ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని వియత్నాం రక్షణ మంత్రి జనరల్ శ్రీ ఎన్గో జువాన్ లిక్ ఈ రోజు కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి 2016 సెప్టెంబరు లో తాను వియత్నాం లో జరిపిన పర్యటనను ఆసక్తితో గుర్తుకు తెచ్చుకొన్నారు. ఆయన పర్యటన సమయంలోనే ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడం జరిగింది. భారతదేశం అనుసరిస్తున్న “యాక్ట్ ఈస్ట్” పాలిసీ లో వియత్నాం ఒక కీలక స్తంభంగా ఉంటుందని ఆయన అన్నారు.
ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని గురించి ప్రధాన మంత్రికి జనరల్ శ్రీ ఎన్గో జువాన్ లిక్ వివరించారు. భారతదేశం, వియత్నాం లు రక్షణ రంగంలో దీర్ఘకాలం మనగలిగే మరియు పరస్పరం ప్రయోజనాత్మకమైన సంబంధాన్ని కలిగివున్నాయని ప్రధాన మంత్రి చెబుతూ, రక్షణ రంగంలో సంబంధాలను మరింతగా పటిష్టపరచుకోవాలన్న భారతదేశ కృతనిశ్చయాన్ని పునరుద్ఘాటించారు.
భారతదేశం మరియు వియత్నాం మధ్య అన్ని రంగాలలో సన్నిహిత సహకారం నెలకొంటే అది యావత్తు ప్రాంతంలో స్థిరత్వం, భద్రత మరియు సమృద్ధికి ఎంతో దోహదం చేయగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.