ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూరోపియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ప్రెసిడెంటు డాక్టర్ వెర్నర్ హొయర్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో భేటీ అయ్యారు. బ్యాంకు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా శ్రీ వెర్నర్ హొయర్ వెంట ఉన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంవత్సరం కిందట ఇయు- ఇండియా సమిట్ సందర్భంగా యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకుకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధిబృందంతో సమావేశమయ్యారు. బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేసేందుకు మద్దతిస్తానని అప్పట్లో ఆయన వాగ్దానం చేశారు. ఈ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించడమైంది.
శీతోష్ణ స్థితిలో మార్పు మరియు పర్యావరణ పరమైన సుస్థిరత్వం రంగాలలో భారతదేశం అనుసరిస్తున్న విధానాలను గురించి ప్రధాన మంత్రి ఈ రోజు జరిగిన సంభాషణ క్రమంలో వివరించారు. పర్యావరణ సంబంధ స్థిరత్వానికి దోహదం చేసే పథకాలకు, ఇంకా లక్నో మెట్రోకు గాను యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంక్ భారతదేశానికి ఒక బిలియన్ యూరోలను రుణంగా అందజేసింది.
శీతోష్ణ స్థితిలో మార్పు రంగానికి సంబంధించి భారతదేశం బలమైన, సంస్కరణానుకూల చర్యలను చేపడుతుండడాన్ని డాక్టర్ హొయర్ ప్రశంసించారు. ఈ దిశగా భారత్ చేసే ప్రయత్నాలకు తమ బ్యాంకు మద్దతును కొనసాగిస్తుంటుందని కూడా ఆయన అన్నారు.