయి.  మన ఒక్కో ప్రయత్నం  మన సంకల్పాన్ని పూర్తి చేస్తాయి.  అందువల్ల మనం 2021 లో ప్రారంభించిన లక్ష్యాలను మనమందరం కలిసి నెరవేర్చాలి. కాబట్టి ఈ సంవత్సరాన్ని సార్థకం చేయడానికి మనమందరం కలిసి అడుగులేద్దాం. మీ సందేశాన్ని, మీ ఆలోచనలను  మీరు ఖచ్చితంగా పంపుతూ ఉండండి. వచ్చే నెలలో మరోసారి కలుద్దాం.

          మరో మన్ కీ బాత్ లో కలిసేందుకు ఇప్పుడు వీడ్కోలు చెప్తున్నాను. నమస్కారం..

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg

Media Coverage

5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister urges the Indian Diaspora to participate in Bharat Ko Janiye Quiz
November 23, 2024

The Prime Minister Shri Narendra Modi today urged the Indian Diaspora and friends from other countries to participate in Bharat Ko Janiye (Know India) Quiz. He remarked that the quiz deepens the connect between India and its diaspora worldwide and was also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

He posted a message on X:

“Strengthening the bond with our diaspora!

Urge Indian community abroad and friends from other countries  to take part in the #BharatKoJaniye Quiz!

bkjquiz.com

This quiz deepens the connect between India and its diaspora worldwide. It’s also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

The winners will get an opportunity to experience the wonders of #IncredibleIndia.”