అందరికీ శుభాభినందనలు,
మిమ్మల్ని కలుసుకోకుండానే నేను తిరిగి వెళ్లిపోయి ఉంటే నా ఈ పర్యటన అసంపూర్తిగా మిగిలివుండేది. మీరంతా ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి భిన్న ప్రాంతాల నుండి ఇక్కడకు తరలివచ్చారు. ఈ రోజు పనిదినమే అయినప్పటికీ మీరంతా ఎంతో ఆదరంగా ఇక్కడకు విచ్చేశారు. భారతదేశం పట్ల మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆదరానికి ఇది నిదర్శనం. అదే మనందరం ఇక్కడ ఈ ప్రదేశంలో సమావేశం కావడానికి కారణం. ఇందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు దేశాన్ని వదలి బయటకు వెళ్లినా ఆ దేశం లోని భారతీయ సంతతి ప్రజలను తప్పనిసరిగా కలుస్తాను. మీరందరూ ఈ రోజు ఇక్కడ పాటిస్తున్న క్రమశిక్షణకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇదే మీ అందరి పెద్ద బలం. ఇంత భారీ సంఖ్యలో జనం వచ్చినా నేను మీ అందరినీ తేలికగా కలుసుకోగలిగాను. అదే నాకు పెద్ద ఆనందం. ఇందుకు మీరందరూ అభివాదాలకు, అభినందనలకు పాత్రులు.
ఈ దేశంలో నేను పర్యటించడం ఇదే తొలి సారి. కానీ ఈ ప్రాంతం భారతదేశానికి ఎంతో ప్రధానమైంది. ప్రధాన మంత్రిగా సేవ చేసే భాగ్యాన్ని మీరంతా నాకు కలిగించిన నాటి నుండి మేం ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ని గురించి గట్టిగా చెబుతూ వస్తున్నాం. ఈ దేశాలతో ఎంతో సాన్నిహిత్యం ఉందన్న భావన మాకుంది. వారితో మనకు ఉన్నది సహజసిద్ధమైన సాన్నిహిత్యమే. ఈ సాన్ని హిత్యం ఏర్పడేందుకు బోలెడు కారణాలు ఉన్నాయి. భగవాన్ రాముడుతో లేదా రామాయణంతో పరిచయం లేని ప్రాంతమంటూ ఈ దేశంలో ఏదీ ఉండకపోవచ్చు; భగవాన్ బుద్ధుడంటే గౌరవం లేని దేశమంటూ కూడా ఏదీ ఉండకపోవచ్చు. అదే పెద్ద చారిత్రక బంధం. ఈ ప్రాంతంతో దీర్ఘకాలిక బంధం ఉన్న భారతీయ ప్రజ ఆ చారిత్రక బంధాన్ని మరింత ముందుకు నడిపించే బాధ్యతను తీసుకొంది. ఒక రాయబార కార్యాలయం చేయగలిగే పనికి ఎన్నో రెట్లు అధికమైన సేవ ఒక సాధారణ భారతీయుడు చేయగలుగుతాడు. ప్రపంచం లోని పలు దేశాలలో భారతీయ సముదాయం ప్రజలందరూ ఎంతో నమ్మకంతో తమను తాము గర్వంగా భారతీయులమని ప్రకటించుకోవడం నేను గమనించాను. ఒక దేశానికి అంతకన్నా కావలసింది ఏముంటుంది ? భారతీయ సముదాయం ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రదేశంలో వారు కనిపిస్తారు. మన పూర్వీకులు వందలాది సంవత్సరాల క్రితమే మన తీరాలను వదలి విదేశాలకు వెళ్లారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా, ఆ ప్రాంతాన్ని సొంత ప్రదేశంగా భావించడం మన భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. మన ప్రత్యేకతను కాపాడుకొంటూ ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మారడం అంత తేలికైన విషయం కాదు. ప్రజలలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. ఎన్ని శతాబ్దాల క్రితం దేశం వదలి వెళ్లారు, ఎన్నితరాలయింది?, చివరకు భాషానుబంధం కూడా తొలగిపోయిందా వంటి అంశాలతో సంబంధం లేకుండా భారతీయ సముదాయం ప్రజలందరూ భారతదేశంలో ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రశాంతంగా నిద్రించలేరు. భారతదేశానికి ఏదైనా మంచి జరిగితే దానిని గర్వకారణంగా భావిస్తారు. అందుకే ప్రపంచ దేశాలతో సమానంగా భారతదేశాన్ని నిలిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మనం వారి స్థాయిని ఒక సారి చేరగలిగితే భారతదేశం పురోగమనాన్ని ఆపగలిగే శక్తి ఏదీ ఉండదన్నది నా అభిప్రాయం. అప్పుడు మనకు సర్వస్వతంత్రంగా వ్యవహరించగలిగే శక్తి లభిస్తుంది. అటువంటి శక్తిని సాధించగల బలం భారతీయుల చేతులలో, మెదడులో, హృదయాలలో ఎంతో ఉంది. అందుకే గత మూడున్నర సంవత్సరాల కాలంలో మన 1.25 బిలియన్ ప్రజల బలాన్ని, మనకు గల ప్రకృతి వనరుల బలాన్ని, సాంస్కృతిక వారసత్వ బలాన్ని మరింత పటిష్టపరచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మీరు 100 లేదా 500 లేదా 1000 లేదా 5000 సంవత్సరాల కాలాన్ని తీసుకోండి.. చరిత్రలో ఎక్కడా భారతీయులు ఇతరులకు హాని చేసిన ఒక్క సంఘటన అయినా చోటు చేసుకోలేదు.
నేను ప్రపంచంలో ఏ దేశ ప్రజలను కలుసుకొన్నా వారికి-మేము ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాలలో ఎప్పుడూ ఇతరుల భూభాగంలో భారతీయ పతాకను ఎగురవేసే ప్రయత్నం చేయలేదు; ప్రపంచంలో ఏ దేశాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచన మాకు లేనేలేదు.. కానీ, లక్షన్నర మందికి పైగా భారతీయ సైనికులు ప్రపంచంలోని పలు దేశాల్లో శాంతి స్థాపన కోసం ప్రాణాలు త్యాగం చేశారు- అని చెబుతుంటాను. ఈ విషయాన్ని మీరంతా ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు.
ప్రపంచంలో ఎక్కడ సంఘర్షణలు చోటు చేసుకున్నా శాంతి స్థాపన కోసం ఐక్య రాజ్య సమితి ఏర్పాటు చేసే శాంతి దళంలో భారతదేశ సైనికులు కూడా ఉంటున్నందుకు భారతీయులందరూ గర్వించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ శాంతి దళం ఉన్న అందులో భారతదేశ సైనికులు ఉంటారు. గౌతమ బుద్ధుడు, మహాత్మ గాంధీ లు ప్రవచించిన శాంతి మాటలకే పరిమితం కాదు. ఈ శాంతిని మన జీవితాలకు వర్తింపచేసుకొన్నాం. ఎప్పుడైనా మనం జీవితాలలో ఈ భావాన్నే ప్రతిబింబిస్తూ వస్తున్నాం. శాంతి అనేది మన రక్త నాళాల్లో ఉంది. అందుకే పూర్వీకులు ‘వసుధైవ కుటుంబకమ్’ (యావత్తు ప్రపంచం ఒక్కటే) భావాన్ని మనకు అందించారు. దానిని మనమంతా అనుసరిస్తూ వస్తున్నాం. భారతదేశం బలీయంగా ఉన్నప్పుడే ప్రపంచం మన బలాన్ని గుర్తిస్తుంది. అటువంటి బలం వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క విభాగంలో మరింత పురోగమించగలుగుతాం. వర్తమానం ఉజ్జ్వలంగా ఉన్నప్పుడే మన చరిత్ర ఎంత ఘనమైంది అనే అంశంతో సంబంధం లేకుండా మన బలాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. అందుకే 21వ శతాబ్దిని భారతీయ శతాబ్దిగా తీర్చి దిద్దవలసిన అవసరం ఉంది. గతాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం స్ఫూర్తిని పొందాలి. అది కష్టం అని నేను భావించడం లేదు. గత మూడు లేదా మూడున్నర సంవత్సరాల అనుభవం ఆధారంగా నేను అది సాధ్యమే అని ఎంతో విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. కొద్ది కాలం క్రితం భారతదేశం గురించి ప్రతికూల వార్తలు ప్రచారంలో ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా భారతదేశం గురించి సానుకూల వార్తలే వినిపిస్తున్నాయి. 1.25 బిలియన్ ప్రజల బలం గల భారతదేశం అంతా సానుకూల శక్తితో తిరుగుతోంది. ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా దానికి ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనాలే లక్ష్యం. 1.25 బిలియన్ జనాభా ఉన్న దేశంలో 30 కోట్ల మంది వ్యవస్థీకృత బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పని చేయగలుగుతుంది ?
అందుకే ఈ అసమానతను తొలగించేందుకు ‘ప్రధాన మంత్రి జన్ ధన్ స్కీము’ను మేం ప్రవేశపెట్టాం. జీరో బ్యాలెన్స్ తో ఖాతాలు తెరవడానికి బ్యాంకులు కొంత ఇరకాటం పడి ఉండవచ్చు. అందుకే కనీసం స్టేషనరీ ఖర్చు అయినా వారి నుండి వసూలు చేసేందుకు అనుమతించాలని బ్యాంకులు కోరాయి. కానీ బ్యాంకింగ్ వసతి అందుకొనే స్వేచ్ఛపేదప్రజలకుంది అని నేను చెప్పాను. బయట సాయుధ గార్డుల గస్తీతో ఏర్ కండిషన్ డ్ వాతావరణంలో పని చేసే బ్యాంకులలో తాము కనీసం ప్రవేశించగలమా అని పేదలు ఆలోచించిన రోజులు ఉన్నాయి. అందుకే వారు స్థానిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు. ఈ వడ్డీ వ్యాపారులేం చేసే వారో మనందరికీ తెలిసిందే. అందుకే 30 కోట్ల మంది భారతీయుల పేర్ల మీద జీరో బ్యాలెన్స్ తో బ్యాంకు ఖాతాలు తెరిపించాం. ఒక్కొక్క సారి సంపన్నులను మనం చూస్తాం, కానీ వారి బుద్ధి అల్పంగా ఉండవచ్చు. అలాగే పేద ప్రజలను కూడా మనం చూస్తాం, కానీ వారిలో ఎంతో పరిణతిని నేను గమనించాను. వారి విశాల హృదయాన్ని నేను చూశాను. మేం జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలు తెరిపించినా వారు క్రమం తప్పకుండా ఆ ఖాతాలలో చిన్న మొత్తాలు పొదుపు చేసే అలవాటు చేసుకొన్నారు. కుటుంబంలోని తల్లులు భర్తలు దుబారాగా ఖర్చు చేసేస్తారని భయపడి తమ వద్ద ఉన్న సొమ్ము గోధుమ డబ్బాల్లోను, పరుపుల కింద దాచుకొనే వారు. ఈ రోజు అతి తక్కువ సమయంలో జన్ ధన్ ఖాతాల్లో 67 వేల కోట్ల రూపాయలు జమయ్యాయంటే, ప్రజల్లో డబ్బు దాచుకొనే అలవాటులో ఎటువంటి మార్పు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు పేద ప్రజలే భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్రవంతిగా మారారు. ఒకప్పుడు వ్యవస్థకు దూరంగా గడిపిన వారే ఈ రోజు వ్యవస్థకు బలంగా, కేంద్ర శక్తిగా మారారంటే అది తక్కువ మార్పేమీ కాదు.
గతంలో చర్చకు కూడా రాని, ప్రజల ఆలోచనకైనా రాని ఎన్నో చొరవలు మేం తీసుకున్నాం. కొందరైతే అసలు ఈ ప్రయత్నాలు సాధ్యమేనా అని అబ్బురపడ్డారు. కానీ దానిని మేం స్వీకరించాం. మా దేశం అనుకున్న పథంలో ముందుకు సాగగలదని నిరూపించాం. సింగపూర్ స్వచ్ఛంగా ఉంది, ఫిలిప్పీన్స్ స్వచ్ఛంగా ఉంది, మనీలా స్వచ్ఛంగా ఉంది, మన దేశం ఎందుకలా ఉండాలి ? భారతదేశం స్వచ్ఛంగా ఉండలేదా, దేశం లోని ఏ పౌరుడు మురికి కూపంలోనే జీవించాలనుకుంటాడు ? కానీ విజయం లేదా వైఫల్యం అనే భయం లేకుండా స్వచ్ఛత కోసం ఒక ఉద్యమం చేపట్టే చొరవ ఎవరో ఒకరు చేయాలి కదా.. మహాత్మ గాంధీ స్వచ్ఛత ఉద్యమాన్ని ఎక్కడ వదలిపెట్టారో అక్కడ నుండి ముందుకు కదలే బాధ్యతను మేం స్వీకరించాం. దేశంలో 2.25 లక్షల గ్రామాల్లో ఈ రోజు బహిరంగ మల మూత్ర విసర్జన అనేదే లేదని ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నాను. సమాజంలో ఒక సగటు జీవి జీవిత నాణ్యతలో అదెంత పెద్ద మార్పు తీసుకువచ్చిందో చూడండి.
20,25,30 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సందర్శించిన, ఇప్పటికీ భారతదేశంతో అనుబంధం కలిగివున్న మీలో కొంతమందికి తెలుసు.. ఒక గ్యాస్ సిలిండర్ ను పొందడం లేదా ఒక గ్యాస్ కనెక్షన్ ను పొందడం ఎంత కష్టమో. పొరుగు వారింట్లో మర్సెడీజ్ కారు ఉన్నా కూడా మనం ఒక గ్యాస్ కనెక్షన్ ను పొందగలిగితే పొరుగు వారిని మించిన విజయాన్ని సాధించామని భావించిన రోజులు ఉన్నాయి. పార్లమెంటు సభ్యులకు 25 గ్యాస్ కూపన్ ల వంతున ఇస్తూ ఉండే వారు. వాటిని వారు తమ నియోజకవర్గం లోని 25 మందికి ఇవ్వవచ్చు. కానీ అవి ఎవరికి వెళ్లాయో నేను వేరే చెప్పనక్కర లేదు. 2014 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు బిజెపి ఒక వైపు, కాంగ్రెస్ పార్టీ రెండో వైపు నిలచాయి. ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాకు అప్పచెప్పింది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతోంది. ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించేది ఎవరో తెలుసుకోవాలని ప్రజలందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమిటి ? ఈ రోజు మీకు ఏడాదికి తొమ్మిదే గ్యాస్ సిలిండర్ లు లభిస్తున్నాయి, మేం అధికారంలోకి వస్తే ఏడాదికి 12 సిలిండర్ లు ఇస్తాం అన్నది వారి ప్రకటన. అంటే కాంగ్రెస్ ఈ అంశం పైనే ఎన్నికల పోరాటం చేస్తోందన్న మాట. 2014 వరకు అందరి ఆలోచనా పరిధి అంతే. వారెవ్వా.. ఎంత అద్భుతం; మనకు ఇక నుండి ఏడాదికి 9 కాదు, 12 సిలిండర్ లు వస్తాయి అనుకొని ప్రజలు హర్షధ్వానాలు చేసిన రోజులవి.
మరి, వంట చెరకుతో వంట చేస్తున్న 5 కోట్ల కుటుంబాలలోని తల్లులకు గ్యాస్ కనెక్షన్ ను, గ్యాస్ సిలిండర్ లను అందించడం జరుగుతోంది. కుటుంబానికి ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 12కి పెంచే ఆలోచన ఒక వైపు, మూడు సంవత్సరాలలో ఐదు కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ను ఇస్తానంటున్న, అది కూడా ఉచితంగా ఇస్తానంటున్న వ్యక్తి మరొక వైపు- ఇప్పుడు చెప్పండి.. ఈ రెండు వాదనలను విన్న మీకు ఏమనిపిస్తోందో.
ఒక పేద కుటుంబంలో కట్టెల పొయ్యిపై వంట చేసే మహిళ రోజుకు నాలుగు వందల సిగరెట్లు వెలువరించే పొగ శరీరంలోకి పీల్చుకుంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆమె చేసిన నేరం ఏమిటి ? ఆమె ఆరోగ్యం గురించి, ఆ పక్కనే ఆటలాడుకొనే పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించే వారు ఎవరు ? వారి జీవితాల్లో మార్పును తీసుకు రాలేమా? వంట చెరకు తడిసిపోతే, దానిని వెలిగించి వంట చేయడం ఎంత కష్టం ? దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 70 సంవత్సరాల తరువాత కూడా వారికి ఆ ఇబ్బందిని తప్పించలేమా ? ఇందుకు ఒక్కటే కారణం.. ఆలోచనలలో పేదరికం వల్ల ఎన్నో పెద్ద సమస్యలు తలెత్తుతాయి, అదే మీ అందరికీ నేను చెప్పేది.
అందుకే నేను ఎర్ర కోట మీది నుండి ఎలుగెత్తి అడిగాను, సోదరులారా, మీకు భరించగల సామర్థ్యం ఉన్నప్పుడు గ్యాస్ సబ్సిడీ అవసరమా, ఏడాదికి 800 లేదా 1000 లేదా 1200 రూపాయలు సబ్సిడీ రూపంలో మిగుల్చుకొన్నంత మాత్రాన మీకు ఒరిగేదేమిటి ? దాన్ని వదులుకోండి అంటూ కోరాను. నేను చెప్పింది ఇంత మాత్రమే. దానికి స్పందించిన 1.25 కోట్ల కుటుంబాలు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఇది చిన్న సంఖ్య ఏమీ కాదు. మోదీ ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాలో నిక్షిప్తం చేయలేదు.
దానిని పేద ప్రజలకు అందించాలన్నది మోదీ నిర్ణయం. ఆ దిశగా మేం విజయవంతంగా ముందుకు కదలి 3 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లను అందించగలిగాం. ఐదు కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ లు అందించాలన్నది నా లక్ష్యం. ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో ప్రజలు లాభం పొందుతున్నారు. అటువంటి లబ్ధిదారులను గుర్తించేందుకు గ్యాస్ కనెక్షన్ లను ‘ఆధార్’ తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ విధానంలో గుర్తించే ప్రక్రియను చేపట్టాం. కొన్నిసందర్భాలలో ఈ భూమిపై ఇంకా జన్మించని శిశువుల పేరు మీద కూడా సబ్సిడీ చేరుతోందని ఈ తనిఖీలో తేలడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సబ్సిడీ ఎవరి పేరు మీద ఎలా దుర్వినియోగం అవుతోందో చెప్పేందుకే నేను ఈ సంగతిని వెల్లడించాను. అది ఎవరి జేబులోకయినా వెళ్తోందో ఏమో; కానీ, ఈ రోజు ఈ దుర్వినియోగాన్ని నేను ఆపగలిగాను. సరైన వారికి మాత్రమే సబ్సిడీ అందేటట్టు చేయగలిగాను. దీని ప్రభావం ఏమిటో తెలుసా.. 57 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఆదా అయింది. దీనిని గుర్తించి ఉండకపోతే ఏటా 57 వేల కోట్ల రూపాయలూ ఇంకా ఈ భూమి మీదకు రాని వారి పేర్ల మీద దొంగల ఖాతాలలోకి చేరిపోయి ఉండేది. ఇన్నాళ్లూ అలాంటి దొంగ సొమ్ము జేబుల్లో వేసుకున్న వారు మోదీ ని ఇష్టపడతారా ? మేం ఇటువంటి పని చేయాలా, వద్దా మీరే చెప్పండి. దేశంలో మార్పు రావాలా, వద్దా? అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలా వద్దా? దేశాన్ని ముందుకు నడిపించాలా, వద్దా…? చెప్పండి.
నేను ఇక్కడకు రావడం వల్ల మీరందరూ నన్ను ఆశీర్వదించారు. దేశం నాకు ఏ లక్ష్యంతో అధికారం కట్టబెట్టిందో దాన్ని సాధించే విషయంలో వెనుకాడేదే లేదని మీకు నేను హామీ ఇస్తున్నాను. 2014 కు ముందు వార్తల్లో ఏం వచ్చేది ఒకసారి ఆలోచించండి. బొగ్గు కుంభకోణం లేదా 2జి కుంభకోణంలో ఎవరెంత స్వాహా చేశారనేదే కదా ? 2014 తరువాత ఎవరైనా ఏం అడుగుతున్నారో తెలుసా, మోదీ గారు, ఎంత సొమ్ము ను వెనుకకు తెచ్చారు అంటూ అడుగుతున్నారు. ఎంత పెద్ద తేడానో చూడండి. ఆ రోజు ప్రజలు దేశం నుండి ఎంత తరలిపోతోందో అని తెలుసుకొనేందుకు ఎదురు చూసే వారు. ఈ రోజు మోదీ గారూ, దయచేసి ఎంత వెనుకకు వచ్చిందో చెప్పండంటూ ఆసక్తిగా అడుగుతున్నారు.
మిత్రులారా, దేశానికి వనరుల కొరత ఏమీ లేదు. ముందుకు పురోగమించగలిగే అవకాశాలన్నీ అందుబాటులో ఉన్నాయి. సామర్థ్యాలు ఉన్నాయి. మేం ఎన్నో కీలక విధానాలతో ముందుకు సాగుతున్నాం. అభివృద్ధిలో దేశం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజా భాగస్వామ్యంలో మేం ముందుకు సాగుతున్నాం. సగటు జీవిని వెంట పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఎంతో కాలం దేశానికి దూరంగా జీవనం సాగించాలని భావించరు. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి, నన్ను ఆశీర్వదించడమే నాకు ఆనందం కలిగిస్తోంది.
అనేకానేక ధన్యవాదాలు.