భారత రాష్ట్రపతి మాన్య శ్రీ రామ్ నాధ్ కోవింద్ గారు ఆహ్వానించిన మీదట వియత్ నామ్ సమాజవాది గణతంత్రం అధ్యక్షులు మాన్య శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్, ఆయన సతీమణి భారతదేశంలో మార్చి నెల 2వ తేదీ నుండి 4 వ తేదీ వరకు పర్యటించారు. ఈ పర్యటనలో వియత్ నామ్ అధ్యక్షుల వారితో పాటు ఆ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి అధికార ప్రతినిధి వర్గం భాగమయ్యారు. వియత్ నామ్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఫామ్ బిన్ మిన్, వివిధ మంత్రిత్వ శాఖల అధినేతలు, పలు ప్రావిన్సుల నేతలు, పెద్ద సంఖ్యలో వ్యాపారులు అధ్యక్షుల వారి వెంట ఈ పర్యటనకు విచ్చేశారు.
పర్యటన కాలంలో వియత్ నామ్ అధ్యక్షుల వారు మాన్య శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ కు భారత రాష్ట్రపతి మాన్య శ్రీ రామ్ నాధ్ కోవింద్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ లో సంప్రదాయబద్ధంగా సైనిక వందనం కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. అనంతరం వియత్ నామ్ అధ్యక్షుల వారు రాజ్ ఘాట్ లో మహాత్మ గాంధీ సమాధి ని దర్శించి జాతి పిత కు పుష్పాంజలిని ఘటించారు. ఆ తరువాత భారతదేశం రాష్ట్రపతి తో వియత్ నామ్ అధ్యక్షులు చర్చలలో పాలుపంచుకొన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన ఆధికారిక విందు కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆ పైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ప్రతినిధి వర్గ స్థాయి చర్చలు సాగాయి. అధ్యక్షుల వారు మాన్య శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ తన పర్యటనలో భాగంగా లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్ తో, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ తో మరి ఇంకా పలువురు నేతలతో భేటీ అయ్యారు. వియత్ నామ్- ఇండియా బిజినెస్ ఫోరమ్ సమాశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలకు చెందిన ప్రసిద్ధులను కూడా కలుసుకొని, చర్చలు జరిపారు. అంతక్రితం, ఆయన బుద్దగయ ను సందర్శించారు.
వియత్ నామ్ కు, భారతదేశానికి మధ్య ప్రతినిధి వర్గం స్థాయి చర్చలు చక్కటి సుహృద్భావభరిత, స్నేహపూరిత వాతావరణంలో కొనసాగాయి. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య బలోపేతమవుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిఫలిస్తున్నాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016లో వియత్ నామ్ పర్యటన అనంతరం ఇరు దేశాల మధ్య అనేక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తాజా చర్చలు మరింత ముందుకు తీసుకుపోయాయి. ఈ చర్చలయ్యాక ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ ల సమక్షంలో అణు శక్తి, వాణిజ్యం, వ్యవసాయం, చేపల పెంపకం తదితరాలపై ఒప్పందాలు కుదిరాయి.
ఆర్ధిక, సామాజిక అభివృద్ధిలో, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞాన రంగాలలో, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో భారతదేశం సాధించిన విజయాలను వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ అభినందించారు. ప్రాంతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న భారతదేశం పాత్రకు తమ మద్దతు ఉంటుందని ఈ సందర్శంగా వియత్ నామ్ అధ్యక్షులు తెలిపారు. సామాజిక, ఆర్ధిక రంగాలలో, విదేశీ విధానంలో వియత్ నామ్ సాధించిన విజయాలు భేషుగ్గా ఉన్నాయంటూ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లు ఈ సందర్భంగా ప్రశంసించారు. పారిశ్రామిక దేశంగా అవతరించాలనే వియత్ నామ్ ఆకాంక్ష త్వరలోనే సఫలమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా వియత్ నామ్ ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుందని వారు అన్నారు.
రెండు దేశాలకు మధ్య ఎంతో కాలంగా కాల పరీక్షను ఎదుర్కొని నిలిచిన స్నేహ సంబంధాలు ఉన్నాయని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం పునాది వేసిన భారతదేశం జాతి పిత మహాత్మగాంధీ ని, వియత్ నామ్ జాతి పిత శ్రీ హోచి మిన్ ను ఇరు దేశాలు గుర్తు చేసుకున్నాయి. వీరి తరువాత పాలన లోకి వచ్చిన ఆయా తరాల నేతలు రెండు దేశాల ప్రజలు ఈ బంధాలను కొనసాగించారని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా పటిష్టంగా వుండడం పట్ల ఇరు దేశాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. వియత్ నామ్ కు, భారతదేశానికి మధ్యగల దౌత్య సంబంధాలకు 45 ఏళ్లు నిండిన సందర్భంగా, వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని పదేళ్లు అయినందుకుగాను వాటిని గుర్తు చేసుకుంటూ 2017లో నిర్వహించిన స్నేహ సంబంధాల వార్షికోత్సవ కార్యక్రమాల సంబరాలను ఈ సందర్భంగా మెచ్చుకోవడమైంది. ఈ సందర్భంగా ‘‘వియత్ నామ్ డేస్ ఇన్ ఇండియా’’ పేరిట 2017లో నిర్వహించిన కార్యక్రమాన్ని వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ కొనియాడారు.
ఇరు దేశాల మధ్య ఉన్న ఘనమైన సంబంధాల కారణంగా రెండు దేశాలు క్రమం తప్పకుండా అన్ని స్థాయిల్లో పర్యటనలను నిర్వహించాలని వియత్ నామ్, భారతదేశ నేతలు అంగీకరించారు. ఇరు దేశాల రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు, శాసన సంబంధమైన సంస్థలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఈ పర్యటనలలో పాల్గొనేటట్టు చూడాలని నిర్ణయించారు. రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల ఆధ్వర్యంలో 2018లో సంయుక్త సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2017-2020 కోసం రూపొందించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళిక అమలును సమీక్షించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
రక్షణ మరియు భద్రత
ఇరు దేశాల మధ్య సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే రక్షణ, భద్రతపరమైన సహకారం చాలా ముఖ్యమైందని, మూల స్తంభం వంటిదని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ అంశంలో జరుగుతున్న ప్రగతి పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశాయి. సీనియర్ల స్థాయిలో ఇరు దేశాల ప్రతినిధుల పర్యటనలను, సంప్రదింపుల వ్యవస్థకు సంబంధించిన సమావేశాలను, ఇరు దేశాల సైనిక బలగాల మధ్యన గల సహకారాన్ని రెండు దేశాల నేతలు ఆహ్వానించారు. సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాదంపై పోరాటం, అన్ని రూపాల్లోని హింసాత్మక తీవ్రవాదం పైనా, అంతర్జాతీయ నేరాలు, మానవ, మత్తుమందుల రవాణా, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, ఆహార భద్రత రంగాలలో ఇరు దేశాల మధ్య బలోపేతమవుతున్న సహకారం పట్ల రెండు దేశాల నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో ఇరు దేశాల మధ్య గల బహిరంగ, స్వేచ్ఛాయుత, భద్రమైన, స్థిరమైన, శాంతియుతమైన, అందరికీ అందుబాటులోని సైబర్ స్పేస్ పట్ల ఇరు దేశాలు తమకు గల నిబద్దతను మరోసారి చాటాయి. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందాలను ప్రతిభావంతంగా అమలు చేసుకోవాలని, ఈ విషయంలో ఉన్నతమైన సహకారం ఉండాలని రెండు దేశాలు ఆకాంక్షించాయి. గతంలో భారతదేశ జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్ కు, వియత్ నామ్ ప్రజా భద్రత మంత్రిత్వశాఖకు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం జరిగింది. దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని నేతలు నిర్ణయించారు. తద్వారా ఉప మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలను చేపట్టాలని సంప్రదాయ, సంప్రదాయేతర భద్రత అంశాలలో సహకారాన్నిపెంచుకోవాలని నిర్ణయించారు. అంతే కాదు శిక్షణపరమైన, సామర్థ్య నిర్మాణ పరమైన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
వియత్ నామ్ కు సంబంధించిన రక్షణపరమైన సహకారం విషయంలో, వియత్ నామ్ సామర్థ్యాల నిర్మాణంలో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని భారతదేశం స్పష్టం చేసింది. వియత్ నామ్ సరిహద్దు గార్డుల కోసం అత్యున్నత స్థాయి పెట్రోల్ బోట్ లను అందజేసేందుకుగాను 100 మిలియన్ అమెరికా డాలర్ల రుణాన్ని వేగంగా అందజేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే రక్షణ పరిశ్రమకు సంబంధించిన 500 మిలియన్ అమెరికా డాలర్ల రుణ సహాయానికి సంబంధించిన విధి విధానాల ఒప్పందంపైన త్వరగా సంతకాలు చేయాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య గల రక్షణ బంధాలను మరింత బలోపేతం చేయాలని రెండు దేశాల నేతలు అంగీకరించారు. ఇందుకోసం సీనియర్ల స్థాయిలో రక్షణ ప్రతినిధి బృందాల పర్యటనలు చేపట్టాలని, క్రమం తప్పకుండా సీనియర్ల స్థాయిలో చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. రెండు దేశాల మధ్య రక్షణ దళాల మధ్య సహకారం, నావికాదళం, తీర రక్షణ ప్రాంత నావల మధ్య సంప్రదింపులు, సామర్థ్యాల నిర్మాణ ప్రాజెక్టులు, పరికరాల సేకరణ, ప్రాంతీయ వేదికలలోను ఎడిఎమ్ఎమ్ ప్లస్ సహా సాంకేతికత బదిలీ, సహకారం మొదలైన చర్యల ద్వారా రక్షణ బంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
సముద్ర ప్రాంత సహకారాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యమని ఇరు దేశాలు అంగీకరించాయి. సముద్ర దోపిడీలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని, సముద్ర మార్గాల భద్రతను బలోపేతం చేయాలని, నావల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ఈ ఏడాది జనవరి లో సమద్ర ప్రాంత సహకారం పైన ఆసియాన్- భారతదేశం వ్యూహాత్మక చర్చ న్యూ ఢిల్లీ లో జరిగింది. ఈ చర్చల స్ఫూర్తితో ఇరు దేశాల మధ్య గల సముద్ర ప్రాంత సమస్యలను ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
సరిహద్దుల్లో చెలరేగే ఉగ్రవాదంతో సహా ఉగ్రవాదాన్ని, దాని రూపాలను ఇరు దేశాలు నిర్ద్వందంగా ఖండించాయి. ప్రపంచ శాంతికి, భద్రతకు, స్థిరత్వానికి ఉగ్రవాదం పెను ప్రమాదంగా మారిందన్న భారతదేశ వాదనతో వియత్ నామ్ ఏకీభవించింది. ఉగ్రవాద కార్యక్రమాలకు ఎలాంటి న్యాయబద్దత లేదని నేతలు స్పష్టం చేశారు. మతానికి, జాతీయతకు, నాగరికతకు, ఆయా జాతులకు ఉగ్రవాదాన్ని ముడి పెట్టకూడదని ఇరు దేశాల నేతలు గుర్తించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్రమైన దృక్పథంతో పోరాటం చేయాలని వారు ప్రపంచ దేశాలను కోరారు. ఉగ్రవాదులను తయారు చేసే కార్యక్రమాలపైన, ఉగ్రవాదులుగా భర్తీ, శిక్షణ, వారి కదలికలపై ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులపై పోరాటం చేయాలని కోరారు. ఉగ్రవాదులకు వనరులు అందకుండా చూడాలని, వ్యవస్థీకృత నేరాలపైనా, అక్రమ నగదు లావాదేవీలు, భారీ స్థాయిలో ప్రజలను హతమార్చే (డబ్ల్యుఎమ్ డి) ఆయుధాల స్మగ్లింగ్ పైనా పోరాటం చేయాలని కోరారు. మత్తుమందుల రవాణా, ఇంకా ఇతర నేర కార్యక్రమాలు జరగకుండా చూడాలని, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయాలని, వారికి అనుకూలమైన ప్రాంతాలు లేకుండా చేయాలని, ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ సంస్థల చేతుల్లో ఇంటర్‌నెట్, సైబర్ స్పేస్, సోషల్ మీడియా, ఇంకా ఇతర కమ్యూనికేషన్ మార్గాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపైన సమగ్రమైన ఒప్పందాన్ని (కాంప్రహెన్షివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్ నేశనల్ టెర్రరిజమ్- సిసిఐటి) త్వరలో అమలు చేయడానికి వీలుగా బలమైన ఏకాభిప్రాయాన్ని కూడగట్టడానికి ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించాయి.
ఆర్ధిక బంధాలు
ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య, ఆర్ధిక కార్యకలాపాలను పెంచాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఇలా చేయడం వ్యూహాత్మక లక్ష్యంగా పరిగణించాయి. ఇది తమ దేశాల మధ్య సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమని స్పష్టం చేశాయి. తమ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతం కావడానికి ఇది ముఖ్యమని అంగీకరించాయి. గత రెండు సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయమైన స్థాయిలో పెరుగుతుండటం పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ దేశాల మధ్య ఉన్న సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలుగా వాణిజ్య పరిమాణాన్ని పెంచాలని, ఇందుకోసం విభిన్న మార్గాలను కనిపెట్టాలని ఇరు దేశాల నేతలు సంబంధిత మంత్రిత్వశాఖలను, ఏజెన్సీలను కోరారు. ఇందులో భాగంగా 2020 కల్లా 15 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా స్థూలమైన, ఆచరణాత్మక మార్గాలను అన్వేషించాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలని, అంతే కాకుండా వాటిమీద మాత్రమే ఆధారపడకుండా వాణిజ్య ప్రతినిధి బృందాల పర్యటనలను బలోపేతం చేయాలని, వ్యాపారపరమైన బంధాలను పెంచాలని, క్రమం తప్పకుండా వాణిజ్య ప్రదర్శనలను, కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరంలో ఎంత వీలైతే అంత ముందుగా వియత్ నామ్ రాజధాని హ నోయి లో వాణిజ్య ఉమ్మడి సబ్ కమిషన్ తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రెండు దేశాలు అంగీకరించాయి.
ఇరు దేశాల సహకారంలోని ప్రాధాన్య రంగాలలో నూతన వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను ఉభయ దేశాల వ్యాపార, వాణిజ్య రంగాల నేతలు అన్వేషించాలని రెండు దేశాల నేతలు కోరారు. హైడ్రోకార్బన్స్, విద్యుత్తు ఉత్పత్తి, నవీకరణయోగ్య శక్తి, శక్తి, సంరక్షణ, మౌలిక సదుపాయాలు, జౌళి, పాదరక్షలు, మందులు, యంత్ర విడి భాగాలు, వ్యవసాయం, వ్యవసాయోత్పత్తులు, పర్యాటక రంగం, రసాయనాల తయారీ, ఐసీటీ, ఇంకా ఇతర సేవా రంగ పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞాన రంగాలలో సాంకేతిక రంగ పాత్రను, పరిమాణాన్ని పెంచాలని, తద్వారా ఉత్పాదకతను పెంచడానికి గల సహకారాన్ని పెంచాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
వియత్ నామ్ కు, భారతదేశానికి పరస్పర లబ్ధి చేకూరేలా ఇరు దేశాలలో పెట్టే పెట్టుబడులకు రెండు దేశాలు ప్రోత్సాహమిచ్చాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో నెలకొన్నపెట్టుబడుల వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్ నామ్ కంపెనీలకు స్వాగతం పలికారు. అలాగే భారతదేశ కంపెనీలు వియత్ నామ్ లో పెట్టుబడులు పెట్టాలని వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ స్వాగతం పలికారు. వియత్ నామ్ చట్టాల ప్రకారం భారతదేశ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు నెలకొనడానికిగాను, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికిగాను వియత్ నామ్ నిబద్దతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో సరళమైన వ్యాపార నిర్వహణ విషయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వియత్ నామ్ అధ్యక్షులు ప్రశంసించారు.
సహకార రంగ అభివృద్ధి
వియత్ నామ్ కు గ్రాంటులను ఇవ్వడంలో, రుణాలను అందజేయడంలో ఎంతో కాలంగా భారతదేశం ఇస్తున్న సహకారాన్ని వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ ప్రశంసించారు. వియత్ నామ్ విద్యార్థులకు, పరిశోధకులకు, విద్యాసంబంధ నిపుణులకు, ప్రభుత్వ అధికారులకు భారతదేశం ఉపకారవేతనాలను ఇస్తోంది. వీటిని పెంచినందుకు వియత్ నామ్ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ ( ఐటిఇసి) ప్రోగ్రామ్, ది మెకాంగ్- గంగా కో ఆపరేషన్ (ఎంజిసి) ఫ్రేంవర్క్ కు తోడు క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ ( క్యు ఐపీలు) కింద ఇచ్చే ప్రాజెక్టుల ద్వారా కూడా ఈ ఉపకార వేతనాలను అందిస్తున్నారు.
ఐటిఇసి కార్యక్రమం కింద వియత్ నామ్ కు అనువైన రంగాలలో వ్యవస్థీకృతమైన కోర్సులను అందజేస్తామని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఆసియాన్- ఇండియా స్మరణార్థ సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ ప్రశంసించారు. సిఎల్ఎమ్ వి దేశాలలో గ్రామీణ అనుసంధానం సాధించడానికి వీలుగా పైలట్ ప్రాజెక్టు ను శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ గ్రామాలను ఆవిష్కరిస్తారు. ఆసియాన్ దేశాలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు, పరిశోధకులకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ లో పిహెచ్ డి ప్రోగ్రామలు చదవడానికి వీలుగా ఫెలోషిప్పులు అందజేస్తారు.
ఇంధన రంగంలో సహకారం
చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో, బొగ్గు, జల విద్యుత్తు, నవీకరణ యోగ్య శక్తి రంగాల్లో, ఇంధన సంరక్షణలో సహకారం గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తున్నవిషయాన్ని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. వియత్ నామ్ లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ మరియు వెలికితీతలో భారతీయ పారిశ్రామికవేత్తలు వారి పెట్టుబడులను విస్తరించాలని కోరుతూ వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ వారికి స్వాగతం పలికారు. వియత్ నామ్ అందించే బ్లాకుల కోసం భారతీయ కంపెనీలు పటిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఇరు దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో చేసే చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ ప్రాజెక్టుల విషయంలో రెండు దేశాలు సంయుక్తంగా పని చేయడానికి వీలుగా ఒక అవగాహన ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకోవాలని, దీనిపైన సంతకాల కోసం ఇరు దేశాలు వేగంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వియత్ నామ్ లోని మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ విభాగాలలో ఉన్న అవకాశాలను భారతదేశపు చమురు, గ్యాస్ కంపెనీలు ఉపయోగించుకోవాలని వియత్ నామ్ ప్రభుత్వం కోరింది.
వియత్ నామ్ లోని నవీకరణ యోగ్య శక్తి, శక్తి సంరక్షణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి రావాలని వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ స్వాగతం పలికారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణు శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి, పరిశోధన రియాక్టర్ ను నిర్మిస్తున్నామని, దీనికి భారతదేశం సహకారాన్ని కొనసాగించడం పట్ల వియత్ నామ్ కృతజ్ఞతలు తెలిపింది.
అంతర్జాతీయ సౌర వేదిక ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేయాలని, తద్వారా నవీకరణయోగ్య శక్తి రంగంలో సహకారం బలోపేతమవుతుందని భారతదేశం వియత్ నామ్ ను అభ్యర్థించింది. దీనిని తాము గుర్తించామని వియత్ నామ్ తెలిపింది.
సంస్కృతి, విద్య, ప్రజల మధ్య సహకారం
సంస్కృతి, పర్యాటకం, ఇరు దేశాలలో ప్రజల ఆధికారిక పర్యటనల విషయంలో రెండు దేశాలు సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించాయి. పురాతత్వశాస్త్రం, సంరక్షణ, ప్రదర్శనశాలల రంగాల్లో మరింతగా సహకరించుకోవాలని ఇరు దేశాల మధ్య గల సాంస్కృతిక, చారిత్రక బంధాలను బలోపేతం చేసుకోవాలని ఉభయ దేశాలు అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య గల నాగరకత పరమైన, చారిత్రాత్మక సంబంధమైన, సాంస్కృతిక పరమైన అంశాలను పునరుద్ధరించి, తిరిగి అనుసంధానించాలని నిర్ణయించారు. భారతదేశంలో సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పాలనే వియత్ నామ్ ప్రతిపాదనను భారతదేశం ఘనంగా ప్రస్తుతించింది.
వియత్ నామ్ లోని కువాంగ్ నామ్ రాష్ట్రంలో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశమైన మైసన్ వుంది. దీనిని పునరుద్దరించడానికి, సంరక్షించడానికిగాను చేపట్టిన ప్రాజెక్టు సమర్థవంతంగా అమలవడం పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తి ని వ్యక్తం చేశారు. వియత్ నామ్ లోని హో లాయ్ టవర్, పోక్లాంగ్ గారాయ్ చామ్ టవర్ ల పునరుద్ధరణ, సంరక్షణ కోసం భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందించడాన్ని వియత్ నామ్ స్వాగతించింది. నిన్హా తువాన్ రాష్ట్రంలోని చామ్ కమ్యూనిటీ కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో భారతదేశం సహాయం అందించడం పట్ల వియత్ నామ్ సంతోషం వ్యక్తం చేసింది. భారతదేశ ప్రభుత్వం భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి (బిఎమ్ విఎస్ఎస్) కలిసి 500 మంది వియత్ నామ్ దేశీయులకు జైపూర్ కాలు ను అందజేసి వారికి పునరావాస సేవలందించడంపట్ల వియత్ నామ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సేవలను వియత్ నామ్ లోని ఫూ తో, విన్ ఫూక్, మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారు పొందారు.
కనెక్టివిటీ
వియత్ నామ్ కు, భారతదేశానికి మధ్య బలమైన కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అంతే కాదు ఆసియాన్ సభ్యత్వ దేశాలకు, భారతదేశానికి మధ్య కూడా ఇది వర్తిస్తుందని భావించారు. సిఎల్ ఎమ్ వి దేశాల కోసం భారతదేశం చేపట్టిన పలు కార్యక్రమాలను వియత్ నామ్ ఉపయోగించుకోవాలని భారతదేశం కోరింది. ముఖ్యంగా భౌతికమైన అనుసంధా, డిజిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశం అందిస్తున్న ఒక బిలియన్ అమెరికా డాలర్ల రుణ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రాంతీయ కనెక్టివిటీ కి సంబంధించి భారతదేశం-మయన్మార్-థాయీ ల్యాండ్ త్రైపాక్షిక ప్రధాన రహదారి నిర్మాణ ప్రాజెక్టు లాంటి వాటి విషయంలో సాధిస్తున్న ప్రగతిని ఇరు దేశాల నేతలు గుర్తించారు. భారతదేశం-మయన్మార్-థాయీ ల్యాండ్ త్రైపాక్షిక ప్రధాన రహదారి ని కాంబోడియా మరియు లావో పిడిఆర్ ల ద్వారా వియత్ నామ్ కు విస్తరించడానికి గల సాధ్య అసాధ్యాలను అన్వేషించాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
ఆసియాన్-ఇండియా మారిటైమ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ పైన త్వరగా సంతకాలు చేయాల్సివుందంటూ దాని ప్రాధాన్యాన్ని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. భారతదేశానికి, వియత్ నామ్ కు మధ్య ఉన్న ఓడ రేవుల మధ్య నేరుగా నౌకాయాన మార్గాలను ఏర్పాటు చేసుకోవడాన్ని వేగవంతం చేయాలని ఇరు దేశాలు కోరాయి. న్యూ ఢిల్లీ కి, హో చి మిన్ సిటీకి నడుమ నేరుగా విమానయాన సౌకర్యాన్ని కల్పించడాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి. ఇరు దేశాల ప్రధాన నగరాల మధ్య మరిన్ని డైరెక్టు విమాన సౌకర్యాలను కల్పించాలని రెండు దేశాల వైమానిక కంపెనీలను నేతలు కోరారు.
ప్రాంతీయ సహకారం
ఇరు దేశాలకు మధ్య పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యల విషయంలో ఏకీభావం ఉంది. వీటిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ లు పంచుకొన్నారు. ఆసియా లోని ప్రాంతీయ భద్రత పరిస్థితి సమస్య కూడా ఇందులో ఉంది. ఇండియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతియుతమైన, సౌభాగ్యపూరితమైన వాతావరణ ప్రాధాన్యాన్ని ఇరుదేశాల నేతలు పునద్ఘాటించారు. ఈ ప్రాంతంలో సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను, నౌకాయాన, విమానయాన స్వేచ్ఛను, సుస్థిరమైన అభివృద్ధిని, స్వేచ్ఛాయుతమైన, బహిరంగ వాణిజ్యాన్ని, పెట్టుబడుల వ్యవస్థను గౌరవించాలని ఇరు దేశాల నేతలు అభిలషించారు.
ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా అందరినీ కలుపుకుపోయే, విధానపరమైన, పారదర్శకమైన, బహిరంగ నిర్మాణాన్నిబలోపేతం చేసి, రక్షించుకోవాలని ఇరు దేశాలు ఈ విషయంలో ముఖ్యమైన పాత్రను పోషించాలని రెండు దేశాల నేతలు గట్టిగా స్పష్టం చేశారు. అంతే కాదు ఆసియాన్ దేశాలతో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి నెలలో ముగిసిన ఆసియాన్- ఇండియా స్మరణార్ధ సదస్సు విజయవంతంగా ముగియడం పట్ల ఇరు దేశాల నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సదస్సు విజయంలో 2015-2018 సమన్వయకర్త దేశంగా వియత్ నామ్ గణనీయమైన పాత్రను పోషించింది. ఢిల్లీ ప్రకటనలో చేసిన ప్రతిపాదనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉభయ దేశాల నేతలు నిర్ణయించారు. తద్వారా ఆసియాన్- ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రాంతీయంగా ఆసియాన్ కేంద్రంగా ఆవిష్కృతమవుతున్న ప్రాంతీయ నిర్మాణానికి, ప్రాంతీయ శాంతి, భద్రత, సౌభాగ్యాల కోసం భారతదేశం చేస్తున్న కృషిని వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ ప్రశంసించారు. ఆసియాన్ లో మిళితం కావడం కోసం, ఆసియాన్ కమ్యూనిటీ నిర్మాణ ప్రక్రియ కోసం ఇండియా కృషిని మెచ్చుకొన్నారు.
ఉప ప్రాంతీయ విధి విధానాలు, నిర్మాణాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారానికి ఉపయోగపడతాయని వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాలని రెండు దేశాలు స్పష్టం చేశాయి. ఆసియాన్ విధి విధానాల ద్వారా ప్రాంతీయ సహకారాన్ని సాధించాలని భావించాయి. మనుగడలో వున్న ఉప ప్రాంతీయ విధి విధానాలను, నిర్మాణాలను కావలసిన విధంగా అభివృద్ధి చేసుకొని ముఖ్యంగా మెకాంగ్-గంగా ఎకనామిక్ కారిడోర్ లను ఉపయోగించుకోవాలని ఇరు దేశాలు స్పష్టం చేశాయి.
బహు పాక్షిక సహకారం
ప్రాంతీయ వేదికల మీద, అంతర్జాతీయ వేదికల మీద ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం పట్ల, సమన్వయం పట్ల రెండు దేశాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని అంగీకారానికి వచ్చాయి. ఐక్య రాజ్య సమితిలో శాశ్వతేతర సభ్యత్వానికి సంబంధించిన అభ్యర్థిత్వాలకు పరస్పరం మద్దతు తెలుపుకోవాలని నిర్ణయించాయి. ఈ విషయంలో 2020-21కిగాను వియత్ నామ్ అభ్యర్థిత్వానికి, భారతదేశం.. 2021-22కు గాను భారతదేశం అభ్యర్థిత్వానికి వియత్ నామ్ మద్దతు పలుకుతాయి. సంస్కరించబడిన భద్రత మండలి లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే అంశానికి తమ మద్దతు కొనసాగుతుందని వియత్ నామ్ ఈ సందర్భంగా స్పష్టం చేసంది.
ప్రపంచవ్యాప్తంగాను, ఇండో పసిఫిక్ ప్రాంతంలోను శాంతి, స్థిరత్వం, అభివృద్ధిలో సహకరించుకోవాలనే ఇరు దేశాల కృతనిశ్చయాన్ని, చర్యలను ఇరు దేశాలు మరో సారి స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన ప్రాధాన్యాన్ని ఇరు దేశాల నేతలు పునరుద్ఘాటించారు. సముద్రాలకు సంబంధించిన ఐక్య రాజ్య సమితి ఒప్పంద చట్టం 1982 (యుఎన్ సిఎల్ఒఎస్) గురించి నేతలు వివరించారు. అంతర్జాతీయ న్యాయ పరమైన బాధ్యతల అమలు, స్వేచ్ఛగా చేసే నౌకాయాన నిర్వహణ, దక్షిణ చైనా సముద్రంపైన విమానయానం, దౌత్యపరమైన, న్యాయపరమైన విధానాలకు పూర్తిస్థాయిలో గౌరవం, బలప్రయోగం, బెదిరింపులకు తావు లేకుండా శాంతియుతంగా ఘర్షణల పరిష్కారం, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండడం తదితర అంశాలను ఇరు దేశాల నేతలు ప్రస్తావించారు. ఈ విషయంలో దక్షిణ చైనా సముద్రంలో వ్యవహరించవలసిన విధానం పైన చేసిన ప్రకటనను సమర్థవంతంగా సంపూర్ణంగా చేయాలని ఇరు దేశాలు మద్దతు పలికాయి. దక్షిణ చైనా సముద్రం (డిఒసి)లో యదార్థమైన, ప్రభావశీలమైన వ్యవహార విధానం తొందరగా రూపొందగలదని ఇరు దేశాలు ఆకాంక్షించాయి.
సుస్థిరమైన అభివృద్ధి కోసం రూపొందిన 2030 అజెండా కు ఇరు దేశాల నేతలు స్వాగతం పలికారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డి జిలు) సాధించడానికిగాను తమకు ఉన్నటువంటి వచనబద్ధతను రెండు దేశాల నేతలు పునరుద్ఘాటించారు. ఎస్ డిజిలను సాధించడానికిగాను అంతర్జాతీయ భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని నేతలు అంగీకరించారు. ఈ విషయంలో ఆడీస్ అబాబా యాక్షన్ అజెండా ను ఇరు దేశాల నేతలు గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అధికారికంగా అందజేస్తామన్న అభివృద్ధి సహాయం అమలు యొక్క ప్రాధానాన్ని రెండు దేశాల నేతలు ప్రస్తావించారు.
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, స్నేహ స్వభావులైన భారతదేశ ప్రజలు అందించిన ఘనమైన ఆతిథ్యానికి వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ వియత్ నామ్ సందర్శనకు తరలి రావాలంటూ ఆయనకు వియత్ నామ్ అధ్యక్షులు శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్ ఆహ్వానం పలికారు. వియత్ నామ్ ఆహ్వానాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ సంతోషంగా స్వీకరించారు. తన వియత్ నామ్ సందర్శన కు సంబంధించి దౌత్య వర్గాల ద్వారా సమాచారాన్ని పంపగలమని తెలియజేశారు.