ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రునిపై వ్యోమనౌకను దింపి విజయం సాధించిన నేపథ్యంలో తాజా మిషన్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈసారి చంద్రుని పైనుంచి నమూనాలతో వ్యోమనౌకను తిరిగి భూమికి రప్పించి, వాటిని విశ్లేషించగల సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన, సామర్థ్య ప్రదర్శన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రునిపైకి వ్యోమనౌకను పంపి, తిరిగి రప్పించగల (2040 నాటికి అమలయ్యే ప్రణాళిక) ప్రాథమిక సాంకేతిక సామర్థ్యాలను సాధించాలని ఇస్రో తలపెట్టింది. ఇందులో భాగంగా డాకింగ్/అన్‌డాకింగ్, ల్యాండింగ్ సహా భూమికి సురక్షితంగా రప్పించడంతోపాటు చంద్ర నమూనాల సేకరణ-విశ్లేషణకు అవసరమైన కీలక సాంకేతిక సామర్థ్యాలను చాటుకుంటుంది.
అంతరిక్షంలో 2035 నాటికి స్వదేశీ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రునిపై భారత్ ల్యాండింగ్, తిరిగిరాక లక్ష్యంగా అమృత కాలంలో భారత అంతరిక్ష కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. ఈ స్వప్న సాకారం దిశగా అంతరిక్ష యానం, మౌలిక సదుపాయాల సామర్థ్య అభివృద్ధి సహా చంద్రయాన్ వరుస మిషన్లకు ఇస్రో రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా, సజావుగా దింపడంలో విజయం ద్వారా కీలక సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకుంది. తద్వారా ఈ సామర్థ్యాలున్న అతి కొద్ది దేశాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ విజయానికి సహజ వారసత్వంలో భాగంగా చంద్ర నమూనాలను సేకరించి, సురక్షితంగా భూమికి తిరిగి తెచ్చే సామర్థ్యాన్ని కూడా రుజువు చేసుకోవాలని సంకల్పించింది.
ఈ మిషన్ కింద అంతరిక్ష నౌకల రూపకల్పన, ప్రయోగ బాధ్యతలను ఇస్రో నిర్వర్తిస్తుంది. ఈ మేరకు సంస్థ ఇప్పటికే అనుసరిస్తున విధివిధానాలతో ప్రాజెక్టును సమర్థంగా నిర్వహించడమే కాకుండా సునిశితంగా పర్యవేక్షించగలదు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి ఆమోదం తర్వాత పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరోవైపు కీలకమైన అన్ని సాంకేతిక పరిజ్ఞానాలనూ దేశీయంగానే రూపొందించాలని భావిస్తున్నారు. ఈ మిషన్ సాకారం కావడంలో అనేక పరిశ్రమల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి, ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలలో అధిక ఉపాధి సృష్టితోపాటు మరిన్ని సాంకేతికతల ఆవిర్భావానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ సాంకేతిక సామర్థ్య ప్రదర్శన మిషన్ ‘‘చంద్రయాన్-4’’కు రూ.2104.06 కోట్లు వ్యయం కాగలవని అంచనా. వ్యోమనౌక రూపకల్పన-తయారీ, ‘ఎల్‌విఎం3’ సంబంధిత రెండు ప్రయోగ వాహనాల మిషన్లు, ‘డీప్ స్పేస్ నెట్‌వర్క్’ తోడ్పాటు, డిజైన్ ధ్రువీకరణ దిశగా ప్రత్యేక పరీక్షలు, చివరగా చంద్రునిపై దిగడం, సేకరించిన నమూనాలతో భూమికి సురక్షితంగా తిరిగి రావడం వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి.
మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు, చంద్ర నమూనాలతో తిరిగి రాక, వాటిపై శాస్త్రీయ విశ్లేషణ వగైరాల రీత్యా కీలక ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనలో భారత్ స్వావలంబన సామర్థ్యాన్ని ఈ మిషన్ చాటుతుంది. ఈ సంకల్ప సాధనలో భారత పారిశ్రామిక రంగం పాత్ర కూడా గణనీయమైనదే. అలాగే చంద్రయాన్-4 సైన్స్ మీట్‌లు, వర్క్ షాప్‌ల ద్వారా దేశంలోని విద్యాసంస్థలను కూడా దీనితో ముడిపెట్టే ప్రణాళిక అమలు ఇప్పటికే మొదలైంది. వ్యోమనౌక భూమికి తెచ్చే నమూనాల వర్గీకరణ (క్యురేషన్), విశ్లేషణ సదుపాయాల కల్పనకు ఈ మిషన్ వీలు కల్పిస్తుంది. ఇవన్నీ అంతిమంగా జాతీయ ఆస్తులుగా మిగులుతాయి.
It would make everyone proud that Chandrayaan-4 has been cleared by the Cabinet! This would have multiple benefits, including making India even more self-reliant in space technologies, boosting innovation and supporting academia. https://t.co/ZWLMPeRrYh
— Narendra Modi (@narendramodi) September 18, 2024