జపాన్ ప్రధానమంత్రి గౌరవనీయ కిషిదా ఫుమియో 19, 20 తేదీల్లో భారతదేశంలో అధికారికంగా పర్యటించారు. ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. భారత ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీతో 14వ భారత-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఉభయ దేశాలు 70 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలు, 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న అత్యంత కీలకమైన సమయంలో జరుగుతోంది. గత వార్షిక సమావేశం జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను సమీక్షించడంతో పాటు సహకారానికి సంబంధించిన విస్తృతమైన అంశాలపై నాయకులు చర్చించారు.
1. భారత, జపాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్నిపునరుద్ఘాటిస్తూ 2018లో జారీ అయిన భారత-జపాన్ విజన్ ప్రకటనలోని అంశాలు నేటి వాతావరణానికి ప్రత్యేకించి గతంలో కన్నా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ భాగస్వామ్యం మరింతగా విస్తరించాల్సిన పరిస్థితికి చక్కగా సరిపోతాయని ప్రధానమంత్రులు అంగీకరించారు. ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవిస్తూ దేశాల మధ్య ఏ సమస్య ఉన్నా బెదిరింపులు, దాడులకు పాల్పడని, యథాతథ స్థితికి ఎవరూ ఏకపక్షంగా భంగం కలిగించని శాంతియుత, సుస్ధిర, సుపంపన్న ప్రపంచం పట్ల తమ కట్టుబాటును ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఎలాంటి దురాక్రమణలకు తావు లేని స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ప్రాంతంగా ఉండాలన్న ఉమ్మడి విజన్ ను పునరుద్ఘాటించారు. తమ ప్రజలకు ఆర్థిక భద్రత, సుసంపన్నత గల వైవిధ్యభరితమైన, పారదర్శక, బహిరంగ, సురక్షిత, అంచనాలకు అందగల ప్రపంచ సరఫరా వ్యవస్థల ద్వారా వచ్చే ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్యం ఊతంగా మనుగడ సాగించగల ప్రపంచం కావాలని ఉభయదేశాలు కోరుకుంటున్నాయి. భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకుంటూ భాగస్వామ్య లక్ష్యాల సాధనకు కృషిని కొనసాగించాలని కట్టుబాటు ప్రకటించాయి.
సమ్మిళితత్వం, నిబంధనల పట్ల గౌరవం గల స్వేచ్ఛాయుతమైన, దాపరికాలు లేని ఇండో-పసిఫిక్ భాగస్వామ్యం అవసరమని నిర్ణయించాయి.
2. ఉభయ దేశాల మధ్య భద్రత, రక్షణ సహకారం పురోగతిని ప్రధానమంత్రులు ప్రశంసిస్తూ దాన్ని మరింత లోతుగా విస్తరించుకోవాలన్న కట్టుబాటు పునరుద్ఘాటించారు. 2019 నవంబర్ లో న్యూఢిల్లీలో ఉభయ దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తూ టోక్యోలో రెండో సమావేశం నిర్వహించాలని ఉభయులు తమ మంత్రులను కోరారు. జపాన్ రక్షణ దళాలు, భారత సాయుధ దళాల మధ్య సరఫరాలు, సేవల సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఆచరణాలోకి రావడాన్ని వారు ఆహ్వానించారు. మిలన్ పేరిట జరిగిన విన్యాసాల్లో జపాన్ తొలిసారి భాగస్వామి కావడాన్ని ఆహ్వానిస్తూ ధర్మ గార్డియన్, మలబార్ సహా ద్వైపాక్షిక, బహుముఖీన చర్యలు కొనసాగించేందుకు కట్టుబాటు ప్రకటించారు. అలాగే జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ దళాలు, భారత వైమానిక దళం మధ్యన వీలైనంత త్వరలో తొలిసారిగా యుద్ధవిమానాల విన్యాసాలు ప్రారంభించేందుకు కట్టుబాటును ప్రకటించారు. మానవ రహిత భూ వాహనం (యుజివి), రోబోటిక్స్ విభాగాల్లో సహకారాన్ని పునరుద్ఘాటిస్తూ రక్షణ పరికరాలు, టెక్నాలజీలో భవిష్యత్ భాగస్వామ్యానికి పటిష్ఠమైన చర్యల కోసం అన్వేషించాలని మంత్రులను కోరారు.
3. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సుసంపన్నతకు కట్టుబాటు ప్రకటిస్తూ ప్రాంతీయంగా ఒకే రకమైన భావాలున్న దేశాలు ప్రత్యేకించి ఆస్ర్టేలియా, ఇండియా, జపాన్, అమెరికా (క్వాడ్) దేశాల మధ్య ద్వైపాక్షిక, బహుముఖీన భాగస్వామ్యాల ప్రాధాన్యం ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. 2021 మార్చి, సెప్టెంబర్ నెలల్లో జరిగిన క్వాడ్ నాయకుల సమావేశాన్ని వారు ఆహ్వానిస్తూ కోవిడ్ వ్యాక్సిన్లు; అత్యంత కీలకమై, వర్థమాన టెక్నాలజీలు, వాతావరణ చర్యలు, మౌలిక వసతుల సమన్వయం, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్షం, విద్యా రంగాల్లో క్వాడ్ సానుకూల, నిర్మాణాత్మక అజెండా సాధించిన ఫలితాలను సమీక్షించారు. రాబోయే నెలల్లో జపాన్ లో జరుగనున్న క్వాడ్ నాయకుల సమావేశంలో సహకారం మరింతగా విస్తరించుకునేందుకు ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు.
4. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019లో ప్రకటించిన ఇండో-పసిఫిక్ సముద్ర ఒప్పందం (ఐపిఓఐ) ప్రకటను ప్రధానమంత్రి కిషిదా ఆహ్వానించారు. ఐపిఓఐ మధ్య సహకారం; స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతం (ఎఫ్ఓఐపి) మధ్య సహకారం విస్తరణకు ఎంతో అవకాశం ఉన్నదని ప్రధానమంత్రి అన్నారు. ఐపిఎఐ అనుసంధాన మూలస్తంభంలో జపాన్ ప్రధాన భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియాన్ ఐక్యత, కేంద్రీకృత స్థానానికి నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆసియాన్ ఔట్ లుక్ ఆన్ ద ఇండో-పసిఫిక్ (ఏఓఐపి) దేశీయ చట్టాలను గౌరవించడం, దాపరికం లేకపోవడం, స్వేచ్ఛ, పారదర్శకత, సమ్మిళితత్వ సూత్రాలకు ఇది కట్టుబడుతుందని అన్నారు.
5. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రెండు అగ్ర దేశాలైన భారత్, జపాన్ సముద్రజలాల భద్రత, రక్షణ, నౌకారవాణా స్వేచ్ఛ, గగనతలంలో విమానాలు నడిపే స్వేచ్ఛ, ఎలాంటి అవరోధాలు లేని చట్టబద్ధమైన వాణిజ్యం; అంతర్జాతీయ చట్టాలకు లోబడి చట్టబద్ధమైన, దౌత్య ప్రక్రియ ద్వారా వివాదాలకు శాంతియుత పరిష్కారం వంటి ఉమ్మడి ప్రయోజనాలు ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రులు నొక్కి చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలాల్లో నిబంధనల ఆధారిత వ్యవస్థ అమలుకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ చట్టాలు ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి సాగర జలాల చట్టానికి (అంక్లోస్) అగ్రప్రాధాన్యం ఇవ్వాలని, సహకారం విస్తరించాలని వారు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతం ఎలాంటి సైనిక జోక్యం లేనిదిగా, స్వయంసమృద్ధంగా ఉండాలని వారు నొక్కి చెప్పారు. అలాగే హక్కులకు ఎలాంటి భంగం కలిగించని రీతిలో చర్చల్లో భాగస్వాములు కాని దేశాలు సహా అన్ని దేశాల ప్రయోజనాలు పరిరక్షిస్తూ అంతర్జాతీయ చట్టాల పరిధిలో ప్రత్యేకించి అంక్లోస్ పరిధిలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సమర్థవంతమైన ప్రవర్తనా నియమావళి సత్వరం రూపొందించాలని, అలాగే దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలు ప్రకటించిన ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలుజరగాలని వారు పిలుపు ఇచ్చారు.
6. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను (యుఎన్ఎస్ సిఆర్) ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులు ప్రయోగించడాన్ని ప్రధానమంత్రులు ఖండించారు. ఉత్తర కొరియా అణ్వాయుధ వ్యాప్తికి సంబంధించిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని యుఎన్ఎస్ సిఆర్ లోని నిబంధనల పరిధిలో ఉత్తర కొరియా ప్రాంతం మొత్తం అణ్వాయుధ రహిత మండలంగా మారాలని వారు పిలుపు ఇచ్చారు. యుఎన్ఎస్ సిఆర్ లకు ఉత్తర కొరియా సంపూర్ణంగా కట్టుబడాలని, అపహరణ సమస్యకు తక్షణ పరిష్కారం సాధించాలని వారు సూచించారు.
7. ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు సాధించడం, మానవ హక్కులను ప్రోత్సహించడం, మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడం సహా వాస్తవంగా ప్రజాప్రాతినిథ్యం గల, సమ్మిళిత రాజకీయ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడడం వంటి అంశాల్లో సన్నిహితంగా సహకరించుకోవాలన్న దృక్పథాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఆఫ్గనిస్తాన్ ప్రాంతాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయం, శిక్షణ ఇవ్వడం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యకలాపాలకు తావు లేనిదిగా ఉండాలని, ఇందుకు యుఎన్ఎస్ సిఆర్ 2593 (2021) పరిధిలో కృషి చేయాలన్న అభిప్రాయం వారు పునరుద్ఘాటించారు. యుఎన్ఎస్ సి మంజూరు చేసిన మేరకు ఆఫ్గన్ ప్రాంతంలోని ఉగ్రవాద బృందాలపై ఉమ్మడి కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు.
8. నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదుల ముప్పు పట్ల ప్రధానమంత్రులు తీవ్ర ఆవేదన ప్రకటిస్తూ ఒక సమగ్ర, స్థిర దృక్పథంతో ఉగ్రవాదంపై పోరాడే విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న ప్రాంతాలను, ఉగ్రవాద నెట్ వర్క్ లు, ఆర్థిక సహాయం అందే మార్గాలను పూర్తిగా నిర్మూలించాలని, సీమాంతర ఉగ్రవాద కదలికలను నిలువరించాలని వారు దేశాలన్నింటికీ పిలుపు ఇచ్చారు. అలాగే వివిధ దేశాలు తమ భూబాగాలు ఇతరులపై ఉగ్రవాద దాడులు చేసే కేంద్రాలు కాకుండా చూసుకోవాలంటూ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించే వారిని వీలైనంత త్వరలో చట్టం ముందు నిలబెట్టాలని సూచించారు. భారతదేశంపై 26/11, పఠాన్ కోట్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ ఎఫ్ఏటిఎఫ్ సహా వివిధ అంతర్జాతీయ వేదికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి పాకిస్తాన్ తమ భూభాగంలోని ఉగ్రవాద నెట్ వర్క్ లపై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండును పునరుద్ఘాటించారు. బహుముఖీన వేదికల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను పటిష్ఠం చేసుకునేందుకు కృషి చేయాలని, ఐక్యరాజ్యసమితిలో సమగ్ర అంతర్జాతీయ ఉగ్రవాద ఒడంబడిక (సిసిఐటి) సత్వరం ఆమోదించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని వారు అంగీకరించారు.
9. మయన్మార్ లో పరిస్థితి పట్ల ప్రధానమంత్రులు ఆందోళన పునరుద్ఘాటిస్తూ దౌర్జన్యాన్ని విడనాడి, నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని, ప్రజాస్వామ్య పునరద్ధరణకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. మయన్మార్ సంక్షోభం పరిష్కారం విషయంలో ఆసియాన్ ప్రయత్నాలకు మద్దతును పునరుద్ఘాటిస్తూ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆసియాన్ అధ్యక్ష స్థానంలో ఉన్న కాంబోడియా నిరంతరాయంగా చేస్తున్న కృషికి మద్దతు తెలిపారు. ఆసియాన్ ఐదు సూత్రాల ఏకాభిప్రాయ ప్రణాళిక సత్వరం అమలుపరచాలని కూడా పిలుపు ఇచ్చారు.
10. ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న పోరాటం, మానవతా సంక్షోభం పట్ల ప్రధానమంత్రులు తీవ్ర ఆందోళన ప్రకటిస్తూ సరిహద్దులపై ప్రత్యేకించి ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఆ పోరాట ప్రభావాన్ని మదింపు చేశారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ లో సమగ్ర ప్రపంచ వ్యవస్థకు కుదిరిన అంగీకారానికి, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి వివిధ దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్ లోని అణు కేంద్రాలకు సంపూర్ణ భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ ఇందుకోసం ఐఏఇఏ చేస్తున్న చురుకైన చర్యలకు మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలో దౌర్జన్యకాండకు తక్షణం స్వస్తి చెప్పాలన్న డిమాండును పునరుద్ఘాటిస్తూ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం వినా మార్గం లేదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ లో మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలన్న ఉభయ దేశాల నిర్ణయం పునరుద్ఘాటించారు.
11. 2021 సంవత్సరం ఆగస్టులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష స్థానం విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి కిషిదా భారతదేశాన్ని, ప్రత్యేకించి “సాగర జల భద్రత : అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణ” కోసం అత్యున్నత స్థాయిలో బహిరంగ చర్చకు యుఎన్ఎస్ సి అధ్యక్ష హోదాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషిని అభినందించారు. యుఎన్ఎస్ సిలో 2023-2024 సంవత్సరానికి నాన్-పెర్మనెంట్ సభ్యత్వం కోసం జపాన్ అభ్యర్థిత్వానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ మద్దతును పునరుద్ఘాటించగా ప్రధానమంత్రి కిషిదా కృతజ్ఞతలు తెలిపారు. యుఎన్ఎస్ సిలో భారత, జపాన్ ప్రాతినిథ్యం వహించే కాంలో వారు చేపట్టే కార్యకలాపాల విషయంలో సన్నిహితంగా సహకరించుకోవాలని ఉభయులు అంగీకరించారు. 21వ శతాబ్ది వాస్తవికతలకు దీటుగా యుఎన్ఎస్ సి సంస్కరణల కోసం కలిసికట్టుగా కృషిని కొనసాగించాలని ప్రధానమంత్రులు తీర్మానించారు. నిర్దిష్ట కాలపరిమితిలో నిర్మాణాత్మక ఫలితాలు అందే విధంగా అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజిఎన్) లిఖితపూర్వకమైన ప్రక్రియ చేపట్టాలని, ఆ కృషిని వేగవంతం చేయాలని వారు నిర్ణయించారు. యుఎన్ఎస్ సిలో శాశ్వత సభ్యత్వానికి భారత, జపాన్ దేశాలు సంపూర్ణ అర్హత కలిగి ఉన్నాయన్న ఉమ్మడి అభిప్రాయాన్ని వారు పునరుద్ఘాటించారు.
12. ప్రపంచం నుంచి అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలన్న అంశానికి ప్రధానమంత్రులు తమ కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ అణ్వాయుధ వ్యాప్తి, అణు ఉగ్రవాదం వంటి సవాళ్లును దీటుగా ఎదుర్కొనే విషయంలోఅంతర్జాతీయ సహకారం పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించారు. సమగ్ర అణ్వాయుధ పరీక్షల నిషేధ ఒడంబడిక (సిటిబిటి) సత్వరం అమలులోకి తేవలసిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి కిషిదా నొక్కి వక్కాణించారు. ఎలాంటి వివక్షకు తావు లేని విధానంలో షానన్ అంగీకారం ఆధారంగా నిరాయుధీకరణ సమావేశంలో ప్రమాదకర వస్తువుల తొలగింపు ఒప్పందంపై (ఎఫ్ఎంసిటి) బహుముఖీన, అంతర్జాతీయ సంప్రదింపులు తక్షణం ప్రారంభించి సత్వరం ముగించాలని వారు పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక చర్యలను పటిష్ఠం చేయడం లక్ష్యంగా అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వం కోసం కలిసికట్టుగా కృషి చేయాలని వారు ప్రతిజ్ఞ చేశారు.
కోవిడ్ అనంతర ప్రపంచంలో స్థిర అభివృద్ధి భాగస్వామ్యం
13. కోవిడ్-19పై పోరాటం, ప్రజల జీవితాలు-జీవనాధార సంరక్షణపై అంతర్జాతీయ చర్యల విషయంలో సహకారం కొనసాగించుకోవాలని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్లను ఇండో-పసిఫిక్ ప్రాంతంలోను, వెలుపలికి కూడా సమానంగా అందేలా చూసేందుకు క్వాడ్ వ్యాక్సిన్ భాగస్వామ్యం కింద జరుగుతున్న పురోగతిని వారు ఆహ్వానించారు. కోవిడ్-19పై పోరాటం, సామాజిక రక్షణ చర్యల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు జపాన్ అందించిన మద్దతును ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రసంశించారు. కోవిడ్-19పై పోరాటానికి భారతదేశం తీసుకున్న చర్యలను, వ్యాక్సిన్ మైత్రి చొరవ కింద సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్లను, ఔషధాలు, ఔషధ సరఫరాలు సకాలంలో సరఫరా చేయడాన్ని ప్రధానమంత్రి కిషిదా ప్రశంసించారు. ఆరోగ్య సంబంధిత ఎస్ డిజిల సాధనకు ప్రత్యేకించి సార్వత్రిక ఆరోగ్య కవరేజి, ప్రపంచ ఆరోగ్య రక్షణ వ్యవస్థ పటిష్ఠతకు కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థలోను, వ్యవస్థ సంస్కరణల విషయంలోను సమన్వయ పాత్ర పోషించాలని నిర్ణయించారు.
14. సిఓపి 26 నిర్ణయాలకు లోబడి అంతర్జాతీయ నికర జీరో వ్యర్థాల సాధనలో నిరంతర ఇన్నోవేషన్, విభిన్న దేశాల వాస్తవికతలకు లోబడి ఆచరణాత్మక ఇంధన పరివర్తనకు విభిన్న మార్గాలు అన్వేషించాల్సిన ప్రాధాన్యాన్ని, వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనవలసిన అవసరాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధన, వాతావరణ మార్పుల పరిష్కారం, ఇంధన భద్రతకు హామీ, విద్యుత్ వాహనాలు, బ్యాటరీలు సహా స్టోరేజి వ్యవస్థలు, విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, సౌర ఇంధనం, హైడ్రోజెన్/ అమ్మోనియా సహా స్వచ్ఛ ఇంధనాలు, పవన విద్యుత్, ఇంధన పరివర్తన ప్రణాళికలు, ఇంధన సామర్థ్యం, సిసియులు (కార్బన్ డయాక్సైడ్ పట్టుకుని వినియోగంలోకి తెచ్చి నిల్వ చేయడం), కార్బన్ రీ సైక్లింగ్ విభాగాల్లో సహకారానికి కుదుర్చుకున్న భారత-జపాన్ స్వచ్ఛ ఇంధన భాగస్వామ్యాన్ని (సిఇపి) వారు స్వాగతించారు. పారిస్ ఒప్పందంలోని ఆరవ అధికరణం అమలులో భాగంగా భారత-జపాన్ జాయింట్ క్రెడిట్ యంత్రాంగం (జెసిఎం) ఏర్పాటుకు చర్చలు కొనసాగించాలని వారు నిర్ణయించారు. ఇతర విభాగాల్లో కూడా పర్యావరణ సంరక్షణకు కృషి చేయాలన్న సంకల్పం పునరుద్ఘాటించారు. అలాగే దేశీయ వ్యర్థ నీటి నిర్వహణను వికేంద్రీకరించే విభాగంలో సహకారం కోసం ఎంఓసిపై సంతకాలు చేయడాన్ని వారు ఆహ్వానించారు. వారణాసి, అహ్మదాబాద్, చెన్నై స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో జపాన్ గత, వర్తమాన సహకారాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ కొనియాడుతూ ఈ రంగంలో మరింత సహకారానికి ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అలాగే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ), వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల సంఘటన (సిడిఆర్ఐ) ఏర్పాటుకు భారతదేశం తీసుకున్న చొరవను ప్రధానమంత్రి కిషిదా ప్రశంసిస్తూ భారీ పరిశ్రమల పరివర్తనకు ప్రోత్సాహం విషయంలో లీడ్ ఐటి పేరిట భారత-స్వీడన్ చొరవలో జపాన్ భాగస్వామి కావాలనుకుంటున్నదని తెలియచేశారు. స్థిర పట్టణాభివృద్ధి కోసం ఎంఓసిపై సంతకాలు చేయడాన్ని వారు ఆహ్వానించారు.
15. ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికగా నిబంధనల ఆధారిత బహుముఖీన వాణిజ్య వ్యవస్థ పటిష్ఠతకు కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ 12వ డబ్ల్యుటిఓ మంత్రుల స్థాయి స మావేశం (ఎంసి12) నిర్ణయాలపై అర్ధవంతమైన ఫలితాలు సాధించే విషయంలో సన్నిహితంగా సహకరించుకోవాలని ప్రధానమంత్రులు నిర్ణయించారు. వ్యవస్థకు ప్రతికూలంగా ఉండే నిర్బంధ ఆర్థిక విధానాల పట్ల వారు ఉమ్మడి వ్యతిరేకత ప్రకటిస్తూ అలాంటి చర్యలపై పోరాటానికి ప్రపంచ స్థాయి అంతర్జాతీయ సహకారం సాధించేందుకు సన్నిహితంగా సహకరించుకోవాలని వారు నిర్ణయించారు.
16. ఉభయదేశాల సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య స్థాయికి విస్తరించుకున్న అనంతరం ఆర్థిక సహకారం గణనీయంగా వృద్ధి చెందిన విషయం ప్రధానమంత్రులు ప్రత్యేకంగా గుర్తించారు. 2014 సంవత్సరానికి ప్రకటించిన 3.5 లక్షల కోట్ల జెపివై పెట్టుబడి లక్ష్యం పూర్తి కావడం పట్ల వారు సంతృప్తి ప్రకటించారు.జపాన్ ఇన్వెస్టర్ల కోసం వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు, ఆర్థిక సహకారం విస్తరణ, వ్యాపార సానుకూలతకు భారతదేశం తీసుకున్న చర్యలను వారు ప్రశంసించారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు; పరస్పర ఆసక్తి గల ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు వచ్చే ఐదేళ్ల కాలానికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల జెపివై లక్ష్యం కూడా చేరాలన్న ఆకాంక్షను ప్రకటించారు. భారతదేశంతో ఆర్థిక సహకారం పటిష్ఠతకు జపాన్ తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. 2021లో కుదుర్చుకున్న భారత-జపాన్ పారిశ్రామిక పోటీ భాగస్వామ్యం (ఐజెఐసిపి) గురించి ఉభయులు ఒక సారి గుర్తు చేసుకుంటూ ఉభయ దేశాల మధ్య ఎంఎస్ఎంఇ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు), తయారీ, సరఫరా వ్యవస్థల విస్తరణ కోసం ఐజెఐసిపి కింద రూపొందించిన రోడ్ మ్యాప్ ను వారు ఆహ్వానించారు. ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల, విశ్వసనీయమైన, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థ అభివృద్ధి కోసం కలిసి పని చేయాలన్న నిర్ణయాన్ని ఉభయులు ధ్రువీకరిస్తూ అత్యుత్తమ ప్రమాణాల పరిధిలో ఈ విభాగంలో చోటు చేసుకుంటున్న పురోగతిని ఆహ్వానించారు. క్వాడ్ వేదికగా అక్రమ టెక్నాలజీ బదిలీలు నిరోధించేందుకు సహకార భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు. 7500 కోట్ల డాలర్ల విలువ గల ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ అంగీకారం పునరుద్ధరణను వారు ఆహ్వానించారు. భారత-జపాన్ సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందం (సెపా) పరిధిలో సురిమి చేపల వాణిజ్యాన్ని పెంచుకోవడానికి చేసిన సవరణలను, ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణ అవసరాన్ని గుర్తించినట్టు ప్రకటించారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల ప్రాధాన్యం ఉన్నదన్న అంశం ప్రత్యేకంగా నొక్కి చెబుతూ ప్రస్తుత యంత్రాంగాల సహాయంతో సెపా అమలు తీరు సమీక్షను వారు ప్రోత్సహించారు. జపాన్ యాపిల్స్ దిగుమతికి భారతదేశం అంగీకరించడాన్ని, భారతదేశానికి చెందిన మామిడిపళ్ల దిగుమతి కోసం నిబంధనల సడలింపును వారు ఆహ్వానించారు.
17. కోవిడ్ అనంతర ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం ప్రధానమంత్రులు గుర్తించారు. భారత-జపాన్ డిజిటల్ భాగస్వామ్య సహకారం వృద్ధికి డిజిటల్ పరివర్తన, భారత ఐటి వృత్తి నిపుణులు జపాన్ లో పని చేయడానికి అవకాశాల కల్పన, ఐఓటి, ఎఐ రంగాలు, ఇతర వర్థమాన టెక్నాలజీల్లో సహకారం విభాగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. జపాన్ ఐసిటి రంగంలో అధిక నైపుణ్యాలు గల భారత ఐటి వృత్తి నిపుణులను ఆకర్షించేందుకు ఎదురు చూస్తున్నట్టు ప్రధానమంత్రి కిషిదా తెలిపారు. వర్థమాన స్టార్టప్ ల కోసం నిధుల సమీకరణకు “ఇండియా-జపాన్ ఫండ్-ఆఫ్_ఫండ్స్” ఏర్పాటు దిశగా జరిగిన పురోగతిని వారు ఆహ్వానించారు. సైబర్ సెక్యూరిటీ, ఐసిటి రంగాల్లో ఎంఓసిలపై సంతకాలు చేయడాన్ని స్వాగతిస్తూ సైబర్ విభాగంలో ద్వైపాక్షిక బంధం పురోగతిని వారు ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి కేంద్రంగా వివిధ వేదికలపై ఈ సైబర్ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవాలని ధ్రువీకరించారు. 5జి, ఓపెన్ రాన్, టెలికాం నెట్ వర్క్ ల భద్రత, జలాంతర్గాముల కేబుల్ వ్యవస్థ, క్వాంటమ్ కమ్యూనికేషన్ల విభాగంలో సహకారం మరింతగా విస్తరించుకోవాలని నిర్ణయించారు. 2020 నవంబర్ లో ఏర్పాటైన శాస్త్ర, సాంకేతిక రంగాలపై భారత-జపాన్ జాయింట్ కమిటీ సహా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం విస్తరణలో పురోగతిని వారు ఆహ్వానించారు. ఉమ్మడి చంద్రమండల పరిశోధన ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు. టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ, వినియోగంపై క్వాడ్ సూత్రాల మార్గదర్శకంలో ఒకే రకమైన ఆలోచనా దృక్పథం గల దేశాల భాగస్వామ్యం విస్తరించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
18. కొన్ని సంవత్సరాలుగా భారత సామాజిక-ఆర్థికాభివృద్ధికి జపాన్ అందిస్తున్న మద్దతును ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. భారతదేశంలో అమలులో ఉన్న ఏడు యెన్ ప్రాజెక్టుల కోసం 30 వేల కోట్ల యెన్ ల (రూ.20,400 కోట్ల పైబడి) రుణ అంగీకారాల మార్పిడిని ప్రధానమంత్రులు ఆహ్వానించారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (ఎంఏహెచ్ ఎస్ఆర్) ప్రాజెక్టుపై ద్వైపాక్షిక సహకారం పురోగతి పట్ల సంతృప్తి ప్రకటించారు. భారత-జపాన్ సహకారానికి ఈ ప్రాజెక్టు ఒక కీలక చిహ్నమని వారు ధ్రువీకరిస్తూ భారతదేశంలో రైల్వేల సామర్థ్యాల విస్తరణలో టెక్నాలజీ బదిలీని విస్తరించడానికి ఇది దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యే దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. ఎంఏహెచ్ఎస్ఆర్, భారతదేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టుల్లో జపాన్ సహకారంతో పాటు పాట్నా మెట్రో కోసం నిర్ణయించిన సర్వేకు సహకారాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.
19. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత, జపాన్ సహకారం ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్ లో అమలుజరుగుతున్న ప్రాజెక్టు పురోగతి పట్ల సంతృప్తి ప్రకటిస్తూ ఆసియాన్, పసిఫిక్ దీవులు, ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే తరహా భాగస్వామ్య విస్తరణకు అవకాశాలు అన్వేషించాలని నిర్ణయించారు. భారతదేశంలో ఈశాన్య ప్రాంత స్థిర ఆర్థికాభివృద్ధికి, దక్షిణాసియాతో ఆ ప్రాంత అనుసంధానతకు యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ (ఎఇఎఫ్) ద్వారా సహకారం విస్తరించుకోవలసిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు. “ఈశాన్యంలో వెదురు విలువ ఆధారిత వ్యవస్థ పటిష్ఠత” సహా “భారత ఈశాన్య ప్రాంత సుస్థిర అభివృద్ధి”కి, ఆరోగ్య సంరక్షణలో సహకారానికి, అటవీ వనరుల నిర్వహణకు; ఈశాన్య రాష్ర్టాల్లో కనెక్టివిటీ, టూరిజం విస్తరణకు భారత-జపాన్ చొరవ పేరిట ఒక కార్యక్రమం ప్రారంభించడాన్ని వారు ఆహ్వానించారు.
20. భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల 70 వార్షికోత్సవం 2022లో జరుగుతున్న నేపథ్యంలో ప్రజల మధ్య సంబంధాలు, పర్యాటకం, క్రీడా రంగాల్లో సహకారం ద్వారా భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ స్థాయి భాగస్వామ్యం మరింత పటిష్ఠం చేసుకోవాలన్న సంకల్పం ఉభయదేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. భారత-జపాన్ స్నేహానికి ప్రతీకగా వారణాసిలో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించడాన్ని వారు ఆహ్వానించారు. జపాన్ భాషా విద్య, శిక్షణ విస్తరణలో పురోగతిని కొనియాడుతూ జపాన్ ఓవర్సీస్ సహకారం వలంటీర్ల (జెఓసివి) పథకం కింద దాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించారు.
21.ఉపాధి అవకాశాల కల్పన కోసం నైపుణ్యాల అభివృద్ధిలో సహకారం ప్రాధాన్యతను వారు పునరుద్ఘాటించారు. జైఐఎం (జపాన్-ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్), జెఇసి (జపనీస్ ఎండోడ్ కోర్సులు) విభాగాలు రెండింటిలోనూ గత ఏడాది 3700 భారతీయులు శిక్షణ పొందడాన్ని వారు ఆహ్వానించారు. సహకార భాగస్వామ్యంలో భాగంగా 2021 జనవరిలో సంతకాలు చేసిన ప్రత్యేక నైపుణ్యాలు గల కార్మిక (ఎస్ఎస్ డబ్ల్యు) వ్యవస్థ అమలులోకి రావడం పట్ల వారు హర్షం ప్రకటించారు. భారతదేశంలో ఎస్ఎస్ డబ్ల్యు పరీక్షలు గత ఏడాది ప్రారంభం కావడాన్ని ఆహ్వానిస్తూ ఎస్ఎస్ డబ్ల్యులో కొందరు భారతీయ కార్మికులు ఇప్పటికే పని చేస్తున్న విషయం గుర్తు చేశారు. జపాన్ లో సుమారు 200 మంది భారతీయులు టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినీలుగా శిక్షణ పొందుతున్న విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల ద్వారా జపాన్ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు దోహదపడేందుకు మరింత అధిక సంఖ్యలో నిపుణులైన భారతీయులు జపాన్ లో పని చేయడాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
22. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్ 2020 విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి కిషిదాకు ప్రధానమంత్రి శ్రీ మోదీ అభినందనలు తెలియచేయగా భారతదేశం అందించిన సహకారాన్ని ప్రధానమంత్రి కిషిదా ప్రశంసించారు. ఉభయదేశాల మధ్య వాణిజ్యం విస్తరించుకునేందుకు, ప్రజల మధ్య సహకారం పటిష్ఠం చేసుకునేందుకు ఒక అవకాశంగా జపాన్ లోని కన్సాయ్ ప్రాంతంలో జరుగనున్న ఒసాకి ఎక్స్ పో 2025లోభాగస్వామిగా ఉంటామని భారత్ ధ్రువీకరించింది. ప్రధానమంత్రి కిషిదా భారతదేశ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ఆ ప్రదర్శన విజయవంతం కావడానికి భారతదేశం అందిస్తున్న మద్దతుకు ప్రధానమంత్రి శ్రీ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
23. ఉభయ దేశాల నాయకుల మధ్య పరస్పర సందర్శనలు సాధించిన విజయాలు ఆధారంగా రాబోయే కాలంలో మరిన్ని సందర్శనల కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. తనకు, తన బృందానికి భారత పర్యటన సందర్భంగా అందించిన హృదయపూర్వకమైన, సాదర ఆతిథ్యం పట్ల ప్రధానమంత్రి కిషిదా ప్రధానమంత్రి శ్రీ మోదీకి కృతజ్ఞతలు తెలియచేశారు. క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి జపాన్ సందర్శించాలని ప్రధానమంత్రి శ్రీ మోదీని కిషిదా ఆహ్వానించారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆనందంగా ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు.
భారత రిపబ్లిక్ ప్రధానమంత్రి
జపాన్ ప్రధానమంత్రి