ఆత్మనిర్భర్ భారత్ కు సంబంధించిన అతి పెద్ద పరివర్తన సహజ ప్రవృత్తి, క్రియాశీలత, ప్రతి క్రియల పరిధి లోనే ఇమిడిపోయి ఉందని, ఇది నేటి యువత మానసికావస్థ కు తగినది గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారం అసమ్ లో తేజ్ పుర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తూ, ఈ మాటలు అన్నారు.
ఆత్మనిర్భర్ భావన ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఉద్యమం వనరులు, భౌతిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక శక్తి, వ్యూహాత్మక శక్తి లలో మార్పు ను తీసుకు రావడానికి సంబంధించిందని, అతి పెద్ద పరివర్తన సహజ ప్రవృత్తి, క్రియాశీలత, ప్రతిక్రియ ల తాలూకు పరిధిలో ఇమిడిపోయివుందని, అది నేటి యువత మానసికావస్థ కు తగినది గా ఉందని ఆయన విడమర్చి చెప్పారు.
నేటి యువ భారతదేశం సవాళ్ల ను స్వీకరించడం లో ఓ ప్రత్యేకమైనటువంటి పంథా ను కలిగివుందని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన తాను చెప్పదలచుకొన్న అంశాన్ని సోదాహరణం గా చెప్పడానికి ఆస్ట్రేలియా లో ఇటీవల యువ భారత క్రికెట్ జట్టు కనబరచిన ఆటతీరు ను గురించి ప్రస్తావించారు. వారు అవమానకరమైన ఓటమి ని ఎదుర్కొన్నారు, అయినప్పటికీ కూడా అంతే వేగం గా పుంజుకొని తరువాతి పోటీ ని గెల్చుకొన్నారు. క్రీడాకారులు గాయాల బారిన పడ్డప్పటికీ దృఢనిశ్చయాన్ని చాటారు. వారు సవాలు తో తలపడి, క్లిష్ట స్థితులలో నిస్పృహ కు లోనవడానికి బదులు సరికొత్త పరిష్కారాల కోసం వెతికారు. అనుభవం లేనటువంటి ఆటగాళ్లు జట్టు లో ఉన్నారు, అయినా కానీ వారి ధైర్యం ఉన్నతమైంది గా ఉండింది, మరి వారు వారికి ఇచ్చిన అవకాశాన్ని చక్క గా వినియోగించుకొన్నారు. వారు వారి ప్రతిభ తోను, వారి వ్యక్తిత్వం తోను ఒక మెరుగైనటువంటి జట్టు పైన పైచేయి ని సాధించారని ప్రధాన మంత్రి అన్నారు.
మన క్రీడాకారులు కనబరచిన ఈ విధమైన గొప్ప ప్రదర్శన ఒక్క క్రీడా రంగ దృష్టి కోణం పరంగానే ముఖ్యమైంది కాదని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ ప్రదర్శన తాలూకు ముఖ్యమైనటువంటి జీవిత పాఠాల ను శ్రీ మోదీ ఒక్కటొక్కటి గా వివరించారు. ఒకటోది, మనం మన సామర్ధ్యం పట్ల నమ్మకాన్ని కలిగివుండాలనే పాఠం; రెండోది, మన దృక్పథం సకారాత్మకం గా ఉంటే సకారాత్మక ఫలితాలు వస్తాయనే పాఠం; మూడో అంశం, మరింత ముఖ్యమైనటువంటి పాఠం అని ప్రధాన మంత్రి అన్నారు. అది ఏమిటి అంటే, ఎవరికైనా రెండు ఐచ్ఛికాలు ఎదురైనప్పుడు, వాటిలో ఒకటోది భద్రమైంది గా ఉండి, మరొకటి కష్టమైన గెలుపు అయినప్పుడు.. ఆ వ్యక్తి ఖచ్చితం గా విజయం తాలూకు ఐచ్ఛికాన్నే అన్వేషించి తీరాలి. ఒక్కొక్క సారి విఫలం కావడం లో ఎలాంటి హాని ఉండదు. మరి ఎవరైనా కష్టమైన పనులను చేపట్టకుండా ఊరుకోకూడదు కూడాను. మనం ఏదైనా సంభవించే వరకు వేచి ఉండి అది జరిగిన తరువాత దాని పట్ల ప్రతిస్పందించడం కంటే, ఏదో ఒకటి చేసి సదరు పరిస్థితి ని అదుపులోకి తీసుకు రావలసిన అవసరం ఉంది. మనం గనుక ఓటమి తాలూకు భయాన్ని , అనవసర ఒత్తిడి ని అధిగమించగలిగితే, మనం నిర్భయత్వాన్ని సంతరించుకొంటాం అని ఆయన అన్నారు. ఈ ‘న్యూ ఇండియా’- ఏదైతే లక్ష్యాల పట్ల సమర్పణ భావాన్ని కలిగి ఉండి, విశ్వాసం తొణికిసలాడుతోందో- అది క్రికెట్ మైదానం లో మాత్రమే ప్రస్ఫుటం కావడమే కాకుండా ఈ సన్నివేశం లో మీరందరూ భాగస్తులే అని విద్యార్థులతో ప్రధాన మంత్రి చెప్పారు.