ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న గ్రీస్ దేశంలో అధికారికంగా పర్యటించారు. హెలెనిక్ గణతంత్రమైన గ్రీస్ ప్రధాని గౌరవనీయ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శించారు.
భారత్-గ్రీస్ మధ్యగల చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రులిద్దరూ స్మరించుకున్నారు. ప్రపంచంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు పునరుత్తేజిత విధానం అవసరమని వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
స్నేహపూర్వక, సౌహార్ద వాతావరణం నడుమన దేశాధినేతలిద్దరూ అత్యున్నత స్థాయి చర్చలు నిర్వహించారు. ఉభయ పక్షాల మధ్య ప్రస్తుత సహకారాన్ని కొనసాగిస్తూ పరస్పర ప్రయోజన సంబంధిత ద్వైపాక్షిక, ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
రెండు ప్రాచీన సముద్ర ఆధారిత దేశాల మధ్య దీర్ఘకాలిక సముద్ర ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో సముద్ర చట్టాలకు లోబడి… ముఖ్యంగా నిబంధనలకు అనుగుణంగా స్వేచ్ఛా, సార్వత్రిక, నియమాధారిత మధ్యధరా సముద్ర/ఇండో-పసిఫిక్ ప్రాంతీయ దృక్పథంపై తమ అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నారు. అలాగే సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి తీర్మానం, అంతర్జాతీయ శాంతి-స్థిరత్వం-భద్రత ప్రయోజనాల దిశగా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, సముద్ర ప్రయాణ స్వేచ్ఛ తదితరాలపై వారు పూర్తి గౌరవం ప్రకటించారు.
భారతదేశంతోపాటు ఐరోపా సమాఖ్య (ఈయూ)లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యయుత, స్వేచ్ఛా విపణులు ఉన్నాయని దేశాధినేతలిద్దరూ గుర్తుచేసుకున్నారు. అందువల్ల ఐరోపా సమాఖ్యతో భారత్ సంబంధాల విస్తరణ పరస్పర ప్రయోజనకరం మాత్రమేగాక ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా సానుకూల ప్రభావం చూపగలదని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. గ్రీస్, భారత్ తమతమ పరిధిలో ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక పునరుద్ధరణలో అసాధారణ నైపుణ్యంతో వృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాయని ప్రధానమంత్రులు ఇద్దరూ సంతృప్తి వెలిబుచ్చారు. భారత-ఈయూ వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలతోపాటు అనుసంధాన భాగస్వామ్యాన్ని త్వరగా అమలు చేయడంపై వారు దృఢ నిశ్చయం ప్రకటించారు.
ఉభయ దేశాలు, ప్రజల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక, సన్నిహిత సంబంధాల పునాది ప్రాతిపదికగా గ్రీకు-భారత్ ద్వైపాక్షిక సంబంధాలను “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి ఉన్నతీకరించాలని దేశాధినేతలిద్దరూ నిర్ణయించుకున్నారు. అలాగే రాజకీయ-ఆర్థిక, భద్రత రంగాల్లనూ ద్వైపాక్షిక సహకార విస్తరణకు కృషి చేయాలని నిశ్చయించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల్లో వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు లక్ష్యంతో సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
రక్షణ, షిప్పింగ్, శాస్త్ర-సాంకేతికత, సైబర్ ప్రపంచం, విద్య, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో ద్వైపాక్షిక చర్చలను మరింత లోతుగా విస్తరించాల్సిన అవసరాన్ని అధినేతలిద్దరూ పునరుద్ఘాటించారు. పరస్పర ప్రయోజనం దిశగా ఆయా రంగాల్లో సహకార సౌలభ్యం కోసం వ్యవసాయంపై హెలెనిక్-ఇండియన్ సంయుక్త ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అంగీకరించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ- భద్రత, ప్రభుత్వాల మధ్య దౌత్యంవంటి అంశాలలో క్రమం తప్పకుండా చర్చలు సాగేలా చూడాలని సీనియర్ అధికారులను ప్రధానమంత్రులు ఆదేశించారు. గ్రీస్-భారత్‌ల మధ్య నేరుగా విమానయాన సేవలను ప్రోత్సహించాలని కూడా వారు అంగీకరానికి వచ్చారు.
రెండు దేశాల మధ్య చిరకాల సాంస్కృతిక ఆదానప్రదానాలను పరిగణనలోకి తీసుకుంటూ అన్నిరకాల కళలలో ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించే కృషిని వారిద్దరూ స్వాగతించారు. ప్రాచీన ప్రదేశాల రక్షణ-సంరక్షణలో ఉమ్మడిగానూ, యునెస్కోతోనూ సహకార బలోపేతంపై దేశాధినేతలిద్దరూ అంగీకరించారు.
రెండు దేశాల మధ్య రాకపోకలు, వలసలపై భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపిఎ) సత్వర ఖరారు పరస్పర ప్రయోజనకరం కాగలదని వారిద్దరూ భావించారు. ముఖ్యంగా శ్రామిక శక్తి స్వేచ్ఛా ప్రయాణానికి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని రూపాలు, స్వభావాల్లోని ఉగ్రవాదాన్ని ఇద్దరు ప్రధానమంత్రులూ నిర్ద్వంద్వంగా ఖండించారు. దీంతోపాటు ఎప్పుడు.. ఎవరు.. ఎక్కడ.. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినా, సీమాంతర విధ్వంస కార్యకలాపాల కోసం ముష్కర మూకలను ప్రచ్ఛన్న శక్తులుగా ప్రయోగించినా సహించరాదన్న సంకల్పం ప్రకటించారు.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ)లో గ్రీస్ భాగస్వామి కావాలని, అలాగే విపత్తు ప్రతిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్‌ఐ)లోనూ సభ్యత్వం స్వీకరించాలని ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు.
భారత జి-20 అధ్యక్షతపై ప్రధాని మిత్సోతాకిస్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ నేతృత్వంలో ఈ కూటమి తన లక్ష్యాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలదని విశ్వాసం వ్యక్తంచేశారు.
గ్రీస్ పర్యటనలో ప్రభుత్వంతోపాటు దేశ పౌరులు తనపట్ల అపార గౌరవాదరాలు ప్రదర్శించడంపై ప్రధానమంత్రి మిత్సోతాకిస్‌తోపాటు ప్రజలందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ, భారత పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మిత్సోతాకిస్‌కు ఆహ్వానం పలికారు.