ఫ్రాన్స్ కు చెందిన యూరప్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జీన్ వీవ్స్ లీ డ్రియన్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్ బర్గ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ప్రధానమంత్రి తన హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారతదేశం, ఫ్రాన్స్‌కు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారు.
2018 మార్చిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌లో జరిపిన అధికారిక పర్యటనను , అలాగే అర్జెంటీనాలో జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుకున్న విషయాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ప్రాంతీయ, అంతర్జాతీ అంశాలపై ఫ్రెంచ్ ఆలోచనలు, ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పరిణామాల గురించి లీ డ్రియన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వివరించారు.రక్షణ, అంతరిక్షం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సముద్ర మార్గ భద్రత, పౌర అణు సహకారం తో పాటు అన్ని రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం కావడాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.