శిక్షణలో ఉన్న భారత విదేశాంగ శాఖ 2023 బ్యాచ్ అధికారులు ప్రధానిని ఆయన నివాసం 7, లోక్ మాన్యమార్గ్ లో కలుసుకున్నారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది ఐఎఫ్ఎస్ అధికారులు శిక్షణలో ఉన్నారు.
ప్రధానమంత్రి నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతమైందని శిక్షణ పొందుతున్న విదేశాంగ అధికారులు ప్రశంసించారు. రాబోయే రోజుల్లో తాము బాధ్యతలు తీసుకోవాల్సి ఉందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సూచనలు, మార్గదర్శకాలను ఇవ్వాలని ఐఎప్ఎస్ అదికారులు ప్రధానిని కోరారు. ప్రభుత్వం ఎక్కడ నియమించినా, దేశ సంస్కృతిని ఎల్లప్పుడూ తమతో పాటు గర్వంగా, గౌరవంగా తీసుకువెళ్లాలని ప్రధాని కోరారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా దేశ సంస్కృతిని ఘనంగా చాటాలని కోరారు. వ్యక్తిగత ప్రవర్తనతో సహా జీవితంలోని అన్ని రంగాల్లో వలసవాద మనస్తత్వాన్ని అధిగమించడం గురించి, దేశం గర్వించదగిన ప్రతినిధులుగా తమను తాము తీర్చిదిద్దుకోవడం గురించి ప్రధాని మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భారతదేశంపట్ల ఉన్న అభిప్రాయం ఎలా మారుతున్నదీ వారితో ప్రధాని చర్చించారు. నేడు ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి, పరస్పర గౌరవమర్యాదలతో చర్చల్లో పాల్గొంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం కోవిడ్ మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నదీ ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికిగాను దేశం ఎలా కృషి చేస్తున్నదీ ప్రధాని వివరించారు.
విదేశాల్లో విధులు నిర్వహించాల్సినప్పుడు అక్కడి ప్రవాస భారతీయులతో, భారత సంతతికి చెందిన వారితో కలిసిపోయి స్నేహాన్ని పెంపొందించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు.