ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు వారి యొక్క ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనంలో 2018 మే 21వ తేదీ నాడు రష్యన్ ఫెడరేశన్ లోని సోచీ నగరంలో జరిపారు. ఇరువురు నాయకులకు వారి మైత్రి ని గాఢతరం చేసుకొనేందుకు మరియు భారతదేశానికి, రష్యా కు మధ్య నెలకొన్న ఉన్నత స్థాయి రాజకీయ సంబంధ ఆదాన ప్రదానాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రాంతీయ అంశాల పట్ల, అంతర్జాతీయ అంశాల పట్ల ఒకరి అభిప్రాయాలను మరొకరికి చాటిచెప్పుకొనేందుకు ఈ శిఖర సమ్మేళనం ఒక అవకాశాన్ని ప్రసాదించింది.
ప్రపంచ శాంతి కి, ఇంకా స్థిరత్వానికి భారతదేశం మరియు రష్యా ల మధ్య ఉన్న ప్రత్యేకమైనటువంటి, విశేషాధికారాలతో కూడినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక ముఖ్య కారణాంకంగా ఉన్నదని ఉభయ నేతలు ఒప్పుకొన్నారు. బహిరంగమైనటువంటి మరియు న్యాయబద్ధమైనటువంటి ప్రపంచ క్రమానికి తోడ్పాటును అందించడంలో భారతదేశం మరియు రష్యా ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించవలసి వుందనే అభిప్రాయాన్ని వారు ఉమ్మడిగా వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి ని మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడం కోసం సమష్టి బాధ్యతలు కలిగిన ప్రధాన శక్తులుగా రెండు పక్షాలు వాటి వాటి పాత్రలను నిర్వహించవలసివుందని ఈ సందర్భంగా వారు గుర్తించారు.
ప్రధాన అంతర్జాతీయ అంశాలపైన నాయకులు ఇరువురూ కూలంకష చర్చలు జరిపారు. బహుళ ధృవ ప్రపంచ క్రమాన్ని నిర్మించడానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యం పైన వారు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇండో- పసిఫిక్ రీజియన్ తో సహా ఒక పక్షంతో మరొక పక్షం సంప్రదింపులను, ఇంకా సమన్వయాన్ని తీవ్రీకరించుకోవాలని వారు నిర్ణయించారు. ఐక్యరాజ్య సమితి, ఎస్‌సిఒ, బిఆర్ఐసిఎస్, ఇంకా జి-20 ల వంటి బహుముఖీన సంస్థల ద్వారా కలసి పని చేయడాన్ని కొనసాగించాలని కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు అధ్యక్షులు శ్రీ పుతిన్ అంగీకరించారు.
ఉగ్రవాదం మరియు సమూల సంస్కరణవాదం.. ఈ అంశాలపై నేతలు ఇరువురూ వారి ఆందోళన ను వ్యక్తం చేశారు. ఉగ్రవాదం పై దాని యొక్క అన్ని రూపాలతో మరియు వ్యక్తీకరణాలతో పోరాడాలని కృత నిశ్చయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అఫ్గానిస్తాన్ లో- ఉగ్రవాదపు బెదరింపునకు చోటు ఉండనటువంటి వాతావరణంలో- శాంతిని, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి మరియు ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కలసి పని చేయడానికి ఏకీభవించారు.
జాతీయ అభివృద్ధి ప్రణాళికలపైన మరియు ప్రాథమ్యాలపైన ఒకరి అభిప్రాయాలను మరొకరు సమగ్రంగా తెలియజెప్పుకొన్నారు. భారతదేశం మరియు రష్యా ల మధ్య సంబంధాలను నిర్వచిస్తున్న ప్రగాఢ విశ్వాసం, పరస్పర ఆదరణ మరియు సద్భావనల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. 2017 జూన్ లో సెంట్ పీటర్స్‌బర్గ్ లో కడపటి ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం జరిగిన నాటి నుండి చోటు చేసుకొన్న సకారాత్మక కదలిక పట్ల వారు సంతృప్తి ని వెలిబుచ్చుతూ, ఈ సంవత్సరం లో భారతదేశం లో జరుగవలసి ఉన్న శిఖర సమ్మేళనానికై నిర్దిష్ట ఫలితాలను అందించే విధంగా సన్నాహాలు చేయవలసిందిగా తమ తమ అధికారులను నేతలు ఇరువురూ ఆదేశించారు.
పెట్టుబడిలో, వ్యాపారంలో మరింత ఎక్కువ సమన్వయాన్ని సాధించడానికి ఉన్నటువంటి అవకాశాలను గుర్తించేందుకు భారతదేశానికి చెందిన నీతి ఆయోగ్ కు మరియు రష్యన్ ఫెడరేశన్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డివెలప్‌మెంట్ కు మధ్య ఒక వ్యూహాత్మక, ఆర్థిక చర్చ ను చేపట్టాలని నేతలు ఇరువురూ సమ్మతించారు. శక్తి రంగంలో సహకారం విస్తరించడం పట్ల వారు సంతృప్తి ని చాటారు. ఈ సందర్భంగా గేజ్‌ప్రోమ్ మరియు గేల్ ల మధ్య ఒక దీర్ఘ కాల ఒప్పందంలో భాగంగా ఎల్ఎన్‌జి యొక్క ఒకటో కన్‌సైన్‌మెంట్ వచ్చే నెలలో చేరుకోనుండడాన్ని వారు స్వాగతించారు. సైనిక రంగం, భద్రత రంగం, ఇంకా పరమాణు శక్తి రంగాలలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి గల ప్రాముఖ్యాన్ని నేతలు ఇరువురూ పునరుద్ఘాటించారు. ఆయా రంగాలలో ప్రస్తుతం సహకారం కొనసాగుతూ ఉండడాన్ని వారు హర్షించారు.
రెండు పక్షాల నేతల మధ్య వార్షిక శిఖర సమ్మేళనాలకు తోడు ఒక అదనపు ఏర్పాటు గా లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనాలను నిర్వహించుకోవాలనే ఆలోచనను ఇరువురు నాయకులు ఆహ్వానించారు.
ఈ సంవత్సరం లోనే భారతదేశం లో జరుగనున్న 19వ వార్షిక శిఖర సమ్మేళనానికి తరలిరావలసిందంటూ అధ్యక్షులు శ్రీ పుతిన్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.