ఎరువుల ధరల అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, ఎరువుల ధరల అంశం గురించి, ఆయనకు, ఒక వివరణాత్మక ప్రదర్శన ద్వారా తెలియజేశారు.
అంతర్జాతీయంగా ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన ధరలు పెరగడం వల్ల ఎరువుల ధర పెరుగుతున్న అంశాన్ని ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందజేయాలని, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
ఒక్కొక్క సంచికీ, 500 రూపాయలుగా ఉన్న డి.ఏ.పి. ఎరువుల సబ్సిడీని, 1200 రూపాయల కు పెంచాలని ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 140 శాతం పెరుగుదల. కాగా, అంతర్జాతీయంగా డి.ఏ.పి. మార్కెట్ ధరలు పెరిగినప్పటికీ, పాత ధర 1200 రూపాయలకే విక్రయాలు కొనసాగించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయం కారణంగా, ఉద్భవించే మొత్తం భారాన్ని భరించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఉండగా, ఒక్కో సంచికి సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ఇంత ఎక్కువగా ఎప్పుడూ పెంచలేదు.
గత ఏడాది, డి.ఏ.పి. అసలు ధర ఒక్కో సంచికి 1,700 రూపాయలుగా ఉంది. ఇందులో, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సంచికి 500 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అందువల్ల, కంపెనీలు, ఒక్కో సంచీ 1200 రూపాయల చొప్పున రైతులకు అమ్ముతున్నాయి.
డి.ఏ.పి. లో ఉపయోగించే ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన పదార్ధాల ధరలు, ఇటీవల, అంతర్జాతీయంగా 60 శాతం 70 శాతం వరకు పెరిగాయి. అందువల్ల, డి.ఎ.పి. సంచి అసలు ధర ఇప్పుడు 2,400 కాగా, 500 రూపాయల సబ్సిడీ ని పరిగణలోకి తీసుకున్న అనంతరం, ఎరువుల కంపెనీలు, 1900 రూపాయలకు విక్రయించగలవు. ఈ రోజు తీసుకున్న తాజా నిర్ణయంతో, రైతులు 1200 రూపాయలకే, డి.ఏ.పి. సంచి పొందడం కొనసాగే, అవకాశం ఉంది.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ధరల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను, రైతులు ఎదుర్కోవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రసాయన ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. డి.ఎ.పి. లో సబ్సిడీ పెరగడంతో, ఖరీఫ్ సీజన్‌లో భారత ప్రభుత్వం అదనంగా 14,775 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఖర్చు చేస్తుంది. అక్షయ తృతీయ రోజు, పి.ఎం-కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి, 20,667 కోట్ల రూపాయలు నేరుగా బదిలీ అయిన అనంతరం, రైతుల ప్రయోజనం కోసం తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఇది రెండవది.