ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషించార. దేశవ్యాప్తంగాగల వేలాది లబ్ధిదారులతోపాటు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిద్వార్ నుంచి వచ్చిన లబ్ధిదారులలో గురుదేవ్ సింగ్ ని ‘హర్ హర్ గంగే’ అంటూ ప్రధానమంత్రి పలుకరించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు కూడా ‘హర్ హర్ గంగే’ నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ప్రధానిని స్వాగతించారు. శ్రీ సింగ్ ఒక రైతు కాగా, వ్యవసాయంతోపాటు చేపల పెంపకం కూడా చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య సంపద యోజన సద్వినియోగం ద్వారా తన ఆదాయం రెట్టింపు చేసుకున్న తీరును ఆయన ప్రధానమంత్రికి వివరించారు. తనకున్నది ఎకరా పొలమేనని, అందులో వ్యవసాయం ద్వారా తన ఆదాయం రూ.60 వేలు మించేది కాదని తెలిపారు. అయితే, ఇప్పుడు మత్స్య సంపద యోజన ప్రయోజనాలను వినియోగించుకుంటూ అదే భూమిలో రూ.1.5 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహనతో వినూత్న రీతిలో వాటిని వినియోగించుకుంటున్నారంటూ ప్రధాని ఆయనను ప్రశంసించారు.
పశుపోషణ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం (తేనె ఉత్పత్తి) వంటి కార్యకలాపాల ద్వారా కూడా వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోవచ్చునని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. హరిత, శ్వేత విప్లవాలతోపాటు మధుర విప్లవం, నీలి విప్లవం ప్రాధాన్యాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు.