“...విస్తృత స్థాయిలో తాండవమాడుతున్న అవినీతి, అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీమతి ఇందిరా గాంధీ నైతిక బాధ్యత వహించి ప్రధాన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు..” దేశంలో 1975 జూన్ 25వ తేదీన వెల్లడి కావలసిన వార్తా కథనమిది. కానీ, దురదృష్టమేమిటంటే అటువంటి పరిణామమేదీ సంభవించ లేదు. ఇందుకు భిన్నంగా శ్రీమతి గాంధీ చట్టాన్ని తుంగలో తొక్కి తన వ్యక్తిగత చాపల్యానికి అనుగుణంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నారు.. అత్యవసర పరిస్థితి ని (ఎమర్జెన్సీ) ప్రకటించడంతో దురదృష్టవశాత్తు భారతదేశం 21 నెలల పాటు “అంధకార యుగం”లోకి తోయబడింది. నా తరానికి చెందిన చాలా మందికి ఎమర్జెన్సీ గురించి అంతగా తెలియదనే చెప్పాలి. ఎందుకంటే... మన ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు ఏటా ఎమర్జెన్సీ వార్షిక దినం సందర్భంగా నాటి “ఉద్యమ”స్థాయి సినీ నటుల ఇంటర్వ్యూ లనే ప్రధానంగా భావిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఎంతగా అధికారాన్ని దుర్వినియోగం చేసిందీ మాత్రం చెప్పలేదు కాబట్టే.
అంతే కాదు.. దేశంలో శ్రీమతి గాంధీ నిరంకుశ పాలనను నిరసిస్తూ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తమ యావత్తు జీవితాలనే ధారపోయాలని నిర్ణయించుకొన్న అనేక మంది వ్యక్తుల, సంస్థల పేర్లన్నీ చరిత్ర పుటలలో నుండి ఎలా అదృశ్యం అయ్యాయో కూడా ఈ సందర్భంగా గమనించదగ్గది. వాస్తవానికి స్వాతంత్ర్య సంగ్రామం తరువాత అధికార దాహం తలకెక్కిన కాంగ్రెస్ పాలనను కూలదోసేందుకు రాజకీయ, రాజకీయేతర శక్తులన్నీ మరోసారి ఏకమై సలిపిన రెండో అతి పెద్ద ఉద్యమం ఇది. ఆనాడు ప్రజలను సమరోత్సాహంతో నడిపించిన శ్రీ నానాజీ దేశ్‌ముఖ్, శ్రీ జయప్రకాశ్ నారాయణ్, శ్రీ నాతాలాల్ జగ్ డా, శ్రీ వసంత గజేంద్రగడ్కర్, శ్రీ ప్రభుదాస్ పట్వారీ వంటి వారు (ఈ జాబితా చాలా పెద్దది) తదితర ధీరోదాత్త నాయకుల జ్ఞాపకాలు కాలం గడుస్తున్నకొద్దీ ప్రజల మనో ఫలకం నుండి చెరిగిపోతున్నాయి. వారంతా ఎమర్జెన్సీ నాటి గుర్తింపు పొందని కథానాయకులే. అయినా వారిని పట్టించుకోని “లౌకిక” మాధ్యమాలకు మరోసారి “కృతజ్ఞతలు.”
ఆనాడు గుజరాత్ కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది.. నిజానికి ఎమర్జెన్సీకి వ్యతిరేకులైన ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. గుజరాత్‌లో ప్రారంభమైన నవనిర్మాణ ఉద్యమం ఈ రాష్ట్రంలో తమ అధికారం ఎంతోకాలం నిలవబోదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ కళ్లకు కట్టించింది. మోర్బి కళాశాల వసతి గృహంలో ఆహార బిల్లుల పెంపును కొందరు విద్యార్థులు వ్యతిరేకించడం, అది విస్తృతమై రాష్ట్రవ్యాప్త నవనిర్మాణ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందడం మనమంతా తెలుసుకోదగిన ఆసక్తికరమైన అంశాలు. నిజం చెప్పాలంటే బీహార్‌లో శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఇలాంటి ఉద్యమాన్ని ప్రారంభించేందుకు కూడా స్ఫూర్తినిచ్చింది గుజరాత్ అనే చెప్పాలి. ఆ రోజుల్లో ‘గుజరాత్‌ను అనుకరించడం’ అన్నది బిహార్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మాట. అలాగే గుజరాత్‌లో శాసనసభను రద్దు చేయాలన్న కాంగ్రెసేతర శక్తుల డిమాండ్ కూడా బీహార్‌లోని కాంగ్రెసేతర శక్తులకు ప్రేరణనిచ్చింది. గుజరాత్‌లో అసెంబ్లీ రద్దు నిర్ణయంతో తాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చివరకు శ్రీమతి ఇందిరా గాంధీ కూడా ఓ సందర్భంలో చెప్పడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో శ్రీ చిమన్‌భాయ్ పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం పతనమైన అనంతరం గుజరాత్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించారు (ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టంలేదు. కానీ, శ్రీ మొరార్జీ దేశాయ్ కృషి వల్ల చివరకు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు).
గుజరాత్‌లో శ్రీ బాబూభాయ్ జె. పటేల్ ముఖ్యమంత్రిగా తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువుదీరింది. నాటి గుజరాత్ ప్రభుత్వం ‘జనతా మోర్చా సర్కారు’గా గుర్తింపు పొందింది. అప్పట్లో గుజరాత్ ప్రజలను వంచించేందుకు శ్రీమతి ఇందిరా గాంధీ చేయని ప్రయత్నం అంటూ లేదన్నది గుర్తించాల్సిన అంశం. ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక సార్లు ‘‘నేను గుజరాత్ కోడల్ని’’ అంటూ తనకే వోట్లు వేయాలని ఆమె వోటర్లను మభ్యపెట్టే ఎత్తుగడలు వేశారు. కానీ, గుజరాత్ నేల మీద తన కుతంత్రాలు పారవని, మోసపూరిత రాజకీయాలతో రాష్ట్ర ప్రజలు తన మాయలో పడరని శ్రీమతి గాంధీకి తెలియదు.
గుజరాత్‌లో జనతా మోర్చా ప్రభుత్వం ఉన్నందువల్ల ఎమర్జెన్సీ కాలపు అకృత్యాలు రాష్ట్ర ప్రజలను అంతగా బాధించలేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం శ్రమిస్తున్న అనేక మంది ఉద్యమకారులు గుజరాత్‌కు వచ్చి స్థిరపడగా, ఈ రాష్ట్రం అలాంటివారు తలదాచుకునే శిబిరంగా మారింది. ఈ కారణంగానే జనతా మోర్చా ప్రభుత్వం తమతో సహకరించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు ఆరోపించింది (ఇక్కడ సహకరించకపోవడమంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను అణచివేయాలన్న ఆ పార్టీ ప్రయత్నాలకు మద్దతివ్వడమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ అందుకు అంగీకరించలేదు). ఎమర్జెన్సీ సాకుతో పత్రికలు, ప్రసార మాధ్యమాలపై విచ్చలవిడి నిషేధం, అణచివేతలను జాతి మొత్తం ప్రత్యక్షంగా చూసిన కాలమది.
కాంగ్రెస్ పార్టీ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటే.. చివరకు ఆగస్టు 15న ఆకాశవాణి ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసారం చేసే ముఖ్యమంత్రి శ్రీ బాబూభాయ్ పటేల్ ప్రసంగంలోనూ శ్రీమతి ఇందిరా గాంధీ కత్తిరింపులు సూచించారు (స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రులు వారి సందేశాన్ని రేడియోలో వినిపించే సంప్రదాయం ఆ రోజుల్లో అమలులో ఉండేది). ఈ ఉద్యమాలన్నీ నడుస్తున్న సమయంలోనే దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆత్మత్యాగానికి సిద్ధం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రచారక్ ఒకరు దృఢ నిర్ణయం తీసుకున్నారు. అయన మరెవరో కాదు... మన ప్రియతమ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఆర్ఎస్ఎస్ లోని ఇతర ప్రచారక్‌లకు అప్పగించిన తరహాలోనే ఉద్యమ ఏర్పాట్లు, జన సమీకరణ, సమావేశాలు, ఉద్యమ సాహిత్య పంపిణీ తదితర కార్యక్రమాలను శ్రీ నరేంద్ర భాయ్‌కీ అప్పగించారు. ఆ రోజుల్లో శ్రీ నాథ్‌భాయ్ జగ్ డా, శ్రీ వసంత గజేంద్ర గడ్కర్‌లతో కలసి శ్రీ నరేంద్రభాయ్ చురుగ్గా పనిచేస్తుండే వారు. ఎమర్జెన్సీ విధింపుతో మొదలైన కాంగ్రెస్ అధికార దాహపు అకృత్యాలను ఎదుర్కొనగల వ్యవస్థీకృత నిర్మాణం, యంత్రాంగం గల ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ ఒక్కటే. ఈ ప్రజాకాంక్షకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లందరూ చురుగ్గా ఇందులో మమేకమయ్యారు. ఎమర్జెన్సీ విధించాక స్వల్ప వ్యవధిలోనే తమ చట్టవిరుద్ధ పద్ధతులను ఎదుర్కొనడంలో ఆర్ఎస్ఎస్ కు గల శక్తియుక్తులు ఏపాటివో కాంగ్రెస్‌కు తెలిసివచ్చింది. దాంతో ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని కాంగ్రెస్ పిరికి నిర్ణయం తీసుకొంది.
ఈ సందర్భంగానే గుజరాత్‌లో ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ కేశవరావు దేశ్‌ముఖ్ అరెస్టయ్యారు. ప్రణాళిక ప్రకారం శ్రీ నరేంద్రభాయ్ ఆయనతో కలిసి పనిచేయాల్సి ఉండగా ఈ కారణంగా అది సాధ్యం కాలేదు. శ్రీ కేశవరావు నిర్బంధం గురించి తెలియగానే మరో సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు శ్రీ నాథాలాల్ జగ్ డాను స్కూటర్ మీద ఆయనను ఓ సురక్షిత ప్రాంతానికి చేర్చారు. అలాగే భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు శ్రీ కేశవ్‌రావు దేశ్‌ముఖ్‌వద్ద ఉండిపోయాయని, వాటిని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని కూడా నరేంద్రభాయ్ గుర్తించారు. కానీ, ఆయన పోలీసుల నిర్బంధంలో ఉన్నందున అది దాదాపు అసాధ్యమన్నదీ వాస్తవం. అయితే, శ్రీ నరేంద్రభాయ్ దీనిని ఒక సవాలుగా స్వీకరించి, మణినగర్‌లోని ఒక స్వయంసేవక సోదరి సాయంతో ఆ పత్రాలను తిరిగి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రకారం శ్రీ దేశ్‌ముఖ్‌ను కలుసుకునేందుకు ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, శ్రీ నరేంద్రభాయ్ తన ప్రణాళికను ఆచరణలో పెట్టి సదరు పత్రాలను పోలీసుల కళ్లుగప్పి తీసుకురాగలిగారు. ఇక ఎమర్జెన్సీ కాలంలో శ్రీమతి గాంధీ పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. తదనుగుణంగా అనేకమంది పాత్రికేయులను మీసా, డిఐఆర్ వంటి చట్టాలకింద జైళ్లలోకి నెట్టారు. దీంతోపాటు ప్రముఖ బ్రిటిష్ పాత్రికేయుడు శ్రీ మార్క్ టులీ సహా పలువురు విదేశీ పాత్రికేయులు భారత్‌కు రాకుండా నిషేధం విధించారు. దీంతో వాస్తవ, సప్రమాణిక సమాచారం ప్రజలకు దాదాపు చేరకుండా ముసుగు కప్పినట్లయింది. వీటన్నిటితో పాటు ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు అనేకమంది కూడా జైలు పాలయ్యారు. సమాచార సరఫరాయే రమారమి అసాధ్యమైపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఈ సమయంలోనే శ్రీ నరేంద్రభాయ్, అనేక మంది ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు ఈ బృహత్కార్య నిర్వహణను వారి భుజస్కంధాలపై వేసుకొన్నారు.
సాహిత్య పంపిణీ, సమాచార విస్తరణకు శ్రీ నరేంద్రభాయ్ వినూత్న మార్గాన్ని అనుసరించారు. రాజ్యాంగం, చట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అకృత్యాలు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని గుజరాత్ నుండి వెళ్లే రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చేరవేసే వారు. అనుమానితులు కనిపిస్తే కాల్చివేసేందుకు రైల్వే రక్షక దళానికి ప్రభుత్వం అధికారం ఇచ్చినందున ఇది ప్రాణాపాయంతో కూడిన సాహసమే. అయితే, శ్రీ నరేంద్రభాయ్, ఇతర ప్రచారక్‌లు అనుసరించిన ప్రణాళికలు చక్కగా పనిచేశాయి. ఆర్ఎస్ఎస్‌పై నిషేధంతో పాటు పత్రికలపై విపరీత ఆంక్షలు ఉండడంతో జన సంఘర్ష సమితులలో భాగంగా స్వయంసేవకులను వారివారి జిల్లాల్లోనే తీర్చిదిద్దాలని నాయకత్వం నిర్ణయించింది. ఇలా ఉద్యమం కోసం పూర్తికాలం పనిచేసేందుకు నిర్ణయించుకున్న స్వయం సేవకుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆ సమయంలో శ్రీ నరేంద్రభాయ్ భావించారు. ఆ మేరకు వారి కుటుంబాలను ఆదుకోగల వదాన్యులను గుర్తించే బాధ్యతను ఆయన స్వీకరించారు.
మరోవైపు పోలీసులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల అణచివేతకు పాల్పడుతుండటంతో శ్రీ నరేంద్రభాయ్ అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని నడిపారు. ఆ సమయంలో మణినగర్‌లో పోలీసుల కళ్లుగప్పి రహస్య సమావేశాలను శ్రీ నరేంద్రభాయ్ అద్భుత రీతిలో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అకృత్యాలపై అజ్ఞాతంలో ఉండి చురుగ్గా పనిచేస్తున్న కాలంలో శ్రీ నరేంద్రభాయ్‌కి శ్రీ ప్రభుదాస్ పట్వారీ పరిచయమయ్యారు. ఒకసారి తన నివాసానికి వచ్చి కలుసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అటుపైన శ్రీ ప్రభుదాస్ పట్వారీ నివాసానికి వెళ్లినప్పుడు అప్పటికే ఎమర్జెన్సీ కిరాతకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రీ జార్జి ఫెర్నాండెజ్‌ను కూడా కలుసుకున్నారు. అప్పుడు ఓ ముస్లిములాగా మారువేషంలో ఉన్న శ్రీ జార్జి ఫెర్నాండెజ్ తన ప్రణాళికను శ్రీ నరేంద్రభాయ్‌కి వివరించారు. ఆ తరువాత శ్రీ జార్జి ఫెర్నాండెజ్, శ్రీ నానాజీ దేశ్‌ముఖ్ సమావేశం కావడంలో శ్రీ నరేంద్రభాయ్ కీలకపాత్ర పోషించారు. ఆ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ సాగిస్తున్న అరాచకాలపై సాయుధ పోరాటం ప్రారంభించాలన్న తన ప్రణాళికను శ్రీ ఫెర్నాండెజ్ వెల్లడించగా శ్రీ నానాజీ, శ్రీ నరేంద్రభాయ్ అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. శ్రీమతి ఇందిరాగాంధీ ఎంత కిరాతకంగా వ్యవహరించినా, ఉద్యమం మాత్రం అహింసా మార్గంలోనే నడవడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ కాలంలో ఆలిండియా రేడియో (ఆకాశవాణి)ని ప్రభుత్వం తన ప్రచార వాణిగా మార్చేసుకొంది. మరోవైపు ప్రభుత్వ చర్యలు వికృతస్థాయిలో ఉన్నప్పటికీ ఓ పత్రిక కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకుంది. ఆకాశవాణి ఇలా సమాచారాన్ని వక్రీకరించడంపై ప్రజలంతా నిర్వేదానికి గురయ్యారు. దీన్ని నిరసిస్తూ ఆకాశవాణి కేంద్రాల ఎదుట జన సంఘర్ష సమితి శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని, చట్టాలను, ఇతర సాహిత్యాన్ని ప్రజలకు చదివి వినిపించింది.
ఆర్ఎస్ఎస్ ఇతర ప్రచారకుల మాదిరిగానే శ్రీ నరేంద్రభాయ్ కూడా జన సంఘర్ష సమితి కార్యక్రమాలకు మద్దతిస్తూ వచ్చారు. అలాగే ఉద్యమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించగల నిర్మాణం, యంత్రాంగం ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ ఒక్కటే కావడంతో ప్రజా సమీకరణ చేసేవారు. ఈ రోజున కూడా కాంగ్రెస్‌కు దాసోహమైన మీడియా పక్షపాత ధోరణి చూసి మనమంతా కలత చెందుతూనే ఉన్నాం. ఎమర్జెన్సీలోనూ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, సమాచార వేదికలను తన స్వార్థ ప్రచారం కోసం వాడుకోవడాన్ని చూశాము. (ఒకనాడు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను మట్టికరిపించిన ఎన్.టి. రామారావు గురించి సమాచారాన్నంతా ఆలిండియా రేడియో పూర్తిగా తొక్కిపెట్టడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆయనను ఆహ్వానించిన తరువాత మాత్రమే ‘ఎన్.టి. రామారావు’ అనే వ్యక్తి ఒకరు ఉన్నారని దేశం తెలుసుకుంది). ప్రభుత్వం నిర్బంధించిన నాయకులకూ శ్రీ నరేంద్రభాయ్ సమాచారం అందజేస్తూండేవారు. మారువేషాలు వేయడంలో దిట్ట అయిన ఆయన, తాను అరెస్టయ్యే ప్రమాదం ఉన్నా అనేక సార్లు మారువేషాలలో జైళ్లకు వెళ్లి అక్కడున్న నాయకులకు కీలక సమాచారాన్ని అందించే వారు. అలా వెళ్లినప్పుడు శ్రీ నరేంద్రభాయ్‌ని పోలీసులు ఒక్కసారి కూడా గుర్తించలేకపోయారు. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ, నిషేధాలకు వ్యతిరేకంగా సాహసించాలని ‘సాధన’ అనే పత్రిక నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆ పత్రిక ప్రజలకు చేరడంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థీకృత యంత్రాంగం ఎంతగానో తోడ్పడింది. ఆ సమయంలో ఇతర ప్రచారకుల తరహాలోనే శ్రీ నరేంద్రభాయ్ కూడా ఈ బాధ్యతలలో పాలుపంచుకున్నారు.
ఎమర్జెన్సీ రోజులలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకం అనేక ఉద్యమాలు చేయడంలో శ్రీ నరేంద్రభాయ్ సహా ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు కీలక పాత్రను పోషించారు. జన సంఘర్ష సమితి నిర్వహించిన ‘ముక్తిజ్యోతి’ యాత్రకు ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది. ఈ సైకిల్ యాత్రలో అనేకమంది ప్రచారక్‌లు పాల్గొని ప్రజాస్వామ్య సందేశాన్ని అన్ని ప్రదేశాలకూ విస్తరింపజేశారు. ఈ ముక్తిజ్యోతి యాత్రను నడియాద్ లో జెండా ఊపి ప్రారంభించింది ఉక్కు మనిషి సర్దార్ శ్రీ వల్లభ్‌భాయ్ పటేల్ కుమార్తె మణిబెన్ పటేల్ అన్నది కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం (నెహ్రూ- గాంధీ కుటుంబంలో ప్రతి తరం గురించి దేశ ప్రజలకు తెలిసినా స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన అనేక మంది దిగ్గజాల కుటుంబ సభ్యుల గురించి తెలియకుండా పోవడం విచారకరం. స్వాతంత్ర్యోద్యమం ప్రతి దశలో పాలుపంచుకున్నామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ మణిబెన్ పటేల్ వంటి వారిని మాత్రం నిర్లక్ష్యం చేసింది ). శ్రీ నరేంద్రభాయ్‌పై శ్రీ కె.వి.కామత్ రాసిన పుస్తకంలో.. ఆయన అద్భుత ప్రతిభ ఎలాంటిదో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలకు తెలిసిందన్న మాట నూటికి నూరు పాళ్లూ వాస్తవం. నిస్వార్థ ప్రచారక్‌గా పనిచేస్తూ వచ్చిన ఆయన, తన సంస్థ లేదా సహ ప్రచారకులు గానీ ఏనాడూ ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా చూశారు.
ప్రచారక్‌లకు ఆర్థిక మద్దతు ఇవ్వడమే కాకుండా ఎమర్జెన్సీ నాటి అరాచకాల గురించి వాస్తవ, ప్రామాణిక సమాచారాన్ని విదేశాల్లోని భారతీయులకు తెలియజేయడంలోనూ శ్రీ నరేంద్రభాయ్ పకడ్బందీగా పనిచేశారని శ్రీ కామత్ ఆ పుస్తకంలో వివరించారు. శ్రీ నరేంద్రభాయ్ సుపరిపాలన లబ్ధిని మనమంతా నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే, ఎమర్జెన్సీ కాలంలో ఒక నిస్వార్థ కార్యకర్తగా ఆయన పాత్రను కూడా ప్రశంసించడం ముఖ్యం. అలాగే జనతా మోర్చా ప్రభుత్వ హయాంలో సామాన్యుడి హక్కుల పరిరక్షణలో గుజరాత్ కూడా తన పాత్రను సమర్థంగా నిర్వర్తించింది. ఇవాళ జాతి ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన నుంచి తమను విముక్తం చేయగలిగే సరికొత్త ‘నవనిర్మాణ’ ఉద్యమం కోసం ప్రజలు గుజరాత్ వైపు, శ్రీ నరేంద్రభాయ్ వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగా సమీప భవిష్యత్తులో నవనిర్మాణం శ్రీకారం చుట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నా..