రష్యన్ ఫెడరేషన్ లో.. 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడంతో పాటు ఆస్ట్రియా రిపబ్లిక్ లో మొదటిసారి పర్యటించడానికి గాను మూడు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరుతున్నాను.
భారతదేశానికి, రష్యా కు మధ్య విశేషమైన, ప్రత్యేకాధికారాలు కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యం గత పది సంవత్సరాలలో మునుముందుకు సాగిపోతూ ఉన్నది. ఈ భాగస్వామ్యం ఇంధన, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యటన రంగాల లోను, రెండు దేశాల ప్రజల సంబంధాలు సహా అనేక రంగాలలో పురోగమించింది.
నేను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో కలసి ద్వైపాక్షిక సహకారం లోని అంశాలతోపాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను. మేం శాంతియుతమైన, స్థిరమైన ప్రాంతాన్ని ఆవిష్కరించడానికి దోహదపడే పాత్రను పోషించాలని కోరుకుంటున్నాం. రష్యా లోని చైతన్యభరితమైన భారత సముదాయంతో భేటీ అయ్యే అవకాశం కూడా ఈ పర్యటనలో నాకు దక్కనుంది.
ఆస్ట్రియా లో అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ వాన్ డెర్ బేలెన్ తోను, చాన్స్ లర్ శ్రీ కార్ల్ నెహమర్ తోను నేను సమావేశమయ్యే అవకాశం నాకు లభించనుంది. ఆస్ట్రియా మన దృఢమైన, విశ్వసనీయమైన భాగస్వామ్య దేశం; అంతేకాదు, ఉభయ దేశాలు ప్రజాస్వామ్యం, బహుళవాదం, అనే ఆదర్శాలను పెంచి పోషించుకొంటున్నాము. నలభై సంవత్సరాల కాలంలో ఒక భారతదేశ ప్రధాన మంత్రి ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే మొదటి సారి. ఈ భాగస్వామ్యాన్ని నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, సుస్థిర అభివృద్ధి, ఇంకా అనేక ఇతర నూతన రంగాలలోను, కొత్తగా ఉనికి లోకి వస్తున్న రంగాలలోను మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకు పోవడం కోసం మామధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఉభయ పక్షాలకు లాభదాయకమైన వ్యాపార అవకాశాలను, పెట్టుబడి అవకాశాలను గుర్తించడం కోసం ఆస్ట్రియా చాన్స్ లర్ తో కలసి నేను ఉభయ పక్షాల వ్యాపారవేత్తలతో మా అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం ఉత్సాహ పడుతున్నాను. ఆస్ట్రియాలో వృత్తి నైపుణ్యానికి, నడవడికకు మంచి పేరు తెచ్చుకొన్న భారత సముదాయంతో కూడా నేను మాటామంతీ జరుపనున్నాను.