గౌరవనీయులు అధ్యక్షుడు బిడెన్ మరియు గౌరవనీయులు అధ్యక్షుడు కిషిడా,
దృశ్య మాధ్యమం ద్వారా అనుసంధానమైన మన నాయకులారా !
ఇతర మహనీయులారా !
ఈ రోజు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఉండటం నాకు సంతోషాన్నిచ్చింది. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాంతాన్ని సారధిగా మార్చాలనే మన సమిష్టి సంకల్పానికి ప్రతి రూపం. ఈ ముఖ్యమైన చొరవకు నేను అధ్యక్షుడు బిడెన్‌కి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండో-పసిఫిక్ ప్రాంతం తయారీ, ఆర్థిక కార్యకలాపాలు, ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులకు కేంద్రం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వాణిజ్య కార్యకలాపాలలో భారతదేశం శతాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా ఉందనడానికి చరిత్ర సాక్ష్యం గా నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాణిజ్య నౌకాశ్రయం భారతదేశంలోని నా సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని లోథాల్ లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల, ఈ ప్రాంతంలోని ఆర్థిక సవాళ్లకు మనం సాధారణ మరియు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం.
మహనీయులారా !
సమగ్రమైన, సౌకర్యవంతమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ను రూపొందించడానికి భారతదేశం మీ అందరితో కలిసి పని చేస్తుంది. స్థితిస్థాపక సరఫరా వ్యవస్థ కు నమ్మకం, పారదర్శకత, సమయపాలన అనే మూడు ప్రధాన స్తంభాలు ఉండాలని నేను నమ్ముతున్నాను. ఈ మూడు స్తంభాలను బలోపేతం చేయడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు కు ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మార్గం సుగమం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మీ అందరికీ అనేకానేక ధన్యవాదములు.