యుగాండా అధ్యక్షుడు శ్రేష్ఠుడైన శ్రీ యొవెరీ కగూటా ముసెవెనీ ఆహ్వానించిన మీదట భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 జులై 24, 25 తేదీల్లో యుగాండా లో ఆధికారిక పర్యటనకు తరలివచ్చారు. భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం తో పాటు పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధుల బృందం ఆయనను అనుసరించింది. భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు గడచిన 21 సంవత్సరాలలో జరిపిన మొదటి పర్యటన ఇదే.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ యుగాండాకు చేరుకోగానే ఆయన కు ఉన్నత స్థాయి లో సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలకడమైంది. పర్యటన లో భాగంగా ఆయన 2018 జులై 24వ తేదీ బుధవారం నాడు ఎంటెబె లోని స్టేట్ హౌస్ లో అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ తో ద్వైపాక్షిక చర్చలలో పాలుపంచుకొన్నారు. అతిథి గా విచ్చేసినటువంటి ప్రధాన మంత్రి గౌరవార్థం అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ ఆధికారికంగా విందు ను ఇచ్చారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ పాల్గొన్న కార్యక్రమాల లో యుగాండా పార్లమెంటు ను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా ఒక కార్యక్రమంగా ఉండింది. ఈ ప్రసంగాన్ని భారతదేశం లోను, అనేక ఆఫ్రికా దేశాల లోను ప్రత్యక్ష ప్రసారం చేశారు. యుగాండా పార్లమెంటు ను ఉద్దేశించి భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ప్రసంగించడం ఇదే మొదటి సారి. ప్రైవేట్ సెక్టర్ ఫౌండేశన్ ఆఫ్ యుగాండా (పిఎస్ఎఫ్‌యు), ఇంకా భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) లు సంయుక్తంగా నిర్వహించిన ఒక వ్యాపార పరమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉభయ ప్రిన్సిపల్స్ ప్రసంగించారు. యుగాండా లో భారతీయ సముదాయం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో పెద్ద సంఖ్య లో పాలుపంచుకొన్న భారతీయులను ఉద్దేశించి కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రసంగించారు.
చర్చల క్రమం లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ, మరియు అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ లు యుగాండా కు, భారతదేశానికి మధ్య నెలకొన్న సాదర సంబంధాల, సన్నిహిత సంబంధాల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను వర్ధిల్లజేసుకోవడానికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయని ఇరు పక్షాలు అంగీకరించాయి. అంతే కాక రాజకీయ పరమైన, ఆర్థిక పరమైన, వాణిజ్య పరమైన, రక్షణ పరమైన, సాంకేతిక పరమైన, విద్యా సంబంధమైన, విజ్ఞాన శాస్త్ర సంబంధ పరమైన, ఇంకా సాంస్కృతిక పరమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పరస్పర అభిమతాన్ని ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి కూడాను. 30,000 సంఖ్యలో ఉన్న ప్రవాసీ భారతీయులు యుగాండా దేశాభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి అందిస్తున్నటువంటి తోడ్పాటు ను అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ కొనియాడారు. ఈ ప్రాంతంలో శాంతి ని, సుస్థిరత ను పరిరక్షించడం లో, ఆర్థిక సమగ్రత కు పాటుపడడం లో యుగాండా వహిస్తున్న గణనీయ భూమిక ను భారతదేశం ప్రశంసించింది.
చర్చల అనంతరం, భారతదేశం, యుగాండా పక్షాలు:
ఇప్పటికే అమలవుతున్న ద్వైపాక్షిక సహకారం సాధించినటువంటి విజయాల, నెరవేర్చినటువంటి కార్యసిద్ధుల పునాదులను మరింత బలపరచాలన్న వచన బద్ధత ను పునరుద్ఘాటించాయి.
ఇరు దేశాల మధ్య వ్యాపారబంధానికి, ఆర్థిక బంధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గుర్తెరిగాయి. ప్రస్తుతం రెండు దేశాల వాణిజ్య స్థాయిని ఇరువురు నేతలు పరిగణన లోకి తీసుకొని వాణిజ్య పరమైన అసమానత ను సవరించడం సహా, వ్యాపార రాశి ని పెంచుకోవడం తో పాటు మరిన్ని రంగాలకు వ్యాపారాన్ని విస్తరించాలనే అభిమతాన్ని, ఇరు దేశాల మధ్య వ్యాపారానికి మార్గాన్ని సుగమం చేయాలనే అభిమతాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమైన పలు రంగాలలో ప్రైవేటు రంగం యొక్క పెట్టుబడిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, పరస్పర వ్యాపార సంబంధాలను పెంచి పోషించుకొనేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి.
ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేశన్ (ఐటిఇసి), ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమిట్ (ఐఎఎఫ్ఎస్), ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేశన్స్ (ఐసిసిఆర్) తదితర సంస్థల సహాయం తో యుగాండా పౌరులు పొందుతున్న శిక్షణ, ఇంకా ఉపకార వేతనాల విషయం లో అభినందన వ్యక్తమైంది.
రక్షణ వ్యవహారాలలో సహకారం పెంపొందుతూ ఉండడం పట్ల, మరీ ముఖ్యంగా వివిధ భారతీయ సైనిక శిక్షణ సంస్థ లలో ఐటిఇసి ఆధ్వర్యంలో యుగాండాన్ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (యుపిడిఎఫ్) శిక్షణ ను పొందుతూ ఉండడం, ఇంకా కిమాకా లోని యుగాండా సీనియర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ (ఎస్‌సిఎస్‌సి) లో భారతీయ సైనిక శిక్షణ బృందం నియామకం పట్ల సైతం యుగాండా, భారతదేశం సంతృప్తి ని వ్యక్తం చేశాయి.
సమాచారం, ఇంకా కమ్యూనికేశన్ సంబంధిత సాంకేతిక విజ్ఞానం రంగం లో యుగాండా కు, భారతదేశానికి మధ్య నెలకొన్న సహకారాన్ని మరింతగా అభివృద్ధి పరచుకోవాలని ఒక అంగీకారానికి రావడమైంది. యుగాండా తన పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (పికెఐ) ప్రాజెక్టు ను అమలు పరుస్తూనే డిజిటల్ ఇన్‌క్లూశన్ అంశంలో భారతదేశం అమలుపరుస్తున్న పథకాలలో కొన్ని పథకాలను తాను కూడా అనుకరించాలనే అభిమతాన్ని వ్యక్తం చేసింది.
ప్రపంచ శాంతి కి, స్థిరత్వానికి ఉగ్రవాదం ఒక పెద్ద బెదరింపు ను రువ్వుతోందని నేతలు ఇరువురూ అంగీకరించారు. ఉగ్రవాదానికి, దాని యొక్క అన్ని రూపాలను ఎదురొడ్డి నిలవడానికి వారు తమ బలమైన వచన బద్ధతను పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం యొక్క చేష్టలు ఏ విధంగా అయినా సరే సమర్ధనీయం కావు అంటూ వారు నొక్కిపలికారు.
ఉగ్రవాదుల పైన, ఉగ్రవాద సంస్థల పైన, ఉగ్రవాద సంబంధిత నెట్‌వర్క్ ల పైన, ఉగ్రవాదానికి కొమ్ము కాసే, ఉగ్రవాదాన్ని సమర్ధించే, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేసే, లేదా ఉగ్రవాదులకు/ ఉగ్రవాద ముఠా లకు ఆశ్రయాన్ని ఇచ్చే వారందరి పట్ల కఠినమైన చర్యలను తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. అంతే కాకుండా, ఉగ్రవాద సంస్థలు ఎటువంటి డబ్ల్యుఎమ్‌డి ని లేదా సాంకేతికత లను అందుకోకుండా చూడవలసిన ఆవశ్యకత యొక్క ప్రాముఖ్యాన్ని కూడా వారు గుర్తెరిగారు. కోంప్రిహెన్సివ్ కన్‌వెన్శన్ ఆన్ ఇంటర్‌నేశనల్ టెర్రరిజమ్ (సిసిఐటి) ని సత్వరం ఆమోదించడం లో సహకారాన్ని అందించాలని వారు కంకణబద్ధులు అయ్యారు.
పరస్పర హితకరమైన ప్రాంతీయ/అంతర్జాతీయ అంశాల పైన, పరస్పర ఆందోళన కారకమైన ప్రాంతీయ/అంతర్జాతీయ అంశాల పైన జమిలి గా ముందుకు పోవలసిన అవసరం ఉందని నేతలు అంగీకరించారు.
యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మరింత ప్రాతినిధ్యయుతంగా, మరింత బాధ్యతాయుతంగా, మరింత సమర్ధమైందిగా, 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ వాస్తవాల పట్ల ప్రతిస్పందించేదిగా రూపుదిద్దుకోగలిగేటట్టు ఆ కౌన్సిల్ యొక్క విస్తరణ సహా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక సమగ్రమైన సంస్కరణ చోటు చేసుకోవలసిన అవసరం ఉందని ఉభయ నేతలు పునరుద్ఘాటించారు. ఐక్య రాజ్య సమితి లోను, అన్య బహుళ పార్శ్విక సంస్థ లలోను తమ సహకారాన్ని తీవ్రీకరించుకోవాలంటూ అందుకుగాను వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. జల వాయు పరివర్తన వంటి ప్రస్తుత ప్రపంచ సవాళ్ళ కు ఎదురొడ్డి నిలవాలన్నా, ప్రాంతీయంగా, ఇంకా అంతర్జాతీయంగా శాంతి భద్రతల ను పరిరక్షించుకోవాలన్నా, నిలకడతనం కలిగినటువంటి అభివృద్ధి ని సాధించాలన్నా ఈ విధమైన సహకారం అవశ్యమని పేర్కొన్నారు.
ద్వైపాక్షిక యంత్రాంగాలను క్రమం తప్పక సమావేశ పరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్పష్టం చేశారు. ఆర్థిక సంబంధమైన, అభివృద్ధి సంబంధమైన సహకారానికి ఉద్దేశించిన పథకాల సత్వర అమలు తో పాటు, ద్వైపాక్షిక సంబంధాల సర్వతోముఖ సమీక్ష కోసం విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహించుకొంటూ ఉండాలని కూడా నాయకులు అనుకున్నారు.
పర్యటన కాలంలో ఈ కింద పేర్కొన్న ఎంఓయూ లు / దస్తావేజు లపై సంతకాలయ్యాయి:
రక్షణ రంగ సహకారానికి సంబంధించినటువంటి ఎంఓయూ.
దౌత్య పరమైన ప్రయాణ పత్రం కలిగివున్న వారు, ఇంకా ఆధికారిక ప్రయాణ పత్రం కలిగివున్న వారికి ప్రవేశానుమతి మినహాయింపు నకు సంబంధించిన ఎంఓయూ.
సాంస్కృతిక బృందాల రాక పోకల కార్యక్రమానికి సంబంధించిన ఎంఓయూ.
మెటీరియల్ టెస్టింగ్ లబోరటరి కి సంబంధించిన ఎంఓయూ.
ఎంఓయూ లు కొలిక్కి రావడాన్ని ఉభయ నేతలు స్వాగతించారు. ఇప్పటికే ఉన్నటువంటి ఒప్పందాలు, అవగాహనపూర్వక ఒప్పంద పత్రాలు ఇతర సహకారపూర్వక ఫ్రేమ్ వర్క్ లు శీఘ్ర గతిన అమలు అయ్యేటట్టు శ్రద్ధ వహించవలసిందిగా సంబంధిత వ్యక్తులను వారు ఆదేశించారు.
పర్యటన కాలంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ దిగువ అంశాలపై ప్రకటనలు చేశారు:
ఎలక్ట్రిసిటి లైన్ లు మరియు సబ్ స్టేశన్ ల నిర్మాణానికి 141 మిలియన్ యుఎస్ డాలర్ల మేరకు, ఇంకా వ్యవసాయం మరియు పాడి ఉత్పత్తుల కోసం 64 మిలియన్ యుఎస్ డాలర్ల మేరకు.. రెండు లైన్స్ ఆఫ్ క్రెడిట్ లు.
జింజా లో మహాత్మ గాంధి కన్ వెన్శన్ /హెరిటేజ్ సెంటర్ స్థాపనకు తోడ్పాటును అందించడం.
యుగాండా ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి ఈస్ట్ ఆఫ్రికన్ కమ్యూనిటీ (ఇఎసి) కి మద్దతుగా ఉండే అవస్థాపన నిర్మాణం మరియు కెపాసిటీ బిల్డింగ్ కై 9,29,705 యుఎస్ డాలర్ల మేరకు ఆర్థికపరమైన సహాయాన్ని అందించడం.
పాడి రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకుగాను ఐటిఇసి పథకంలో భాగంగా శిక్షణకు సంబంధించి 25 స్లాట్ లు.
యుగాండాన్ పీపుల్ డిఫెన్స్ ఫోర్సెస్ (యు పి డిఎఫ్) కు 88 వాహనాలు, యుగాండా ప్రభుత్వం యొక్క శాంతియుత వినియోగానికై 44 వాహనాల బహూకరణ.
కేన్సర్ నిర్మూలన కై యుగాండా చేస్తున్న కృషికి సహాయకారిగా ఉండే విధంగా భాభాట్రాన్ కేన్సర్ థెరపీ యంత్రం బహూకరణ.
యుగాండా లోని బడి పిల్లకు 1,00,00 ఎన్ సిఇఆర్ టి పుస్తకాల బహూకరణ.
వ్యవసాయాభివృద్ధి లో యుగాండా చేస్తున్న ప్రయత్నాలకు సహాయకారిగా ఉండేందుకు సౌర విద్యుత్తు తో పని చేసే 100 సేద్యపు నీటిపారుదల పంపుల బహూకరణ.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ చేసిన ప్రకటన లు ఉత్తమమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలను గాఢతరం చేయడంలోను, మరింత పటిష్టపరచడంలోను ఎంతగానో దోహదపడగలవని పేర్కొంటూ శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ యొవెరీ ముసెవెనీ స్వాగతించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు, మరియు తన ప్రతినిధి వర్గానికి యుగాండా లో వారు బస చేసిన కాలంలో ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించినందుకుగాను అధ్యక్షుడు శ్రీ యొవెరీ ముసెవెనీ కి ధన్యవాదాలు తెలిపి, భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించారు. అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ ఈ ఆహ్వానాన్ని సహర్షంగా మన్నించారు. దౌత్య వర్గాల సంప్రదింపుల అనంతరం పర్యటన తేదీల విషయంలో ఒక అంగీకారం కుదురనుంది.