న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాల అధినేతల హోదాలో మేము ఇవాళ సమావేశమయ్యాం. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికైన జి-20 ద్వారా సమష్టి పరిష్కారాల అన్వేషణ పై మా ఉమ్మడి నిబద్ధతను ఈ సందర్బంగా పునరుద్ఘాటిస్తున్నాం.
అదే సమయంలో జి-20కి ప్రస్తుత, తదుపరి వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న మూడు దేశాల హోదాలో ప్రపంచ సవాళ్ల పరిష్కారం దిశగా భారత జి-20 అధ్యక్షతన సాధించిన చరిత్రాత్మక ప్రగతిని కొనసాగిస్తామని ప్రతినబూనుతున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సంయుక్తంగా మరింత పెద్ద, ప్రభావశీల, మెరుగైన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ఏర్పాటులో జి-20 నిబద్ధతను మేము స్వాగతిస్తున్నాం. జి-20 వేదికగా సమష్టి కృషి ద్వారా ప్రపంచ ప్రజల మెరుగైన భవిష్యత్తుకు మద్దతిస్తూ మేము సాధించగలిగినదేమిటో మా నిబద్ధత స్పష్టం చేస్తుంది.