మిస్టర్ ప్రెసిడెంట్, మిమ్మలను కలుసుకోవడం ఎల్లవేళలా సంతోషం కలిగిస్తుంది. ఈరోజు మనమిద్దరం మరో సానుకూల, ప్రయోజనకరమైన క్వాడ్ శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొన్నాం.
ఇండియా - అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం నిజమైన విశ్వసనీయ భాగస్వామ్యం.
మన ఉమ్మడి విలువలు, భద్రతతోపాటు ఎన్నో రంగాలలో మన ఉమ్మడి ప్రయోజనాలు, ఈ విశ్వసనీయ బంధాన్ని బలోపేతం చేశాయి.
మన ప్రజలకు -ప్రజలకు మధ్య సంబంధాలు, సన్నిహిత ఆర్ధిక సంబంధాలు మన భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
మన మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మన శక్తి సామర్ధ్యాలకన్నా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ ఇవి నిరంతరాయంగా పెరుగుతూ వస్తున్నాయి.
మన మధ్యగల ఇండియా - అమెరికా పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంతో , పెట్టుబడుల దిశగా మనం పటిష్టమైన ప్రగతిని సాధించగలం.
మనం టెక్నాలజీ రంగంలో మన ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. అలాగే అంతర్జాతీయ అంశాలపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాం.
ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి మన రెండు దేశాలు ఉమ్మడి దృక్ఫథాన్ని ప్రతిబింబిస్తుననాయి. అలాగే మన ఉమ్మడి విలువలను పరిరక్షించేందుకు పనిచేస్తున్నాయి. ఉమ్మడి ప్రయోజనాలు ద్వైపాక్షిక అంశాల విషయంలోనే కాకుండా ఇతర సారూప్య ఆలోచనలు కలిగిన దేశాలతో కూడా పంచుకోవడానికి ఇరు దేశాలూ కృషిచేస్తున్నాయి.
క్వాడ్, ఐపిఇఎఫ్ నిన్న ప్రకటించిన అంశాలు ఇందుకు తగిన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవాళ మనం జరుపుతున్న చర్చలు ఈ సానుకూల వేగాన్ని మరింత వేగవంతం చేస్తాయి.
ఇండియా , అమెరికాల మధ్య స్నేహం
ప్రపంచ శాంతి, స్థిరత్వానికి, ప్రపంచ సుస్థిరత ,మానవజాతి శ్రేయస్సు కు ఒక గొప్ప శక్తిగా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.