గౌరవనీయులైన
డెన్మార్క్ ప్రధానమంత్రిగారు...
ప్రతినిధి బృందం సభ్యులు…
మీడియా మిత్రులారా!
శుభ సాయంత్రం… నమస్కారం!
గౌరవనీయ డెన్మార్క్ ప్రధానమంత్రిగారూ... మీ దేశంలో నాకు, మా ప్రతినిధి బృందానికి అద్భుత రీతిలో స్వాగతమిచ్చినందుకు ముందుగా మీకు, మీ బృందానికి ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో నాకిదే తొలి పర్యటన. గత సంవత్సరం అక్టోబరులో మీకు భారతదేశంలో స్వాగతం పలికే అవకాశం నాకు లభించింది. ఈ రెండు పర్యటనల నేపథ్యంలో మన స్నేహ సంబంధాలను మరింత సన్నిహితం, గతిశీలం చేసే వీలు కలిగింది. మన రెండు దేశాలూ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నియమబద్ధ పాలన తదితర విలువలను మాత్రమేగాక అనేక పరస్పర సహాయక బలాలను పంచుకుంటున్నాం.
మిత్రులారా!
భారత-డెన్మార్క్ వర్చువల్ సదస్సు 2020 అక్టోబరులో నిర్వహించిన సందర్భంగా మన స్నేహబంధానికి మనం హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం హోదా కల్పించాం. ఆ మేరకు ఇవాళ్టి చర్చల్లో సదరు హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త కృషిని సమీక్షించాం. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా వివిధ రంగాల్లో- ముఖ్యంగా పునరుత్పాదన ఇంధనం, ఆరోగ్యం, రేవులు, నౌకా రవాణా, వర్తుల ఆర్థిక వ్యవస్థ జల నిర్వహణ వంటివాటిలో గణనీయ ప్రగతి సాధించడం నాకెంతో సంతోషం కలిగించింది. డెన్మార్క్‌కు చెందిన 200కుపైగా కంపెనీలు భారతదేశంలోని వివిధ రంగాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తదనుగుణంగా పవన విద్యుత్, నౌకా రవణా, సంప్రదింపు సేవలు, ఆహార తయారీ, ఇంజనీరింగ్ వగైరా పరిశ్రమలు నడుపుతున్నాయి. ఇవేకాకుండా ఇంకా అనేక రంగాలుండగా, భారతదేశంలో ‘వాణిజ్య సౌలభ్యం’తోపాటు స్థూల ఆర్థిక సంస్కరణల ద్వారా అవి ప్రయోజనం పొందుతున్నాయి. అందువల్ల భారత మౌలిక సదుపాయాల రంగంసహా హరిత పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేందుకు డెన్మార్క్ కంపెనీలు, పెన్షన్ నిధి రంగాలకు అపార అవకాశాలున్నాయి.
నేటి చర్చల సందర్భంగా భారత-ఐరోపా సంబంధాలు, ఇండో-పసిఫిక్, ఉక్రెయిన్ తదితర అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత-ఐరోపా సమాఖ్య మధ్య ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’పై సంప్రదింపులు త్వరలోనే ఓ కొలిక్కి రావచ్చునని మేం ఆశాభావంతో ఉన్నాం. స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సార్వజనీన, నియమాధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భరోసా దిశగా మా అభిప్రాయాన్ని నొక్కిచెప్పాం. అదేవిధంగా ఉక్రెయిన్‌లో తక్షణ కాల్పుల విరమణకు మేం పిలుపునిచ్చాం. ఈ సమస్య పరిష్కారంలో చర్చలు-దౌత్య సాయంపైనా సంసిద్ధత తెలిపాం. వాతావరణ రంగంలో మా మధ్య సకారంపైనా చర్చించాం. గ్లాస్గో ‘కాప్-26’లో ఆమోదించిన తీర్మానాల అమలుకు భారత్ కూడా నిబద్ధతతో ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారంపై మరిన్ని అవకాశాల అన్వేషణకు మేం అంగీకరించాం.
గౌరవనీయ ప్రధానిగారూ!
మీ నాయకత్వంలో భారత-డెన్మార్క్ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరగలవన్నది నా దృఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో రేపు నిర్వహించబోయే భారత-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నందుకుగాను మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఇవాళ ప్రవాస భారతీయ సమాజ సభ్యులతో సమావేశంలో మీరు పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మీ రాక ఇక్కడి భారతీయ సమాజంపై మీ ప్రేమాదరాలకు నిదర్శనం.
ధన్యవాదాలు