భారతీయ యువత విప్లవ తత్త్వాన్ని విజయవంతంగా ప్రతిఘటించారన్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ముస్లిమ్ ఉలేమాలు, మేధావులు, విద్యావేత్తలు మరియు ఇతర ప్రముఖ వ్యక్తులతో కూడిన ప్రతినిధి వర్గం ఈ రోజు భేటీ అయింది. వృద్ధి ఫలాలు అందరికీ అందటం, సమాజంలో అల్పసంఖ్యాక వర్గాలతో సహా అన్ని వర్గాల వారు సాంఘికంగాను, ఆర్థికంగాను మరియు విద్యపరంగాను సాధికారితను సంతరించుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకొంటుండటం పట్ల ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రికి అభినందనలు తెలిపింది.
భారతదేశం నుండి హజ్ యాత్రికుల సంఖ్యను పెంచుతూ సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రతినిధి వర్గం ప్రశంసించింది. ఈ విషయంలో ప్రధాన మంత్రి కనబరచిన చొరవకు ఆయనకు అభినందనలు తెలియజేసింది.
అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి మొదలుపెట్టిన ఉద్యమాన్ని ప్రతినిధి వర్గం ముక్తకంఠంతో మద్దతు పలికింది. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం పేదలకు, మరీ ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చుతుందని ప్రతినిధి వర్గం ఒప్పుకొంది.
ప్రపంచ వ్యాప్తంగా పలు విదేశాలతో సంబంధాలను పటిష్టపరచుకొనేందుకు ప్రధాన మంత్రి చేస్తున్న కృషికిగాను ఆయనకు ప్రతినిధి వర్గం శుభాభినందనలు తెలిపింది. ప్రపంచంలోని ప్రతి మూలనా ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నట్లు పేర్కొంది.
స్వచ్ఛ భారత్ దిశగా ప్రధాన మంత్రి పడుతున్న ప్రయాసను కూడా ప్రతినిధి వర్గ సభ్యులు మెచ్చుకొన్నారు.
ఇవాళ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రభావం చూపుతున్న విప్లవ తత్త్వాన్ని భారతదేశపు యువత విజయవంతంగా అడ్డుకోగలిగినట్లు ప్రధాన మంత్రి అన్నారు. దీనికి ఘనత అంతా కూడా మన ప్రజలు చిరకాలంగా వారసత్వంగా పంచుకొంటున్న భావనకు దక్కాలని ఆయన చెప్పారు. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం మన అందరిపైన ఇప్పుడు ఉన్న బాధ్యత అని ఆయన అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు మరియు భారతదేశపు సాంఘిక యవనిక ఉగ్రవాదుల లేదా వారి ప్రాయోజకుల క్రూర కృత్యాలు సఫలమవడాన్ని ఎన్నటికీ సహించబోదని ఆయన స్పష్టంచేశారు. విద్య మరియు నైపుణ్యాల వికాసం యొక్క ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి వివరించారు. లాభసాటి ఉపాధికల్పనకు, పేదరికం నుండి అభ్యున్నతి వైపు పయనించేందుకు విద్య మరియు నైపుణ్యాల వికాసం కీలక సాధనాలు అని ఆయన అన్నారు.
భారతదేశం నుండి హజ్ యాత్రికుల సంఖ్యను పెంచుతూ సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి అభినందించారు. విదేశాలలో భారతీయ ముస్లిముల పట్ల సకారాత్మక అభిప్రాయావళి రూపుదిద్దుకొన్నదని ఆయన చెప్పారు.
ప్రతినిధి వర్గంలో ఇమామ్ శ్రీ ఉమర్ అహ్మద్ ఇల్యాసి (చీఫ్ ఇమామ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమామ్స్ ఆఫ్ మాస్క్ స్); లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్ డ్) శ్రీ జమీరుద్దీన్ షా (అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ ఉప కులపతి); శ్రీ ఎమ్ వై ఇక్బాల్ (భారత సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి); జామియా మిల్లియా ఇస్లామియా ఉప కులపతి శ్రీ తలత్ అహ్మద్ మరియు ఉర్దూ పత్రికారచయిత శ్రీ శాహిద్ సిద్దికీ లు సభ్యులుగా ఉన్నారు.
అల్పసంఖ్యాక వర్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ మరియు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎం..జె. అక్బర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.