ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ డొనాల్డ్ జె.ట్రంప్ 2025 ఫిబ్రవరి 13న వాషింగ్టన్, డి.సి.లో ఆయనకు సాదర ఆతిథ్యమిచ్చారు.
స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన, మానవ హక్కులు, బహుపాక్షికతకు ఎంతో విలువనిచ్చే సార్వభౌమిక, సచేతన ప్రజాస్వామ్య దేశాల నాయకులుగా భారత్ - అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య శక్తిసామర్థ్యాలను ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాలు, సద్భావన, పౌరుల మధ్య బలమైన సంబంధాలు ప్రాతిపదికగా రెండు దేశాల స్నేహబంధం పెనవేసుకున్నదని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో “యుఎస్ - ఇండియా ‘కంపాక్ట్’ ఫర్ ది ట్వంటీఫస్ట్ సెంచరీ” (21వ శతాబ్దపు సైనిక భాగస్వామ్యం దిశగా అవకాశాలకు ప్రేరణ, వాణిజ్యం-సాంకేతికతలకు మరింత వేగం) పేరిట కొత్త కార్యక్రమానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ నేడు శ్రీకారం చుట్టారు. రెండు దేశాల మధ్య సహకారానికి కీలక మూల స్తంభాలైన రంగాల్లో ప్రగతిశీల మార్పులకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ మేరకు పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యంపై నమ్మకాన్ని ప్రతిఫలిస్తూ ఈ ఏడాది ప్రాథమిక ఫలితాల ఆధారిత కార్యాచరణపై వారు తమ నిబద్ధతను స్పష్టం చేశారు.
రక్షణ రంగం
రెండు దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల లోతైన సమన్వయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- రక్షణ భాగస్వామ్యం వివిధ రంగాలకు చురుగ్గా విస్తరింపజేయడంపై తమ దృఢ నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ సంబంధాలను మరింత విస్తరించడంలో భాగంగా 21వ శతాబ్దంలో యుఎస్-భారత్ కీలక రక్షణ భాగస్వామ్యం దిశగా ఈ సంవత్సరంలోనే సరికొత్త పదేళ్ల ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యేలా తమ ఆలోచనలను ప్రస్ఫుటం చేశారు.
భారత రక్షణ వస్తు జాబితాలో అమెరికా ఉత్పత్తులు గణనీయం భాగం కావడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో “సి-130జె సూపర్ హెర్క్యులస్, సి-17 గ్లోబ్‌మాస్టర్-III, పి-8ఐ పోసిడాన్ ఎయిర్‌క్రాఫ్ట్ సహా సిహెచ్‑47ఎఫ్ చినూక్స్, ఎంహెచ్‑60ఆర్ సీహాక్స్, ఎహెచ్‑64ఇ అపాచీస్; హార్పూన్ యాంటీ-షిప్ క్షిపణులు; ఎం777 హోవిట్జర్లు, ఎంక్యు‑9బి” వంటివన్నీ అంతర్భాగంగా ఉన్నాయి. పరస్పర కార్యకలాపాల సామర్థ్యం పెంపు, రక్షణ పారిశ్రామిక సహకార బలోపేతం దిశగా భారత్‌కు అమెరికా రక్షణ ఉత్పత్తుల విక్రయాలతోపాటు సహోత్పత్తి కార్యకలాపాలు కూడా విస్తరింపజేయాలని నాయకులిద్దరూ నిర్ణయించారు. ఇందులో భాగంగా భారత రక్షణ అవసరాలను త్వరగా తీర్చడానికి దేశంలో “జావెలిన్” యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, “స్ట్రైకర్” ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ తయారీ దిశగా ఈ ఏడాది కొత్త కొనుగోళ్లతోపాటు సహోత్పత్తి ఏర్పాట్లు కొనసాగించే ప్రణాళిక ఉన్నట్లు ప్రకటించారు. విక్రయ నిబంధనలపై ఒప్పందానికి అనుగుణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత సముద్ర నిఘా పరిధి విస్తరణ లక్ష్యంగా 6 పి-8I సముద్ర గస్తీ విమానాల కొనుగోలు సకాలంలో పూర్తికావడంపై వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘వ్యూహాత్మక వాణిజ్య ఆమోదం-1’ (ఎస్‌టిఎ‑1) విధానం కింద భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగానే కాకుండా ‘క్వాడ్’ భాగస్వామిగానూ అమెరికా గుర్తించింది. ఈ మేరకు అమెరికా-భారత్ రక్షణ వాణిజ్యం, సాంకేతిక ఆదానప్రదానం-నిర్వహణ, విడి భాగాల సరఫరా, దేశీయంగా మరమ్మతులు, అమెరికా రక్షణ వ్యవస్థల ఏకీకరణ వగైరాల క్రమబద్ధీరణ దిశగా అంతర్జాతీయ ఆయుధ నియంత్రణలు (ఐటిఎఆర్) సహా సంబంధిత ఆయుధ బదిలీ నిబంధనలను సమీక్షిస్తారు. రెండువైపులా కొనుగోలు వ్యవస్థల సమన్వయం, రక్షణ రంగ వస్తుసేవల పరస్పర సరఫరా కోసం ‘పరస్పర రక్షణ కొనుగోళ్ల’ (ఆర్‌డిపి) ఒప్పందంపై ఈ ఏడాదిలోనే చర్చలు ప్రారంభించాలని నాయకులిద్దరూ సూచించారు. అంతరిక్షం, గగనతల రక్షణ, క్షిపణి, సముద్ర-సముద్రగర్భ సాంకేతిక పరిజ్ఞానాలలో రక్షణ సాంకేతిక సహకారాన్ని ముమ్మరం చేయడంపై కృతనిశ్చయం ప్రకటించారు. ఈ దిశగా ఐదో తరం యుద్ధ విమానాలతోపాటు సముద్రగర్భ వ్యవస్థలను భారత్‌కు అందించడంపై తమ విధానాన్ని సమీక్షిస్తామని అమెరికా ప్రకటించింది.
రక్షణ పారిశ్రామిక సహకారంపై అమెరికా-భారత్ భవిష్యత్ ప్రణాళిక రూపకల్పనతోపాటు స్వయంప్రతిపత్తి వ్యవస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ అంగీకరించారు. ఆ మేరకు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పారిశ్రామిక భాగస్వామ్యాలు-ఉత్పత్తి పెంపు నిమిత్తం ‘అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్’ (ఎఎస్‌ఐఎ-ఆసియా) పేరిట కొత్త కార్యక్రమాన్ని వారు ప్రకటించారు. ప్రాంతీయ భద్రత బలోపేతం సహా అత్యాధునిక సముద్ర వ్యవస్థలు, అధునాతన ఎఐ ఆధారిత మానవరహిత ప్రతిదాడి వైమానిక వ్యవస్థ (యుఎఎస్)ల ఉమ్మడి రూపకల్పన, సహోత్పత్తికి నాయకులిద్దరూ ఆమోదించారు. ఇందుకు తగిన అత్యాధునిక స్వయంప్రతిపత్తి సాంకేతికతలపై ‘అందూరిల్ ఇండస్ట్రీస్’, మహీంద్రా గ్రూప్ మధ్య; ‘యాక్టివ్ టోవ్డ్ అర్రే’ వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన-ఉత్పత్తిపై ‘ఎల్3 హారిస్, భారత్ ఎలక్ట్రానిక్స్ మధ్య కొత్త భాగస్వామ్యాలను వారు స్వాగతించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల సద్వినియోగంతో మెరుగైన శిక్షణ, సైనిక కసరత్తులు- కార్యకలాపాలతో గగన, భూతల, సముద్ర, అంతరిక్ష, సైబర్ స్పేస్ వంటి అన్ని రంగాల్లో సైనిక సహకారం విస్తరించేందుకు నాయకులు దృఢ నిశ్చయం ప్రకటించారు. ఇక “టైగర్ ట్రయంఫ్” (2019లో తొలిసారి ప్రారంభం) పేరిట అనే త్రివిధ దళాల విన్యాసం చేపట్టనుండటంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ విన్యాసాలను భారత్‌లో భారీ సమ్మిశ్రణంతో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
చివరగా, ఇండో-పసిఫిక్‌లో అమెరికా, భారత విదేశీ సైనిక మోహరింపులకు మద్దతు, బలగాల కొనసాగింపు దిశగా రంగం సిద్ధం చేయడానికి కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. మెరుగైన రవాణా-నిఘా భాగస్వామ్యం, ఇతరత్రా ఆదానప్రదానాలు, భద్రత సహకార కార్యకలాపాలు సహా సంయుక్త మానవతా-విపత్తు సహాయ కార్యకలాపాల్లో సైనిక బలగాల రాకపోకల మెరుగుకు ఏర్పాట్లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.
వాణిజ్యం - పెట్టుబడులు
ఉభయ దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడుల విస్తరణపై నాయకులిద్దరూ దృఢ సంకల్పం ప్రకటించారు. తద్వారా రెండు దేశాలూ బలమైనవిగా, పౌరుల శ్రేయస్సు మరింత పెరిగేలా, ఆర్థిక వ్యవస్థలు రూపాంతరం చెందేవిధంగా, సరఫరా శ్రేణులు మరింత పునరుత్థాన శక్తి సంతరించుకునేలా చూడాలని నిర్ణయించారు. అలాగే నిష్పాక్షికత, జాతీయ భద్రత, ఉద్యోగ సృష్టికి భరోసా ఇచ్చేలా వృద్ధిని ప్రోత్సహించడంలో భాగంగా అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించాలని వారు సంకల్పించారు. ఈ మేరకు మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపును మించి 500 బిలియన్ డాలర్ల స్థాయిని దాటించే లక్ష్యంతో “మిషన్-500” పేరిట ఓ సాహసోపేత సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇంతటి ఆకాంక్షాత్మక లక్ష్యాలను సాధించాలంటే సరికొత్త, నిష్పాక్షిక-వాణిజ్య నిబంధనలు అవసరమని అంగీకరిస్తూ తమ ఆలోచనను ప్రకటించారు. ఈ మేరకు 2025 శీతాకాలం ముగిసే నాటికి పరస్పర ప్రయోజనకర, బహుళరంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) తొలిదశపై చర్చల పూర్తిపై నిర్ణయానికొచ్చారు. ఈ చర్చల పురోగమనంతోపాటు ‘కంపాక్ట్’ ఆకాంక్షలను వాణిజ్య బంధం పూర్తిగా ప్రతిబింబించే దిశగా సీనియర్ ప్రతినిధులను నియమించేందుకు సంసిద్ధత తెలిపారు. ఈ వినూత్న, విస్తృత శ్రేణి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా అమెరికా-భారత్ వస్తుసేవల రంగంలో ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతం, విస్తృతి నిమిత్తం రెండు దేశాలూ సమగ్ర విధానం అనుసరిస్తాయి. దీనికి అనుగుణంగా మార్కెట్ సౌలభ్యం పెంపు, సుంకాలు, టారిఫ్యేతర అవరోధాల తగ్గింపు, సరఫరా శ్రేణి ఏకీకరణ విస్తృతికి ఉభయ పక్షాలూ కృషి చేస్తాయి.
ద్వైపాక్షిక వాణిజ్యంలో అవరోధాల తొలగింపుపై పరస్పర కట్టుబాటు దిశగా సత్వర చర్యలు చేపట్టడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలో బోర్‌బాన్, మోటార్ సైకిళ్ళు, ‘ఐసిటి’ ఉత్పత్తులు, లోహ రంగాల్లో అమెరికాకు ప్రయోజనంగల ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు దిశగా భారత్ ఇటీవల తీసుకున్న చర్యలపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. అలాగే వైద్య పరికరాలు సహా ‘అల్ఫాల్ఫా’ పశుగ్రాసం, బాతు మాంసం వంటి తమ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం పెంచుతూ భారత్ చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. అదేవిధంగా తమ దేశం నుంచి మామిడి, దానిమ్మ ఎగుమతుల పెంపుపై అమెరికా తీసుకున్న చర్యలను భారత్ అభినందించింది. మరోవైపు భారత్‌కు, అమెరికా పారిశ్రామిక వస్తు ఎగుమతులతోపాటు అమెరికాకు భారత కార్మికశక్తి తయారీ ఉత్పత్తుల ఎగుమతుల పెంపు ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం విస్తృతికి సంయుక్తంగా కృషి చేయాలని ఉభయ వర్గాలు సంకల్పించాయి. అంతేకాకుండా వ్యవసాయ వస్తు వాణిజ్యం పెంచడానికి కూడా కలిసి పనిచేస్తాయి.
చివరగా- అమెరికా-భారత్ కంపెనీలు రెండు దేశాల్లోని అధిక విలువగల ఉత్పత్తుల తయారీ పరిశ్రమలలో పరస్పరం కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పించడంపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. దీనికి సంబంధించి సుమారు 7.35 బిలియన్ల విలువైన భారతీయ కంపెనీల పెట్టుబడులను వారు స్వాగతించారు. వీటిలో అలబామా, కెంటకీలలోని అత్యాధునిక పరిశ్రమలలో అల్యూమినియం వస్తూత్పత్తుల తయారీపై హిండాల్కో సంస్థ నోవెలిస్; టెక్సాస్, ఒహైయోలలోని ఉక్కు తయారీ కార్యకలాపాలలో జెఎస్‌డబ్ల్యు; ఉత్తర కరోలినాలో కీలక బ్యాటరీ పదార్థాల తయారీ సంస్థలో ఎప్సిలాన్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్; వాషింగ్టన్‌లో ఇంజెక్టబుల్స్ ఉత్పత్తుల తయారీలో జూబిలెంట్ ఫార్మా సంస్థల పెట్టుబడులున్నాయి. ఫలితంగా స్థానిక కుటుంబాలకు 3,000కుపైగా ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఇంధన భద్రత
రెండు దేశాలలో ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు, సాంకేతిక ఆవిష్కరణలకు ఇంధన భద్రత మూలాధారమని నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు. చౌకధర, విశ్వసనీయత, లభ్యత, సుస్థిరతగల ఇంధన మార్కెట్లకు భరోసా ఇవ్వడంలో అమెరికా-భారత్‌ల మధ్య సహకారానికిగల ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన రంగాన్ని నడిపించడంలో కీలక ఉత్పత్తిదారులు, వినియోగదారులుగా అమెరికా-భారత్‌ల ప్రధాన పాత్రను గుర్తిస్తూ, చమురు, గ్యాస్, పౌర అణుశక్తి సహా ఉభయదేశాల ఇంధన భద్రత భాగస్వామ్యంపై తమ కట్టుబాటును వారు పునరుద్ఘాటించారు.
ప్రపంచ ఇంధన ధరలను మెరుగ్గా ఉంచడంలో, ఉభయ దేశాల పౌరులకు చౌకధరతో, విశ్వసనీయ ఇంధన లభ్యతకు భరోసాగా హైడ్రోకార్బన్ల ఉత్పత్తి పెంపు ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ స్పష్టం చేశారు. సంక్షోభాల వేళ ఆర్థిక స్థిరత్వ పరిరక్షణలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకుగల విలువను గుర్తిస్తూ వ్యూహాత్మక చమురు నిల్వలకు సౌకర్యాల విస్తరణ దిశగా కీలక భాగస్వాములతో సంయుక్తంగా కృషి చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ)లో భారత్ శాశ్వత సభ్యత్వానికి దృఢంగా మద్దతిస్తామని అమెరికా ధ్రువీకరించింది.
ఇంధన భద్రతకు భరోసానిచ్చే కృషిలో భాగంగా ఇంధన వాణిజ్యం పెంపుపై తమ కట్టుబాటును నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. రెండు దేశాల గతిశీల ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న అవసరాలు-ప్రాధాన్యాల మేరకు భారత్‌కు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ద్రవీకృత సహజ వాయువు వంటి ఉత్పత్తుల ప్రధాన సరఫరాదారుగా అమెరికాను పరిగణనలోకి తీసుకునేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే సరఫరా వైవిధ్యీకరణ, ఇంధన భద్రతకు భరోసా కృషిలో భాగంగా సహజ వాయువు, ఈథేన్, పెట్రోలియం ఉత్పత్తులు సహా హైడ్రోకార్బన్ రంగంలో వాణిజ్యం పెంపు దిశగా అపార పరిధి, అవకాశాలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానంగా చమురు-గ్యాస్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల పెంపుతోపాటు రెండు దేశాల ఇంధన కంపెనీల మధ్య సహకార విస్తృతికి మార్గం సుగమం చేస్తామని నాయకులు ప్రకటించారు.
పెద్ద ఎత్తున స్థానికీకరణ, వీలైనంత మేర సాంకేతిక బదిలీ ద్వారా అమెరికా రూపొందించిన అణు రియాక్టర్లను భారత్‌లో నిర్మించడంలో ఉమ్మడి ప్రణాళికలతో ముందడుగు వేయాలని నాయకులిద్దరూ నిర్ణయించారు. ఈ మేరకు ‘అమెరికా-భారత్ 123’ పౌర అణు ఒప్పందం సంపూర్ణ అమలుపై వారు నిబద్ధత ప్రకటించారు. అణు రియాక్టర్లకు సంబంధించి అణుశక్తి చట్టంతోపాటు పౌర బాధ్యత సంబంధిత అణు నష్టపరిహార చట్టానికి (సిఎల్‌ఎన్‌డిఎ) సవరణలు చేపడతామని భారత్ ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించడాన్ని రెండు పక్షాలూ స్వాగతించాయి. అంతేకాకుండా పౌర బాధ్యత సమస్యను పరిష్కారంతోపాటు అణు రియాక్టర్ల ఉత్పత్తి-విస్తరణలో భారత-అమెరికా పరిశ్రమల మధ్య సహకార సౌలభ్యం దిశగా ‘సిఎల్‌ఎన్‌డిఎ’ నిర్దేశం మేరకు ద్వైపాక్షిక ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించాయి. దీంతో అమెరికా రూపొందించిన భారీ రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికల అమలుకు మార్గం సుగమం కాగలదు. అంతేకాకుండా అధునాతన చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రూపకల్పన, ఏర్పాటు ద్వారా అణు విద్యుదత్పాదన పెంపు దిశగా చర్యలకు ఇది వీలు కల్పిస్తుంది.
సాంకేతికత- ఆవిష్కరణ
రక్షణ, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాలలో కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల అన్వయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం-ప్రభుత్వం, విద్య - ప్రైవేట్ రంగ సహకారాన్ని పెంపొందించే యుఎస్-ఇండియా ట్రస్ట్ ("ట్రాన్స్ఫార్మింగ్ ది రిలేషన్షిప్ యాజ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ") ను ప్రారంభిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు.
ట్రస్ట్ కు కేంద్రబిందువుగా ఈ సంవత్సరం చివరి నాటికి కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడంపై యుఎస్-ఇండియా మార్గదర్శక ప్రణాళికను ముందుకు తీసుకురావడానికి రెండు దేశాల ప్రైవేట్ పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్టు నాయకులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిధులు సమకూర్చడం, నిర్మాణం, శక్తిని అందించడం, భారతదేశంలో పెద్ద ఎత్తున యుఎస్ మూలాలు కలిగిన ఏఐ మౌలిక సదుపాయాలను మెరుగైన భవిష్యత్తు చర్యలతో అనుసంధానించడానికి అడ్డంకులను గుర్తిస్తారు. అమెరికా, భారత్ కలిసి తదుపరి తరం డేటా సెంటర్లలో పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులకు మార్గం సుగమం చేయడానికి చర్యలు తీసుకుంటాయి. కృత్రిమ మేధ కోసం కోసం కంప్యూటింగ్ సామర్థ్యం, ప్రాసెసర్ల అభివృద్ధి, వాటిని అందుబాటులోకి తీసుకురావడం, ఎఐ నమూనాలలో నూతన ఆవిష్కరణలు చేయడం, అలాగే సామాజిక సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడానికి ఎఐ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో సహకరిస్తాయి. ఈ క్రమంలో ఈ సాంకేతికతల భద్రతకు, నియంత్రణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి కూడా ఉమ్మడిగా పనిచేస్తాయి.
విజయవంతమైన “ఇండస్-ఎక్స్” వేదికను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేసిన కొత్త ఇన్నోవేషన్ బ్రిడ్జ్ ‘ఇండస్ ఇన్నోవేషన్‘ ను ప్రారంభిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఇది అమెరికా-భారత పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే గాకుండా, అంతరిక్షం, ఇంధనం, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చడానికి, అలాగే ఆవిష్కరణలలో అమెరికా, భారతదేశాల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదం చేయనుంది.
రెండు దేశాల సైన్యాలలో కీలకమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమెరికా, భారత రక్షణ సంస్థలు, పెట్టుబడిదారులు విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని కల్పించే ఇండస్-ఎక్స్ చొరవకు నాయకులు నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే 2025 లో జరగనున్న తదుపరి శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించారు
ట్రస్ట్ చొరవలో భాగంగా సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలు, ఫార్మాస్యూటికల్స్ కోసం విశ్వసనీయమైన, సుస్థిరమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నాయకులు నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో భాగంగా, కీలక మందుల తయారీలో అవసరమైన క్రియాశీల ఔషధ పదార్ధాల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియెంట్స్- ఎపిఐ) కోసం అమెరికాతో సహా భారతీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడులు మంచి ఉద్యోగాలను సృష్టిస్తాయి. ముఖ్యమైన సరఫరా వ్యవస్థలను వైవిధ్యపరుస్తాయి. ఇంకా రెండు దేశాలలోనూ ప్రాణాలను రక్షించే మందుల కొరతను తగ్గిస్తాయి.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అధునాతన తయారీ కోసం కీలకమైన ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి, వాటి పరిశోధన, అభివృద్ధిలో సహకారాన్ని వేగవంతం చేయడానికి భారత్, అమెరికా అంగీకరించాయి. అలాగే మినరల్ సెక్యూరిటీ పార్టనర్షిప్ (ఎం ఎస్ పి) లో భాగస్వామ్య దేశాలుగా భారత్, అమెరికా మొత్తం కీలక ఖనిజాలపై పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. కీలకమైన ఖనిజాల అన్వేషణ, ప్రయోజనం, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో సహకారాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇందుకోసం అల్యూమినియం, బొగ్గు గనులు, చమురు, గ్యాస్ వంటి భారీ పరిశ్రమల నుంచి కీలకమైన ఖనిజాలను (లిథియం, కోబాల్ట్, అరుదైన భూ ఖనిజాలు సహా) వెలికితీయడానికి, , ప్రాసెస్ చేయడానికి “స్ట్రాటేజిక్ మినరల్ రికవరీ ఇనిషియేటివ్” అనే కొత్త అమెరికా-భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నేతలు ప్రకటించారు.
ఆక్సియోమ్ ద్వారా నాసా- ఇస్రో సహకారంతో భారతదేశం నుంచి మొదటి ఆస్ట్రోనాట్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువచ్చే ప్రణాళికలు, భూమి ఉపరితల మార్పులను ద్వంద్వ రాడార్ల సాయంతో క్రమబద్ధంగా మ్యాప్ చేసే ఏకైక మిషన్ అయిన సంయుక్త “నిసార్” మిషన్‌ను త్వరితగతిన ప్రారంభించే ప్రణాళికలతో 2025 సంవత్సరాన్ని అమెరికా-భారత్ పౌర అంతరిక్ష సహకారంలో మార్గదర్శక సంవత్సరం నేతలు ప్రశంసించారు. దీర్ఘకాలిక మానవ అంతరిక్ష యాత్రలు, అంతరిక్షయాన భద్రత, గ్రహాల రక్షణ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో నైపుణ్యం, వృత్తిపరమైన మార్పిడితో సహా అంతరిక్ష అన్వేషణలో మరింత సహకారం అవసరమని నాయకులు పిలుపునిచ్చారు. కనెక్టివిటీ, అధునాతన అంతరిక్షయానం, ఉపగ్రహ, అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు, అంతరిక్ష సుస్థిరత, అంతరిక్ష పర్యాటకం, అధునాతన అంతరిక్ష తయారీ వంటి సంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా మరింత వాణిజ్య అంతరిక్ష సహకారానికి నాయకులు నిబద్ధతను ప్రకటించారు.
భారత్, అమెరికా శాస్త పరిశోధనా వర్గాల మధ్య సంబంధాలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తూ, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను పరిశోధించడంలో యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారతీయ అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య కొత్త భాగస్వామ్యాన్ని నేతలు ప్రకటించారు. ఈ భాగస్వామ్యం సెమీ కండక్టర్లు, కనెక్టెడ్ వాహనాలు, మెషీన్ లెర్నింగ్, తదుపరి తరం టెలికమ్యూనికేషన్లు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ( ఐటిఎస్), భవిష్యత్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో సంయుక్త పరిశోధనకు అనుకూలంగా అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారతీయ శాస్త్రీయ సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలపరుస్తుంది.
ఎగుమతుల నియంత్రణలను పరిష్కరించడానికి, ఉన్నత స్థాయి సాంకేతిక వాణిజ్యాన్ని పెంచడానికి, రెండు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో అడ్డంకులను తగ్గించడానికి ప్రయత్నాలను రెట్టింపు చేయాలని నాయకులు నిర్ణయించారు. కీలకమైన సరఫరా వ్యవస్థల పరిమితికి మించిన కేంద్రీకరణను అవకాశంగా తీసుకోవాలని చూసే తృతీయ పక్షాల ఎగుమతి నియంత్రణలలో అన్యాయమైన పద్ధతులను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని నాయకులు తీర్మానించారు.
బహుళపక్ష సహకారం
స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతానికి అమెరికా, భారత్ మధ్య సన్నిహిత భాగస్వామ్యం కీలకమని నేతలు పునరుద్ఘాటించారు. క్వాడ్ భాగస్వాములుగా, ఈ భాగస్వామ్యం ఆసియాన్ కేంద్రీకరణను గుర్తించడంపై ఆధారపడి ఉందని నాయకులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలకు, సుపరిపాలనకు కట్టుబడి ఉండటం. సముద్ర మార్గాలలో భద్రత, స్వేచ్ఛా నౌకాయానం, విమాన ప్రయాణం సముద్రాల ఇతర చట్టబద్ధమైన ఉపయోగాలకు మద్దతు ఇవ్వడం, అలాగే చట్టబద్ధమైన వాణిజ్యాన్ని నిర్బంధాలు లేకుండా కొనసాగించడం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం వంటి అంశాలను పునరుద్ఘాటించారు.
ఢిల్లీలో జరగనున్న క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశానికి ముందు, ప్రకృతి వైపరీత్యాలపై ప్రజల స్పందనకు మద్దతు ఇవ్వడానికి సంయుక్త వైమానిక సామర్థ్యాన్ని పెంచే కొత్త క్వాడ్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పరస్పర పనితీరును మెరుగుపరచడానికి సముద్ర గస్తీని మెరుగుపరుస్తారు.
సహకారాన్ని పెంచాలని, దౌత్య సంప్రదింపులను పెంచాలని, మధ్యప్రాచ్యంలోని భాగస్వాములతో స్పష్టమైన సహకారాన్ని పెంపొందించాలని నాయకులు తీర్మానించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను పెంపొందించడానికి కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక కారిడార్లలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రాముఖ్యతను వారు వివరించారు. 2025లో కొత్త కార్యక్రమాలను ప్రకటించేందుకు, వచ్చే ఆరు నెలలలో భారత్- మధ్య ప్రాచ్యం -యూరప్ కారిడార్, ఐ2యూ2 గ్రూప్ భాగస్వాములను సమావేశపరచాలని నాయకులు భావిస్తున్నారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి, మానవతా సహాయం, భద్రతకు భరోసాగా భారతదేశం నిర్వహిస్తున్న పాత్రను అమెరికా ప్రశంసించింది. ఈ సందర్భంలో సువిశాల హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా ద్వైపాక్షిక చర్చలు, సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులు తమ నిబద్ధతను ప్రకటించారు. అలాగే, ఆర్థిక అనుసంధానం, వాణిజ్యానికి సమన్వయంతో పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన కొత్త ద్వైపాక్షిక, ప్రభుత్వస్థాయి వేదిక “ఇండియన్ ఓషన్ స్ట్రాటజిక్ వెంచర్”ను ప్రారంభించారు. గ్రేటర్ హిందూ మహాసముద్ర కనెక్టివిటీకి మద్దతు ఇస్తూ, సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టులో బహుళ బిలియన్ల, బహుళ సంవత్సరాల పెట్టుబడిని మెటా ప్రకటించడాన్ని నాయకులు స్వాగతించారు. ఇది ఈ సంవత్సరం పని ప్రారంభిస్తుంది. చివరికి ఐదు ఖండాలను అనుసంధానించడానికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ, అంతకు మించి ప్రపంచ డిజిటల్ రహదారులను బలోపేతం చేయడానికి 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది. విశ్వసనీయ విక్రేతలను ఉపయోగించి హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్స్ నిర్వహణ, మరమ్మతులు, పెట్టుబడులు పెట్టాలని భారత్ భావిస్తోంది.
రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం కీలకమైన ఖనిజాల మధ్య సంబంధాలు, వాణిజ్యం, సహకారాన్ని పెంపొందించడానికి పశ్చిమ హిందూ మహాసముద్రం, మధ్యప్రాచ్యం, ఇండో-పసిఫిక్ లో కొత్త బహుళపక్ష భాగస్వామ్యాల ఏర్పాటు అవసరాన్ని నాయకులు గుర్తించారు. 2025 నాటికి ఈ ఉప ప్రాంతాల్లో కొత్త భాగస్వామ్య కార్యక్రమాలను ప్రకటించాలని నేతలు భావిస్తున్నారు.
ప్రపంచ శాంతి, భద్రతల కోసం బహుళజాతి వేదికల్లో సైనిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేతలు తీర్మానించారు. అరేబియా సముద్రంలో సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ నావికా టాస్క్ ఫోర్స్ లో భవిష్యత్ నాయకత్వ పాత్రను చేపట్టాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు ప్రశంసించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై పోరాడాలని, ప్రపంచం నలుమూలల నుంచి ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలించాలని నేతలు పునరుద్ఘాటించారు. 26/11 ముంబయి దాడులు, 2021 ఆగస్టు 26న ఆఫ్ఘనిస్తాన్ లోని అబ్బే గేట్ బాంబు దాడి వంటి హేయమైన చర్యలను నివారించడానికి, అల్-ఖైదా, ఐఎస్ఐఎస్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి గ్రూపుల నుండి ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. తమ పౌరులకు హాని కలిగించే వారిని శిక్షించాలనే ఉమ్మడి ఆకాంక్షను గుర్తించిన అమెరికా తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. 26/11 ముంబై, పఠాన్ కోట్ దాడుల సూత్రధారులను త్వరితగతిన శిక్షించాలని, సీమాంతర ఉగ్రదాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని పాకిస్తాన్ కు నేతలు పిలుపునిచ్చారు. మారణాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి, వాటి పంపిణీ వ్యవస్థలను నిరోధించడానికి కలిసి పనిచేస్తామని, ఉగ్రవాదులు, ప్రభుత్వేతర వ్యక్తులు అటువంటి ఆయుధాలను పొందకుండా నిరోధిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
ప్రజల మధ్య సహకారం
ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ ప్రస్తావించారు. 3,00,000 మందికి పైగా బలమైన భారతీయ విద్యార్థి సమాజం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్లకు పైగా సమకూరుస్తోందని, అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడిందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగుల ప్రతిభ, చలనం రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చాయని వారు గుర్తించారు.ఆవిష్కరణను ప్రోత్సహించడం, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, భవిష్యత్ అవసరాలకు ఉద్యోగులను సిద్ధం చేయడంలో అంతర్జాతీయ విద్యా సహకారాల ప్రాధాన్యతను గుర్తించిన ఇరువురు నాయకులు ఉన్నత విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలపరచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సంయుక్త/డ్యుయల్ డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, సంయుక్త ప్రతిభా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అమెరికా లోని ప్రముఖ విద్యా సంస్థల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను భారత్ లో ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను అమలు చేయాలని సంకల్పించారు.
ప్రపంచం ఒక ప్రపంచ పని ప్రదేశంగా పరిణామం చెందడానికి సృజనాత్మక, పరస్పర ప్రయోజనకరమైన,సురక్షితమైన రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ఈ విషయంలో, విద్యార్థులు వృత్తి నిపుణుల చట్టపరమైన రాకపోకలకు స్వల్పకాలిక పర్యాటక, వ్యాపార ప్రయాణాన్ని సులభతరం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇరు దేశాల పరస్పర భద్రత కు హాని కలగకుండా అవాంఛనీయ, , నేర స్వభావం కలిగిన, అక్రమ పద్ధతుల్లో ప్రవేశించిన వ్యక్తుల, వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.
చట్టవిరుద్ధ వలస వ్యవస్థలు, మాదక ద్రవ్యాల ముఠాలు, మానవ, ఆయుధాల అక్రమ రవాణాదారులు, అలాగే ప్రజల భద్రతకు, దౌత్య భద్రతకు, ఇరుదేశాల స్వయంప్రతిపత్తికి, భౌగోళిక సమగ్రతకు ముప్పుగా మారే ఇతర శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాల అమలు సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలపరచాలని నిర్ణయించారు.
ఇరుదేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఉన్నత స్థాయి ఉన్నతస్థాయి పరస్పర సహకారాన్ని కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధానమంత్రి మోదీ సంకల్పం చెప్పుకున్నారు. ప్రకాశవంతమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి, ప్రపంచ శ్రేయస్సుకు, స్వేచ్ఛాయుత, సుస్థిర ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే స్థిరమైన భారత-అమెరికా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.