జవాబిచ్చే హక్కు కింద భారత్ సమాధానం
గౌరవనీయ అధ్యక్షా,
పాకిస్థాన్ ప్రధానమంత్రి చేసిన ప్రకటనపై భారతదేశానికిగల జవాబిచ్చే హక్కును ఈ వేదికనుంచి నేను వినియోగించుకుంటున్నాను.
2. అత్యంత విశిష్టమైన ఈ సమావేశ వేదికపైనుంచి మాట్లాడే ప్రతి పదం చరిత్రకు సాక్షీభూతంగా నిలిచేదేనన్న విశ్వాసం జగద్విదితం. దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముఖతా ఇవాళ మనం విన్నదంతా- మేము-వారు; ధనిక-పేద; ఉత్తరం-దక్షిణం; అభివృద్ధి చెందిన-వర్ధమాన; ముస్లిం-ముస్లిమేతర అంటూ ప్రపంచాన్ని రెండుగా చిత్రించే మొండివాదన. అది ఐక్యరాజ్యసమితి సమక్షంలో విచ్ఛిన్నాన్ని ప్రేరేపించేలా ముందుగానే సిద్ధం చేసుకున్న రాతప్రతి. విభేదాలను రెచ్చగొట్టి, ద్వేషాన్ని ఎగదోసే ప్రయత్నాల్లో భాగమే.. ఒక్కమాటలో చెబితే అదొక ‘విద్వేష ప్రసంగం.’
3. ప్రతిస్పందించేందుకు లభించిన అవకాశాన్ని ఇలా అనుచితంగా… వాస్తవానికి దుర్భాషతో దుర్వినియోగం చేయడమన్నది సర్వసభ్య సమావేశం వేదికపై బహుశా అరుదు. దౌత్యంలో మాటలకు చాలా విలువుంటుంది. కానీ- ‘జనహననం’, ‘రక్తపాతం’, ‘జాత్యహంకారం’, ‘తుపాకీ పట్టడం’, ‘తుదకంటా పోరు’ ఇత్యాది పదబంధ ప్రయోగం మధ్యయుగాలనాటి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందే తప్ప 21వ శతాబ్దపు ధార్శనికత అనిపించుకోదు.
4. అణు విధ్వంసం తప్పదంటూ ప్రధాని ఖాన్ బెదిరించడం యుద్ధోన్మాదమే తప్ప రాజనీతిజ్ఞత ఎంతమాత్రం కాబోదు.
5. ఉగ్రవాదమనే పరిశ్రమను పెంచి పోషించడంలో గుత్తాధిపత్యంగల దేశాధినేత ముఖతా వినిపించినప్పటికీ ప్రధాని ఖాన్ ఉగ్రవాదాన్ని సమర్థించడం కచ్చితంగా సిగ్గుచేటు మాత్రమేగాక అగ్గిరాజేయడమే అవుతుంది.
6. ఒకప్పటి క్రికెటర్, పెద్దమనుషుల ఆటను విశ్వసించిన ఓ క్రీడాకారుడి నేటి ప్రసంగం నామమాత్రంగా మిగిలిన ఒకనాటి దర్రా ఆదమ్ ఖేల్ ప్రాంత క్రూర తుపాకీ భాష తరహాలో సాగింది.
7. అలాంటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్థాన్‘లో ఉగ్రవాద సంస్థలు లేవన్నట్లుగా తనిఖీకి రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి పరిశీలకులను ఆహ్వానించడం చిత్రం. అదే నిజమైతే ఆ వాగ్దానానికి కట్టుబడాల్సిందిగా ప్రపంచం ఆయనను డిమాండ్ చేస్తుంది.
8. అయితే, ఆ ప్రతిపాదిత తనిఖీకి ముందుగా పాకిస్థాన్ మేం సంధించే కొన్ని ప్రశ్నలపై స్పందించవచ్చు.
• ఐక్యరాజ్య సమితి ఇప్పటిదాకా ముద్రవేసిన 130 మంది ఉగ్రవాదులకు, ఐక్యరాజ్య సమితి ప్రకటిత 25 ఉగ్రవాద సంస్థలకు తమ భూభూగమే నెలవనే నిజాన్ని పాకిస్థాన్ నిర్ధారించగలదా?
• అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ సభ్యుడుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన, దాయిష్ సంస్థపై విధించిన ఆంక్షల జాబితాలో నమోదైన వ్యక్తికి పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో తమదేనని పాకిస్థాన్ అంగీకరించగలదా?
• ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నందుకుగాను లక్షలాది డాలర్ల జరిమానా విధించాక పాకిస్థాన్ దేశానికి చెందిన అగ్రశ్రేణి బ్యాంకు అయిన హబీబ్ బ్యాంకు న్యూయార్క్ శాఖ ఎందుకు మూతపడిందో పాకిస్థాన్ వివరణ ఇవ్వగలదా?
• ఆర్ధిక కార్యాచరణ బృందం నిర్దేశించిన 20 నుంచి 27 కీలక పరామితులను ఉల్లంఘించినందుకుగాను నోటీసులు జారీ అయ్యాయన్న నిజాన్ని పాకిస్థాన్ నిరాకరించగలదా?
• ఒసామా బిన్ లాడెన్‘ను తాను బాహాటంగా సమర్థించడాన్ని ప్రధాని ఖాన్ న్యూయార్క్ నగరవాసుల సమక్షంలో నిరాకరించగలరా?
గౌరవనీయ అధ్యక్షా,
9. ఉగ్రవాదాన్ని ప్రధాన స్రవంతిగా కొనసాగించడంతోపాటు ఇవాళ విద్వేష ప్రసంగం చేసిన పాకిస్థాన్ నేటి ఈ అవకాశాన్ని తననుతాను మానవహక్కుల దూతకు కొత్త అవతారంగా ప్రదర్శించుకునేందుకు తాపత్రయపడుతోంది.
10. తమ భూభాగంలో 1947నాటికి అల్పసంఖ్యాక వర్గాలు 23శాతం కాగా, నేడు వారిని 3 శాతానికి అణగదొక్కిందీ దేశం. అంతేకాకుండా క్రైస్తవులు, సిక్కులు, అహమ్మదీయులు, హిందువులు, షియాలు, పష్తూన్లు, సింధీలు, బలోచీల వంటి మైనారిటీ వర్గాలపై క్రూరమైన దైవదూషణ చట్టాలను రూపొందించి వాటిని దారుణంగా దుర్వినియోగం చేయడంతోపాటు భౌతికంగానూ వారిని హింసించింది. దీనికితోడు బలవంతపు మతమార్పిడులకు పాల్పడింది.
11. మానవహక్కులను ప్రబోధిస్తున్న వారి కొత్త అవతారాన్ని చూస్తుంటే హిమాలయాల్లో అంతరించిపోతున్న కొండగొర్రెను వేటాడే వేటగాడిని తలపిస్తోంది.
12. మానవ హతకులు, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నియాజీ నేటి శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం తగరు. ఈ నేపథ్యంలో చరిత్రను అర్థం చేసుకోవడంలో మీ అవగాహనలేమిని ప్రక్షాళన చేసుకోవాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. పాకిస్థాన్ 1971లో తమ సొంత ప్రజలపై సాగించిన దారుణ మానవ హననాన్ని, నాటి లెఫ్టినెంట్ జనరల్ ఎ.ఎ.కె.నియాజీ పోషించిన పాత్రను మరచిపోకండి. ఈ కఠోర వాస్తవాన్ని గౌరవనీయ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా ఈ మధ్యాహ్నం సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగం సందర్భంగా గుర్తుచేశారు.
గౌరవనీయ అధ్యక్షా,
13. భారతదేశంలో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రగతి, సమగ్రతలకు అవరోధంగా నిలిచిన ఓ కాలంచెల్లిన, తాత్కాలిక నిబంధనను భారత్ రద్దుచేసినపుడు పాకిస్థాన్ విద్వేషపూరితంగా ప్రతిస్పందించింది. నిత్య సంఘర్షణను కోరుకునేవారు లేశమాత్రం శాంతికిరణాన్నయినా సహించలేరనడానికి అది నిదర్శనంగా నిలిచింది.
14. అయితే, పాకిస్థాన్ ఇటు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, విద్వేష ప్రసంగాలు చేస్తుంటే అటు భారత్ మాత్రం జమ్ముకశ్మీర్ ప్రగతిని ప్రధాన స్రవంతిలోకి తీసుకెళ్లడం ప్రారంభించింది.
15. శతాబ్దాలనాటి వారసత్వం-వైవిధ్యం, బహుపాక్షికత, సహనశీలతల సమ్మేళనమై శక్తిమంతంగా వర్ధిల్లుతున్న భారత ప్రజాస్వామ్యంలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్‘లను ప్రధాన స్రవంతిలోకి తీసుకెళ్లే ప్రయత్నం బహుచక్కగా, వాస్తవికంగానేగాక తిరుగులేని రీతిలోనూ కొనసాగుతోంది.
16. తమ తరఫున మాట్లాడటం కోసం భారతీయ పౌరులకు ఎవరి సాయమూ అక్కర్లేదు. అందునా విద్వేష సిద్ధాంతంతో ఉగ్రవాద పరిశ్రమను నడిపేవారి తోడ్పాటు అస్సలు అవసరమే లేదు.
గౌరవనీయ అధ్యక్షా… మీకు నా కృతజ్ఞతలు.
Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.
Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.