ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీవన యానం ఉత్తర గుజరాత్ లోని మెహసానా జిల్లా లోని వాద్ నగర్ పట్టణం నుండి మొదలైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడు సంవత్సరాల తరువాత దేశం గణతంత్రంగా అవతరించిన కొద్ది నెలల్లో, అంటే 1950 సెప్టెంబర్ 17 నాడు శ్రీ నరేంద్ర మోదీ జన్మించారు. తల్లి తండ్రులు శ్రీమతి హీరాబా మోదీ, శ్రీ దామోదర్ దాస్ మోదీ. వీరికి ఆరుగురు సంతానం. అందులో మూడవ వారు శ్రీ నరేంద్ర మోదీ. వాద్ నగర్ చిన్న పట్టణమే అయినా దానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన ఆధారాల ప్రకారం వాద్ నగర్ పూర్వం ఆధ్యాత్మికతకు , విజ్ఞాన సముపార్జనకు కేంద్రంగా విలసిల్లినట్టు తెలుస్తోంది. చైనా యాత్రికుడు శ్రీ హ్యు యాన్ సాంగ్ వాద్ నగర్‌ను సందర్శించారు. వాద్ నగర్ కు బౌద్ధమతానికి సంబంధించిన చరిత్ర తో కూడా సంబంధం ఉంది. శతాబ్దాల క్రితం వాద్ నగర్‌లో సుమారు పది వేల మందికి పైగా బౌద్ధ సన్యాసులు నివసించే వారని చెబుతారు.
Vadnagar station, where Narendra Modi's father owned a tea stall and where Narendra Modi also sold tea
శ్రీ నరేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు.. సమాజంలోని అట్టడుగు వర్గాల నుండి వచ్చిన కుటుంబం కావడంతో జీవితం గడవడానికి ఎంతగానో కష్టపడ్డారు. కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉండే వారు ( సుమారు 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల ఇల్లు వీరిది). వీరి తండ్రి గారు స్థానిక రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసుకొన్న టీ స్టాల్‌లో టీ ని విక్రయించే వారు. చిన్నప్పుడు శ్రీ నరేంద్ర మోదీ తన తండ్రి ఏర్పాటు చేసిన టీ స్టాల్‌లో ఆయనకు సహాయపడుతూ ఉండే వారు.
బాల్యం లో తాను గడిపిన జీవితం శ్రీ నరేంద్ర మోదీపై గాఢమైన ముద్రను వేసింది. శ్రీ నరేంద్ర మోదీ తన తండ్రికి సహాయపడుతూనే చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తండ్రికి సహాయపడడం, చదువు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఆయన సమతూకంతో వ్యవహరించారు. చదువు, వక్తృత్వం పట్ల ఆసక్తి, దేనినైనా సాధించాలనే పట్టుదలగల వ్యక్తిగా శ్రీ నరేంద్ర మోదీని ఆయన చిన్ననాటి మిత్రులు గుర్తు చేసుకుంటారు. పాఠశాల గ్రంథాలయంలో గంటలకొద్తీ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఇక క్రీడల లోనూ వారికి ఎంతో ఆసక్తి. ఈత అంటే వారికి మక్కువ. శ్రీ నరేంద్ర మోదీకి అన్ని సముదాయాల నుండీ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఆయనకు ఇరుగు పొరుగున ఎంతో మంది ముస్లిం మిత్రులు ఉండే వారు. అందువల్ల తరచుగా హిందూ, ముస్లిముల పండుగలను జరుపుకొనే వారు.
As a child Narendra Modi dreamt of serving in the Army but destiny had other plans…
ఆయన ఆలోచనలు, కలలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. అలా తరగతి గదిలో ప్రారంభమైన ఆలోచనలు ఆయన దేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టే స్థాయికి నడిపించాయి.సమాజంలో మార్పు తీసుకురావాలని, ప్రజల కష్టాలను తొలగించాలని వారు సంకల్పించారు.యువకుడిగా ఉన్నప్పుడు వారు ఐహిక సుఖాలకు దూరంగా ఉండే ఆలోచనలు చేశారు. వంటనూనెల వాడకం, ఉప్పు, కారం, పులుపు వస్తువులు.. వీటిని త్యజించారు. స్వామి వివేకానంద రచనలను ఆమూలాగ్రం చదివారు. అది ఆయనను ఆత్మ స్వరూపతత్వాన్ని తెలుసుకునే దిశగా నడిపించింది. స్వామి వివేకానంద కన్న జగద్గురు భారతదేశపు కలను సాకారం చేయాలన్న సంకల్పానికి ఆయనలో అప్పుడే పునాది పడింది.
శ్రీ నరేంద్ర మోదీ బాల్యం నుండి ఆయనను అంటిపెట్టుకొని వారి జీవితంలో కొనసాగుతూ వస్తున్నది ఆయనలోని సేవాతత్పరత. శ్రీ నరేంద్ర మోదీ తొమ్మది సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తాపై నదికి వరదలు వచ్చాయి. అప్పడు ఆయన తన స్నేహితులతో కలిసి ఆహార శాలను ఏర్పాటు చేసి, వచ్చిన మోత్తాన్ని వరద బాధితుల సహాయానికి అందించారు. వారు చిన్నతనంలో ఉన్నప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో రైల్వే స్టేషన్‌లో టీ స్టాల్ ను ఏర్పాటు చేసి యుద్ధ క్షేత్రానికి వెళుతున్న, యుద్ద క్షేత్రం నుండి వస్తున్న వీర సైనిక జవానులకు తేనీరు అందించి సేవలు చేశారు. ఇది చిన్న సహాయమే కావచ్చు. కానీ దేశ మాత పిలుపును అందుకొని అంత చిన్న వయస్సులోనే తన వంతు సాయాన్ని అందించాలన్న ఆయన ప్రదర్శించిన పట్టుదల విశేషంగా చెప్పుకోదగింది.
బాలుడిగా శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సైన్యంలో చేరి దేశ మాత రుణాన్ని తీర్చుకోవాలని బలంగా అనుకునేవారు. అయితే అదృష్టం మరో రకంగా ఉండడంతో, ఆయన కుటుంబ సభ్యులు శ్రీ నరేంద్ర మోదీ సైన్యంలో చేరాలన్న ఆలోచనలను వ్యతిరేకిస్తూ వచ్చారు. సమీపంలోని జామ్ నగర్ సైనిక్ స్కూల్‌లో చదువుకోవాలని భావించారు. కానీ పాఠశాల ఫీజు చెల్లించాల్సిన సమయంలో ఇంట్లో డబ్బులు లేవు. అలా సైనిక్ స్కూల్‌లో చేరాలన్న ఆయన కల నెరవేరకుండా పోయింది. అయితేనేం, విధి ఆయన కోసం ఎంతో గొప్ప ప్రణాళికలను సిద్ధం చేసింది.. దేశవ్యాప్తంగా మానవాళికి సేవ చేసే మహోన్నత అవకాశాన్ని ఆయనకు కల్పించింది.
Seeking the blessings of his Mother