భారతదేశ విదేశాంగ విధానంలో దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంస్థ - ఎస్ఎ ఆర్ ఆర్ సి (సార్క్) అత్యంత ముఖ్యాంశం. సార్క్‌లో అతి పెద్ద దేశంగానేగాక ఆర్థికంగానూ భారతదేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే తన విదేశాంగ విధానంలో సార్క్ దేశాలకు ఎంతటి కీలక స్థానం ఇస్తున్నదీ స్పష్టంచేశారు.
ప్రధాన మంత్రిగా 2014 మే 26న తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సార్క్ దేశాల అధినేతలందర్నీ ఆహ్వానించాలని శ్రీ మోదీ నిర్ణయించుకొన్నారు. ఆ మేరకు శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ హమీద్ కర్జాయ్ (అఫ్గానిస్తాన్), స్పీకర్ శ్రీ షర్మిన్ చౌదరి (బంగ్లాదేశ్-ప్రధాని హసీనా జపాన్ పర్యటనకు వెళ్లినందున), ప్రధాని శ్రీ చేరింగ్ టొబగే (భూటాన్), అధ్యక్షుడు శ్రీ అబ్దుల్లా యామీన్ (మాల్దీవ్స్), ప్రధాని శ్రీ సుశీల్ కొయిరాలా (నేపాల్), ప్రధాని శ్రీ నవాజ్ షరీఫ్ (పాకిస్థాన్), అధ్యక్షుడు శ్రీ రాజపక్ష (శ్రీ లంక) తదితర నాయకులంతా హాజరయ్యారు. ఆ మరునాడు ఆయా నాయకులతో శ్రీ మోదీ ఫలప్రదమైన ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్నారు. ప్రతి సమావేశంలోనూ సార్క్ దేశాల మధ్య సంబంధాల్లో ఆశావహ, రికార్డు స్థాయి ప్రగతి ప్రారంభమైందన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.
తన తొలి విదేశీ పర్యటన కోసం భూటాన్‌ను ఎంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2014 జూన్ 15న ఘన స్వాగత సంరంభం నడుమ ఆ గడ్డపై అడుగుపెట్టారు. ఈ పర్యటనలో అనేక ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అలాగే భూటాన్ పార్లమెంటు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014లో ఖాట్మండూలో అడుగుపెట్టినపుడు 17 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంతరం స్వతంత్ర ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా నేపాల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆ దేశంతోనూ అనేక కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతేకాకుండా నేపాల్ నాయకులతో ప్రధాన మంత్రి చర్చలతో భారత-నేపాల్ సంబంధాల్లో ఓ చారిత్రక అధ్యాయం మొదలైంది. ఆ తరువాత 2014 నవంబరులో సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం కోసం మరో సారి నేపాల్ వెళ్లిన శ్రీ మోదీ, అక్కడ సార్క్ అగ్ర నాయకులను కలుసుకొన్నారు.
శ్రీ లంక కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీ సిరిసేన 2015 ఫిబ్రవరిలో భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆ ఏడాది జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన, తన తొలి విదేశీ పర్యటన కోసం భారతదేశాన్ని ఎంచుకోవడం గమనార్హం. అటుపైన 2015 మార్చి నెలలో ప్రధాన మంత్రి శ్రీ లంక పర్యటనకు వెళ్లడంతో అనేక సంవత్సరాల తర్వాత ద్వైపాక్షిక సందర్శనకు వెళ్లిన తొలి భారత ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై సంతకాలు జరగడంతోపాటు ప్రధాన మంత్రి శ్రీ మోదీ శ్రీ లంక పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాఫ్నా వెళ్లి, ఆ నగరాన్ని సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా, ప్రపంచంలో రెండో దేశాధినేతగా చరిత్రపుటలకెక్కారు. అక్కడ భారతదేశ ప్రభుత్వ తోడ్పాటుతో నిర్మించిన గృహ పథకాన్ని ప్రారంభించి, ప్రజలకు ఇళ్లను అప్పగించడంతోపాటు జాఫ్నా సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, మే 2015 లో భారతదేశం సందర్శించారు మరియు రెండు దేశాల సంబంధాలను మెరుగుపరిచేందుకు కలిసి పనిచేసేందుకు అంగీకరించాయి.
భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలలో ఒక పరీవాహక క్షణంగా వివరించబడే భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం ఏకగ్రీవంగా మే 2015 లో భారత పార్లమెంటులో అమోదించబడినప్పుడు చరిత్ర సృష్టించబడింది. అన్ని రాజకీయ పార్టీలను మరియు ముఖ్యమంత్రులను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించగా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నుండి కూడా అభినందనలు వచ్చాయి. బాంగ్లాదేశ్ తో సంబంధాలను మరింత పటిష్టపరిచేందుకు ప్రధాని త్వరలో బాంగ్లాదేశ్ సందర్శించాలని భావిస్తున్నారు.
అందువలన, ద్వైపాక్షిక సమావేశాలు, కీలక ఒప్పందాలతోపాటు సార్క్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సాధ్యపడే ప్రతిదీ చాలా శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్నారు.