నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ ఆహ్వానించిన మీదట భారతదేశ ప్రధాన మంత్రి శ్రేష్ఠులైన శ్రీ నరేంద్ర మోదీ 2018 మే 11వ, 12వ తేదీలలో నేపాల్ ఆధికారిక పర్యటనకు తరలివచ్చారు.
2018వ సంవత్సరంలో వారి రెండో ద్వైపాక్షిక శిఖర సమ్మేళనానికి సూచికగా, ఇరువురు ప్రధానులు 2018 మే 11వ తేదీ నాడు ప్రతినిధివర్గ స్థాయి చర్చలను అత్యంత ఆదరభరితమైన మరియు సహృదయపూరితమైన వాతావరణంలో నిర్వహించారు. ఇది ఈ రెండు దేశాల నడుమ నెలకొన్న ప్రగాఢమైనటువంటి మైత్రికి మరియు సదవగాహనకు ప్రతీకగా నిలచింది.
2018 ఏప్రిల్ లో ప్రధాని శ్రీ ఓలీ ఆధికారిక పర్యటన కాలంలో న్యూ ఢిల్లీ లో జరిగిన తమ సమావేశాన్ని ఉభయ ప్రధానులు గుర్తుకు తెచ్చుకొన్నారు. అలాగే, ఆ పర్యటన ద్వారా చోటు చేసుకొన్నటువంటి పురోగతిని కొనసాగించాలని, ఇందుకోసం గతంలో చేసుకొన్న ఒప్పందాల అమలు దిశగా తగిన చర్యలు తీసుకోవాలని వారు అంగీకారానికి వచ్చారు. ప్రధాని శ్రీ ఓలీ భారతదేశంలో ఇటీవల పర్యటించిన కాలంలో అంగీకారం కుదిరిన మేరకు వ్యవసాయం, రైలు మార్గాల లంకెలు మరియు అంతర్దేశీయ జల మార్గాల అభివృద్ధి అంశాలలో ఇరు దేశాలలో దీటైన కార్యక్రమాలను చేపట్టాలని కూడా వారు అంగీకరించారు. ఇలా చేయడం వల్ల ఆయా రంగాలలో పరివర్తనపూర్వక ప్రభావం ఉండగలదని వారు భావించారు.
ఇరు దేశాల మధ్య వేరు వేరు స్థాయిలలో సన్నిహితమైనటువంటి మరియు బహుముఖీనమైనటువంటి సంబంధాలను ఇద్దరు ప్రధానులు సమీక్షిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖర స్థాయికి చేర్చే దిశగా కృషి చేయాలని, విభిన్నరంగాలలో ప్రస్తుతం ఇచ్చి పుచ్చుకొంటున్న సహకారాన్ని పటిష్టపరచుకోవడంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికై భాగస్వామ్యాన్ని సమానత్వం, పరస్పర విశ్వాసం,గౌరవం మరియు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన విస్తరించుకోవాలని సంకల్పించారు.
మొత్తంమీద ద్వైపాక్షిక సంబంధాల స్థితిని సమీక్షించడం కోసం మరియు ఆర్థిక, అభివృద్ధి సహకార పథకాల అమలును వేగవంతం చేయడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయిలో నేపాల్- ఇండియా జాయింట్ కమిశన్ సహా ద్వైపాక్షిక యంత్రాంగాలను క్రమం తప్పక సమావేశపరుస్తూ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇరువురు ప్రధానులు స్పష్టీకరించారు.
భారతదేశం మరియు నేపాల్ ల మధ్య వ్యాపార, ఆర్థిక బంధాలకు ప్రాముఖ్యం ఉన్నదని ఇరువురు ప్రధానులు గ్రహించారు. భారతదేశంతో నేపాల్ యొక్క వ్యాపార లోటు అంతకంతకు పెరిగిపోతుండడంపై ప్రధాని శ్రీ ఓలీ ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఈ లోటు సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. ఈ సందర్భంలో, ప్రధానులు ఇరువురు ఇటీవలే జరిగిన ఇంటర్- గవర్నమెంటల్ కమిటీ మీటింగ్ ఆన్ ట్రేడ్, ట్రాన్సిట్ అండ్ కోఆపరేశన్ యొక్క ఫలితాన్ని స్వాగతించారు. అనధికార వ్యాపారాన్ని నియంత్రించడం కోసం ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందంపై ఒక సమగ్ర సమీక్షను సంయుక్తంగా మొదలుపెట్టాలని, భారతదేశ విపణి నేపాల్ కు అందుబాటులోకి వచ్చే విధంగా ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్, తదితర ఒప్పందాలకు సవరణలను పరిశీలించాలని తలపోశారు. తద్వారా మొత్తంమీద ద్వైపాక్షిక వ్యాపారం పెంపొందగలదని, నేపాల్ కు ట్రాన్సిట్ ట్రేడ్ సుగమం కాగలదని భావించారు.
ఆర్థిక వృద్ధి ని ఉత్తేజితం చేయడంలో, ప్రజలకు- ప్రజలకు మధ్య రాకపోకలను ప్రోత్సహించడంలో సంధానం ఉత్ప్రేరక పాత్ర ను పోషించగలదని ప్రధానులు ఇరువురూ గమనించారు. భూమి, జలం మరియు గగనతలం.. ఈ మూడు మార్గాల పరంగా భౌతిక సంధానాన్ని, ఆర్థిక సంధానాన్ని తీవ్రీకరించేందుకు మరిన్ని చర్యలను చేపట్టాలని వారు అంగీకరించారు. ప్రజలకు- ప్రజలకు మధ్య గతిశీల సంబంధాలు మరియు స్నేహపూరితమైన ద్వైపాక్షిక సంబంధాలను పరిగణన లోకి తీసుకొంటూ, పౌర విమానయాన రంగంలో సహకారాన్ని విస్తరించాలని, అలాగే, నేపాల్ కు అదనపు గగనతల ప్రవేశ మార్గాలపైన సాంకేతిక చర్చను ఆయా సాంకేతిక బృందాలు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు.
సేద్యపు నీటి పారుదల, వరదల నిర్వహణ, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఇంకా రివర్ ట్రేనింగ్ వర్క్స్ ల వంటి రంగాలలో పరస్పర ప్రయోజనం కోసం జల వనరుల పరంగా సహకారాన్ని పెంపొందించుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ఇరు ప్రధానులు పునరుద్ఘాటించారు. సంయుక్త దళం నియామకం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ దళం జలమయమైన ప్రాంతాలను మరియు వరదల బారిన పడిన ప్రాంతాలను సందర్శించి ఒక స్థిర పరిష్కారం కోసం తీసుకోదగ్గ సముచిత చర్యలను గురించి పరిశీలిస్తుంది.
నేపాల్ లో 900 ఎమ్ డబ్ల్యు శక్తిని కలిగివుండేటటువంటి అరుణ్-III జల విద్యుత్తు ప్రోజెక్టు కు ఇరువురు ప్రధానులు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. విద్యుత్తు ఉత్పాదనలో, విద్యుత్తు వ్యాపారం లో రెండు దేశాల మధ్య సహకారం ఇనుమడించడానికి ఈ ప్రోజెక్టు కార్యకలాపాల ఆరంభం తోడ్పడగలుగుతుందన్న ఆశాభావాన్ని వారు వెలిబుచ్చారు. విద్యుత్తు రంగంలో సహకారం కోసం 2018 ఏప్రిల్ 17వ తేదీ నాడు జరిగినటువంటి సంయుక్త సారథ్య సంఘం సమావేశం తాలూకు పర్యవసానాన్ని ఉభయ ప్రధానమంత్రులు స్వాగతించారు. విద్యుత్తు రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని- ద్వైపాక్షిక విద్యుత్తు వ్యాపార ఒప్పందానికి అనుగుణంగా- పెంచుకోవాలని వారు అంగీకారానికి వచ్చారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ జనక్ పుర్ మరియు ముక్తి నాథ్ లను కూడా సందర్శించారు. జనక్ పుర్, ఇంకా కాఠ్ మాండూ లలో జరిగిన పౌర స్వాగత కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.
ఇరు దేశాల మధ్య, ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్నటువంటి సన్నిహితమైన మతపర మరియు సాంస్కృతికపర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో రామాయణ ఇతిహాసం తో సంబంధం ఉన్నటువంటి అయోధ్య, తదితర స్థలాలతో సీతాదేవి జన్మస్థలమైనటువంటి జనక్ పుర్ ను సంధానించే ‘నేపాల్- ఇండియా రామాయణ సర్క్యూట్’ ను ఇరువురు ప్రధానులు కలసి ప్రారంభించారు. జనక్ పుర్ మరియు అయోధ్య ల నడుమ తిరిగే నేరు బస్సు సర్వీసు కు ఇరువురు ప్రధానులు జనక్ పుర్ లో పచ్చ జెండాను చూపడం ద్వారా ప్రారంభించారు.
పరిష్కారం మిగిలివున్నటువంటి అంశాలను అన్ని రంగాలలో సహకారాన్ని పెంపొందింపచేసుకొనే లక్ష్యంతో- 2018 సెప్టెంబరు కల్లా ఓ కొలిక్కి తీసుకురావలసిందిగా- సంబంధిత అధికారులను ఇరువురు ప్రధానులు ఆదేశించారు.
గుర్తించిన రంగాలలో అర్ధవంతమైన సహకారం ఏర్పరచుకోవడం కోసం బిఐఎమ్ఎస్ టిఇసి, ఎస్ఎఎఆర్ సి మరియు బిబిఐఎన్ ఫ్రేమ్ వర్క్ లలో భాగంగా ప్రాంతీయ స్థాయిలో, ఉప- ప్రాంతీయ స్థాయిలో సహకరించుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ఇరువురు ప్రధానులు నొక్కిపలికారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ నేపాల్ లో చరిత్రాత్మకంగా జరిపిన మూడో పర్యటన రెండు దేశాల మధ్య చాలా కాలం నాటి నుండి ఉన్న స్నేహ సంబంధాలను మరింత బలపరచిందని, మన మధ్య వర్ధిల్లుతున్నటువంటి భాగస్వామ్యానికి ఒక తాజా ప్రేరణను అందించిందని ఉభయ ప్రధానులు అంగీకరించారు.
ప్రధాని ఓలీ అనుగ్రహ పూర్ణమైన ఆహ్వానంతో పాటు ఆత్మీయ ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గాను ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు.
భారతదేశానికి తరలిరావలసిందంటూ ప్రధాని శ్రీ ఓలీ కి ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానాన్ని అందించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని శ్రీ ఓలీ మన్నించారు; దౌత్య వర్గాల సంప్రదింపుల అనంతరం తేదీలను ఖరారు చేయడం జరుగుతుంది.