గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వాన జమ్ముకశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలతో సాగిన చర్చలు కొద్దిసేపటి కిందటే ముగిశాయి. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రగతి, బలోపేతం దిశగా అత్యంత నిర్ణయాత్మక కృషిలో ఇదొక భాగం. అత్యంత సౌహార్ద వాతావరణంలో సాగిన ఈ సమావేశం పాల్గొన్నవారందరూ భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై తమ సంపూర్ణ విధేయతను ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడటంపై కేంద్ర హోంశాఖ మంత్రి నాయకులందరికీ ఈ సందర్భంగా వివరించారు.
ప్రతి పార్టీ వినిపించిన వాదనలను, సూచనలను ప్రధానమంత్రి అత్యంత శ్రద్ధగా ఆలకించారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులందరూ తమ దృష్టికోణాన్ని నిష్పాక్షికంగా వెల్లడించడాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రెండు కీలకాంశాలకు ప్రధానమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. తదనుగుణంగా మొదట జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి చేర్చేందుకు మనమంతా సమష్టిగా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. అటుపైన జమ్ముకశ్మీర్‌లో సర్వతోముఖాభివృద్ధి అవసరమని, ఈ ప్రగతి ఫలాలు ప్రతి ప్రాంతంతోపాటు ప్రతి సమాజానికీ చేరాలన్నది మన రెండో కర్తవ్యమని వివరించారు. ఈ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన సహకారపూరిత వాతావరణం ఏర్పడటం అవశ్యమని నొక్కిచెప్పారు. జమ్ముకశ్మీర్‌లో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడాన్ని కూడా గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భద్రత పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక పంచాయతీలకు దాదాపు రూ.12000 కోట్లు నేరుగా అందాయని గుర్తుచేశారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకున్నదని చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించి తదుపరి ముఖ్యమైన దశకు… అంటే- శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి శాసనసభలో రాజకీయ ప్రాతినిధ్యం లభించేలా నియోజకవర్గ హద్దుల నిర్ణయ ప్రక్రియను సత్వరం పూర్తిచేయాల్సి ఉందన్నారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన/గిరిజన ప్రాంతాల్లో నివసించే వర్గాలవారికి సముచిత ప్రాతినిధ్యం దక్కేవిధంగా చూడటం అవసరమని స్పష్టం చేశారు. ఆ మేరకు సరిహద్దుల నిర్ణయ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడంపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. తదనుగుణంగా ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు అన్ని పార్టీల నాయకులూ అంగీకరించారు.
జమ్ముకశ్మీర్‌ను శాంతిసౌభాగ్య పథాన నడిపించడంలో భాగస్వాములందరి సహకారం అవసరమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. జమ్ముకశ్మీర్ హింసాత్మక విష వలయం నుంచి బయటపడుతూ స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్నదని ఆయన గుర్తుచేశారు. దీనికి తగినట్లుగా జమ్ముకశ్మీర్ ప్రజల్లో కొత్త ఆశలు, సరికొత్త విశ్వాసం చిగురిస్తుండటమే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల్లోగల ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, ఆత్మవిశ్వాసం మెరుగకు మనమంతా రాత్రింబవళ్లు నిర్విరామంగా కృషిచేయాల్సి ఉందని ప్రధానమంత్రి స్పష్టీకరించారు.
జమ్ముకశ్మీర్ ప్రగతి, సౌభాగ్యాలతోపాటు ప్రజాస్వామ్య బలోపేతం దిశగా నేటి సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నేపథ్యంలో దీనికి హాజరైన రాజకీయ పార్టీలన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు