1. గౌరవ భారత రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ మరియు ప్రథమ మహిళ శ్రీమతి సవిత కోవింద్ ఆహ్వానించిన మీదట మ్యాన్మార్ అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ యూ విన్ మాయింట్ మరియు ప్రథమ మహిళ శ్రీమతి దా చో చో 2020 ఫిబ్రవరి 26వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలం లో భారతదేశం లో పర్యటన కు విచ్చేశారు. ఈ పర్యటన లో భాగం గా శ్రీ యు విన్ మాయింట్, ఆయన వెంట వచ్చిన ప్రతినిధి వర్గం బోధ్ గయ, ఆగ్ రా లు సహా చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలన్నిటి ని సందర్శించనున్నారు. ఉభయ దేశాల మధ్య నెలకొన్న శక్తివంతమైన స్నేహ సంబంధాల కు సూచిక గా అత్యున్నత స్థాయి లో చర్చల ను నిర్వహించే సంప్రదాయాని కి ఈ పర్యటన మరింత ఉత్తేజాన్నిస్తుంది.
2. న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణం లో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ న అధ్యక్షుడు శ్రీ యు విన్ మాయింట్ కు, ప్రథమ మహిళ దా చో చో కు లాంఛనపూర్వక స్వాగతం పలికారు. అతిథుల గౌరవార్ధం రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ విందు ను ఏర్పాటు చేశారు. ఆ విందు కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అధ్యక్షుడు శ్రీ యు విన్ మాయింట్ తో విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్.జయ్ శంకర్ భేటీ అయ్యారు. ఈ పర్యటన సందర్భం లో ఉభయ ప్రతినిధి వర్గాలు 10 అవగాహనపూర్వక ఒప్పంద పత్రాలు/ ఒప్పందాల ను పరస్పరం ఆదాన ప్రదానం చేసుకొన్నాయి.
3. చర్చ ల సందర్భం గా ఉభయ దేశాల నాయకులు పరస్పర హితభరితమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల ను గురించి విస్తృతం గా చర్చించారు. ఉభయ దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో క్రమం తప్పకుండా జరుగుతున్న సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేశాయని వారు నొక్కి పలికారు. మ్యాన్మార్ అనుసరిస్తున్న స్వతంత్ర, క్రియాశీల, అలీన విదేశాంగ విధానానికి, భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’, ‘నైబర్ హుడ్ ఫస్ట్ పాలసి’ ల మధ్య సారూప్యం పట్ల నేత లు ఉభయులు హర్షాన్ని ప్రకటిస్తూ, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, ఇరు దేశాలకు, ఇరు దేశాల ప్రజల కు లాభదాయకం అయ్యే విధం గా ద్వైపాక్షిక సంబంధాల ను మరింత విస్తరించుకోవడానికి దోహదపడే కొత్త విభాగాల లో సహకారానికి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.
4. రెండు దేశాల మధ్య ఇప్పటికే గుర్తించిన సరిహద్దు ను పరస్పరం గౌరవించుకోవాలన్న ఆకాంక్ష ను రెండు వర్గాలు పునరుద్ఘాటించాయి. అపరిష్కృతం గా ఉన్న ఉమ్మడి సరిహద్దు వర్కింగ్ గ్రూపు సమావేశం సహా మిగతా అంశాలన్నిటిని ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక అంగీకార యంత్రాంగం పరిధి లో పరిష్కరించుకొనేందుకు ఉభయులు మరో మారు నిబద్ధత ను వ్యక్తం చేశారు.
5. ఉభయ దేశాల సంబంధాల కు అనుసంధానం గా నిలుస్తున్న అంశాల పట్ల రెండు దేశాలు కట్టుబాటు ను పునరుద్ఘాటిస్తూ భారతదేశం ఆర్థిక మద్దతు తో మ్యాన్మార్ లో అమలవుతున్న ప్రోజెక్టుల ను మ్యాన్మార్ సహకారం తో, మద్దతు తో త్వరిత గతి న పూర్తి చేయాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి.
6. ఉభయ దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు లో తము-మోరే, రిఖావ్ దార్-జోఖౌతార్ వద్ద గల సరిహద్దు గేటుల ద్వారా ప్రయాణికులు, వస్తు రవాణా మరింత తేలిగ్గా తిరిగేందుకు వీలు గా విధి విధానాల ను సవరించుకొనేందుకు, అవసరమైన మౌలిక వసతుల ను మరింత త్వరితం గా అభివృద్ధి చేసుకొనేందుకు ఉభయ వర్గాలు అంగీకారాని కి వచ్చాయి. మ్యాన్మార్ లోని తము వద్ద తొలి దశ లో ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ను నిర్మించేందుకు తాను ప్రకటించిన కట్టుబాటు ను భారతదేశం పునరుద్ఘాటించింది. ఈ ప్రోజెక్టు ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కలిసికట్టు గా కృషి చేయాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి. సరిహద్దుల గుండా వాహనాలు మరింత తేలిగ్గా తిరిగేందుకు వీలు గా అనిర్ణీత స్థితి లో ఉన్నటువంటి ద్వైపాక్షిక మోటారు వాహనాల ఒప్పందాన్ని వీలైనంత త్వరలో సిద్ధం చేసుకోవాలని ఉభయ వర్గాలు కట్టుబాటు ను ప్రకటించాయి. 2020వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ కల్లా ఇమ్ఫాల్- మాండలే మధ్య ఒక సమన్వయపూర్వక బస్సు సర్వీసు ను ప్రారంభించడం లక్ష్యంగా ప్రైవేటు ఆపరేటర్ లు కుదుర్చుకొన్న ఒప్పందాన్ని ఉభయ వర్గాలు ఆహ్వానించాయి.
7. ఉభయ దేశాల సరిహద్దు వెంబడి మారుమూల ప్రాంతాల లో నివసిస్తున్న ప్రజల సంక్షేమం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ 2012వ సంవత్సరంలోనే కుదుర్చుకొన్న ఎంఒయు కు కట్టుబడి ప్రయోగాత్మక ప్రోజెక్టు లో భాగం గా బోర్డర్ హాట్ ల నిర్మాణాన్ని చేపట్టాలని ఉభయ వర్గాలు అంగీకరించాయి. నిర్వహణ తీరుతెన్నుల పై ఉభయుల కు అంగీకారయోగ్యమైన విధా నానికి తుది రూపాన్నిచ్చిన అనంతరం సరిహద్దు హాట్ లు ఏర్పాటు చేసే పని కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్టు తెలిపాయి.
8. చిన్ రాష్ట్రం, నాగా స్వయం పాలిత ప్రాంతం పరిధి లో మౌలిక వసతుల కల్పన, సామాజిక- ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలు లక్ష్యం గా చేపట్టిన భారత-మ్యాన్మార్ సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఉభయ వర్గాలు సంతృప్తి ని ప్రకటించాయి. భారతదేశ గ్రాంట్- ఇన్- ఎయిడ్ ప్రోజెక్టు ల లో భాగం గా ఆ ప్రాంతం లో 43 పాఠశాల లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 51 వంతెన లు, రహదారులను గత మూడు సంవత్సరాల కాలం లో నిర్మించారు. నాలుగో విడత సహాయం కింద అందిస్తున్న 5 మిలియన్ యుఎస్ డాలర్ తో 29 ప్రోజెక్టుల ను 2020-21 లో అమలుపరచేందుకు ఉభయ వర్గాలు అంగీకరించాయి.
9. సిత్వే పోర్టు, కళాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ రవాణా ప్రోజెక్టు ల ద్వారా ఏర్పడిన సానుకూల పరిణామాల ను ఇద్దరు నాయకులు పరిగణన లోకి తీసుకొన్నారు. సిత్వే పోర్టు, పలేట్వా ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ టెర్మినల్, వాటికి అనుబంధ వసతుల నిర్వహణ కు 2020 వ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి పోర్టు ఆపరేటర్ ను నియమించడాన్ని వారు ఆహ్వానించారు. ఈ పోర్టు పూర్తి స్థాయి లో పని చేయడం ప్రారంభమైతే సమీపం లోని ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి తో పాటు స్థానిక ప్రజల కు కూడా లబ్ధి చేకూరుతుంది. పలేట్వా-జోరిన్ పురి రోడ్డు ను, కళాదాన్ ప్రోజెక్టు తుది దశ ను సత్వరం పూర్తి చేయడానికి ఉభయ వర్గాలు వచనబద్ధత ను పునరుద్ఘాటించాయి. ఈ పోర్టు పూర్తి అయితే భారతదేశం లోని ఈశాన్య రాష్ర్ట ప్రాంతాల కు అనుసంధానం ఏర్పడడం తో పాటు పోర్టు కు నౌకల రాకపోక లు విశేషం గా పెరిగే ఆస్కారం ఉంది. కళాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రోజెక్టు నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులు, నిర్మాణ సామగ్రి, నిర్మాణ యంత్రపరికరాల ను మిజోరం సరిహద్దు ద్వారాను, జోరిన్ పురి పశ్చిమ దిశ లో పలేట్వా వరకు స్వేచ్ఛ గా తరలించడం లో మ్యాన్మార్ అందిస్తున్న సహకారాన్ని భారతదేశం ప్రశంసించింది.
10. త్రైపాక్షిక హైవే లో భాగం అయిన కలేవా-యార్గ్యి రోడ్డు మార్గం నిర్మాణ పురోగతి పట్ల ఉభయ దేశాల నాయకులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. 2021వ సంవత్సరం కల్లా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ హైవే పై ఉన్న 69 వంతెన ల పునర్నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్న కట్టుబాటు ను భారతదేశం పునరుద్ఘాటించింది. అందుకు అవసరమైనంత సహకారం అందించేందుకు మ్యాన్మార్ అంగీకరించింది.
11. సామర్థ్యాల నిర్మాణంలో, శిక్షణ లో భారతదేశం సహకారాన్ని మ్యాన్మార్ ప్రశంసించింది. మ్యాన్మార్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ (ఎమ్ ఐటి), అడ్వాన్స్ డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రిసర్చ్ ఎండ్ ఎడ్యుకేశన్ (ఎసిఎఆర్ ఇ) ల వంటి ప్రధాన ప్రోజెక్టుల ను దీర్ఘకాలిక మనుగడ ప్రాతిపదిక న సత్వరం పూర్తి చేయడానికి ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చాయి. యామెథిన్ లో మహిళా పోలీసు శిక్షణ కేంద్రం హోదా పెంపుదల కు సంబంధించిన విధివిధానాలు ఖరారు అయిన అనంతరం దాని ని త్వరగా పూర్తి చేయడానికి ఆసక్తి తో ఎదురు చూస్తున్నట్టు ఉభయ దేశాల నాయకులు ప్రకటించారు. మ్యాన్మార్ యువత కు సమర్థవంతం గా శిక్షణ ఇచ్చి వారి ఉపాధి అర్హత ను పెంచడం లో పకాక్కు, మ్యింగ్యాన్ లలో భారతదేశం గ్రాంటు తో ఏర్పాటైన మ్యాన్మార్-ఇండియా పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు పోషిస్తున్న కీలక పాత్ర ను ఉభయ వర్గాలు ప్రశంసించాయి. మోనీవా, థాటన్ లలో మరో రెండు కొత్త కేంద్రాల ఏర్పాటు పనులు చురుకు గా సాగుతున్నట్టు వారు గుర్తించారు.
12. రఖాఇన్ స్టేట్ డివెలప్ మెంట్ ప్రోగ్రామ్ ద్వారా రఖాఇన్ రాష్ట్రం లో శాంతి, సుస్థిరత, సామాజిక ఆర్థిక అభివృద్ధి లో మ్యాన్మార్ కు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు భారతదేశం వచన బద్ధత ను పునరుద్ఘాటించింది. 2019వ సంవత్సరం లో రఖాఇన్ ఉత్తర ప్రాంతం లోని నిరాశ్రయుల కోసం 250 ప్రి ఫ్యాబ్రికేటెడ్ గృహ నిర్మాణం, తత్సంబంధిత సహాయ సామగ్రి ని పంపినందుకు భారతదేశాన్ని మ్యాన్మార్ ప్రశంసించింది. రఖాఇన్ స్టేట్ డివెలప్ మెంట్ ప్రోగ్రామ్ రెండో దశ లో మరో 12 ప్రోజెక్టు ల అమలు ను వేగవంతం చేసేందుకు, అధిక ప్రభావవంతమైన కమ్యూనిటీ డివెలప్ మెంట్ ప్రోజెక్టు ల నియామవళి కింద సహకారాన్ని మరింత పటిష్ఠ పరచుకొనేందుకు, మెకాంగ్-గంగా సహకార యంత్రాంగం కింద అధిక ప్రభావవంతమైన ప్రోజెక్టుల ను త్వరిత గతి న చేపట్టేందుకు ఉభయ వర్గాలు కట్టుబాటు ను ప్రకటించాయి. ఇందులో భాగం గా అత్యధిక ప్రభావవంతమైన ప్రోజెక్టుల కు భారత గ్రాంటు కోసం ఒక ఒప్పందం పై ఉన్నత ప్రతినిధివర్గం సంతకాలు చేయడం పట్ల నాయకులు హర్షం ప్రకటించారు.
13. ఉత్తర రఖాఇన్ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం దిశ గా మ్యాన్మార్ ప్రభుత్వం తీసుకొన్న చర్యల కు భారతదేశం మద్దతు ను పునరుద్ఘాటించింది. రఖాఇన్ రాష్ట్రం లో బాధితుల పునరావాసం కోసం మ్యాన్మార్, బాంగ్లాదేశ్ లు సంతకాలు చేసిన ద్వైపాక్షిక ఒప్పందాల కు భారతదేశం మద్దతు ను తెలిపింది. ప్రస్తుతం బాంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ ప్రాంతం లో నివాసం ఉంటున్న శరణార్థుల స్వచ్ఛంద, సుస్థిర, సత్వర పునరావాసాని కి ద్వైపాక్షిక ఒప్పందం నిబంధన ల పరిధిలోనే మ్యాన్మార్, బంగ్లాదేశ్ లే వాటి కృషి ని కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని ఉభయ పక్షాలు ప్రకటించాయి. సమస్య సంక్లిష్టత ను గుర్తించి మ్యాన్మార్ కు తగు సహకారాన్ని అందిస్తున్నందుకు భారతదేశాని కి మ్యాన్మార్ కృతజ్ఞత లు తెలిపింది.
14. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం పూర్తి సామర్థ్యాల ను వినియోగం లోకి తెచ్చే దిశ గా ప్రయత్నాల ను ముమ్మరం చేయవలసిన అవసరాన్ని ఉభయ దేశాలు గుర్తించాయి. సంధానం, విపణి లభ్యత, ఆర్థిక లావాదేవీ ల సరళీకరణ, బిజినెస్ టు బిజినెస్ కనెక్ట్ విభాగాల లో ద్వైపాక్షిక, ప్రాంతీయ వాణిజ్య అంగీకారాల పరిధి లో తీసుకొంటున్న చర్యల కు మద్దతు ను ప్రకటిస్తూ అవి ఉభయ దేశాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి తగినంత సహాయకారి కాగలవంటూ నాయకులు ప్రశంసించారు.
15. మ్యాన్మార్ లో వీలైనంత త్వరితంగా భారతదేశం యొక్క రూపే కార్డు ను ప్రవేశపెపట్టడానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఉభయ వర్గాలు అంగీకరించాయి. మ్యాన్మార్ ఆర్థిక వ్యవస్థ ను పటిష్ఠపరచేందుకు, ఉభయ దేశాల మధ్య పర్యాటకాన్ని విస్తరించేందుకు సహాయకారి గా నిలచే రూపే కార్డు ను ప్రవేశపెట్టే విషయం లో నేషనల్ పేమెంట్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) మ్యాన్మార్ చట్టాలు, నియంత్రణ ల పరిధిలో కృషి చేయగలదన్న ఆశాభావాన్ని ప్రకటించారు.
16. ఉభయ దేశాల మధ్య అంతర్ సరిహద్దు చెల్లింపుల ను వేగవంతం చేసేందుకు సహాయపడే ఇండియా- మ్యాన్మార్ డిజిటల్ పేమెంట్ గేట్ వే ఏర్పాటు కు గల అవకాశాలను అన్వేషించేందుకు ఉభయ వర్గాలు అంగీకరించాయి. అలాగే అంతర్ సరిహద్దు వాణిజ్యాన్ని పెంచడం లక్ష్యం గా స్థానిక కరెన్సీలో సెటిల్ మెంట్ లను నిర్వహించుకొనేందుకు ద్వైపాక్షిక యంత్రాంగం ఏర్పాటు కు గల అవకాశాల ను అన్వేషించడం పై సౌతం ఆసక్తి ని ప్రదర్శించారు. ప్రస్తుతం అందుబాటు లో ఉన్న ఇండియా-మ్యాన్మార్ జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశాల ను సత్వరం ఏర్పాటు చేసేందుకు ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చాయి.
17. ఇంధన రంగం లో సహకారాన్ని మరింత పెంచుకోవడం వల్ల ఏర్పడే పరస్పర ప్రయోజనాన్ని ఉభయ దేశాలు గుర్తించాయి. పెట్రోలియం ఉత్పత్తులు ప్రత్యేకించి రిఫైనింగ్, స్టాక్ నిర్వహణ, బ్లెండింగ్, రిటైల్ విభాగాల లో ఉభయ ప్రభుత్వాల మధ్య అవగాహన యంత్రాంగం ద్వారా సహకరించుకోవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల అభివృద్ధి, ఆ విభాగం లో వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ లో సహకారాని కి, ప్రోత్సాహాని కి ఉభయ వర్గాలు సమ్మతి ని తెలిపాయి. మ్యాన్మార్ లోని అప్ స్ట్రీం సెక్టర్ లో భారత ప్రభుత్వ రంగ చమురు మరియు గ్యాస్ కంపెనీ ల పెట్టుబడుల ను ఉభయ వర్గాలు ఆహ్వానించాయి. ఇండియన్ ఆయిల్, ఇంకా ఇతర గ్యాస్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ (పిఎస్ యు స్) పెట్టిన పెట్టుబడుల తో నిర్మించిన ప్రోజెక్టు ల ఉత్పత్తుల లో కొంత భాగాన్ని భారతదేశాని కి ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉంటాయేమో కనుగొనే విషయం లో కూడాను అంగీకారాని కి వచ్చారు.
18. మ్యాన్మార్- ఇండియా ద్వైపాక్షిక బంధం మూల స్తంభాలలో రక్షణ, భద్రత సహకారం ఒకటి అనే అంశాన్ని ఉభయ వర్గాలు పునరుద్ఘాటించాయి. రక్షణ సిబ్బంది పరస్పర పర్యటన ల ద్వారా ఏర్పడిన సానుకూలత ను వారు ప్రశంసించారు. ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారం పై 2019వ సంవత్సరం జూలై లో సంతకాలు చేసిన ఎంఒయు ద్వారా మరింత సన్నిహిత సహకారాని కి మార్గం సుగమం అయిందని ఉభయ దేశాల నాయకులు అంగీకరించారు. మ్యాన్మార్ రక్షణ సర్వీసుల లో సామర్థ్యాల నిర్మాణం లో సహకరించడానికి, పరస్పర భద్రత సహకారాన్ని విస్తరించుకొనేందుకు భారతదేశం అంగీకరించింది. ఉభయ దేశాల సరిహద్దు ప్రాంతాల లోని స్థానిక ప్రజల సుసంపన్నత కు దోహదపడే విధం గా సరిహద్దు వెంబడి శాంతి, సుస్థిరత ల స్థాపన కు కృషి చేయాలని నాయకులు అంగీకారానికి వచ్చారు. శత్రు వర్గాలు దాడుల కు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అంగీకరించకూడదన్న కట్టుబాటు ను కూడా ఉభయ వర్గాలు పునరుద్ఘాటించాయి.
19. ఉభయ దేశాల మధ్య సాగర జలాల సహకారం విస్తరించడాన్ని కూడా ఇరువురు నాయకులు ఆహ్వానించారు. సాగర జలాల నుండి ఎదురయ్యే సవాళ్ల ను దీటు గా ఎదుర్కోవడం, సాగర జలాల భద్రత ను పటిష్ఠం చేయడానికి గల ప్రాధాన్యాన్ని కూడా ఉభయులు గుర్తించారు. సాగర జలాల భద్రత సహకారాని కి ఎంఒయు పై సంతకాలు చేయడం, 2019వ సంవత్సరం సెప్టెంబర్ లో జాయింట్ వర్కింగ్ గ్రూపు తొలి సమావేశం నిర్వహణ, వైట్ శిప్పింగ్ డేటా మార్పిడి వంటివి ఆ సహకారం లో కీలక అడుగులు అంటూ ఉభయ దేశాల నాయకులు అంగీకరించారు.
20. పరస్పరం ఆందోళన కలిగించే భద్రత వంటి అంశాల పై సమగ్ర చట్టపర విధి విధానాల రూపకల్పన యొక్క ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తూ సివిల్ , వాణిజ్య అంశాల లో పరస్పర న్యాయ సహాయానికి పెండింగు లో ఉన్న ఒప్పందం, నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై చర్చల ను కొనసాగించాలని ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందాల ను వీలైనంత త్వరలో ఖరారు చేసుకొనేందుకు వచనబద్ధత ను ప్రకటించాయి. 2020వ సంవత్సరం డిసెంబర్ వరకు మ్యాన్మార్ సందర్శించే భారతదేశ పర్యాటకుల కు వీజ ఆన్ అరైవల్ ను విస్తరించాలన్న నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది.
21. కేన్సర్ రోగుల చికిత్స కోసం మెడికల్ రేడియేశన్ సంబంధి సామగ్రి ‘‘భాభాట్రాన్-2’’ను ఇచ్చేందుకు భారతదేశం ముందుకు రావడాన్ని మ్యాన్మార్ పక్షం ప్రశంసించింది. ఆరోగ్య సంరక్షణ రంగం లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఉభయ పక్షాలు అంగీకారాన్ని వ్యక్తం చేశాయి.
22. ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఫెడరల్ యూనియన్ ను స్థాపించడం కోసం, ప్రజాస్వామిక పరివర్తన, శాంతి ప్రక్రియ, జాతీయ రాజీల దిశ గా మ్యాన్మార్ చేస్తున్న కృషి కి తోడ్పాటు ను అందిస్తామని భారతదేశం పునరుద్ఘాటించింది. మ్యాన్మార్ ప్రభుత్వ ఉద్యోగుల కు, క్రీడాకారుల కు, పార్లమెంటు సభ్యుల కు, న్యాయాధికారుల కు మరియు ఎన్నికల నిర్వహణ అధికారుల కు భారతదేశం ప్రస్తుతం కొనసాగిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు, సామర్ధ్యం పెంపుదల సంబంధిత కార్యక్రమాలు, జాగృతి సంబంధిత పర్యటన లు మరియు ఉపన్యాస పరంపర పట్ల ఉభయ పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. మ్యాన్మార్ విశ్వవిద్యాలయాల కు భారతదేశం తన నేశనల్ నోలిజ్ నెట్ వర్క్ ను (ఎన్‌కెఎన్) విస్తరిస్తానని భారతదేశం ప్రకటించింది. మ్యాన్మార్ డిప్లమేటిక్ అకేడమి ని నెలకొల్పడం లో మ్యాన్మార్ కు తోడ్పాటు ను అందించడం కోసం సిద్ధంగా ఉన్నట్లు భారతదేశం పక్షం మరొక్కమారు పునరుద్ఘాటించింది. భారతదేశాని కి సంబంధించిన ‘‘ఆధార్’’ ప్రోజెక్టు పై ఆధారపడిన మ్యాన్మార్ జాతీయ ఐడి ప్రోజెక్టు కు సాంకేతిక సహాయాన్ని అందించడానికి భారతదేశం ముందుకు రావడాన్ని గమనించిన మ్యాన్మార్ అందుకుగాను ధన్యవాదాలు తెలిపింది.
23. ఒక ప్రజాస్వామ్యయుత ఫెడరల్ యూనియన్ ను నెలకొల్పడం కోసం ప్రజాస్వామిక పరివర్తన మరియు జాతీయ రాజీ ప్రక్రియ ల దిశ గా మ్యాన్మార్ చేస్తున్న కృషి కి తోడ్పాటు ను అందిస్తానని భారతదేశం పునరుద్ఘాటించింది. దేశవ్యాప్త కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ లో భాగం గా ప్రభుత్వాని కి, సైన్యాని కి మరియు జాతుల పరంగా ఏర్పడ్డ సాయుధ సమూహాల కు మధ్య ఒక సంభాషణ మాధ్యమం ద్వారా మ్యాన్మార్ అనుసరిస్తున్న శాంతి ప్రక్రియ కు భారతదేశ ప్రధాన మంత్రి పూర్తి మద్దతు ను వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో అభివృద్ధి ప్రధానం గా ముందంజ వేయాలన్న ఉమ్మడి జాతీయ లక్ష్య సాధన లో శాంతి కి మరియు స్థిరత్వాని కి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టవలసివుందని నేత లు ఇరువురు స్పష్టీకరించారు.
24. ఉగ్రవాదం రువ్వుతున్న బెదరింపు ను ఇరు పక్షాలు గమనించి, ఉగ్రవాద ముఠా లకు మరియు వాటి చర్యల కు ఎదురొడ్డి నిలవడం లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకరించాయి. ఉగ్రవాదాన్ని దాని యొక్క అన్ని రూపాల లోను, అవతారాల లోను సహించబోమంటూ ఉభయ పక్షాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని, హింసాత్మక అతివాదాన్ని నిరోధించడం లో బలవత్తరమైనటువంటి అంతర్జాతీయ భాగస్వామ్యం ఎంతైనా అవసరమని, అంతేకాక నిగూఢ సమాచారాన్ని ఒక దేశాని కి మరొక దేశం ఇతోధిక స్థాయి లో వెల్లడించుకోవాలని ఇరు పక్షాలు నొక్కి వక్కాణించాయి. ఈ విషయం లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఆ పక్షాలు సమ్మతించాయి.
25. దీనికి తోడు ఐక్య రాజ్య సమితి (యుఎన్) ఇంకా, ఇతర అంతర్జాతీయ సంస్థ ల వంటి బహుళ దేశీయ వేదికల లో తమ సన్నిహిత సహకారాన్ని కొనసాగించేందుకు కూడా ఇరు పక్షాలు ఒప్పుకొన్నాయి. ఆసియాన్, బిఐఎమ్ఎస్‌టిఇసి (బిమ్స్ టెక్), మెకాంగ్-గంగా కోఆపరేశన్, తదితర ప్రాంతీయ ఫ్రేమ్ వర్క్స్ పరిధి లో సహకరించుకోవాలని ఉభయ పక్షాలు అంగీకరించాయి. సంస్కరణ కు లోనయ్యే మరియు విస్తరణ కు అవకాశం ఉన్న యుఎన్ఎస్‌సి లో ఒక శాశ్వత సభ్యత్వ దేశం గా జతపడాలని భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కు మ్యాన్మార్ మద్ధతిచ్చింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఆసియాన్ కు కేంద్ర స్థానం, అంతర్జాతీయ చట్టం పట్ల ఆదరణ భావం, పారదర్శకత్వం, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి వైఖరి, ఏ విధమైన అరమరికల కు తావు ఇవ్వనటువంటి సూత్రాల ను ప్రోత్సహించడం తో పాటు శాంతియుత సరిహద్దు ను పరిరక్షించడం వంటి అంశాల పట్ల తమ వచన బద్ధత ను రెండు పక్షాలు పునరుద్ఘాటించాయి. తద్వారా పురోగతి మరియు సమృద్ధి సాధన కు కలసికట్టుగా ముందంజ వేయవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం కొనసాగిస్తున్న మైత్రీపూర్వక సంబంధాలు మంచి ఇరుగు పొరుగు సంబంధి సఖ్యత ల ప్రాతిపదిక న కాంటినెంటల్ శెల్ఫ్ కు 200 నాటికల్ మైళ్ళ కు ఆవలి పరిమితి అనే అంశం పై ఎవరి వాదన ను వారు సమర్పించే అంశం లో ద్వైపాక్షిక సాంకేతిక స్థాయి చర్చల ను కొనసాగించడానికై ఇరు పక్షాలు నిరీక్షిస్తున్నాయి.
26. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ)లో ఐరాస సభ్యత్వ దేశాలు అన్నీ కూడాను చేరి, సౌర శక్తి రంగం లో ముందస్తు సహకారాన్ని అందించేలా చేయడం లో భాగం గా ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ఆఫ్ ద ఐఎస్ఎ లో సవరణ కు సాధ్యమైనంత త్వరగా అనుమోదం తెలిపేందుకు తగిన చర్యల ను చేపట్టడానికి మ్యాన్మార్ నిబద్ధురాలై ఉంది. అంతేకాదు, విపత్తుల ముప్పు ను ఎదుర్కొంటున్న మ్యాన్మార్ మరియు భారతదేశం వంటి దేశాల కు సంబంధించినంత వరకు ‘కొయలిశన్ ఆఫ్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ)’ యొక్క ప్రాసంగికత ను భారతదేశం నొక్కి చెప్పింది. అలాగే సిడిఆర్ఐ లో చేరే విషయాన్ని పరిశీలించాలంటూ మ్యాన్మార్ ను ప్రోత్సహించింది.
27. బాగాన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా లో చేర్చడాన్ని భారతదేశం ఆహ్వానించింది. బాగాన్ లో భూకంపం దరిమిలా ధ్వంసమైన 92 పగోడా ల పునరుద్ధరణకు, పరిరక్షణ కు సంబంధించిన ఒక ప్రోజెక్టు తొలి దశ లో భాగం గా 12 పగోడాల ను ఉద్ధరించడం కోసం భారతీయ పురాతత్వ సర్వేక్షణ (ఎఎస్ఐ) చేపట్టిన పనుల ఒకటో దశ ఆరంభం కావడం పట్ల ఉభయ పక్షాలు హర్షాన్ని వెలిబుచ్చాయి. ఈ జీర్ణోద్ధరణ పనుల లో ఎఎస్ఐ బృందాని కి అన్ని రకాలుగాను తోడ్పాటు ను అందించడానికి మ్యాన్మార్ అంగీకరించింది.
28. రెండు దేశాల మధ్య మైత్రీ పూర్వకమైనటువంటి మరియు సమరసమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్టపరచుకోవడాని కి మరియు అన్ని స్థాయిల లో అనుబంధ కార్యక్రమాల ను తీవ్రీకరించడానికి ఇరు పక్షాలు వాటి యొక్క దృఢమైన నిబద్ధత ను పునరుద్ఘాటించాయి.
29. మ్యాన్మార్ ప్రతినిధి వర్గం భారతదేశం లో బస చేసిన కాలం లో ఆప్యాయత తోను మరియు అసాధారణమైన రీతి లోను ఆతిథ్యాన్ని అందించినందుకుగాను రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కు మరియు ప్రథమ మహిళ శ్రీమతి సవిత కోవింద్ కు అధ్యక్షుడు శ్రీ యూ విన్ మాయింట్ మరియు ప్రథమ మహిళ శ్రీమతి డా. చో చో ధన్యవాదాలు పలికారు.