ముందుగా, చెన్నైలోను మరియు తమిళ నాడు లోని ఇతర ప్రాంతాలలోను ఇటీవలి భారీ వర్షాలు, ఇంకా వరదల కారణంగా ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలతో పాటు అనేక బాధలు పడిన ప్రజలకు నేను ప్రగాఢ సంతాపాన్ని మరియు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు సహాయాన్ని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను. అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆర్. మోహన్ కన్నుమూత పట్ల కూడా నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.
‘దిన తంతి’ 75 సంవత్సరాల అద్భుత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది. ఇంతవరకు విజయవంతమైన ప్రస్థానాన్ని చేసినందుకు శ్రీ ఎస్.పి. అదితనార్, శ్రీ ఎస్.టి. అదితనార్, శ్రీ బాలసుబ్రమణియన్ గార్లు కృషిని నేను అభినందిస్తున్నాను. గడచిన 75 సంవత్సరాలుగా వారి అమేయ కృషి ‘తంతి’ని కేవలం తమిళ నాడు లోనే కాక దేశం మొత్తంమీదనే అతి పెద్ద ప్రసార మాధ్యమ సంస్థలలో ఒక సంస్థగా నిలిపాయి. ఈ విజయంలో తమ వంతు పాత్రను పోషించిన తంతి గ్రూపు యాజమాన్యాన్ని, సిబ్బందిని సైతం నేను అభినందిస్తున్నాను.
దేశంలోని కోట్లాది భారతీయులకు ఇవాళ 24 గంటల వార్తా చానళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే, నేటికీ చాలా మంది దిన చర్య ఒక చేతిలో టీ కప్పు లేదా కాఫీ కప్పు, మరో చేతిలో వార్తపత్రిక తోనే మొదలవుతుంది. దిన తంతి ఇవాళ తమిళ నాడుతో పాటు బెంగళూరు, ముంబయి నగరాలలోనేగాక దుబాయ్ సహా మొత్తం 17 ముద్రణ కేంద్రాల ద్వారా ప్రజలకు ఈ వెసులుబాటును కల్పిస్తోందని నాకు తెలిసింది. ఈ 75 ఏళ్ల అద్భుత విస్తరణను 1942లో ఈ పత్రికను ప్రారంభించిన శ్రీ ఎ.పి. అదితనార్ దార్శనిక నేతృత్వానికి నివాళిగా పేర్కొనవచ్చు. ఆ రోజుల్లో పత్రిక ముద్రణ కాగితం అరుదైన వస్తువు. కానీ, ఆ రోజుల్లో గడ్డిని ఉపయోగించి చేత్తో తయారుచేసిన కాగితంపైనే ఆయన పత్రికను ముద్రించడం ప్రారంభించారు.
సరళమైన భాష, తగిన పరిమాణంలో అక్షరాలు, సులభంగా అర్థమయ్యే శైలి వంటివి దిన తంతి కి ఎనలేని ప్రజాదరణను సంపాదించి పెట్టాయి. ఆ రోజుల్లోనే ఈ పత్రిక వారికి రాజకీయ అవగాహన కల్పించడంతోపాటు సమాచారాన్ని చేరువ చేసింది. వార్తాపత్రికను చదవడం కోసం ప్రజలు టీ దుకాణాల వద్ద గుమికూడే వారు. అలా మొదలైన ప్రయాణం నేటికీ కొనసాగుతుండగా అందులోని సమతూకంతో కూడిన వార్తా కథనాలతో రాష్ట్రం లోని దినసరి వేతన జీవి నుండి అత్యున్నత స్థానంలోని రాజకీయ నాయకుడి దాకా పత్రికకు విశేష ప్రాచుర్యం లభించింది.
‘తంతి’ అంటే టెలిగ్రామ్ అని నాకు చెప్పారు.. ఆ మేరకు ‘దిన తంతి’ రోజువారీ టెలిగ్రామ్ అన్నమాట. ఈ 75 సంవత్సరాల కాలంలో తపాలాశాఖ అందజేసే సంప్రదాయక టెలిగ్రామ్ క్రమేణా కనుమరుగవుతూ నేడు ఉనికిలో లేకుండా పోయింది. కానీ, ఈ టెలిగ్రామ్ మాత్రం రోజురోజుకూ ప్రజాదరణను పెంచుకొంటూ ఎదుగుతోంది. కఠోర శ్రమ, సంకల్ప దీక్ష మద్దతు గల ఓ గొప్ప ఆలోచనకు ఉన్న శక్తి ఎంతటిదో దిన తంతి ప్రస్థానమే నిరూపిస్తోంది.
తమిళ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు శ్రీ అదితనార్ పేరిట తంతి గ్రూపు యాజమాన్యం అవార్డును ఏర్పాటు చేసిందని తెలిసి నేను అమితంగా సంతోషించాను. ఈ పురస్కారాన్ని అందుకొంటున్న శ్రీ తమిళన్బన్, డాక్టర్ ఇరైఅన్బు, శ్రీ వి.జి.సంతోషం లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీరికి లభించిన ఈ గుర్తింపుతో గౌరవప్రదమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొన్న వారికి మరింత ఉత్తేజం లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
మహిళలు మరియు సజ్జనులారా,
మానవ జాతి జ్ఞాన జిజ్ఞాస కూడా చరిత్ర లాగానే అత్యంత పురాతనం. ఈ దాహార్తిని తీర్చడానికి పాత్రికేయం తోడ్పడుతుంది. నేటి వార్తాపత్రికలు కేవలం వార్తలివ్వడంతోనే సరిపెట్టడం లేదు. అవి మన ఆలోచన ధోరణిని మలచగలిగినవే కాకుండా మన కోసం ప్రపంచ గవాక్షాన్ని తెరుస్తాయి. విస్తృతార్థంలో చూస్తే పత్రికా మాధ్యమాలంటే పరివర్తన చెందుతున్న సమాజమే. అందుకే ఈ మాధ్యమాన్ని మనం ప్రజాస్వామ్య నాలుగో స్తంభంగా అభివర్ణిస్తుంటాం. ఈ రోజు కలం బలాన్ని ప్రదర్శించే వారి సరసన ఉండడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎంతటి కీలక జీవన శక్తిగా ఉందో, సమాజా చైతన్యకారిగా ఉందో వారు నిత్యం మనకు చూపుతూనే ఉన్నారు.
వలస పాలన చీకటి కాలంలో రాజా రామమోహన్ రాయ్ గారి ‘సంవాద్ కౌముది’, లోక మన్య తిలక్ గారి ‘కేసరి’, మహాత్మగాంధీ గారి ‘నవజీవన్’ ల వంటి ప్రచురణలు కరదీపికలై స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయి. దేశంలో పాత్రికేయానికి మార్గదర్శులుగా వారు వారి జీవిత సౌఖ్యాలను త్యాగం చేశారు. వారు వార్తా పత్రికల ద్వారా సామూహిక చైతన్యానికి, అవగాహన కల్పనకు తోడ్పడ్డారు. అటువంటి సంస్థాపక మార్గదర్శుల ఆదర్శాల వల్లనే కాబోలు.. బ్రిటిషు హయాంలో అనేక వార్తా పత్రికలు స్థాపించబడి, దినదిన ప్రవర్ధమానమై నేటికీ కొనసాగుతున్నాయి.
మిత్రులారా,
దేశం పట్ల, సమాజం పట్ల తాము నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని ఆ తదుపరి తరాలు నెరవేర్చడాన్ని మనం ఎన్నడూ విస్మరించరాదు. అది మనం స్వాతంత్ర్యం సాధించిన విధానం. అటుపైన ప్రజా జీవనంలో పౌర హక్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. దురదృష్టవశాత్తూ కాలక్రమంలో మనం మన వ్యక్తిగత, సామూహిక బాధ్యతలను నిర్లక్ష్యం చేశాం. నేడు సమాజాన్ని పీడిస్తున్న అనేక రుగ్మతలకు ఇది కొంతమేర కారణమైంది. ఇప్పుడిక ‘‘కార్యనిమగ్న, బాధ్యతాయుత, అవగాహన కలిగిన పౌరుల’’ సృష్టి దిశగా సామూహిక అవగాహన కల్పించాల్సిన తరుణం ఆసన్నమైంది. ‘హక్కు’ విషయంలో గల పౌర అవగాహన ‘బాధ్యతయుత కార్యాచరణ’పై పౌర అవగాహనతో సముచిత సమతూకం ఉండాలి. ఇది మన విద్యావ్యవస్థ మరియు రాజకీయ నాయకుల నియతి ల ద్వారానే సాధ్యమన్నది వాస్తవమే. అయితే, ఈ కృషిలో ప్రసార మాధ్యమాలు కూడా కీలకమైన పాత్రను పోషించవలసి ఉంది.
మహిళలు మరియు సజ్జనులారా,
అనేక వార్తాపత్రికలు స్వాతంత్ర్యం దిశగా ప్రజాభిప్రాయాన్ని మలచగా, వాటిలో వివిధ భాషల పత్రికలు ఉన్నాయి. వాస్తవానికి విభిన్న భాషల భారత పత్రికా ప్రపంచం అంటే బ్రిటిషు ప్రభుత్వానికి భయమే. కాబట్టే వాటిని అణచివేయడం కోసం 1878లో ‘విభిన్న భాషా పత్రికల చట్టాన్ని’ తీసుకువచ్చింది. వైవిధ్యభరిత భారతదేశంలో భాషా పత్రికల- ప్రాంతీయ భాషలలో ప్రచురితమయ్యే వార్తాపత్రికల పాత్రకు ఆనాటి తరహా లోనే నేటికీ అదే ప్రాముఖ్యం ఉంది. ప్రజలు సులభంగా అర్థం చేసుకోగల భాషతో అవి సమాచారాన్ని అందించేవి. ఈ కర్తవ్యంలో భాగంగా తరచుగా బలహీనవర్గాల, అణగారిన సామాజిక వర్గాల పక్షం వహించేవి. అందువల్ల వాటి బలాన్ని, ప్రభావాలనే గాక వాటి బాధ్యతను కూడా ఎన్నడూ తక్కువగా అంచనా వేయడం సాధ్యం కాదు. అవి సుదూర ప్రాంతాల సమాచారంతో పాటు ప్రభుత్వ ఉద్దేశాలను, విధానాలను ప్రజల్లోకి తెచ్చే వార్తాహరులు. అదే సమయంలో అవి మన ప్రజల ఆలోచనలను, భావాలను, ఉద్వేగాలను స్పష్టంగా చూపించే మార్గదర్శులు. ఉత్తేజకర పాత్రికేయ ప్రపంచంలో అత్యంత అధిక ప్రజాదరణగల పత్రికలు కొన్ని ప్రాంతీయ భాషలలోనే ప్రచురితం అవుతున్న నేపథ్యంలో వాటిలో ఒకటిగా ‘దిన తంతి’ ఉండడం విశేషం.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా నిత్యం సంభవించే పరిణామాలన్నీ ఒక వార్తాపత్రికలో ఎలా ఇమిడిపోతున్నాయా అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారని నేను విన్నాను. నిశితంగా గమనిస్తే ఈ భూగోళం మీద ప్రతిరోజూ ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే, వీటిలో అత్యంత ముఖ్యమైనవేవో సంపాదకులు నిర్ణయిస్తారు. ముఖపత్ర కథనాలుగా వేటిని ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. దేనికి ఎంత స్థలం కేటాయించాలో, దేన్ని వదలివేయాలో కూడా వారే తేలుస్తారు. ఇది ఎంతో గొప్ప బాధ్యతాయుతమైనటువంటి విధి నిర్వహణ. ప్రజాహితం దృష్ట్యా సంపాదకత్వ స్వేచ్ఛను ఎంతో వివేకంతో వినియోగించాలి. అలాగే ఏం రాయాలో, ఏం రాయించాలో కూడా నిర్ణయించే స్వేచ్ఛ అలాంటిదే. ఆ స్వేచ్ఛ ‘‘కచ్చితమైనదాని కన్నా తక్కువగా’’ లేదా ‘‘వాస్తవం కన్నా తప్పుగా’’ ఉండరాదని మహాత్మ గాంధీ గారు స్వయంగా చెప్పారు. ‘‘పత్రికలను నాలుగో స్తంభంగా పిలుస్తారు. అది కచ్చితంగా ఓ శక్తే.. కానీ, దానిని దుర్వినియోగం చేయడం నేరం.’’
పత్రికా, ప్రసార వ్యవస్థల నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల చేతులలో ఉన్నప్పటికీ, అది ప్రజా శ్రేయస్సుకు తోడ్పడుతుంది. మేధావులు చెప్పినట్లు బలప్రయోగంతో కాకుండా శాంతిమార్గంలో సంస్కరణలను తెచ్చే ఒక ఉపకరణం ఇది. అందువల్ల ఎన్నికైన ప్రభుత్వంతో, న్యాయ వ్యవస్థతో సమానంగా దానికీ సామాజిక జవాబుదారీతనం మరింతగా ఉంది. అలాగే దాని ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలి. ప్రసిద్ధ సాధువు తిరు వళ్లువార్ మాటలలో చెప్పాలంటే, ‘‘ఈ ప్రపంచంలో ప్రాముఖ్యాన్ని, సంపదను సమానంగా తెచ్చిపెట్టగలిగింది నైతికత కన్నా మరొకటి ఏదీ లేదు’’.
మిత్రులారా,
సాంకేతిక విజ్ఞానం ప్రసార మాధ్యమాలలో పెను మార్పులను తీసుకువచ్చింది. ఒకనాడు గ్రామంలోని నల్ల బల్లపై పత్రికల పతాక శీర్షికలను రాసిన రోజులు ఉన్నాయి. వాటికి ఎంతో ప్రాధాన్యం కూడా ఉండేది. ఇవాళ నల్లబల్లల నుండి ఆన్ లైన్ బులెటిన్ బోర్డు దాకా మన మీడియా విస్తరించింది. ప్రస్తుతం విద్యావ్యవస్థలో అభ్యాస ఫలితాలపై దృష్టి సారించిన తరహా లోనే సారాంశ వినియోగంపై మన దృక్పథం కూడా మారింది. ఇవాళ పౌరులంతా విశ్లేషణలలో, చర్చల్లో పాల్గొనడంతో పాటు వారికి చేరుతున్న వార్తలను బహుళ వనరుల ద్వారా పరిశీలించి లోతుగా తనిఖీ చేసుకొంటున్నారు. కాబట్టి మీడియా తన విశ్వసనీయతను కొనసాగించాలంటే అదనపు జాగ్రత్తలను తీసుకోవడం అవసరం. విశ్వసనీయ మీడియా సంస్థల మధ్య ఆరోగ్యకరమైనటువంటి స్పర్థ కూడా ప్రజాస్వామ్యం యొక్క మనుగడకు ఎంతో మేలు చేస్తుంది. విశ్వసనీయతకు పెరిగిన ప్రాధాన్యం ఆత్మశోధన అంశాన్నీ మన ముందుకు తెచ్చింది. మీడియాలో సంస్కరణలన్నవి తరచూ ఆత్మశోధన ద్వారా అంతర్గతంగానే వస్తాయన్నది నా విశ్వాసం. కొన్ని సందర్భాల్లో ఆత్మశోధన ప్రక్రియను మనం చూస్తుంటామన్నది వాస్తవమే. ముంబయిపై ఉగ్రవాదుల 26/11 దాడుల తాలూకు విశ్లేషణ అటువంటి ఆత్మశోధనలలో ఒకటి. ఇటువంటిది తరచూ సాగుతుండాలన్నది నా అభిప్రాయం.
మిత్రులారా,
మన ప్రియతమ పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ గారి మాట ఒకటి నాకు గుర్తుకువస్తోంది… ‘‘మనది ఎంతో గొప్ప దేశం. మనకు ఎన్నో విజయ గాథలు ఉన్నాయి. కానీ, వాటిని మనం గుర్తించడానికి నిరాకరిస్తున్నాం. ఎందుకని ?’’ నా పరిశీలన మేరకు, ఇవాళ మీడియా సమాచారంలో చాలావరకు రాజకీయాల చుట్టూనే తిరుగుతోంది. అయితే, ప్రజాస్వామ్యంలో స్వచ్ఛమైన రాజకీయాలపై మాత్రమే సుదీర్ఘ చర్చ సాగాలి. భారతదేశమంటే మాలాంటి రాజకీయ నాయకుల కన్నా ప్రాధాన్యం గలది. భారతదేశమంటే 125 కోట్ల మంది భారతీయులు. కాబట్టి వారిపై ప్రసార మాధ్యమాలు ఎక్కువగా దృష్టి సారించి, వారి విజయాలకు ప్రాముఖ్యమిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఈ కృషిలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి పౌరుడూ మీకు స్నేహితుడే. వ్యక్తుల విజయ గాథల భాగస్వామ్యం, వినిమయంలో పౌర పాత్రికేయులు ఒక ముఖ్యమైన ఉపకరణం కాగలరు. ప్రకృతి విపత్తులు, సంక్షోభ సమయాల్లో రక్షణ, సహాయ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడానికి వారెంతగానో తోడ్పడగలరు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రసార మాధ్యమాలు సాధారణంగా దానికి సంబంధించిన అనేక అంశాలను ముందుకు తెస్తూంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల రాకడ, తీవ్రత బాగా పెరిగిపోతోంది. మనలో ప్రతి ఒక్కరికీ వాతావరణ మార్పు పెను సవాలు విసురుతోంది. దీనిపై పోరాటంలో మీడియా ముందుండి నడపలేదా? జలవాయు పరివర్తన పోరును గురించి నివేదించేందుకు, చర్చించేందుకు లేదా అవగాహన పెంచేందుకు పత్రికలలో కాస్త స్థలాన్ని మీడియా కేటాయించలేదా ? లేక, ప్రసారాల్లో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించలేదా ?
స్వచ్ఛభారత్ మిషన్ విషయంలో మీడియా ప్రతిస్పందనను కొనియాడేందుకు నేను ఈ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాను. మహాత్ముని 150వ జయంతి నాటికి అంటే 2019 కల్లా మనం స్వచ్ఛ భారత్ ను సాధించేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో మీడియా పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్ర నా హృదయాన్ని స్పర్శించింది. ఆ మేరకు పరిశుభ్రతపై సామూహిక చైతన్యాన్ని, అవగాహనను సృష్టించడంలో అనుపమానంగా కృషి చేస్తోంది. మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇంకా చేయవలసిన దానిని గురించి కూడా గుర్తుచేస్తోంది.
మహిళలు మరియు సజ్జనులారా,
మీడియా కీలక పాత్రను పోషించవలసిన అంశం మరొకటి ఉంది. అదే ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’. దీనికో ఉదాహరణ చెబుతాను…
ఈ లక్ష్యం కోసం ఏడాది పాటు వార్తాపత్రికలు రోజూ కొన్ని సెంటీమీటర్ల స్థలం కేటాయించగలవా ? ప్రతి రోజూ వారు ఓక సరళమైన నినాదాన్ని తమ తమ భాషలలో ప్రచురించవచ్చు. అవసరమైతే దాన్ని అన్ని ప్రధాన భాషల్లో అనువదించి కూడా ప్రచురించవచ్చు.
సంవత్సరం చివరలో సదరు పత్రిక పాఠకులకు అన్ని భారతీయ భాషలలో అటువంటి 365 వాక్యాలు తగిన అవగాహన కల్పించగలవు. ఈ సరళమైన చర్య సృష్టించే సానుకూల ప్రభావాన్ని ఒక్కసారి ఊహించండి. అలాగే పాఠశాలల్లో విద్యార్థులు దీనిపై రోజూ కాసేపు చర్చించేలా చేయవచ్చు. దీనివల్ల పిల్లలు కూడా మన వైవిధ్యం, బలంలో గల సుసంపన్నతను అర్థం చేసుకోగలుగుతారు. ఆ విధంగా ఈ చర్య ఒక గొప్ప లక్ష్యం కోసం ఉపయోగపడటమేగాక పత్రికను కూడా బలోపేతం చేస్తుంది.
మహిళలు మరియు సజ్జనులారా,
మానవ జీవితంలో 75 సంవత్సరాలంటే గణనీయ సుదీర్ఘ కాలమే. కానీ, ఒక దేశం లేదా సంస్థ విషయంలో అదొక ముఖ్యమైన మైలురాయి మాత్రమే. సుమారు 3 నెలల కిందటనే మనం స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమైన క్విట్ ఇండియా ఉద్యమ 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకొన్నాం. ఒక విధంగా దిన తంతి ప్రస్థానం భారతదేశం ఒక యువ, ఉత్తేజకర జాతిగా ఎదగడాన్ని ప్రతిబింబించింది.
ఆ రోజున నేను పార్లమెంటులో ప్రసంగిస్తూ- 2022కల్లా ఒక న్యూ ఇండియా ను సృష్టిద్దామంటూ పిలుపునిచ్చాను. అవినీతి, కులతత్వం, మతతత్వం, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితరాల నుండి భారతదేశం విముక్తం కావాలన్నది నా ఆకాంక్ష. ఆ మేరకు రాబోయే ఐదేళ్లూ ‘సంకల్ప్ సే సిద్ధి’.. దృఢ నిశ్చయంతో విజయ సాధన కృషి సాగాలి. అప్పుడు మాత్రమే మన స్వాతంత్ర్య సమర యోధులు కలలుగన్న భారతదేశాన్ని మనం సాకారం చేయగలుగుతాం. మన దేశం క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు పుట్టిన ‘దిన తంతి’ ఈ విషయంలో ఒక ప్రత్యేక బాధ్యతను స్వీకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా వినతికి స్పందించి మీ పాఠకుల కోసం, దేశ ప్రజల కోసం రాబోయే అయిదు సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొంటారని ఆశిస్తున్నాను.
రాబోయే ఐదేళ్లలో సాధించే లక్ష్యం కన్నా మరో 75 ఏళ్ల కాలం ఎలా ఉండబోతోందన్నది కూడా ఈ ప్లాటినమ్ జూబిలీ వేళ ‘తంతి’ యోచించాలి. తాజా సమాచారం తక్షణం వేలికొసల మీదకు వచ్చి వాలే ఈ రోజుల్లో సమకాలీనతను నిలబెట్టుకొంటూ దేశ ప్రజలకు ఎలా సేవ చేయాలంటే ఉత్తమ మార్గం ఏది ? ఆ విధంగా చేయడంలో అత్యున్నత ప్రమాణాలను, వృత్తిసామర్థ్యాన్ని, నైతికతను, వాస్తవికతను కూడా కొనసాగించడం అవశ్యం.
చివరగా, తమిళ నాడు ప్రజలకు సేవ చేయడంలో దిన తంతి ప్రచురణకర్తల కృషిని నేను మరోసారి కొనియాడుతున్నాను. మన ఘనమైన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు నిర్మాణాత్మకంగా తోడ్పడడాన్ని కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
Today, newspapers do not just give news. They can also mould our thinking & open a window to the world. In a broader context, media is a means of transforming society. That is why we refer to the media as the fourth pillar of democracy: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 6, 2017
The then British Government was fearful of the Indian Vernacular Press. It was to muzzle vernacular newspapers, that the Vernacular Press Act was enacted in 1878. The role of newspapers published in regional languages remains as important today, as it was then: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 6, 2017
I have often heard people wonder, as to how the amount of news that happens in the world every day always just exactly fits the newspaper: PM @narendramodi on a lighter note.
— PMO India (@PMOIndia) November 6, 2017
Editorial freedom must be used wisely in public interest. The freedom to write, does not include the freedom to be 'factually incorrect'. Mahatma Gandhi said: “The press is called the Fourth Estate. It is definitely a power, but, to misuse that power is criminal.": PM Modi
— PMO India (@PMOIndia) November 6, 2017
Even though media may be owned by private individuals, it serves a public purpose. As scholars say, it is an instrument to produce reform through peace, rather than by force. Hence, it has as much social accountability as the elected government or the judiciary: PM Modi
— PMO India (@PMOIndia) November 6, 2017
Today, every citizen analyses & attempts to verify the news that comes to him through multiple sources. Media, therefore, must make an extra effort to maintain credibility. Healthy competition among credible media platforms is also good for the health of our democracy: PM Modi
— PMO India (@PMOIndia) November 6, 2017
A lot of the media discourse today revolves around politics. However, India is more than just us politicians. It is the 125 crore Indians, which make India what it is. I would be happy to see media focus a lot more, on their stories, and their achievements: PM Modi
— PMO India (@PMOIndia) November 6, 2017
Natural calamities seem to be occurring with increasing frequency across the world. Can media take a lead in the battle against climate change? Can media devote just a little space to report or increase awareness about what we can do to combat climate change?: PM Modi
— PMO India (@PMOIndia) November 6, 2017