1. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహ్వానం మేరకు ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమాన్యుయల్ మాక్రాన్ 2018 మార్చి నెల 10వ తేదీ నుండి 12 తేదీ మధ్య భారతదేశంలో ఆధికారిక పర్యటనకై విచ్చేశారు. 11వ తేదీన ఉభయ దేశాల నాయకులు అంతర్జాతీయ సౌర కూటమి వ్యవస్థాపక శిఖర సమ్మేళనాన్ని సహ ఆతిథేయిలుగా నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తృత శ్రేణి అంశాలపైన ఇరువురు నిర్మాణాత్మక చర్చలు జరిపి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఉభయ దేశాల మధ్య అభిప్రాయాలు పరస్పరం ఒకే ఒరవడిలో వ్యక్తం అవుతున్నాయని ప్రకటించారు.

2. భారతదేశం ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దానిని మరింత ముందుకు నడిపించాలన్న కట్టుబాటు ను ప్రకటించారు. భారత ప్రధాన మంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శిఖర సమ్మేళనాన్ని నిర్వహించడం ద్వారా ఈ సహకారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఉభయ దేశాల మధ్య ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టపరమైన పరిపాలన, మానవ హక్కులను గౌరవించడం వంటి ఉమ్మడి సిద్ధాంతాలు, విలువల ఆధారంగా ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించారు.

3. ఒకటో ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశ సైనికులు, ఫ్రెంచి సైనికులు చేసిన సాహసోపేతమైన త్యాగాలను గుర్తు చేసుకొంటూ 2018 నవంబర్ 11వ తేదీన పారిస్ లో జరుగనున్న ఒకటో ప్రపంచ యుద్ధ శత వార్షిక వేడుకలలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా పారిస్ శాంతి వేదిక ఏర్పాటుకు ప్రధాన మంత్రి మద్దతు తెలుపగా, అందుకు అధ్యక్షుడు శ్రీ మాక్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.

I. వ్యూహాత్మక భాగస్వామ్యం

4. “ర‌క్షిత స‌మాచారంగా గుర్తించిన స‌మాచారాన్ని ప‌ర‌స్ప‌రం అందించుకోవ‌డం, ప‌ర‌స్పర ర‌క్షణ క‌ల్పించ‌డం కోసం ఉభయ దేశాల మ‌ధ్య కుదిరిన అంగీకారాన్ని” ఉభయ నాయ‌కులు ఆహ్వానించారు. ఉభయ దేశాల మ‌ధ్య గల వ్యూహాత్మక విశ్వాసానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని వారు పేర్కొన్నారు. మంత్రిత్వ స్థాయిలో వార్షిక ర‌క్షణ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని కూడా నాయ‌కులు అంగీకారానికి వ‌చ్చారు.

5. హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో స‌హ‌కార విస్తృతికి మ‌రింత లోతుగా చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌న్న‌నిర్ణ‌యాన్ని ఉభ‌యులు ఆహ్వానించారు. ఈ భాగ‌స్వామ్యానికి క‌ర‌దీపిక‌గా నిలచేలా రూపొందించిన “హిందూ మ‌హాస‌ముద్రంలో భారత్- ఫ్రాన్స్ స‌హ‌కారం ఉమ్మ‌డి వ్యూహాత్మక విజ‌న్” ను కూడా వారు ఆహ్వానించారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డి వాణిజ్యం, క‌మ్యూనికేష‌న్ ల నిరంతర ప్ర‌వాహానికి ఎలాంటి అవ‌రోధం క‌ల‌గ‌కుండా చూసుకోవాలంటే స‌ముద్ర జ‌లాల్లో ఉగ్ర‌వాదం, చౌర్యాన్ని అరిక‌ట్ట‌డం, సాగర జ‌లాల ర‌క్ష‌ణ‌పై చైత‌న్యం క‌ల్పించ‌డం, సామ‌ర్థ్యాల నిర్మాణం, ప్రాంతీయ అంశాల‌పై ప్రాంతీయ/అంత‌ర్జాతీయ‌ వేదిక‌లలో స‌హ‌క‌రించుకోవ‌డం ద్వారా అంత‌ర్జాతీయ జ‌లాల్లో భ‌ద్ర‌త‌ను ప‌రిర‌క్షించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని వారు గుర్తించారు.

6. “సాయుధ ద‌ళాల కోసం ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణిలో లాజిస్టిక్స్ మ‌ద్ద‌తు ఇచ్చేందుకు భారత గణతంత్రం, ఫ్రాన్స్ గణతంత్రంల మ‌ధ్య కుదిరిన అంగీకారాన్ని” వారు ఈ ఒప్పందం కింద ఉభయ దేశాలు భారత, ఫ్రెంచ్ సాయుధ‌ ద‌ళాల‌కు ప‌ర‌స్పర లాజిస్టిక్స్ స‌హ‌కారం ప‌రిధిలో తమ వ‌ద్ద ఉన్న స‌దుపాయాల‌ను ప‌ర‌స్పరం వినియోగించుకొనేందుకు అనుమ‌తిస్తారు. భారత-ఫ్రాన్స్ బంధంలో ఏర్ప‌డిన ప‌రిణ‌తికి, వ్యూహాత్మ‌క‌మైన గాఢతకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని వారు పేర్కొన్నారు.

7. క్ర‌మం త‌ప్ప‌కుండా ఉమ్మ‌డి సైనిక విన్యాసాలను నిర్వ‌హించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఉభయ దేశాల నాయ‌కులు నొక్కి చెప్పారు. 2017 ఏప్రిల్ లో ఫ్రాన్స్ లో వ‌రుణ నౌకాదళ విన్యాసాలు, 2018 జ‌న‌వ‌రిలో ఫ్రాన్స్ లో శ‌క్తి సైనిక విన్యాసాలు విజ‌యవంతంగా నిర్వ‌హించ‌డాన్ని వారు స్వాగ‌తించారు. రానున్న వారాల్లో భార‌త్ లో జ‌రుగ‌నున్న వ‌రుణ నౌకాదళ విన్యాసాలు, 2019లో ఫ్రాన్స్ లో జ‌రుగ‌నున్న గ‌రుడ వాయుదళ విన్యాసాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు వారు ప్ర‌క‌టించారు. ఈ ఉమ్మ‌డి మిలిట‌రీ విన్యాసాల‌ను మ‌రింత‌గా విస్త‌రించుకోవాల‌న్న ఆకాంక్ష‌తో పాటు రానున్న కాలంలో ఇలాంటి విన్యాసాల నాణ్యతను పెంచుకోవాల‌ని కూడా అంగీకారానికి వ‌చ్చారు.

8. 2016 లో కుదిరిన రఫాల్ విమానాల ఒప్పందంతో స‌హా ఉభయ దేశాల మ‌ధ్య కుదిరిన వివిధ అంగీకారాల అమ‌లు నిర్ణీయ స‌మ‌యానికి అనుగుణంగానే పురోగ‌మిస్తూ ఉండ‌డం ప‌ట్ల ఇద్ద‌రు నాయ‌కులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ కు చెందిన నౌకానిర్మాణ సంస్థ స‌హ‌కారంతో మాఝ్ గావ్ డాక్ షిప్ బిల్డ‌ర్స్ లిమిటెడ్ మొట్ట‌మొద‌టిసారిగా భార‌తదేశం లో నిర్మించిన తొలి జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ క‌ల్వ‌రి విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల హ‌ర్ష ప్ర‌క‌టించారు.

9. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ర‌క్షణ త‌యారీ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత‌గా విస్త‌రించే దిశ‌గా చ‌ర్చ‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. ర‌క్షణ ప‌రిక‌రాలు ఉమ్మ‌డిగా త‌యారు చేసి, ఉమ్మ‌డిగా ఉత్ప‌త్తి చేసేందుకు భారత, ఫ్రెంచి ర‌క్షణ సంస్థ‌ల‌కు మేక్ ఇన్ ఇండియా చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పించింద‌ని వారు ప్ర‌శంసించారు. అంద‌రి ప‌ర‌స్పర ప్ర‌యోజ‌నం ల‌క్ష్యంగా ప‌రిజ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని మార్పిడి చేసుకొనేందుకు కూడా ఇది వేదిక క‌ల్పించింద‌ని వారు అన్నారు. భారత, ఫ్రెంచి కంపెనీల మ‌ధ్య కుదిరిన భాగ‌స్వామ్యాల‌ను కూడా వారు ఆహ్వానిస్తూ కొత్త భాగ‌స్వామ్యాల ఏర్పాటును ప్రోత్స‌హించాల‌న్న వచనబద్ధతను ప్ర‌క‌టించారు.

10. యుద్ధ‌విమానానికి ఇంజ‌ిన్ ను త‌యారుచేసేందుకు డిఆర్ డిఒ కు, ఎస్ఎఎఫ్ఆర్ఎఎన్ కు మ‌ధ్య ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ దాన్ని స‌త్వ‌రం పూర్తి చేసుకొనేందుకు అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందించాల‌ని ఉభ‌యులు నిర్ణ‌యించారు.

11. సీమాంతర ఉగ్ర‌వాదం స‌హా ఫ్రాన్స్ లో, భార‌తదేశంలో ఉగ్ర‌వాద సంబంధిత సంఘ‌ట‌న‌ల‌ను ఖండిస్తూ ఉగ్ర‌వాద చ‌ర్యల‌ను ఏ విధంగా స‌మ‌ర్థించేది లేద‌న్న క‌ట్టుబాటును పున‌రుద్ఘాటించారు. ఏ కార‌ణంగా అయినా, ప్రాంతాలు, జాతులు, జాతీయ‌త‌లు, వ‌ర్ణాల పేరిట అయినా ఎలాంటి ఉగ్ర‌వాద చ‌ర్య‌లైనా న్యాయ‌బ‌ద్ధం కావ‌ని ప్ర‌క‌టించారు. 2016 జ‌న‌వ‌రి లో ఉగ్ర‌వాదాన్ని ఖండిస్తూ ఉభయ దేశాలు ఆమోదించిన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ఎక్కడ క‌నిపించినా ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించాల‌న్న క‌ట్టుబాటు ను పున‌రుద్ఘాటించారు. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించే ధోర‌ణుల నుంచి అంత‌ర్జాతీయ స‌మాజాన్ని దూరం చేయ‌డానికి మ‌రింత కృషి చేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించారు. 2018 ఏప్రిల్ లో ఫ్రెంచి ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో ఉగ్ర‌వాద ఫైనాన్సింగ్ వ్య‌తిరేక అంత‌ర్జాతీయ స‌హ‌కారం సంఘం స‌మావేశానికి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు.

12. ద‌క్షిణాసియా మరియు స‌హేల్ ప్రాంతం స‌హా వివిధ ప్రాంతాలలో శాంతికి, భ‌ద్ర‌త‌కు విఘాతం క‌లిగిస్తున్న అల్ కాయిదా, దాయేశ్/ఐఎస్ ఐఎస్, జైశ్- ఎ- మొహ‌మ్మ‌ద్, హిజ్బుల్‌ ముజాహిదీన్, ల‌ష్క‌ర్- ఎ- త‌యబా, వాటి అనుబంధ ఉగ్ర‌వాద బృందాల సీమాంతర క‌ద‌లిక‌ల‌ను నిలువ‌రించాల‌ని, ఆయా సంస్థ‌ల‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించే మార్గాల‌ను మూసివేయాల‌ని, ఉగ్ర‌వాదుల‌కు సుర‌క్షిత స్థావ‌రాల‌ను నిర్మూలించాల‌ని ప్ర‌పంచ‌ దేశాల‌న్నింటికీ వారు పిలుపు ఇచ్చారు.

13. ఉభయ దేశాల‌కు చెందిన ఇంట‌ర్ వెన్ష‌న్ ద‌ళాలు (ఎన్ఎస్ జి- జిఐజిఎన్), ద‌ర్యాప్తు సంస్థల మ‌ధ్య అద్భుత స‌హ‌కారానికి తోడుగా భారత, ఫ్రెంచ్ ఉగ్ర‌వాద వ్య‌తిరేక పోరాట సంస్థల మ‌ధ్య స‌హ‌కారం విస్త‌రించుకోవాల‌ని కూడా నిర్ణ‌యించారు. భిన్న మార్గాల్లో ప్ర‌త్యేకించి ఆన్ లైన్ లో ఉగ్ర‌వాద ప్రోత్సాహక ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిలువ‌రించ‌డంలో కొంగ్రొత్త స‌హ‌కారం పెంచుకోవాల‌ని కూడా నిర్ణ‌యించారు. ఐక్య‌రాజ్య‌స‌మితి, జిసిటిఎఫ్, ఎఫ్ ఎటిఎఫ్, జి20 వంటి వివిధ బ‌హుముఖీన సంస్థ‌లు వేదిక‌గా ఉగ్ర‌వాద వ్య‌తిరేక పోరాటాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని కూడా వారు ఒక అంగీకారానికి వ‌చ్చారు. ఉగ్ర‌వాద సంస్థల ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌త మండ‌లి తీర్మానం 1267, అదే త‌ర‌హా లోని ఇతర తీర్మానాల‌ను స‌త్వరం అమ‌లు చేయాల‌ని స‌మితి స‌భ్య దేశాల‌కు పిలుపు ఇచ్చారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద స‌మ‌గ్ర కూట‌మి (సిసిఐటి) స‌త్వర ఏర్పాటు కోసం క‌లిసి కృషి చేయాల‌ని నిర్ణ‌యించారు.

14. మత్తుమందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ మరియు కెమికల్ ప్రికర్సర్స్ అక్రమ ర‌వాణాను, అక్రమ వినియోగాన్ని అరిక‌ట్టేందుకు స‌మ‌ర్థ‌వంత‌మైన వ్య‌వ‌స్థాత్మక సంప్ర‌దింపుల కోసం ఉభయ దేశాల మ‌ధ్య కుదిరిన ఒప్పందాన్ని వారు ఆహ్వానించారు.

15. శాంతియుత ప్ర‌యోజ‌నాల‌కే పరమాణు శ‌క్తి వినియోగంపై భారతదేశానికి, ఫ్రాన్స్ కు మ‌ధ్య 2008 సంవ‌త్స‌రంలో కుదిరిన ఒప్పందం, 2016 లో స‌హ‌కారానికి రూపొందించిన ప్ర‌ణాళిక రెండింటికీ అనుగుణంగా మ‌హారాష్ట్రలోని జైతాపూర్ లో ఆరు న్యూక్లియర్ రియాక్టర్ ల ఏర్పాటుకు ఎన్‌పిసిఐఎల్, ఇడిఎఫ్ ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప‌ట్ల ఇద్ద‌రు నాయ‌కులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

16. జైతాపూర్‌ లో ప‌నులు 2018 చివ‌రకు ప్రారంభం కావాల‌న్న ల‌క్ష్యాన్ని పున‌రుద్ఘాటిస్తూ ఇందుకు సంబంధించిన కాంట్రాక్టుప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఎన్ పిసిఐఎల్, ఇడిఎఫ్‌ ల‌ను కోరారు. ఇది పూర్త‌ి అయితే జైతాపూర్ ప్రాజెక్టు 9.6 గీగా వాట్ల సామ‌ర్థ్యంతో ప్ర‌పంచంలోనే అతి పెద్ద పరమాణు విద్యుత్తు ప్లాంటు అవుతుంది. 2030 కల్లా శక్తి ఉత్ప‌త్తిలో 40 శాతం శిలాజేతర ఇంధ‌నాల నుండి స‌మ‌కూర్చుకోవాల‌న్న భారతదేశం ల‌క్ష్యానికి ఇది తోడ్పాటును అందిస్తుంది. ఫ్రాన్స్ నుండి అందే ఆర్థిక ప్యాకేజి అండ‌గా ఈ ప్రాజెక్టు విద్యుత్తు ఉత్ప‌త్తి వ్య‌యాల‌ను త‌గ్గించి స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు విద్యుత్తును అందుబాటులోకి తేవాల‌ని వారు పిలుపు ఇచ్చారు. జైతాపూర్ ప్లాంటులకు జీవిత కాలం పొడ‌వునా ఇంధన స‌ర‌ఫ‌రా, సాంకేతిక ప‌రిజ్ఞానం బ‌దిలీ అందించేందుకు, భార‌తదేశం లోనే త‌యారీ కార్య‌క‌లాపాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఫ్రాన్స్ అంగీకారం తెలిపింది.

17. అణు ప్ర‌మాదాల కార‌ణంగా పౌరుల‌కు ఏర్ప‌డే న‌ష్టాల‌కు బాధ్యత వ‌హించే విధంగా కుదిరిన అంగీకారాన్ని జైతాపూర్ కు కూడా విస్త‌రించాల‌న్న నిర్ణ‌యాన్ని ఉభ‌యులు ఆహ్వానించారు. సివిల్ లిబర్టీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ యాక్ట్, 2010 కి, సివిల్ లయబులిటీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ రూల్స్, 2011 కు అనుగుణంగా ఈ అవగాహనను కుదుర్చుకొన్నారు.

18. ఉభ‌య‌ దేశాల అణుశక్తి సంస్థల మ‌ధ్య తర‌చుగా సంప్ర‌దింపుల‌ను, ప‌ర‌స్పర ప్ర‌యోజ‌నం ప్రాతిప‌దికన స‌హాకార విస్తృతిని ఆహ్వానిస్తూ సిఇఎ/ఐఎన్ఎస్‌టిఎన్, డిఎఇ/ జిసిఎన్ఇపి ల మ‌ధ్య శాంతియుత స‌హ‌కారానికి పరమాణు శ‌క్తి ఒప్పందాల‌కు మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. భారతదేశ అటామిక్ ఎనర్జి రెగ్యులేటరీ బోర్డు (ఎఇఆర్ బి), ఫ్రాన్స్ కు చెందిన ఆటోరైట్ డి ష్యూరిటి న్యూక్లియర్ (ఎఎస్ఎన్) ల మ‌ధ్య విలువైన అనుభ‌వాలు, ఉత్తమ ప్ర‌మాణాలు, అణు భ‌ద్రత, నియంత్రణ అంశాల్లో తాజా ప‌రిణామాలు పంచుకొనేందుకు త‌ర‌చుగా సంప్ర‌దింపులు, దీర్ఘ‌కాలిక బంధం నెల‌కొన‌డాన్ని ప్ర‌శంసించారు.

అంతరిక్ష సహకారం

19. పౌర సంబంధ అంతరిక్ష విభాగంలో చారిత్రక అనుసంధాన నిర్మాణాన్ని ఉభయులు ఆహ్వానిస్తూ ‘‘ఇండియా ఫ్రాన్స్ జాయింట్ విజన్ ఫర్ స్పేస్ కోఆపరేషన్’’ కు వారు మద్దతు పలికారు. ప్రత్యేకించి మూడో ఉమ్మడి ఉపగ్రహ కార్యక్రమం తృష్ణ (పర్యావరణ వ్యవస్థ, నీటి వినియోగం పర్యవేక్షణ) కోసం ఉభయ దేశాల అంతరిక్ష సంస్థల మధ్య సహకారం, భారతదేశానికి చెందిన ఓషన్ శాట్-3 ఉపగ్రహంలో ఫ్రెంచి పరికరాన్ని తరలించడానికి కుదిరిన అంగీకారాన్ని ఆహ్వానించారు.

II. ఆర్థిక, విద్య, శాస్త్రసాకేంతిక, సాంస్కృతి మరియు ప్రజాసహకార రంగాలు

20. ఆర్థిక, విద్యా, శాస్త్ర, సాంస్కృతిత, పర్యాటక రంగాలలో ఉభయ దేశాల మధ్య లోతైన బంధం నెలకొనడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షులు శ్రీ మాక్రాన్ లు సంతృప్తిని వ్యక్తంచేశారు.

21. ఉభయ దేశాల మధ్య ప్రవేశానికి, దీర్ఘకాలిక నివాసానికి సంబంధించిన షరతులను సరళీకరిస్తూ విద్యార్థులు, వృత్తి నిపుణుల కదలికలు, వలసకు మార్గం సుగమం చేసే విధంగా ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని వారు ఆహ్వానించారు.

22. ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర మార్పిడికి సంబంధించి అమలు జరుగుతున్న కార్యక్రమం పురోగతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షులు శ్రీ మాక్రాన్ లు సంతృప్తిని వెలిబుచ్చుతూ ఉభయ దేశాల సంస్కృతులపై పరస్పర అవగాహన కోసం యువత మధ్య కూడా పరస్పర అవగాహన కల్పన కార్యక్రమాల అవసరాన్ని నొక్కిపలికారు. ఇందుకు అనుగుణంగా ఉభయ దేశాల యువత మధ్య పరస్పర సంప్రదింపులు, సహకారం విస్తరణకు ఉద్దేశించి ఫ్రాన్స్, ఇండియా ల భవిష్యత్ కార్యక్రమం పేరిట ఒక కార్యక్రమం ఫ్రెంచి చొరవతో ప్రారంభించడాన్ని ప్రశంసించారు.

ఆర్థిక సహకారం

23. భారతదేశం లో ప్రస్తుతం అమలులో ఉన్న, కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ వస్తు తయారీ ప్రాజెక్టులలో ఫ్రెంచి కంపెనీల భాగస్వామ్యం పట్ల ఇద్దరు నాయకులు సంతృప్తి ప్రకటించారు. ఆయా కంపెనీలు భారతదేశం లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపట్టడం పట్ల హర్షం ప్రకటించారు. భారతదేశ ఇన్వెస్టర్లకు ఫ్రాన్స్ ఆకర్షణీయ గమ్యం అని కూడా వారు ప్రముఖంగా అంగీకరించారు.

24. ఇటీవల కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరణపై కూడా ఉభయులు సంతృప్తి ప్రకటిస్తూ 2022 కల్లా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ యూరో లకు పెంచడం లక్ష్యంగా ఈ జోరు కొనసాగేలా చూడాలని ఉభయులు అంగీకారానికి వచ్చారు. ఉభయ దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య సహకారంలో ఎస్ఎమ్ఇలు, మధ్య శ్రేణి కంపెనీల ప్రాధాన్యాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ కోసం :

– భారత-ఫ్రాన్స్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా ఆర్థికసహకార చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు.

– 2018 మార్చిలో ఢిల్లీలో జరిగినన సిఇఒల ఫోరమ్ సహాధ్యక్షుల కొత్త సిఫారసులను ఆహ్వానించారు.

25. ఆర్థిక, ఫైనాన్షియల్ విభాగాలలో సహకారం మరింత లోతుగా విస్తరింపచేసుకొనేందుకు మంత్రిత్వ స్థాయిలో వార్షిక సమావేశాల నిర్వహణ ప్రాధాన్యాన్ని గుర్తించారు.

విద్య, శాస్త్ర సాంకేతిక సహకారం

26. 2020 కల్లా 10 వేల మంది విద్యార్థుల స్థాయికి చేరడం లక్ష్యంగా విద్యార్థుల మార్పిడి కార్యక్రమం నాణ్యతను, సంఖ్యను పెంచడానికి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ యంత్రాంగం స్థాయిలో నెలకొన్న గతశీల సహకారం పట్ల సంతృప్తి ప్రకటించారు. భారత విద్యార్థులు ఫ్రాన్స్ లోను, ఫ్రెంచి విద్యార్థులు భారతదేశం లోను విద్యాభ్యాసం చేయడాన్ని ప్రోత్సహించే దిశగా డిగ్రీలకు పరస్పర గుర్తింపు ఇవ్వడం కోసం ఒక ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఆహ్వానించారు. పరిశోధన, ఉన్నత విద్యలపై 2018 మార్చి 10వ, 11 వ తేదీలలో న్యూ ఢిల్లీలో విజ్ఞ‌ాన సదస్సు జరగడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.

27. ఉభయ దేశాలకు నైపుణ్యాల అభివృద్ధి ప్రాధాన్యతాంశమని పేర్కొంటూ భారత కార్మిక శక్తిలో నైపుణ్యాలు పెంచేందుకు, తాము పని చేస్తున్న రంగాలలో మరింత చురుకైన భాగస్వాములు కావడానికి అవకాశం కల్పిస్తూ ఫ్రెంచి కంపెనీలు భారతదేశం లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల పట్ల సంతృప్తిని ప్రకటించారు. ఉభయ దేశాల్లోని నైపుణ్య శిక్షణ సంస్థలు, ఏజెన్సీల మధ్య మరిన్ని భాగస్వామ్యాలు నెలకొనాలని పిలుపు నిచ్చారు.

28. 2017లో జరిగిన భారత ఫ్రెంచి అడ్వాన్స్ డ్ పరిశోధన కేంద్రం 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రాధాన్యాన్ని ప్రశంసించారు. పరిశోధన, విపణి, సామాజిక అవసరాల రంగాలలో సంస్థ మరింత చురుకైన కార్యకలాపాలు చేపట్టాల్సి ఉన్నదని పిలుపు నిచ్చారు. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల విభాగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవడం లక్ష్యంగా 2018 సంవత్సరంలో శాస్త్ర సాంకేతిక వ్యవహారాల ఉమ్మడి కమిటీ సమావేశం యొక్క ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా గుర్తించారు.

సంస్కృతి సంబంధిత ఆదాన ప్రదానం

29. 2016 సంవత్సరంలో నిర్వహించిన “నమస్తే ఫ్రాన్స్” విజయవంతం కావడం పట్ల ఉభయ నాయకులు ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్ లోని 41 నగరాల్లో ఈ కార్యక్రమం కింద భారతీయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చే 83 కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే భారత్లో నిర్వహించిన ‘Bonjour India’ (నమస్తే ఇండియా) కార్యక్రమం కింద 33 నగరాల్లో 300 ప్రాజెక్టులు చేపట్టడం పట్ల సంతృప్తి ప్రకటించారు. ఫ్రాన్స్ లో ఏడాది పాటు “ఇండియా@70” పేరిట భారతదేశం కార్యక్రమాల నిర్వహించడాన్ని కూడా నాయకులు అభినందించారు.

30. ఉభయ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ప్రోత్సహించడంలో సాహిత్యం ప్రాధాన్యతను ప్రత్యేకంగా గుర్తించారు. 2020 లో జరుగనున్న Salon du Livre de Paris (ఫ్రెంచి బుక్ ఫేర్) లో భారతదేశానికి గౌరవ ఆతిథ్యం దక్కడాన్ని వారు ఆహ్వానించారు. 2022 వ సంవత్సరంలో న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ లో ఫ్రాన్స్ గౌరవ అతిథిగా పాల్గొననుంది.

31. రెండు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలు పెరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు శ్రీ మాక్రాన్ లు సంతృప్తి ప్రకటించారు. 2014 సంవత్సరంలో ఫ్రాన్స్ కు భారత పర్యాటకుల సంఖ్య 69 శాతం కన్నా పెరిగింది. 2020 కల్లా ఒక మిలియన్ భారత పర్యాటకుల ఫ్రాన్స్ సందర్శన, 335,000 ఫ్రెంచి పర్యాటకుల భారత సందర్శన లక్ష్యాలుగా నిర్దేశించుకొన్నారు.

III. భూగోళంపై భాగస్వామ్యం

32. వాతావరణ న్యాయం, వాతావరణ సమతుల్యత, హరిత వాయువులకు హానికరమైన వాయువుల విడుదల తగ్గింపు సిద్ధాంతాల ఆధారంగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంపై ఉభయ వర్గాలు తమ వచనబద్ధతను పునరుద్ఘాటించాయి. సిఒపి 24 లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒడంబడిక (యుఎన్ ఎఫ్ సిసిసి) ఆమోదించిన పారిస్ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి ఉభయులు కట్టుబాటు ప్రకటించారు.

33. పర్యావరణ విషయంలో అంతర్జాతీయ ఒప్పందం కోసం తాము చేస్తున్న కృషికి భారతదేశం ఇస్తున్న మద్దతు కు ప్రధాన మంత్రి కి ఫ్రెంచి అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

అంతర్జాతీయ సౌర కూటమి

34. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) ఒప్పందం అమలు లోకి రావడం పట్ల ఉభయులు హర్షం ప్రకటించారు. 2018 మార్చి 11వ తేదీన ఐఎస్ఎ వ్యవస్థాపక సదస్సు నిర్వహణ కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. సౌర ఇంధనాన్ని భారీగా అందుబాటులోకి తేవడం కోసం చేపట్టే ప్రాజెక్టులకు తక్కువ ధరల్లో ఆర్థిక సహాయం అందించేందుకు ఐఎస్ఎ ఆధ్వర్యంలో నిర్మాణాత్మక ప్రాజెక్టులు, కార్యక్రమాలు మరింత లోతుగా అమలు చేయడానికి ఉభయులు కట్టుబాటు ప్రకటించారు.

నవీకరణ యోగ్య శక్తి

35. ఉమ్మడి ప్రాధాన్యంగా నవీకరణ యోగ్య శక్తి రంగంలో భారతదేశం, ఫ్రాన్స్ సాంకేతిక సహకారం మరింత బలోపేతం చేసుకోవాలని ఉభయులు కట్టుబాటును పునరుద్ఘాటించారు. సౌర శక్తి అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రయివేటు నిధులను సమీకరించాల్సిన అవసరాన్ని నొక్కి పలికారు. అంతర్జాతీయ సౌర కూటమిలో భాగంగా అంతర్జాతీయ పారిశ్రామిక మండలుల సమాఖ్య ఏర్పాటు కోసం కుదిరిన అంగీకారాన్ని, ఇందులో భాగస్వాములు కావడానికి ఎమ్ఇడిఇఎఫ్, ఎస్ఇఆర్, ఎఫ్ఐసిసిఐ మరియు సిఐఐ లు ప్రకటించిన సంసిద్ధతను వారు ఆహ్వానించారు.

మన్నికైన చలనశీలత

36. భారతదేశం, ఫ్రాన్స్ స్థిరమైన అభివృద్ధిని, ఆర్థిక వృద్ధిని సాధించాలంటే అతి తక్కువ వ్యర్థాలను వదిలే రవాణా వ్యవస్థ కీలకమని ఉభయులు గుర్తించారు. విద్యుత్తు వాహనాల తయారీపై ఉభయదేశాలు బలీయమైన ఆకాంక్షలు ప్రకటించిన విషయం ఇరువురు గుర్తు చేశారు. ఈ దిశగా ఫ్రాన్స్ కు చెందిన వాతావరణ సమతుల్యత మరియు సమ్మిళిత రవాణా మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ల మధ్య ఫ్రెంచి డివెలప్ మెంట్ ఏజెన్సీ (ఎఎఫ్ డి) నిర్వహణలో ఫ్రెంచి సాంకేతిక సహకారంపై ఒక అంగీకారం కుదరడం పట్ల వారు సంతృప్తి ప్రకటించారు.

37. రైల్వేల అభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు ఉభయ దేశాల మధ్య కుదిరిన అంగీకారానికి కట్టుబాటును పునరుద్ఘాటించారు. ఢిల్లీ, చండీగఢ్ సెక్షన్ లో సెమి- హైస్పీడ్ వ్యవస్థ అభివృద్ధి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తి కావడంతో పాటు అంబాలా, లూధియానా స్టేషన్ల అభివృద్ధి కోసం అధ్యయనం పూర్తి కావడం పట్ల వారు సంతృప్తి ప్రకటించారు. ప్రయాణికుల రవాణా, సరకు రవాణా భవిష్యత్తు అవసరాల ఆధారంగా ఢిల్లీ-చండీగఢ్ మధ్య వేగాన్ని పెంచే అంశంపై భవిష్యత్తులో జరగనున్న సాంకేతిక చర్చలు దృష్టి కేంద్రీకరించాలని వారు నిర్ణయించారు. శాశ్వత ప్రాతిపదికన భారత-ఫ్రెంచి రైల్వే ఫోరమ్ ఏర్పాటు కావడం పట్ల నాయకులు హర్షం ప్రకటించారు. ఫ్రాన్స్ కు చెందిన వాతావరణ సమతుల్యత మరియు సమ్మిళిత రవాణా మంత్రిత్వ శాఖ, ఎస్ ఎన్ సిఎఫ్ (ఫ్రెంచి రైల్వే), భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

స్మార్ట్ సిటీలు

38. సుస్థిర నగరాలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం భారత, ఫ్రెంచి భాగస్వామ్యం అద్భుత పురోగతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షులు శ్రీ మాక్రాన్ సంతృప్తి ప్రకటించారు. ఫ్రెంచి, భారత కంపెనీల మధ్య చక్కని, ఫలవంతమైన భాగస్వామ్యాలు అనేకం నెలకొన్న విషయం వారు గుర్తించారు. చండీగఢ్, నాగపూర్, పుదుచ్చేరి.. ఈ మూడు నగరాల విషయంలో అసాధారణ సహకారం నెలకొనడాన్ని వారు ఆహ్వానించారు.

IV. ప్రపంచ వ్యూహాత్మక సహకారం విస్తరణ

39. వ్యూహాత్మక భాగస్వాములుగా ఉభయ దేశాలు కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ స్థాయి అంశాలపై ఉభయుల మధ్య ఏకీభావాన్ని పంచుకోవడంతో పాటు ఉమ్మడి ఆసక్తి గల అంశాలపై సంప్రదింపులు, సమన్వయం విస్తరించుకొంటాయి.

40. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం ఫ్రాన్స్ తన మద్దతును పునరుద్ఘాటించింది. అలాగే భారీ జన విధ్వంసం కలిగించే ఆయుధాల వ్యాప్తిని నిరోధించడంపై కూడా ఉమ్మడి ఆందోళనలను రెండు దేశాలు పునరుద్ఘాటించాయి.

41. భారతదేశం 2016 జూన్ లో ఎమ్ టిసిఆర్ లో సభ్యత్వ దేశం కావడం, 2017 డిసెంబర్ లో వాసెనార్ అంగీకారంలో భాగస్వామి కావడం పట్ల ఫ్రాన్స్ హర్షం ప్రకటించింది. వాసెనార్ అంగీకారంలో భారతదేశ భాగస్వామ్యానికి మద్దతు ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీ మాక్రాన్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా గ్రూపు లో భారతదేశం భాగస్వామ్యానికి కూడా మద్దతు ప్రకటించినందుకు ఫ్రాన్స్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ విస్తరణను నిలువరించేందుకు పరమాణు సరఫరా దేశాల బృందంలో భారతదేశం సభ్యత్వానికి గట్టి మద్దతును ఫ్రాన్స్ పునరుద్ఘాటించింది.

42. డి పి ఆర్ కె అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణుల కార్యక్రమాన్నినిరంతరాయంగాచేపడుతూ ఉండడం, దాని విస్తరణ అనుసంధానత కారణంగా అంంతర్జాతీయ శాంతికి, సుస్థిరతకు ఎనలేని ముప్పు ఎదురవుతోందని వారన్నారు. డిపిఆర్ కె అంగీకరించిన మేరకు కొరియా ద్వీపకల్పంలో పరమాణు కార్యక్రమం, క్షిపణి కార్యక్రమాల తనిఖీకి, బాధ్యత మోపేందుకు సహకరించాలని వారు కోరారు. ఈ సవాలును దీటుగా ఎదుర్కొనడంలో అంతర్జాతీయ దేశాలన్నీ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం సాధించేందుకు ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను అంతర్జాతీయ సమాజం యావత్తు పూర్తి స్థాయిలో అమలుపరచాలని పిలుపు ఇచ్చారు.

43. ఇరాన్, ఇ3+3 ల మధ్య కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జెసిపిఒఎ) పూర్తి స్ధాయిలో అమలుపరిచేందుకు భారతదేశం, ఫ్రాన్స్ మద్దతు ప్రకటించాయి. పరమాణు సంబంధిత జెసిపిఒఎ వచనబద్ధతకు ఇరాన్ కట్టుబడి ఉందన్న విషయం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఎఇఎ) ధ్రువీకరణను తాము గుర్తిస్తున్నట్టు వారు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆమోదంతో కుదిరిన ఆ ఒప్పందం తు.చ. తప్పకుండా సమర్థవంతంగా అమలు జరగాలని పిలుపునిచ్చారు. భద్రతమండలి తీర్మానం 2231 పూర్తి స్థాయిలో అమలుపరచాలని వారు పిలుపు ఇచ్చారు.

44. సిరియా సంక్షోభానికి సమగ్ర శాంతియుత పరిష్కారం సాధించేందుకు ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జెనీవా ఒడంబడిక ప్రాధాన్యాన్ని వారు పునరుద్ఘాటించారు. పౌరుల రక్షణ, పౌర సహాయానికి అనుమతించడం అత్యంత ప్రాధాన్యతాంశాలని వారు పేర్కొన్నారు. సంక్షోభంలో భాగస్వామ్యం గల వర్గాలు, వారి మద్దతుదారులు తమ కట్టుబాట్లను గౌరవించాలని కోరారు. సిరియా సార్వభౌత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం మినహా సైనిక చర్య పరిష్కారం కాదని వారు అభిప్రాయపడ్డారు. రసాయనిక ఆయుధాల వినియోగానికి తావుండరాదని వారన్నారు.

45. ఉమ్మడి సిద్ధాంతాలు, విలువల ఆధారంగా యూరోపియన్ యూనియన్, ఇండియా ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి మద్దతును వారు పునరుద్ఘాటించారు. బహుముఖీన, భద్రతాపరమైన అంశాల్లో భారతదేశం, ఇయు సహకారం విస్తరించాలని వారు అంగీకరించారు. న్యూ ఢిల్లీ లో 2017 అక్టోబర్ 6న జరిగిన ఇండియా- ఇయు శిఖరాగ్ర సదస్సు సాధించిన ఫలితాలను వారు ఆహ్వానించారు. విస్తృత ప్రాతిపదికన ఇయు- ఇండియా వాణిజ్య, పెట్టుబడుల అంగీకారంపై సరైన సమయంలో తిరిగి ప్రారంభించే దిశగా సహకరించుకోవాలని నిర్ణయించారు.

46. నేటి ప్రపంచీకరణ యుగంలో అనుసంధానం ప్రాధాన్యాన్ని ఉభయ దేశాలు అంగీకరించాయి. అంతర్జాతీయ నిబంధనలు, సత్పరిపాలన, దేశీయ చట్టాలకు కట్టుబాటు, దాపరికం లేని వైఖరి, పారదర్శక, సామాజిక-పర్యావరణ ప్రమాణాలు పాటించడం, ఆర్థిక బాధ్యతల సిద్దాంతాలు, రుణాలకు సంబంధించి ఆర్థిక సహాయం వ్యవహారాలలో బాధ్యతాయుత ధోరణి వంటి అంశాల ఆధారంగా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకొంటూ అనుసంధానత చొరవలు ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.

47. బలమైన, సుస్థిరమైన, సమతూకం కలిగిన, సమ్మిళితమైన వృద్ధి లక్ష్యంగా జి20 సభ్యత్వ దేశాలతో కలిసి పని చేయడం ద్వారా జి20 కూటమి నిర్ణయాలను అమలుపరిచేందుకు భారతదేశం, ఫ్రాన్స్ కట్టుబాటు ను ప్రకటించాయి.

48. సుస్థిరమైన వృద్ధిని, అభివృద్ధిని సాధించాలంటే స్వేచ్ఛాయుతమైన, దాపరికాలు లేనిన, న్యాయబద్ధమైన, నిబంధనల ఆధారిత బహుముఖీన వాణిజ్య వ్యవస్థ కు కీలక ప్రాధాన్యం ఉందని నాయకులు పునరుద్ఘాటించారు. డబ్ల్యుటిఒ లో సభ్యత్వ దేశాలన్నింటితో కలిసి ఈ దిశగా పని చేయడానికి వారు కట్టుబాటును ప్రకటించారు.

49. అంతర్జాతీయ ఆర్థిక, ఫైనాన్షియల్ పాలనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, మితిమీరిన అంతర్జాతీయ అసమానతలు తగ్గించేందుకు, సమ్మిళిత, అనుసంధానిత అభివృద్ధికి కలిసి కృషి చేయాలని భారతదేశం, ఫ్రాన్స్ అంగీకరించాయి. ఉగ్రవాదం, పేదరికం, ఆకలి, ఉపాధికల్పన, వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, లింగపరమైన అసమానతలు సహా వివిధ రకాల అసమానతల తొలగింపు వంటి సవాళ్ల పరిష్కారానికి కలిసి కృషి చేయాలని నిర్ణయించాయి.

50. ఆఫ్రికా సుసంపన్నత, సుస్థిరత లు లక్ష్యంగా సహకారం, సమన్వయం అందించుకోవడానికి భారతదేశం, ఫ్రాన్స్ అంగీకరించాయి. 2017 జూన్ లో పారిస్ లో జరిగిన తొలి ఆఫ్రికా చర్చల ఆధారంగా క్షేత్ర స్థాయిలో ఉమ్మడి ప్రాజెక్టులను అమలు చేయడానికి సంసిద్ధతను పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాల అదుపు వంటి తీవ్రమైన సవాళ్లను పరిష్కరించుకునే దిశగా ఆఫ్రికా దేశాలు తమ సంసిద్ధతను ప్రకటిస్తూ జి5 సహేల్ జాయింట్ ఫోర్స్ ఏర్పాటును నాయకులు ఆహ్వనించారు.

51. ఇండియన్ ఓశన్ రిమ్ అసోసియేశన్ (ఐఒఆర్ఎ), దాని విలువల ప్రోత్సాహానికి నాయకులు తమ మద్దతు ప్రకటించారు.

52. తూర్పు ఆసియా, మధ్య ప్రాచ్యం పై నిపుణుల స్థాయిలో నిరంతర అధికారిక చర్చల నిర్వహణకు, ఏకాభిప్రాయం గల అందరినీ కూడగట్టి పరిధిని విస్తరించేందుకు అంగీకరించారు. రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య వార్షిక విధాన, ప్రణాళిక చర్చలు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు.

53. తనకు, తనతో వచ్చిన ప్రతినిధివర్గానికి ఎంతో సాదర సత్కారాలు చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీకి అధ్యక్షులు శ్రీ మాక్రాన్ ధన్యవాదాలు తెలుపుతూ, ఫ్రాన్స్ లో ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.