భారతదేశ ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ గా డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా ను నియమించడం జరిగింది. ఆయన నేడు పదవీ బాధ్యతల ను స్వీకరించారు.
వ్యవసాయం, విపత్తు నిర్వహణ, విద్యుత్తు రంగం, మౌలిక సదుపాయాల కల్పన కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం మరియు నియంత్రణ సంబంధమైన అంశాలకు చెందిన కార్యక్రమాల ను నిర్వహించడం లో డాక్టర్ మిశ్రా విశేష అనుభవాన్ని గడించారు. పరిశోధన, ప్రచురణలు, విధాన రూపకల్పన మరియు కార్యక్రమ నిర్వహణ లు ముడిపడ్డ విశేష వృత్తి జీవనం ఆయన కు సొంతం. విధాన రూపకల్పన లో మరియు పరిపాలన లో ఆయన కు బోలెడంత అనుభవం ఉంది. ప్రధాన మంత్రి కి అడిశనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు సహకార కార్యదర్శి, స్టేట్ ఇలెక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిశన్ చైర్మన్ ల వంటి ప్రధానమైన బాధ్యతల ను ఆయన నిర్వహించారు. వ్యవసాయం, సహకార కార్యదర్శి గా ఆయన జాతీయ వ్యవసాయాభివృద్ధి కార్యక్రమం (ఆర్‌కెవివై) మరియు జాతీయ ఆహార భద్రత అభియాన్ (ఎన్ఎఫ్‌ఎస్ఎమ్)ల వంటి అనేక జాతీయ కార్యక్రమాల లో చురుకు గా పాలు పంచుకొన్నారు.
ప్రధాన మంత్రి కి అడిశనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా లో డాక్టర్ మిశ్రా 2014-19 సంవత్సరాల మధ్య కాలం లో మానవ వనరుల నిర్వహణ లో, మరీ ముఖ్యం గా ఉన్నత పదవుల కు నియామకాల లో నవీనమైన పద్ధతుల ను మరియు గొప్ప ప్రభావాన్ని చూపేటటువంటి మార్పుల ను తీసుకు రావడం లో పేరు తెచ్చుకొన్నారు.
ఆయన అంతర్జాతీయ స్థాయి లో గడించిన అనుభం లో పరిశోధన, ది ఇన్స్ టిట్యూట్ ఆఫ్ డివెలప్‌మెంట్ స్టడీస్ (యుకె)లో నాలుగు సంవత్సరాల కు పైగా విద్యా సంబంధమైన కృషి కి తోడు ప్రపంచ బ్యాంకు, ఇంకా ఎడిబి ప్రోజెక్టుల కు సంబంధించిన సంప్రదింపులు మరియు వాటి ని అమలుపరచడం, అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన సంస్థ (ఐసిఆర్ఐఎస్ఎటి) పాలక మండలి లో సభ్యత్వం తో పాటు పలు అంతర్జాతీయ సమావేశాల లో నిపుణుడి గా / రిసోర్స్ పర్సన్ గా కూడా ప్రాతినిధ్యం వహించారు.
విపత్తు నిర్వహణ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం అయినటువంటి ‘‘యునైటెడ్ నేశన్స్ సాసాకవా అవార్డ్ 2019’’ ని ఆయన ఇటీవల అందుకొన్నారు.
డాక్టర్ మిశ్రా యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ నుండి అర్థ శాస్త్రం / డివెలప్‌మెంట్ స్టడీస్ లో పిహెచ్‌డి ని అందుకొన్నారు. అంతేకాకుండా, అదే విశ్వ విద్యాలయం నుండి డివెలప్‌మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఎ. పట్టా ను పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థ శాస్త్రం లో ఎం.ఎ. ను ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణుడయ్యారు. బి.ఎ ఆనర్స్ (ఎకనామిక్స్) లోను ప్రథమ శ్రేణి లో పాసయ్యారు. 1970వ సంవత్సరం లో జి.ఎం. కాలేజి (సంబల్‌పుర్ విశ్వవిద్యాలయం) నుండి ఇతర సబ్జెక్టు లలో డిస్టింక్షన్ తెచ్చుకొన్నారు. ఒడిశా లోని విశ్వవిద్యాలయాలన్నింటి లోకీ ఎకనామిక్స్ లో ప్రథమ శ్రేణి ని సాధించింది శ్రీ మిశ్రా ఒక్కరే.
ఆయన రచనల లో ప్రచురణకు నోచుకొన్న వాటిలో
● ద కచ్ఛ్ అర్థ్ క్వేక్ 2001: రికలెక్షన్ లెసన్స్ ఎండ్ ఇన్ సైట్స్, నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ , న్యూ ఢిల్లీ, ఇండియా (2004).
● అగ్రికల్చరల్ రిస్క్, ఇన్ శ్యోరెన్స్ ఎండ్ ఇన్‌కమ్: ఎ స్టడీ ఆఫ్ ది ఇంపాక్ట్ ఎండ్ డిజైన్ ఆఫ్ ఇండియాస్ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్ శ్యోరెన్స్ స్కీమ్, అవేబరీ, ఆల్డర్‌షాట్, యుకె (1996).
● ఎడిటెడ్ డివెలప్‌మెంట్ ఎండ్ ఆపరేశన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్ శ్యోరెన్స్ స్కీమ్స్ ఇన్ ఏశియా, ఏశియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేశన్, టోక్యో, జపాన్ (1999) లు ఉన్నాయి.
అనేక అంతర్జాతీయ పత్రికల కు వ్యాసాల ను మరియు సమీక్షల ను కూడా ఆయన అందించారు.