1. శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు. ఉభయ దేశాల నాయకుల మధ్య నిరంతర ఉన్నత స్థాయి సంప్రదింపుల ప్రక్రియలో ఈ పర్యటన ఒక భాగమే కాకుండా మాననీయ ప్రెసిడెంట్ శ్రీ యు హ తిన్ క్యావ్, గౌరవనీయురాలు, ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ లు గడచిన సంవత్సరంలో భారతదేశంలో జరిపిన పర్యటనలకు కొనసాగింపుగా కూడా ఈ పర్యటన చోటుచేసుకొంటోంది.
2. సెప్టెంబర్ 5వ తేదీన ప్రధాన మంత్రి శ్రీ మోదీకి నే ప్యీ తావ్ లో అధ్యక్ష భవనం వద్ద సాదర స్వాగతం లభించింది. మయన్మార్ అధ్యక్షుల వారితో ప్రధాన మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి గౌరవార్ధం అధ్యక్ష భవనంలో విందు సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. సెప్టెంబర్ 6వ తేదీన ప్రధాన మంత్రి నాయకత్వంలోని భారత ప్రతినిధి వర్గం గౌరవనీయురాలైన మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ నాయకత్వంలోని మయన్మార్ ప్రతినిధి వర్గంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సుహృద్భావపూర్వకమైన, నిర్మాణాత్మకమైన వాతావరణంలో- ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేటట్లు- ఈ చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆరోగ్యం, సంస్కృతి, సంస్థాగత సామర్థ్యాల నిర్మాణం, సాగర జలాల భద్రత, కీలక సంస్థల మధ్య సహకారం వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య సహకారానికి దోహదపడే ఒప్పందాలపై ప్రధాన మంత్రి, మయన్మార్ ప్రభుత్వ సలహాదారు ల సమక్షంలో సంతకాలతో పాటు, ఆయా పత్రాల ఆదాన ప్రదానం కార్యక్రమం జరిగింది.
3. నే ప్యీ తావ్ లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ప్రధాన మంత్రి బాగాన్, యాంగూన్ లలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శిస్తారు. బాగాన్ లో భారతీయ పురాతత్త్వ సర్వేక్షణ కు చెందిన నిపుణుల పర్యవేక్షణలో పునర్నిర్మాణం జరుగుతున్న పవిత్రమైన, చారిత్రక ఆనందా దేవాలయాన్ని ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ప్రధాన మంత్రి యాంగూన్ లో మృతవీరుల భవ్య సమాధిని సందర్శించి జనరల్ ఆంగ్ సాన్ కు వందనాలు ఆచరిస్తారు. బాగ్ యోక్ ఆంగ్ సాన్ వస్తు ప్రదర్శన శాలను, ఇతర ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. యాంగూన్ లో బస చేసే సమయంలో ప్రధాన మంత్రి యాంగూన్ లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రజలను కలుస్తారు.
4. ఉభయ దేశాల నాయకులు చర్చల సందర్భంగా- మయన్మార్ అధ్యక్షుల వారు, మయన్మార్ ప్రభుత్వ సలహాదారు 2016 ఆగస్టు, అక్టోబర్ నెలల్లో భారతదేశంలో జరిపిన పర్యటనల అనంతరం చోటు చేసుకొన్న పురోగతి పై- సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య జరుగుతున్న అధికారుల స్థాయి చర్చలు, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, ప్రజా సంబంధాలపై సమీక్షించారు. మయన్మార్ అనుసరిస్తున్న సర్వ స్వతంత్ర, క్రియాశీల, అలీన విదేశాంగ విధానం, భారతదేశం అనుసరిస్తున్న ఇతరులకు మార్గదర్శకమైన ‘ఈస్ట్ యాక్ట్ పాలిసి’, ‘నేబర్ హుడ్ ఫస్ట్ పాలిసి’ల లోని సామరస్య ధోరణికి ఇది నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఉభయ దేశాల ప్రజల పరస్పర లాభానికి దోహదపడే విధంగా ద్వైపాక్షిక బంధాన్ని మరింత లోతుగా విస్తరించుకోవడానికి గల అవకాశాలను అన్వేషించాలని వారు వచనబద్ధతను ప్రకటించారు. ప్రాంతీయంగాను, వెలుపల కూడా శాంతి, ఉమ్మడి సుసంపన్నత, అభివృద్ధి ల కోసం ఉభయుల ఉమ్మడి కట్టుబాటును వారు పునరుద్ఘాటించారు.
5. మయన్మార్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న శాంతి స్థాపన ప్రక్రియను ప్రశంసించడంతో పాటు జాతీయ స్థాయిలో సయోధ్య, శాంతి సాధనకు చేపడుతున్న చర్యలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. మయన్మార్‌లో శాంతి, సుస్థిరతలు భారతదేశానికిఅత్యంత ప్రాధాన్యతాపూర్వకమైన అంశమని ఆయన చెప్పారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య సంస్థలు సమీకృతం కావడానికి, డెమోక్రాటిక్ ఫెడరల్ రిపబ్లిక్ మనుగడకు భారత ప్రభుత్వం మద్దతును కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
6. సరిహద్దుల్లోని ప్రస్తుత భద్రతను ఉభయ నాయకులు సమీక్షించి ఇటీవల తమ భూభాగాల్లో చోటు చేసుకున్న ఉగ్రవాద చర్యలు, తీవ్రవాద ప్రేరేపిత చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా శాంతి సామరస్యాలకు అమితమైన ముప్పు తెస్తున్న వాటిలో ఉగ్రవాదం ప్రధానమైనదని గుర్తించడంతో పాటు అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటాన్ని ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకే పరిమితం చేయకుండా ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద నెట్ వర్క్ లను కూడా లక్ష్యంగా చేసుకొని నిర్వహించాలని, వారికి మద్దతును, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంస్థలు, ప్రోత్సాహాన్ని, ఆశ్రయాన్ని ఇస్తున్న దేశాల పట్ల, ఉగ్రవాదుల చర్యలను వారి విజయంగా ప్రచారం చేసే దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉభయ దేశాల నాయకులు నిర్ణయించారు. అమరనాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని, సీమాంతర ఉగ్రవాదుల ప్రేరేపణతో సాగిన దాడులను మయన్మార్ ఖండించింది. ఇటీవల పలువురు మయన్మార్ భద్రత సిబ్బంది మరణానికి కారణం అయిన ఉత్తర రఖైన్ రాష్ర్టంలో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశం ఖండించింది. ఉగ్రవాదం మానవ హక్కుల అతిక్రమణం అన్న విషయం ఉభయ వర్గాలు అంగీకరిస్తూ ఉగ్రవాదాలను మృత వీరులుగా స్తుతించే ధోరణులను ఖండించారు. ఉగ్రవాదుల అణచివేత విషయంలో ఎంపిక ప్రాతిపదికన వ్యవహరించడం, పక్షపాత ధోరణులు అనుసరించడాన్ని అంతర్జాతీయ సమాజం అంతం చేయాలని వారు పిలుపు ఇచ్చారు. సమగ్ర అంతర్జాతీయ ఉగ్రవాద ఒడంబడికకు సత్వరం తుదిరూపాన్నిచ్చి ఆమోదింపచేయాలని ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు ఉమ్మడిగా పిలుపు ఇచ్చారు.
7. సరిహద్దు ప్రాంతాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉమ్మడి సరిహద్దు వెంబడి శాంతి, సుస్థిరతలు నెలకొల్పడం కీలకమని వారు గుర్తించారు. భారతదేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను తాను గౌరవిస్తున్నట్టు మయన్మార్ పునరుద్ఘాటించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు జరిపేందుకు మయన్మార్ భూభాగాన్ని తిరుగుబాటు శక్తులు ఉపయోగించుకోవడాన్ని అనుమతించకూడదన్న విధానాన్ని కొనసాగించనున్నట్టు ప్రకటించింది. అదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నందుకు భారత ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
8. ఉభయ దేశాల మధ్య ఇప్పటికే గుర్తించిన సరిహద్దు రేఖను పరస్పరం గౌరవించడంతో పాటు మిగతా సరిహద్దు రేఖ గుర్తింపు ప్రక్రియను కూడా ప్రస్తుత ద్వైపాక్షిక అంగీకారానికి, సంప్రదింపులకు లోబడి సత్వరం పూర్తి చేయాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి.
9. తమ తక్షణ పొరుగు ప్రాంతాల్లో భద్రత స్థితిగతులను ఉభయ దేశాలు సమీక్షించడంతో పాటు సాగర జలాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవలసిన అవసరాన్ని కూడా గుర్తించాయి. ఉభయ దేశాలు రక్షణ సహకారాన్ని పరస్పర ప్రయోజనకరంగా విస్తరించుకోవాలని నిర్ణయించాయి. ఇటీవల మయన్మార్ రక్షణ బలగాల కమాండర్- ఇన్- చీఫ్ భారతదేశ పర్యటన విజయవంతం కావడం పట్ల సంతృప్తి ప్రకటించాయి. సమన్వయ ధోరణిలో క్రమం తప్పకుండా గస్తీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వ్యవస్థాత్మక సహకారాన్ని సైతం విస్తరించుకోవాలని, వైపరీత్యాల సమయంలో సహాయం, మానవతాపూర్వక సహకారం వంటి సాంప్రదాయేతర భద్రత విభాగాలలో ద్వైపాక్షిక సాగర జలాల సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని కూడా నిర్ణయించాయి. బంగాళాఖాతంలోను, హిందూ మహా సముద్రం లోను ప్రయోజనాల పరిరక్షణకు ఇది కీలకమని గుర్తించాయి.
10. ఉభయ దేశాల మధ్య ఇప్పటికే నెలకొన్న పరస్పర అవగాహనను, ద్వైపాక్షిక బంధాన్ని కొనసాగించుకోవడంతో పాటు ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, విస్తృత ప్రాంతీయ ప్రయోజనాలు లక్ష్యంగా మరింత సుహృద్భావం, నమ్మకంతో సహకరించుకోవాలని ఉభయ పక్షాలు ప్రతిన బూనాయి.
11. ఉభయ దేశాల మధ్య అత్యున్నత అధికారుల స్థాయి పర్యటనలు కొనసాగడం వల్ల ద్వైపాక్షిక అంశాల పట్ల పరస్పరం మరింత లోతైన అవగాహన ఏర్పడిందని ఉభయులు సంతృప్తి ప్రకటించారు. రక్షణ, వ్యాపారం/ వాణిజ్యం, విద్యుత్తు, ఇంధన, సరిహద్దుల నిర్వహణ, అనుసంధానం విభాగాలలో రంగాల వారీ వ్యవస్థాత్మక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల రాజకీయ స్థాయిలో సమర్థవంతంగా కొనసాగింపు నిర్ణయాలు తీసుకోగల వాతావరణం ఏర్పడిందని వారు ప్రశంసించారు. ఉభయ దేశాల పార్లమెంటేరియన్ ల మధ్య సన్నిహిత సహకారం నెలకొనడం పట్ల సంతృప్తి ప్రకటిస్తూ ఈ సహకారం, సంప్రదింపులు కొనసాగించుకొనేలా వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
12. మయన్మార్ సామాజిక, ఆర్థికాభివృద్ధికి భారతదేశం అందిస్తున్నసహకారం పట్ల ఆ దేశం సంతృప్తి ప్రకటించింది. భారత ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సహకారంతో అమలవుతున్న సహకార ప్రాజెక్టులను ఉభయ దేశాలు సమీక్షించాయి. ఇవి నేరుగా మయన్మార్ ప్రజలకు లాభం చేకూరుస్తాయని అంగీకరిస్తూ వాటిని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించాయి. మౌలిక వసతుల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు కోసం మయన్మార్ చేస్తున్న కృషికి భారతదేశ నిరంతర కట్టుబాటును ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. భారతదేశ సహకారంతో పకోక్కు, మింగ్ యాన్ లలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటిసి లు) అందించిన సానుకూల ప్రభావాన్నికొనియాడిన మయన్మార్ మొనీవా, థాటన్ లలో మరో రెండు ఐసిటిల అభివృద్ధికి సహకారం అందించేందుకు అంగీకరించినందుకు, మింగ్ యాన్ ఐటిసి కి అయిదు సంవత్సరాల సమగ్ర మెయింటెనెన్స్ ప్రణాళిక అందించినందుకు భారత్ కు కృతజ్ఞతలు తెలిపింది. యాంగాన్ లో ఏర్పాటైన మయన్మార్-ఇండియా ఆంత్ర ప్రన్యోర్ షిప్ డివెలప్ మెంట్ సెంటర్, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రేనింగ్ స్థాయిని పెంచడానికి భారతదేశం అంగీకరించడం పట్ల మయన్మార్ కృతజ్ఞతలు తెలిపింది. మయన్మార్ యువతలో శాస్త్రీయ ధోరణులు పెంచడం లక్ష్యంగా మయన్మార్ లోని ఒక అనుకూలమైన ప్రదేశంలో వేధశాల ఏర్పాటుకు చర్చలు కొనసాగించాలని ఉభయ వర్గాలు అంగీకరించాయి.
13. భద్రతపరంగాను, అభివృద్ధిపరంగాను ప్రాధాన్యం గల రఖైన్ రాష్ర్టం లోని పరిస్థితిని ఉభయ వర్గాలు సమీక్షించాయి. మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, అనుబంధ రంగాలు, వ్యవసాయ ప్రాసెసింగ్, కమ్యూనిటీ డివెలప్ మెంట్ విభాగాల్లో ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు చిన్న వంతెనల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, చిన్న స్థాయి విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు, జీవనోపాధి కార్యకలాపాలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ఇంటి నుండి చేపట్టే కళల ప్రోత్సాహం, పర్యావరణ- సాంస్కృతిక పరిరక్షణ వంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధనకు కృషి చేయాలని ఉభయులు అంగీకరించారు. రఖైన్ రాష్ర్ట అభివృద్ధి కార్యక్రమానికి సహాయం అందించేందుకు భారతదేశం ముందుకు రావడాన్ని మయన్మార్ స్వాగతించింది. వచ్చే కొద్ది నెలల కాలంలో ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన విధివిధానాలకు తుది రూపం ఇవ్వాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి.
14. వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ విద్య రంగాలలో సహకారం పట్ల ఉభయ దేశాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రధానంగా యెజిన్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ పరిశోధన, విద్యా కేంద్రం ఏర్పాటు, వ్యవసాయ పరిశోధన శాఖ పరిధిలో రైస్ బయో పార్క్ ఏర్పాటు పనులు వేగం పుంజుకోవడం పట్ల కూడా సంతృప్తి ప్రకటించాయి. మయన్మార్ కు చెందిన అభ్యర్థులకు వ్యవసాయ శాస్త్రాలలో స్నాతకోత్తర, డాక్టరేట్ కార్యక్రమాలకు భారతదేశం సహకారాన్ని మయన్మార్ ప్రశంసించింది.
15. మయన్మార్ న్యాయశాఖ అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసు సిబ్బంది సామర్థ్యాల నిర్మాణానికి అమలు జరుగుతున్న కార్యక్రమాల పట్ల ఉభయ వర్గాలు సంతృప్తి ప్రకటించాయి. మయన్మార్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజి, ఇండియా- మయన్మార్ సెంటర్ ఫర్ ఎన్ హాన్స్ మెంట్ ఆఫ్ ఐటి స్కిల్స్ లకు సహకారాన్ని పొడిగించడం పట్ల కూడా మయన్మార్ ధన్యవాదాలు తెలిపింది. న్యూ ఢిల్లీ లోని ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో మయన్మార్ దౌత్యవేత్తలకు శిక్షణ ఇవ్వడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరింది. కేంద్రీయ హిందీ సంస్థాన్ లో ప్రతి సంవత్సరం ఇద్దరు మయన్మార్ దౌత్యవేత్తలను చేర్చుకునేందుకు, ప్రతి ఏడాది 150 మంది మయన్మార్ సివిల్ ఉద్యోగులకు ఇండియన్ ట్రేనింగ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ ఇచ్చేందుకు భారత్ సంసిద్ధత ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
16. మయన్మార్ పోలీసు విభాగంలో శిక్షణ వసతులను మరింత మెరుగుపరిచేందుకు, సామర్థ్యాల నిర్మాణానికి గత ప్రాధాన్యాన్ని గుర్తించి మయన్మార్ లోని యామెథిన్ లో మహిళా పోలీసు శిక్షణ కేంద్రం భారత ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సహాయంతో మరింత అభివృద్ధి చేసేందుకు ఒక అవగాహనా ఒప్పందం కుదరడాన్ని ఉభయ దేశాల నాయకులు ఆహ్వానించారు. యాంగూన్ లో పోలీసు అధికారుల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భారత ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించడాన్ని మయన్మార్ ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఉభయులు కలిసి చేపట్టాలని నిర్ణయించారు.
17. భారత ప్రభుత్వం నుండి నూరు శాతం గ్రాంట్- ఇన్- ఎయిడ్ తో చేపడుతున్న కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టు, మరో రోడ్డు వంతెన నిర్మాణం ప్రాజెక్టులు ఉభయ దేశాల మధ్య అనుసంధానంలో కీలకంగా నిలుస్తాయంటూ వాటితో సహా వివిధ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వడం పట్ల మయన్మార్ కృతజ్ఞతలు తెలిపింది. కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టులో భాగంగా సిత్వె పోర్టు, పలెట్వా ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ టర్మినల్ పూర్తి కావడాన్ని, ఆరు కార్గో బార్జ్ లు అప్పగించడాన్నిమయన్మార్ అభినందించింది. మయన్మార్ లోని ఇతర అంతర్జాతీయ పోర్టులలో అనుసరిస్తున్న విధంగానే పోర్టు నిర్వహణకు, మెయింటెనెన్స్ కు ఒక ఆపరేటర్ ను ఉమ్మడిగా ఏర్పాటు చేసుకునేందుకు ఒక ఎమ్ఒయును కుదుర్చుకోవాలని ఉభయ దేశాలు అంగీకరించాయి. దీని వల్ల పోర్టు, ఐడబ్ల్యుటి మౌలిక వసతులను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి, ప్రాజెక్టులో చివరిదైన పలెట్వా-జోరిన్ పురి రోడ్డు అభివృద్ధికి కూడా వీలు కలుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణంలో ఇప్పటికి ఏర్పడిన పురోగతి పట్ల ఉభయ వర్గాలు సంతృప్తిని ప్రకటిస్తూ నిర్మాణ సిబ్బంది, పరికరాలు సరిహద్దు ద్వారా ప్రయాణించేందుకు అనుమతించాలని ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చాయి. తాము-క్యియోగ్నే-కలేవా రోడ్డు, కలేవా-యార్గ్యి సెక్టార్ లో త్రైపాక్షిక హైవే నిర్మాణం త్వరలో ప్రారంభించాలని నిర్ణయించాయి. రిహ్-తెడిమ్ రోడ్డు అలైన్ మెంట్ కు, నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ను రూపొందించేందుకు ఉభయ వర్గాలు అంగీకరించాయి. అలాగే డిపిఆర్ లు తయారైన అనంతరం ప్రస్తుత ఎల్ఒసి వెంబడి పుతాఓ-మ్యిత్క్యినా, అలెతంక్యా-అహుంగ్మా రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఉభయ వర్గాలు అంగీకరించాయి. మయన్మార్ అభ్యర్థన మేరకు రిఖ్వాదార్-జోఖాతర్ వంతెన, బ్వ్యాను వంతెనల నిర్మాణానికి డిపిఆర్ లు తయారుచేయించేందుకు భారతదేశం అంగీకరించింది.
18. ఆరోగ్య రంగంలో అమలు జరుగుతున్న ప్రాజెక్టులను కూడా ఉభయులు సమీక్షించారు. మోనీవా జనరల్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడం పట్ల, యాంగాన్ పిల్లల ఆస్పత్రి, సిత్వే జనరల్ ఆస్పత్రి నిర్మాణంలో పురోగతి పట్ల సంతృప్తి ప్రకటించాయి. ఉభయుల మధ్య అంగీకారయోగ్యమైన విధివిధానాల పరిధిలో భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ హాస్పిటల్ గ్రూప్ ల సహకారంతో నై పీ తాలో ఒక అత్యాధునిక వసతులు గల ఆస్పత్రి ఏర్పాటు, నిర్వహణపై చర్చలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.
19. భారతదేశం 2012లో మయన్మార్‌కు రాయితీపై అందజేసిన 500 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం వినియోగ ప్రగతిపై రెండు పక్షాలు సమీక్షించాయి. ఈ రుణ సదుపాయం కింద అమలు చేయ తలపెట్టిన ప్రాజెక్టుల వల్ల కీలక రంగాలలో భౌతిక మౌలిక సదుపాయాలు వేగంగా రూపుదిద్దుకొంటాయని, తదనుగుణంగా వ్యవసాయం, రవాణా రంగాలలో సామర్థ్యం మెరుగుపడుతుందని గుర్తించాయి. ఆ మేరకు పరస్పరం ఆమోదించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని నిశ్చయించాయి.
20. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా సంపూర్ణ ప్రయోజనం రాబట్టుకొనేందుకు వీలుగా సంధానానికి సంబంధించిన వ్యవస్థాగత ఏర్పాట్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని రెండు పక్షాలు అభిప్రాయపడ్డాయి. ఈ దిశగా సరిహద్దులు దాటుతూ సరుకుల రవాణా- ప్రయాణికుల చేరవేత సంబంధిత మోటారు వాహనాల రాకపోకలు సాగేందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పంద ప్రక్రియ పూర్తికి గల ప్రాముఖ్యాన్ని గుర్తించాయి.
21. భారతదేశం- మయన్మార్ ల మధ్య విద్యుత్తు, ఇంధన సరఫరా వ్యవస్థలను మరింత సమన్వయం చేయవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. తమ దేశంలో ఇంధన రంగానికి సంబంధించి అన్వేషణ, ఉత్పత్తిలో భారతదేశ భాగస్వామ్యంపై మయన్మార్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమ దేశంలో పెట్రో రసాయనాలు, పెట్రో ఉత్పత్తులు, మార్కెటింగ్ మౌలిక వసతుల కల్పన, ద్రవీకృత పెట్రోలియమ్ గ్యాస్ (LPG) టర్మినల్స్ నిర్మాణం తదితర టెండర్లలో పాల్గొనాల్సిందిగా భారత కంపెనీలకు ఆహ్వానం పలికింది. భారతదేశంలోని ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీలు మయన్మార్ లో కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టినట్లు భారత్ తెలిపింది. భూ సరిహద్దు ద్వారా మయన్మార్‌కు డీజిల్ సరఫరా కోసం భారత- మయన్మార్‌లకు చెందిన నుమాలిగఢ్ రిఫైనరీ, పరమి ఎనర్జీ గ్రూపుల మధ్య ఒప్పందం కుదరడంపై రెండు పక్షాలు అభినందనలు తెలిపాయి. దీనివల్ల ఉత్తర మయన్మార్ ప్రజలకు పెట్రోలియమ్ ఉత్పత్తులు చౌక ధరలో సదా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నాయి. ఆ మేరకు మయన్మార్‌లో పెట్రో ఉత్పత్తుల నిల్వ, చిల్లర విక్రయ కార్యకలాపాల దిశగా రెండు సంస్థలు సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకొనేందుకు ప్రోత్సహిస్తామని ప్రకటించాయి. రెండు సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా 2017 సెప్టెంబరు 4వ తేదీన తొలి విడత కింద హైస్పీడ్ డీజిల్ మయన్మార్ కు చేరుకొంది.
22. మయన్మార్ ప్రభుత్వం గుర్తించిన మేరకు సాంప్రదాయక, నవీకరణయోగ్య శక్తి ఆధారిత విద్యుత్తు పథకాలకు సాంకేతికపరమైన, ప్రాజెక్టుల వారీ సహకారాన్ని అందించేందుకు భారతదేశం సంసిద్ధతను వ్యక్తం చేసింది. దీనితో పాటు మయన్మార్ లో సోలార్ పార్కుల అభివృద్ధి ఆచరణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం నిర్వహణకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో సౌర శక్తి ప్రసార వనరుల అంచనా నిర్వహణకూ భారతదేశం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇంధన సామర్థ్య రంగంలో రెండు దేశాల మధ్య సహకార మార్గాలకు గల అవకాశాల పైనా ఉభయ పక్షాలు చర్చించాయి. తమ దేశంలోని రఖైన్ రాష్ట్రంలో, బాగో ప్రాంతంలో, రాజధాని నే ప్యీ డావ్ లో ప్రభుత్వం గుర్తించిన కీలక శివారు పట్టణాలు, భవనాలలో భారత ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా శక్తి సామర్థ్య ఎల్ఇడి ఆధారిత విద్యుద్దీపాలను ఏర్పాటు చేసే సాంకేతికత ప్రదర్శన ప్రాజెక్టులను చేపట్టినందుకుగాను భారతదేశానికి మయన్మార్ కృతజ్ఞతలు తెలిపింది. విద్యుత్తు వాణిజ్యంలో తన అనుభవాన్ని భారతదేశం వివరించడంతో పాటు ఈ రంగంలో మయన్మార్ తో సహకారానికి గల అవకాశాలను పరిశీలించేందుకు ఆసక్తిని వ్యక్తం చేసింది. దీనితో పాటు ఇతర సంబంధిత అంశాలపై విద్యుత్తుకు సంబంధించిన సంయుక్త సారథ్య సంఘం, ఇతర వేదికలపై త్వరగా సమావేశమై చర్చించేందుకు రెండు పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు వల్ల అందులోని దేశాలకు విశేష ప్రయోజనాలు లభించే అవకాశం ఉన్న దృష్ట్యా కూటమి ఏర్పాటు సంబంధిత ఒప్పంద చట్రంలో భాగస్వామి కావాలన్న భారతదేశం సూచనను లోతుగా పరిశీలిస్తామని మయన్మార్ వాగ్దానం చేసింది.
23. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల స్థాయిని రెండు పక్షాలు గుర్తిస్తూ ఇది మరింత వేగవంతంగా సాగితే మరింత వృద్ధికి అవకాశాలు ఉంటాయని రెండు పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య వరక్త సౌలభ్యం దిశగా అన్నిరకాల వాణిజ్య అవరోధాలను తొలగించడం ద్వారా విపణి అందుబాటును మెరుగుపరచవలసిన అవసరం ఉందన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీ లో 2017 జూన్ నెలలో నిర్వహించిన మయన్మార్- ఇండియా జాయింట్ ట్రేడ్ కమిటీ 6వ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. అలాగే బార్డర్ ట్రేడ్ కమిటీ, బార్డర్ హాత్స్ కమిటీ లపై సమావేశాల నిర్వహణకు అంగీకరించాయి.
24. మయన్మార్ లో జౌళి రంగం అభివృద్ధి దిశగా ప్రామాణీకరణ, తనిఖీ, నాణ్యత సిఫారసులు, పరిశోధన- అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం తదితరాలలో తమ సహకారం కోరడంపై భారతదేశం హర్షం వ్యక్తం చేసింది.
25. ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణంలో పప్పు ధాన్యాలకు గల ప్రాముఖ్యాన్ని, ఈ వాణిజ్యంలో మయన్మార్ రైతులు, భారతదేశ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు పక్షాలు గుర్తించాయి. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల పప్పు ధాన్యాలపై పరిమాణాత్మక ఆంక్షలు విధిస్తూ భారతదేశం ఇటీవల జారీ చేసిన ప్రకటనపై మయన్మార్ ప్రభుత్వ సలహాదారు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య, ప్రజల మధ్య గల స్నేహ సంబంధాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మయన్మార్ నుండి దిగుమతులపై విధించిన అన్ని ఆంక్షలను తొలగించాల్సిందిగా ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన మంత్రి స్పందిస్తూ దీర్ఘకాల సర్దుబాట్లపై చొరవ తీసుకోవడం ముఖ్యమని, తద్వారా భవిష్యత్తులో రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించిన వారమవుతామని తెలిపారు.
26. సరిహద్దులు దాటి రావడంపై చర్చలు విజయవంతంగా సాగి, ఒప్పందం ఖరారు కావడంపై ఉభయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం వల్ల ఉమ్మడి భూ సరిహద్దులో రెండు వైపులా ప్రజలు కదలికల నియంత్రణకు, సమన్వయానికి వీలు కలుగుతుంది. తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పర్యాటక అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. అందువల్ల సదరు ఒప్పందంపై సంతకాల దిశగా అవసరమైన లాంఛనాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాయి. అలాగే భారతదేశంలోని ఇంఫాల్ నుండి మయన్మార్ లోని మాండలే వరకు సమన్వయ పూర్వక బస్సు సేవలను ప్రారంభించడంపై ఒప్పందాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా చర్చలు చేపట్టేందుకు రెండు దేశాల నాయకులు అంగీకరించారు.
27. రెండు దేశాల మధ్య గగనతల సంధానం మెరుగు ద్వారా ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలతో పాటు పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధిసహా పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పాటు లభించగలదని వారు అంగీకరించారు. భారత ఆర్థిక, సాంకేతిక సహకారంతో మయన్మార్ లోని పాకోక్కు విమానాశ్రయం లేదా కలాయ్ విమానాశ్రయాల అభివృద్ధిపై మయన్మార్ పౌర విమానయాన విభాగం (డిసిఎ) సహకారంతో భారతదేశ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూపొందించడంపై నేతలు అంగీకారానికి వచ్చారు. అలాగే మయన్మార్ ఏర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ల కోసం భారతదేశం లో నిర్దిష్ట శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల నిర్వహణకు భారత్ సుముఖతను వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై రెండు దేశాల నేతలు హర్షం వెలిబుచ్చారు. మయన్మార్ లోని తమూ, మాండలే ల మధ్య రైల్వే సంధాన మార్గం నిర్మాణం ఆచరణ సాధ్యతను అన్వేషించాలని వారు అధికారులను ఆదేశించారు. దీనిపై డిపిఆర్ రూపకల్పన కోసం భారతదేశం నుండి ఒక బృందాన్ని పంపడం పైనా అంగీకారం కుదిరింది.
28. మానవ అక్రమ తరలింపు బాధితుల రక్షణపై, పునరావాసంపై పరస్పర అంగీకార ప్రక్రియల ఖరారు ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలూ గుర్తించాయి. ఈ దిశగా మానవ అక్రమ తరలింపు నిరోధంపై సహకారం కోసం ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ, దీని ఖరారు ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు సంసిద్ధత ప్రకటించారు.
29. భారత- మయన్మార్ ప్రజల మధ్య బంధాన్ని మరింత సన్నిహితం చేసేందుకు సంస్కృతి పరంగా కేంద్రీకరణ అవసరమని నేతలు ఇరువురు నొక్కిపలికారు. ఈ దిశగా 2017-20 మధ్య కల్చరల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ (సిఇపి) పై సంతకాలు పూర్తి కావడం మీద సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాలు, మయన్మార్ సరిహద్దు లోని ప్రాంతాల మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదానానికి ఉత్తేజం లభిస్తుందన్న విశ్వాసం వెలిబుచ్చారు. అలాగే న్యూ ఢిల్లీ లోని Indian Institute of Archaeology లో మయన్మార్ పురావస్తు నిపుణులు ఏటా రెండు సార్లు అధ్యయనం చేసుకొనే వీలు కల్పిస్తున్నట్లు భారతదేశం నిర్ధారించింది.
30. బోధ్ గయ లో మయన్మార్ రాజులు మిండన్, బాగిడావ్ ల పాలన కాలం నాటి ఆలయాలు, శిలాశాసనాల పరిరక్షణ, సంరక్షణలకు భారతీయ పురాతత్త్వ సర్వేక్షణ (Archaeological Survey of India) చేపట్టిన ప్రాజెక్టు పనులు ముగింపు దశకు చేరాయని, బహుశా 2017 డిసెంబరు కల్లా పూర్తి కావచ్చునని భారతదేశం తెలిపింది. ఈ సమాచారంపై మయన్మార్ హర్షం వ్యక్తం చేస్తూ భారతదేశం- మయన్మార్ సాంస్కృతిక వారసత్వంలో ఈ ఆలయాలు ప్రధానాంశాలు అని పేర్కొంది.
31. బాగన్ నగర సంస్కృతీ పరిరక్షణ, సంరక్షణ బాధ్యత స్వీకరించడంతో పాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం అందిస్తున్న సహకారంపై మయన్మార్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నగరంలోని 92 పురాతన కట్టడాలు, బౌద్ధ దేవాలయాలను పునరుద్ధరించి, సంరక్షించే బాధ్యతను భారతీయ పురాతత్త్వ సర్వేక్షణ స్వీకరించడం ప్రశంసనీయం. దీనికి సంబంధించిన ఒప్పందం తుది దశకు చేరడంపై రెండు పక్షాలు హర్షం ప్రకటించాయి. భారతదేశం- మయన్మార్ సహకారంలో భాగంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులలో మయన్మార్ కళలు, ఆహార, సంస్కృతి కార్యకలాపాల కేంద్రంగా "బాగన్ హాత్ " ఏర్పాటు, ఎల్ఇడి ఆధారిత వీధిదీపాలు, సుస్థిర జల నిర్వహణ కోసం వర్షపు జల సంరక్షణ, ప్రత్యామ్నాయ ఆదాయ సృష్టి కోసం బాగన్ ప్రజలకు శిక్షణ, గుర్తించిన పాఠశాలల స్థాయి పెంపు వంటివి అంతర్భాగంగా ఉన్నాయి.
32. మయన్మార్ పౌరులకు ఇ-వీసా మినహా ఇతరత్రా కేటగిరీలలో ఉచిత వీసా మంజూరు చేయాలన్న భారత ప్రభుత్వం నిర్ణయంపై మయన్మార్ ప్రశంసలు కురిపించింది.
33. భారతదేశంలో వివిధ నేరాలకు పాల్పడి, ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న 40 మంది మయన్మార్ జాతీయులకు ప్రత్యేక క్షమాభిక్షను ప్రసాదించాలని భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై మయన్మార్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. మయన్మార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ప్రజలు, ప్రత్యేకించి భారతదేశ కారాగారాలలో నుండి విడుడల కానున్న ఆ 40 మంది కుటుంబాలు కూడా భారతదేశం ప్రదర్శించిన సౌహార్దపూరిత చర్య పట్ల హర్షం వ్యక్తం చేశాయి.
34. ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించి మద్దతివ్వడంలో ప్రసార మాధ్యమాలు పోషించిన పాత్రకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించడంతో పాటు భారతదేశం-మయన్మార్ పాత్రికేయ మండలుల మధ్య సహకారం దిశగా అవగాహన ఒప్పందం కుదరడంపై రెండు పక్షాలు హర్షం ప్రకటించాయి. ఈ చట్రం కింద రెండు దేశాల్లోని రాజకీయ, ఆర్థిక పరిణామాలపై పాత్రికేయుల మధ్య మెరుగైన అవగాహన ఆదాన ప్రదానానికి ప్రోత్సాహం లభిస్తుంది.
35. వాణిజ్యం, రవాణా, ఇంధనం సహా వివిధ రంగాలలో పరస్పర సమాన లబ్ధికి హామీ ఇస్తూ గరిష్ఠ పరస్పర ప్రయోజనాల దిశగా ప్రాంతీయ సహకారాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లడంపై రెండు పక్షాలూ వాటి వంతు నిబద్ధతను పునరుద్ఘాటించాయి. రెండు దేశాల లోని ప్రజల జీవనం, జీవనోపాధుల మెరుగుదల కోసం ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ స్థాయులలో వివిధ సంయుక్త చర్యలకు గల ప్రాముఖ్యాన్ని కూడా గుర్తించాయి.
36. ఐక్య రాజ్య సమితి సహా బహుళపక్ష సంస్థల స్థాయిలో సన్నిహితంగా పనిచేయాలన్న నిబద్ధతను భారతదేశం, మయన్మార్ లు ప్రకటించాయి. ఆ మేరకు ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి అంశాలపై తమ వైఖరులలో సమన్వయం ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. బలమైన ఐక్య రాజ్య సమితి ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భద్రత మండలి లో సత్వర సంస్కరణల అవసరాన్ని నొక్కిచెప్పాయి. భద్రత మండలిలో సమగ్ర సంస్కరణల కోసం అంతర ప్రభుత్వ సంప్రదింపులకు మద్దతివ్వడంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. అలాగే భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మయన్మార్ తన సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs)-2030 నిర్దేశిస్తున్న మేరకు ఆ కార్యక్రమ అమలు మార్గాలను అంతర్జాతీయ వేదికపై బలోపేతం చేయడంకోసం కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పాన్ని రెండు పక్షాలు మరోసారి ప్రకటించాయి. ఐక్య రాజ్య సమితి, అందులోని ప్రత్యేక సంస్థల కార్యకలాపాల్లో వాస్తవిక దృక్పథం, నిష్పాక్షికతల ప్రాముఖ్యాన్ని ఉభయ పక్షాలు నొక్కిచెప్పాయి.
37. బహు పాక్షిక ఆర్థిక సంస్థల బలోపేతం, సంస్కరణలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో వర్ధమాన దేశాల గళం, భాగస్వామ్యం అవసరాన్ని రెండు పక్షాలూ గుర్తించాయి.
38. ఈ ప్రాంతంలో మంచి ఇరుగుపొరుగుల భావనకు ఉత్తమ ఉదాహరణగా నిలవాలన్న గట్టి సంకల్పాన్ని భారతదేశం, మయన్మార్ లు తీసుకొన్నాయి. ఆ మేరకు సంయుక్త ప్రగతి మార్గంలో సాగాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. ఆ మేరకు రెండు దేశాల ప్రజల మధ్య భాగస్వామ్య ప్రయోజనాలను ప్రోత్సహించాలని, తద్వారా వారు పరస్పర లబ్ధి లక్ష్యంగా, ఒకరిపై ఒకరు ఆధారపడే సామరస్య వాతావరణంలో జీవించేలా చూడాలని అంగీకరించాయి.
39. మయన్మార్ లో తన పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృందానికి హార్దిక స్వాగతం పలికి, సాదరంగా ఆతిథ్యమిచ్చిన అధ్యక్షుడికి ప్రధాన మంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
40. పరస్పర అనుకూల సమయం చూసుకొని భారతదేశంలో పర్యటించవలసిందిగా మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. ఈ ఆత్మీయ ఆహ్వానం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.