మన రైతులకు సాధికారత
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం వ్యవసాయంపై అపూర్వమైన రీతిలో దృష్టి సారించింది. మెరుగైన ఉత్పాదకత, రైతులకు రక్షణ, వారి ఆదాయం పెంపు సహా మొత్తంగా వారి సంక్షేమం దిశగా గడచిన రెండు సంవత్సరాలలో అనేక వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలన్నీ రైతులకు బహుముఖంగా తోడ్పాటును అందిస్తున్నాయి. రైతుకు ఎరువుల సులభ లభ్యత నుండి పంటల బీమా పథకం, పరపతి సౌలభ్యం, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే దాకా శాస్త్రీయంగా సాయం అందుతోంది. అంతేకాకుండా రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడానికి బహుముఖ చర్యలు చేపట్టాలని కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
దేశం 2014-15, 2015-16 సంవత్సరాలలో వరుస కరవులను ఎదుర్కొంది. అయినప్పటికీ రైతుల దృఢ సంకల్పం వల్ల వ్యవసాయ ఉత్పాదకత సహా సరఫరా, ద్రవ్యోల్బణం కూడా నిలకడగా ఉన్నాయి. ఆ మేరకు 2015-16లో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడులు 252.23 మిలియన్ టన్నులుగా అంచనా వేస్తే 2014-15లో అది 252.02 మిలియన్ టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఇక వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయం- రైతు సంక్షేమ శాఖగా ప్రభుత్వం మార్పు చేసింది. రైతుకే అగ్ర ప్రాధాన్యమిచ్చే దార్శనికతలో ఆదర్శప్రాయ మార్పునకు నిదర్శనమిదే. తదనుగుణంగా వ్యవసాయం-రైతు సంక్షేమ శాఖ కేటాయింపు కూడా గణనీయంగా పెరిగి రూ.35,984 కోట్లకు చేరింది.
వ్యవసాయమన్నది మరింత ఆశావహ, అధికోత్పాదక, అధికాదాయ సమన్వితం కావాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. అయితే, రైతుల సమస్యలను వ్యవసాయ దశలవారీగా పరిష్కరించేందుకు బహుకోణీయ విధానం అవసరం. ఆ మేరకు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను ప్రభుత్వం సిద్ధం చేసింది:-.
విత్తనాలు వేసే ముందు:
- సరైన పంటల ఎంపిక కోసం రైతులకు భూసార కార్డులతో సాయం.
ఇందులో భాగంగా 1.84 కోట్ల భూసార కార్డులను రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మొత్తంమీద 14 లక్షల వ్యవసాయ కమతాలు సహా దేశంలోని రైతులందరికీ భూసార కార్డులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.
- ఎరువులు
ఎరువుల కోసం రైతులు బారులు తీరడం ఇప్పుడు చరిత్ర మాత్రమే. రైతుకు ఎరువులు సులభంగా లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ఎరువుల ధరలను కూడా గణనీయగా తగ్గించింది. దేశంలో ఇప్పడు 100 శాతం వేపపూతతో కూడిన యూరియా లభిస్తోంది. ఈ పూతవల్ల ఎరువు సామర్థ్యం 10 నుండి 15 శాతం మెరుగుపడి వినియోగించాల్సిన యూరియా పరిమాణం తగ్గుతుంది.
- ఆర్థిక సాయం
రైతు రుణాలపై రాయితీ నిమిత్తం రూ.18,276 కోట్ల కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది. దీనివల్ల స్వల్పకాలిక రుణంపై 4 శాతం, దీర్ఘకాలిక (పంట చేతికందిన తరువాత) రుణంపై 7 శాతం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మార్కెట్ రేటు 9 శాతానికి బదులుగా 7 శాతం వంతున రైతులు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
విత్తనం వేసే దశలో:
- నీటిపారుదల సదుపాయాలు
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పి ఎమ్ కె ఎస్ వై)ను ఉద్యమస్థాయిలో అమలు చేయాలని, 28.5 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీర్ఘకాలంగా మూలపడిన 89 నీటిపారుదల పథకాలను సత్వర నీటిపారుదల లబ్ధి కార్యక్రమం (ఎఐబిపి) కింద వేగవంతం చేసేందుకు నిర్ణయించింది. జాతీయ గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (ఎన్ఎబిఎఆర్ డి)పరిధిలో రూ.20,000 కోట్ల ఆరంభ మూల నిల్వతో ప్రత్యేకంగా దీర్ఘకాలిక నీటిపారుదల నిధి ఏర్పాటుకు చొరవ చూపింది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ జి ఎన్ ఆర్ ఇ జి ఎ) కింద వర్షాధార ప్రాంతాల్లో 5 లక్షల పంట కుంటలు, బావులతో పాటు 10 లక్షల పచ్చిరొట్ట ఎరువు గుంటలు తవ్వించేందుకు నిశ్చయించింది.
- మద్దతు- మార్గనిర్దేశం
దేశంలోని కోట్లాది రైతులకు సెల్‌ఫోన్ ల ద్వారా సంక్షిప్త సందేశాలు, నేరుగా ఫోన్ చేసే సదుపాయం కల్పిస్తూ శాస్త్రీయ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
విత్తనాలు వేసిన తరువాత:
- ప్రధాన మంత్రి పంటల బీమా పథకం (పిఎమ్ ఎఫ్ బి వై)
మునుపెన్నడూ లేనంత తక్కువ రుసుము చెల్లింపుతో పంటల బీమా సదుపాయం పొందే అవకాశం పిఎమ్ ఎఫ్ బి వై ద్వారా రైతులకు దక్కింది. ఒక్కొక్క పంటకు ఒక విధమైన రుసుము శాతాన్ని ఈ పథకం నిర్దేశిస్తోంది. ఉదాహరణకు ఖరీఫ్ పంటలపై 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం వంతున రుసుము చెల్లిస్తే సరిపోతుంది. రుసుము శాతంపై అదనపు భారమేమీ ఉండదు. హామీ సొమ్ములో తగ్గింపు ఉండదు. అంటే... రైతుకు పూర్తి రక్షణ లభిస్తుందన్న మాట. స్వాతంత్ర్యం లభించిన నాటినుంచి రైతులలో దాదాపు 20 శాతం మాత్రమే బీమా పథకం కిందకు వస్తున్నారు. అయితే, రాబోయే మూడేళ్లలో 50 శాతం రైతులను పిఎమ్ ఎఫ్ బి వై కిందకు తేవాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.
- ఇ-నామ్
రాష్ట్రాలు తమ తమ వ్యవసాయ విపణి నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయ విపణులను తామే నిర్వహిస్తున్నాయి. తదనుగుణంగా రాష్ట్రాన్ని అనేక మార్కెట్ ప్రాంతాలుగా విభజించాయి. ఇదిలా ముక్కచెక్కలు కావడం వల్ల ఒక విపణి నుండి మరొక విపణికి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై దుష్ర్పభావం పడుతోంది. మరో వైపు రైతులకు గిట్టుబాటు ధర లభించకపోగా, పెరిగిన ధరలతో వినియోగదారులపై భారం పడుతోంది. ఈ సవాళ్లకు జవాబుగా ఏకీకృత విపణి రూపేణా ఇ-నామ్ ఆన్‌లైన్ వ్యాపార వేదిక ఆవిర్భవించింది. దీంతో ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం స్థాయిలో సార్వజనీనత సాధ్యమవుతుంది. ఏకీకృత విపణులలో ప్రక్రియలన్నిటినీ ఒకే రూపంలోకి ఇమడ్చడం వల్ల అమ్మకందారులు, కొనుగోలుదారుల నడుమ సమాచార అసమతౌల్యం తొలగిపోతుంది. వాస్తవ గిరాకీ ఆధారంగా అసలు ధర ఉనికిలోకి వస్తుంది. తద్వారా వేలం ప్రక్రియలో పారదర్శకత సాధ్యమవుతుంది. రైతుకు జాతీయ స్థాయి విపణి అందుబాటులోకి వస్తుంది. తన ఉత్పత్తి నాణ్యతకు తగిన ధర లభించడమేగాక ఆన్‌లైన్‌లో చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది. అదే సమయంలో వినియోగదారులకు సరసమైన ధరలో నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
పైన పేర్కొన్న చర్యలన్నీ తీసుకోవడమే కాక రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బహుముఖ విధానాన్ని ప్రభుత్వం చేపట్టింది. వ్యవసాయానికి అనుబంధంగా మత్స్య, పశుసంవర్ధక, పాడి ఉత్పత్తులు వంటి కార్యకలాపాలకు మద్దతిస్తోంది. ఇందులో భాగంగా పాడి పరిశ్రమకు సంబంధించి రూ.850 కోట్లతో- ‘పశుధన సంజీవని’, ‘నకుల్ ఆరోగ్య పత్రం’, ‘ఇ-పశుధన విపణి’, ‘జన్యు సంబంధ దేశవాళీ పశు సంతతి అభివృద్ధి జాతీయ కేంద్రం’ పేరిట నాలుగు పథకాలను ప్రారంభించింది. అలాగే దేశవాళీ గోసంతతి వృద్ధి, సంరక్షణ కోసం ‘జాతీయ గోకుల కార్యక్రమం’ ప్రవేశపెట్టింది. ప్రభుత్వం చూపిన శ్రద్ధ ఫలితంగా 2013-14లో 95.72 లక్షల టన్నులుగా ఉన్న మత్స్య ఉత్పత్తులు 2014-15కల్లా 101.64 లక్షల టన్నులకు పెరగగా, 2015-16లో 107.9 లక్షల టన్నులకు దూసుకుపోగలదని అంచనా. ఇక నీలి విప్లవం పథకం కింద మత్స్యకారులకు మూడు నెలల చేపల వేట నిషేధ కాలంలో ‘పొదుపు-సాయం’ కింద అందజేసే నెలవారీ మొత్తాన్ని రూ.1500కు పెంచింది.
ప్రభుత్వం అందజేసిన విపత్తు సహాయం కూడా గణనీయంగా పెరిగింది. లోగడ 2010-2015 మధ్య రాష్ట్రాల విపత్తు ప్రతిస్పందన నిధి కింద రూ.33,580.93 కోట్ల మేర కేటాయించగా, 2015-2020కి గాను ప్రభుత్వం రూ.61,220 కోట్లు కేటాయించింది. వివిధ రాష్ట్రాలలో 2010-14 మధ్య కరువు, వడగళ్ల వాన వంటి విపత్తులు సంభవించినప్పుడు 12,516.2 కోట్ల సహాయాన్ని ఆమోదించింది. ఇందులో ఒక్క 2014-15 సంవత్సరంలో ఎన్ డి ఎ ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.9,017.998 కోట్లు కావడం విశేషం. ఇక 2015-16లో ఇప్పటిదాకా రూ.13,496.57 కోట్లకు ఆమోదం తెలిపింది..