ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి తరఫున భారతదేశం కోసం ప్రత్యేక వాణిజ్య ప్రతినిధి హోదాలో 2021 ఆగష్టు 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు టోనీ అబోట్ ను, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కలుసుకున్నారు.
భారత-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి వీలుగా, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
భారత, ఆస్ట్రేలియా దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారం, కోవిడ్ -19 మహమ్మారి నుండి ఉద్భవిస్తున్న ఆర్థిక సవాళ్లను రెండు దేశాలు చక్కగా ఎదుర్కోవడంలో సహాయపడుతుందనీ, అదేవిధంగా, స్థిరమైన, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం గురించి వారి భాగస్వామ్య దృష్టిని గ్రహించడంలో కూడా వారికి సహాయపడుతుందని వారు నొక్కి చెప్పారు.
ఇటీవలి కాలంలో భారత-ఆస్ట్రేలియా సంబంధాల వృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా, ఈ దిశగా, ప్రధాన మంత్రి మోరిసన్ మరియు మాజీ ప్రధానమంత్రి అబాట్ సేవలను కూడా, ఆయన, ఈ సందర్భంగా, ప్రశంసించారు.
గత ఏడాది ప్రధానమంత్రి మోరిసన్ తో తాను పాల్గొన్న వర్చువల్ సమ్మిట్ ను కూడా ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, పరిస్థితులు అనుకూలించిన వెంటనే భారతదేశంలో ప్రధానమంత్రి మోరిసన్ కు ఆతిథ్యం ఇవ్వాలనే తన కోరికను కూడా, ఆయన ఈ సందర్భంగా, పునరుద్ఘాటించారు.
ప్రధానమంత్రి మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ మధ్య, 2020 జూన్, 4వ తేదీన జరిగిన వర్చువల్ సమావేశంలో, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృతమైన వాణిజ్యంతో పాటు, పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం మరియు ఆస్ట్రేలియా కట్టుబడి ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడం జరిగింది. అదేవిధంగా, పరస్పర ప్రయోజనం కోసం మరియు ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సి.ఈ.సి.ఏ) పై తిరిగి నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నారు. గౌరవనీయులు టోనీ అబాట్ ప్రస్తుత పర్యటన, ఈ భాగస్వామ్య ఆశయాన్ని ప్రతిబింబించింది.