దుబాయ్‌లో కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 2024-26 కాలానికిగాను పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ (లీడ్ ఐటీ2.0) సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సహాధ్యక్షత వహించారు.
భారత్-స్వీడన్ దేశాలు సంయుక్తంగా పారిశ్రామిక పరివర్తన వేదికకు శ్రీకారం చుట్టాయి. రెండు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, సాంకేతికత ప్రదాతలు, పరిశోధకులు, మేధావులను ఇది ఒక వేదికపైకి తెస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో ‘లీడ్‌ఐటి 2.0 కింది అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు:
- సార్వజనీన, పారదర్శక పారిశ్రామిక పరివర్తన
- సంయుక్తంగా స్వల్ప కర్బన ఉద్గార సాంకేతికత రూపకల్పన-బదిలీ
- పారిశ్రామిక పరివర్తన దిశగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక చేయూత
కాగా, న్యూయార్క్ నగరంలో 2019 నాటి వాతావరణ కార్యాచరణపై ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్-స్వీడన్ సంయుక్తంగా ‘లీడ్ ఐటి’ని ప్రారంభించాయి.