“వ్యక్తుల పాస్‌పోర్టులు రకరకాల రంగుల్లో ఉండవచ్చు. కానీ, మానవతా బంధాన్ని మించిన బలమైన బంధం మరేదీ ఉండదు.” ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పలుమార్లు చాటిన జీవిత సత్యమిది. ప్రపంచంలో ఏ మూల ఎలాంటి విషాదం చోటుచేసుకున్నా ఇది వాస్తవరూపం దాలుస్తూ వచ్చింది.
యెమన్‌లో అంతర్యుద్ధం తారస్థాయికి చేరినప్పుడు ఆ కల్లోల మండలంలో వివిధ దేశాల పౌరులు చిక్కుకుపోయారు.అక్కడి భారతీయులనే కాకుండా అనేక దేశాల వారిని కూడా రక్షించేందుకు భారతదేశ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది. ఆ సందర్భంగా రక్షణ చర్యలు చేపట్టినప్పుడు పలు దేశాలు భారతదేశ ప్రభుత్వ సహాయం కోసం అభ్యర్థించాయి. ఆనాటి రక్షణ, సహాయ చర్యలలో భారతదేశం ప్రదర్శించిన వేగం అనూహ్యమైనదే కాక అత్యంత ప్రభావవంతమైనదిగా కూడా పేర్కొనవచ్చు
భారతదేశం ప్రదర్శించిన ఈ విస్తృత స్పందన, వేగంపై అత్యున్నత స్థాయి పర్యవేక్షణ సాగింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ నిరంతర పర్యవేక్షణ చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ వి.కె.సింగ్ స్వయంగా యెమన్, జిబౌటీలకు వెళ్లి రక్షణ, సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు.
నేపాల్‌ను 2015 ఏప్రిల్ 25వ తేదీ ఉదయం పెను భూకంపం కుదిపేసినప్పుడు భారత ప్రభుత్వం తనకు సాధ్యమైన అన్ని రకాలుగాను చేయూతను అందించి ఆ దేశంలోని సోదరీసోదరుల ఆవేదనను పంచుకొన్నది. భారతదేశ సాయుధ బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు, ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యక్షంగా రక్షణ, సహాయ చర్యలలో పాల్గొని, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేశారు.ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్వయంగా ఉన్నతస్థాయి సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ అక్కడి స్థితిగతులను పర్యవేక్షించారు. అదే సమయంలో భూకంపం బారినపడిన భారతీయులు సహా ఇతర దేశాల వారిని రక్షించేందుకు భారతదేశ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేసింది.
భారతదేశం కృషిని ప్రపంచమంతా ప్రశంసించింది. శ్రీ మోదీ తమను కలుసుకొన్నసందర్భంగా రక్షణ, సహాయ చర్యలలో భారతదేశ ప్రభుత్వం చూపిన దీక్షాదక్షతలను ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ హోలాండ్, కెనడా ప్రధాని శ్రీ హార్పర్ ల వంటి ప్రపంచ దేశాల నాయకులు కొనియాడారు. ప్రధాన మంత్రితో ఫోన్ సంభాషణ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ నెతన్యాహు కూడా భారతదేశం తీసుకొన్న చొరవను అమితంగా మెచ్చుకున్నారు. అలాగే భారతదేశంలో అమెరికా రాయబారి శ్రీ రిచర్డ్ వర్మ కూడా భారతదేశం పోషించిన పాత్రను అభినందించారు.
అఫ్గానిస్తాన్‌లో 8 నెలల పాటు దుండగుల చెరలో ఉన్న ఫాదర్ శ్రీ అలెక్సిస్ ప్రేమ్‌కుమార్ 2015 ఫిబ్రవరిలో క్షేమంగా స్వదేశం చేరుకొన్నారు. అక్కడ సహాయ చర్యలలో పాలుపంచుకొంటూ వచ్చిన ఫాదర్‌ను అమానుష శక్తులు అపహరించుకుపోయాయి. ఆ తరువాత ఆయన విడుదలపై చాలాకాలం ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు ప్రేమ్‌కుమార్‌ను స్వదేశానికి రప్పించడంలో భారతదేశ ప్రభుత్వం విజయం సాధించి, ఫాదర్ కుటుంబంలో ఆనందం నింపింది. ఆయన విడుదలకు కృషి చేసిన ప్రధాన మంత్రికి, ప్రభుత్వానికి ఫాదర్ కుటుంబం ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు తెలిపింది.
అదే విధంగా మధ్య ప్రాచ్యంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతదేశపు నర్సులను ప్రభుత్వం రక్షించింది. ముఖ్యంగా ఇరాక్ నుండి నర్సులను క్షేమంగా స్వదేశం చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఆనాడు చేసిన కృషిని కేరళ ముఖ్యమంత్రి శ్రీ ఊమెన్ చండీ స్వయంగా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇదీ సంక్షోభాలు తలెత్తిన ప్రతి సమయంలో కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ.
ఒక వ్యక్తి పాస్‌పోర్టు ఏ రంగులో ఉన్నదనే అంశంకన్నా మానవతా బంధమే మిన్న అనేందుకు నిదర్శనమిదే.